National Security advisor
-
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్
సాక్షి, ఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావడంతో మళ్లీ ఆయన్నే నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా మరోసారి పీకే మిశ్రా నియమితులయ్యారు. ప్రధానమంత్రి సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్‌లు అమిత్ కరే, తరుణ్ కపూర్ నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. -
అదే జరిగితే ఎక్కువ సంతోషించేది మేమే.. అజిత్ దోవల్
జెదాహ్: ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి సౌదీ అరేబియాలో జరుగుతున్న రెండ్రోజుల సమావేశాల్లో పాల్గొన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ యుద్ధ సమసిపోతే అంతకంటే సంతోషం మరొకటి ఉండదని అన్నారు. సౌదీ అరేబియా వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశానికి సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించగా మొత్తం 40 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చించేందుకే వీరంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రష్యాను ఆహ్వానించకపోవడం విశేషం. భారత దేశం తరఫున అధికార ప్రతినిధిగా హాజరైన అజిత్ దోవల్ రెండు దేశాల మధ్య సంధిని కుదిర్చే విషయంలో తామెల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామని తెలిపారు. అజిత్ దోవల్ మాట్లాడుతూ.. భారతదేశం తరపున మేము తరచుగా రష్యా, ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు చేస్తూ.. దౌత్యాన్ని కుదర్చడానికి తమవంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామన్నారు. ఇప్పటికే యుద్ధాన్ని ఆపడానికి అనేక దేశాలు తమకు తోచిన ప్రతిపాదనలు తెరపైకి తీసుకు రాగా వాటిలో కొన్ని మాత్రమే రెండు దేశాలకూ ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని అన్నారు. అలా కాకుండా రెండు దేశాలకూ సమ్మతమైన, శాశ్వతమైన, సమగ్ర పరిష్కారం కోసం భారతదేశం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన అంతర్జాతీయ చట్టాల్లోని నియమ నిబంధనలను భారత్ గౌరవిస్తుందని దాని ప్రకారమే రెండు దేశాల మధ్య సంధి కుదిర్చే ప్రయాత్నం చేస్తామని.. అదే జరిగితే తమకంటే ఎక్కువగా సంతోషించేవారు ఎవ్వరూ ఉండరని అన్నారు. అంతకుముందు జపాన్‌లో జరిగిన జీ7 సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జిలెన్‌స్కీని కలిసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని ఆయనకు ధైర్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: చికాగోలో రోడ్లపై తిరుగుతున్న హైదరాబాదీ మహిళకు ఉపశమనం -
చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
జోహన్నెస్‌బర్గ్ : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్‌బర్గ్‌లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్బంగా నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్‌కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. అప్పుడే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. దీనికి స్పందిస్తూ వాంగ్ యీ ఏమన్నారంటే.. చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని అన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని.. -
బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవించి ఉంటే మనదేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్జీ) అజిత్ ధోవల్ చెప్పారు. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(అసోచామ్) శనివారం ఢిల్లీలో నిర్వహించిన మొదటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారక ఉపన్యాసంలో ఆయన ప్రసంగించారు. ‘బోస్ నాయకత్వ సామర్థ్యాలు అసాధారణమైనవి. ఆయన దేశాన్ని కుల, మత, జాతి విభజనలకు అతీతమైన ఒక వాస్తవంగా గుర్తించారు. ఐక్య భారతం కోసం ఆయన కలలుగన్నారు. ఆయన ప్రసిద్ధ నినాదం కదమ్ కదమ్ బధాయే జా’అన్ని వర్గాల ప్రజలను కదిలించింది. ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిన మహ్మద్ అలీ జిన్నా సైతం చంద్రబోస్ ఒక్కరినే నాయకుడిగా గుర్తిస్తానని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి బోస్ జీవించి ఉంటే భారతదేశ విభజన జరిగి ఉండేది కాదు’అని దోవల్ పేర్కొన్నారు. నేతాజీ తన జీవితంలోని వివిధ క్లిష్టమైన దశల్లో సాహసోపేతంగా వ్యవహరించారు. అప్పట్లో తిరుగులేని నేతగా ఉన్న గాంధీని సైతం నమ్మిన సిద్ధాంతం కోసం ఎదిరించిన ధైర్యం ఆయన సొంతం. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి మళ్లీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు’అని ఎన్ఎస్జీ అప్పటి పరిణామాలను గుర్తు చేశారు. ప్రజల సామర్థ్యాలపై నేతాజీకి అపారమైన నమ్మకం ఉండేదన్నారు. దేశాభివృద్ధిపై ధోవల్ మాట్లాడుతూ.. ‘మన దేశానికున్న అతిపెద్ద బలం మానవ వనరులు...చురుకైన నిబద్ధత కలిగిన శ్రామికశక్తి. క్లిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, మన శ్రామిక శక్తిని అంతర్జాతీయంగా పోటీ పడేలా నైపుణ్యాలను పెంపొందించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి’అని అన్నారు. -
