Sialkot
-
పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం
భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి జైషే మహ్మద్ టాప్ కమాండర్ షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. పంజాబ్‌లోని సియాల్ కోట్లో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను కాల్చి చంపారు. నూర్ మదీనా మసీద్‌లో ఫజర్ ప్రార్థన అనంతరం బయటకు రాగా.. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు లతీఫ్‌తోపాటు మరో ఇద్దరు సహచరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లతీఫ్తోపాట మరో ఉగ్రవాది అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కాల్పులు జరిపిన అగంతకులు సంఘటన స్థలం నుంచి పారిపోయారు. ఈ దాడిపై పాక్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పఠాన్ కోట్ దాడి వ్యూహకర్త షామిద్ లతీఫ్(41) ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు లాంచింగ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2016 జనవరి 2న జరిగిన పఠాన్‌కోట్‌లోని వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడికికి మాస్టర్‌మైండ్ లతీఫే. ఈ దాడిలో తొమ్మిది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పఠాన్‌కోట్‌లో బాంబు పేలుడు జరిగి మరో అధికారి మరణించారు. తరువాత ఈ దాడికి పాల్పడిన అయిదుగురు ముష్కరులను భారత బలగాలు మట్టుబెట్టాయి. అయితే ఈ పేలుళ్లకు సూత్రధాని షాహిద్ లతీఫ్ అంటూ అప్పట్లో దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. అతడు పాక్‌లోని సియాల్కోట్ నుంచే ఈ దాడికి పథకం వేసి.. ఐదుగురు ఉగ్రవాదులను పఠాన్‌కోట్‌పై దాడికి పంపినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ లతీఫ్‌ను మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇక ఇటీవల పాక్‌లో వరుసగా జరుగుతున్న ఉగ్రవాదుల హత్యలు ఆ దేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ ఏడాదిలో వేర్వేరు ఉగ్రవాద సంస్థలకు చెందిన అయిదుగురు టాప్ కమాండర్లు గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించారు. లతీఫ్‌ను 1994 నవంబర్ ఉగ్రవాదం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నివారణ చట్టం (UAPA)ప్రకారం జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 16 ఏళ్ల పాటు మసూద్ అజార్‌తో కలిసి కోట్ బల్వాల్లోని జైలులో శిక్షననుభవించాడు. అనంతరం 2010లో వాఘా ద్వారా పాకిస్థాన్‌కు అప్పగించారు. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను హైజాక్ చేసిన కేసులో లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
మా ఆయనకు వధువు కావాలి: భార్యలు
పాకిస్తాన్: ‘మా ఆయన వయసు 22 సంవత్సరాలు... నాలుగో భార్యగా.. మాకు సోదరిగా మంచి యువతి కావాలి.. ఆమె పేరు ఎస్తో ప్రారంభం కావాలి.. వివాహానికి ముందు ఒకసారి ఆమె మా భర్తను కలిసి మాట్లాడాలి’ అంటూ ఇచ్చిన ఓ ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘ఒక్క భార్యతోనే వేగలేకపోతున్నాం.. ముగ్గురిని చేసుకున్నావ్.. మరో పెళ్లికి సిద్దపడ్డావ్ నిజంగా నువ్వు దేవుడివి సామి’ అంటున్నారు ఈ ప్రకట చూసిన వారు. పాకిస్తాన్ సియాల్కోట్కు చెందిన అద్నాన్ అనే వ్యక్తి కోసం ఈ ప్రకటన ఇచ్చారు. ఇక అద్నాన్కు 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మొదటిసారి వివాహం అయ్యింది. ఆ సమయంలో, అతను ఒక విద్యార్థి. 