![Ajit Doval Called For An Action Plan To Crack Down On Militant Groups - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/25/ajit-doval.jpg.webp?itok=t7NWQQEY)
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్‌సీఓ, యాంటీ టెర్రర్ వాచ్‌డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు
Comments
Please login to add a commentAdd a comment