పుతిన్‌తో దోవల్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. గురువారం మాస్కోలో ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇకమీదటా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గానిస్తాన్ అంశంపై పలు దేశాల అత్యున్నత స్థాయి ప్రతినిధులతో పుతిన్ భేటీ అవుతున్నారు. అందులోభాగంగా గురువారం ఐదవ జాతీయ భద్రతా మండలి/సలహాదారుల సమావేశంలో దోవల్, పుతిన్ మాట్లాడుకున్నారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ‘అఫ్గానిస్తాన్‌లో అనిశ్చితిని అవకాశంగా తీసుకుని కొన్ని ప్రాంతీయేతర శక్తులు అక్కడ మరింతగా విస్తరించేందుకు కుట్ర పన్నుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. మానవతాసాయం మరింతగా తగ్గిపోతోంది’ అని పుతిన్ అన్నారు. ‘ అఫ్గాన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని మరింతగా ఎగదోసే చర్యలను భారత్ ఏమాత్రం ఉపేక్షించదు. అఫ్గాన్ ప్రజలను కష్టాల్లో వదిలేయబోము’ అని దోవల్ అన్నారు. -
Agnipath scheme: అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : అజిత్ దోవల్
న్యూఢిల్లీ : సైన్యంలో యువరక్తాన్ని నింపడానికి, మరింత టెక్ సేవీగా మార్చడానికే అగ్నిపథం పథకాన్ని తీసుకువచ్చామని, దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మన జాతికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని మూల్యంగా చెల్లించడానికి సిద్ధమయ్యారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో 2006లోనే ఈ తరహా పథకం తీసుకువద్దామని అనుకున్నారని వెల్లడించారు. ప్రపంచ దేశాలో యువ జనాభా అత్యధికంగా ఉన్న మన దేశం ఆర్మీ విషయాన్నికొస్తే సగటు వయసు అత్యధికంగా ఉన్న దేశంగా ఉందని , అందుకే సైనిక రంగంలో సంస్కరణలు తప్పవన్నారు. మంగళవారం ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌పై చెలరేగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న వారెవరూ అసలైన ఆశావహులు కాదని, వారంతా ఇళ్లలో కూర్చొని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఒకటే జీవితం–రెండు కెరీర్లు , ఒక్కోసారి మూడు కెరీర్లు అని యువత మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అగ్నివీరుల మొదటి బ్యాచ్ పదవీ విరమణ చేసిన సమయానికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.385 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అప్పుడు పరిశ్రమలకి ఇలాంటి శిక్షణ పొందిన యువతరం అవసరం ఉంటుందన్నారు. యుద్ధభూమిని టెక్నాలజీ తన చేతుల్లోకి తీసుకుంటోందని ఇకపై కాంటాక్ట్‌లెస్ యుద్ధాలు కూడా వస్తాయని, అందుకే ఇలాంటి మార్పులు తప్పవన్నారు. అగ్నివీరులుగా శాశ్వత కెరీర్ కొనసాగించడానికి నాలుగేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకోవాలని వారిలో ఎంపికైన 25% మందికి మళ్లీ కఠోర శిక్షణ ఉంటుందని అజిత్ దోవల్ వివరించారు. -
పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థల్ని కట్టడి చేయాలి
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. తజికిస్తాన్ రాజధాని డషంబేలో బుధవారం ఎనిమిది దేశాలతో కూడిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశానికి దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాద సంస్థలు, వ్యక్తులపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాద సంస్థకు ఆర్థిక సాయం అందకుండా దీటుగా ఎదుర్కోవాలని అన్నారు. ఇందుకోసం ఎస్సీఓ, యాంటీ టెర్రర్ వాచ్డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదరాలని సూచించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండించాలన్న దోవల్, ఉగ్రవాద దాడుల్లో సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌లో తరచూ దాడులకు పాల్పడే లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌లను కట్టడి చేయడానికి దోవల్ ఒక కార్యాచరణని కూడా ప్రతిపాదించినట్టుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. చదవండి: టోల్ అడిగితే కొడవలి చేతికిచ్చాడు -
ముప్పు ఉంటే భారత్ యుద్ధం చేస్తుంది!