20 ఏళ్ళ వయసులో రెండవసారి వివాహం చేసుకున్నాడు. పోయిన ఏడాది మూడవ వివాహం అయ్యింది. 22 ఏళ్ల అద్నాన్ ప్రస్తుతం మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నాడు. కొన్ని కండీషన్లు కూడా పెడుతున్నాడు. ఇక నాల్గవ భార్యగా రాబోయే యువతి మొదట అతడిని కలవాలని.. ఆమె పేరు ఎస్తో ప్రారంభం కావాలని తెలిపాడు. ఎందుకంటే అతని ముగ్గురు భార్యలు, షుంబాల్, షుబానా, షాహిదా పేర్లతో సరిపోలడానికి ఆమె పేరు 'ఎస్'తో ప్రారంభం కావాలని ఈ షరతు పెట్టాడు. ఇక ఇప్పటికే అద్నాన్‌కి మొదటి ముగ్గురు భార్యల వల్ల ఐదుగురు సంతానం కలగగా ఒకరిని దత్తత తీసుకున్నాడు. మొదటి భార్య షుంబల్కి ముగ్గురు పిల్లలు, షుబానాకి ఇద్దరు పిల్లలు జన్మించారు. మూడవ భార్య షాహిదా ఒకరిని దత్తత తీసుకుంది. (చదవండి: ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకరినే మనువాడారు!) ‘ఇందరి పోషణ ఎలా.. ఎంత పెద్ద ఇంటిలో నివాసం ఉంటారని’ అద్నాన్‌ని ప్రశ్నించినప్పుడు తాను ఆరు బెడ్ రూములు, డ్రాయింగ్ రూమ్, స్టోర్ రూమ్ ఉన్న ఇంట్లో ఉంటానని వెల్లడించాడు. ఇక మొదటి వివాహం తరువాత తనకి ఆర్థికంగా బాగా కలిసి వచ్చిందని.. ఖర్చులను నిర్వహించడంలో ఎటువంటి సమస్య లేదన్నాడు. కుటుంబానికి నెలకు ఖర్చు లక్ష నుంచి ఒకటిన్నర లక్షల పాకిస్తాన్ రూపాయల మధ్య ఉంటుందని తెలిపాడు. తన ముగ్గురు భార్యలు ఒకరితో ఒకరు బాగా సర్దుకుంటారని వెల్లడించాడు. అతని మీద వారికి ఉన్న ఏకైక ఫిర్యాదు ఏమిటంటే, అతను తమతో తగిన సమయం గడపడం లేదని భావిస్తారు. తన భార్యలు ముగ్గురూ తనను ప్రేమిస్తున్నారని, తాను కూడా వారిని చాలా ప్రేమిస్తున్నానని తెలిపాడు. (బ్రేకప్: తనను తానే పెళ్లి చేసుకున్నాడు) -
కోర్టుకు ముగ్గురే!
అదుపులో 30 మంది.. * పఠాన్‌కోట్ కేసులో పాక్ అధికారుల తీరు లాహోర్: భారత్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడికి సంబంధించి పాక్‌లో ప్రారంభమైన ఉన్నతస్థాయి దర్యాప్తులో భాగంగా అదుపులోకి తీసుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఆదివారం కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తులో భాగంగా 31 మందిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుండగా, వారిలో ముగ్గురినే సియాల్కోట్లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టులో హాజరుపర్చడం విశేషం. వారిపై పఠాన్‌కోట్ దాడికి సంబంధించి కాకుండా.. జీహాదీ సాహిత్యాన్ని కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురినీ విచారణ నిమిత్తం 3 రోజుల పోలీసు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారు. అయితే, పఠాన్‌కోట్ దాడిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతున్నందున.. ఆ దర్యాప్తు పూర్తయ్యేంతవరకు ఎవరిపైన కూడా ఆ ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేయడం కుదరదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాడికి బాధ్యులంటూ ఎవరినీ కోర్టులో హాజరుపర్చడం కూడా సాధ్యం కాదని స్పష్టం చేశాయి. కాగా, జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరెస్ట్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. పఠాన్‌కోట్ దాడి నేపథ్యంలో భారత్ ఒత్తిడి మేరకు ఆయనను అరెస్ట్ చేశారని పాక్ మీడియా చెబుతుండగా.. ఆయన భద్రత నిమిత్తమే అదుపులోకి తీసుకున్నాం కానీ అరెస్ట్ చేయలేదంటూ పంజాబ్ న్యాయశాఖ మంత్రి రానా సనావుల్లా స్పష్టం చేశారు.