న్యూఢిల్లీ: జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ అక్టోబర్ 24న రిషికేష్‌లో చేసిన వ్యాఖ్యలు ఏ దేశాన్నో లేక ఏ పరిస్థితినో ఉద్దేశించిన చేసినవి కావని అధికారులు సోమవారం వివరణ ఇచ్చారు. అవి రిషికేష్‌లో జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారతదేశ నాగరికత గురించి ఆధ్యాత్మిక ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు అని వివరించారు. రిషికేష్‌లోని పారమార్ధ నికేతన్ ఆశ్రమంలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ధోవల్ పాల్గొన్నారు. అక్కడ భక్తులను ఉద్దేశించి భారతదేశ ఆధ్యాత్మిక శక్తిని గురించి ప్రసంగించారు. స్వామి వివేకానంద బోధనలను ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటివరకు ఎవరిపైనా దాడి చేయలేదు. దీని గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే, దేశానికి ముప్పు ఉందని భావిస్తే.. కచ్చితంగా భారత్ దాడి చేస్తుంది. ఎందుకంటే దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యమైన విషయం. ప్రమాదం ఉందని భావిస్తే పోరాటం చేస్తుంది. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా, విస్తృత ప్రయోజనాలు లక్ష్యంగా ఆ పోరాటం ఉంటుంది. మన భూభాగంపై కానీ, ఇతరుల భూభాగంపై కానీ భారత్ పోరాడుతుంది. కానీ, అది స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం కాదు.. విస్తృత ప్రయోజనాలు కేంద్రంగానే యుద్ధం చేస్తుంది’ అని ధోవల్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. తూర్పు లద్ధాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను ఉద్దేశించే ధోవల్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నాయి. దాంతో, అధికారులు ధోవల్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. -
20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..!
వాషింగ్టన్: వుహాన్ అనే ఓ చిన్న నగరంలో పుట్టి ప్రపంచానికే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైరస్ కరోనా. ఈ వైరస్ ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి దాకా దాదాపు 2,50,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. సుమారు 4 మిలియన్లకు పైగా ప్రజలు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకున్నారు. చైనా కారణంగా ప్రపంచ మొత్తం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రపంచ దేశాలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే దీనికి చైనా ఎంత మాత్రం బాధ్యత వహించదు అంటూ' అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ రాబర్ట్ ఓ బ్రయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ప్యాకేజీపైనే దృష్టి : ఆరంభ లాభాలు ఆవిరి వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చైనా నుంచి వచ్చే ఇలాంటి విపత్తులను ఇక భరించడం కష్టం, వాటికి ఎక్కడో ఓ చోట అడ్డుకట్ట వేయాల్సిన ఆవశ్యకత ఉంది. గడిచిన 20 ఏళ్లలో చైనా నుంచి ఐదు ప్లేగు లాంటి మహమ్మారులు వచ్చాయి. సార్స్, బర్డ్ ప్లూ, స్వైన్ ఫ్లూ, కరోనా లాంటివన్నీ చైనా నుంచి వచ్చినవే. ఇలా చైనా ప్రపంచం మీదకు వదులుతున్న భయంకరమైన పరిస్థితిని ఇంకెంతో కాలం భరించలేమని రాబర్ట్ ఓ బ్రయాన్ వ్యాఖ్యానించారు. చైనాలో పబ్లిక్ హెల్త్ క్రైసిస్‌ను నిలువరించడం కష్టసాధ్యమైంది. కావాలంటే ఇలాంటి వైరస్‌లను నిలువరించడానికి అమెరికా సహాయమందించడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉంది. కరోనా ప్రభావం దాదాపు 212 దేశాలపై ఉంది. వాటి ఆర్థిక వ్యవస్థలు కూడా బాగా దెబ్బతిన్నాయని' ఓ బ్రయాన్ పేర్కొన్నారు. చదవండి: లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ -
బలహీన ప్రభుత్వాలు మంచివి కావు: దోవల్
న్యూఢిల్లీ: రానున్న పదేళ్లు భారత్‌కు దృఢమైన, స్థిరమైన, నిర్ణయాత్మక ప్రభుత్వం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వ్యాఖ్యానించారు. బలహీనమైన సంకీర్ణ ప్రభుత్వాలు మంచివి కావని, జాతీయ, రాజకీయ, ఆర్థిక పరమైన లక్ష్యాలను సాధించడానికి దృఢమైన ప్రభుత్వమే కావాలని ఆయన పేర్కొన్నారు. గురువారం సర్దార్ పటేల్ మెమోరియల్ ‘డ్రీమ్ ఇండియా 2030– అవాయ్డింగ్ ద పిట్ఫాల్స్’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. బలహీనమైన ప్రజాస్వామ్యాలు దేశాన్ని మరింత బలహీనంగా మార్చగలవు. రానున్న కొన్నేళ్లలో భారత్ అలాంటి వాటికి తలొగ్గకుండా దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి’ అని అన్నారు. ప్రజాస్వామ్యం బలహీనంగా ఉన్నప్పుడు రాజీపడాల్సి వస్తుందని, ఎప్పుడైతే రాజీ పడతామో అప్పుడు జాతీయత కన్నా రాజకీయ మనుగడకే ప్రాధాన్యం ఉంటుందని ఉద్ఘాటించారు. విచ్ఛిన్న రాజకీయాలు, బలహీనమైన ప్రభుత్వాలు భారత్ లక్ష్యాలను చేరుకోకుండా అడ్డుపడతాయన్నారు. ఇందుకు దోవల్ తన ప్రసంగంలో బ్రెజిల్‌ను ఉదహరించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాల్లో ముందున్న బ్రెజిల్.. రాజకీయ అస్థిరత కారణంగా వృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. -
ఎన్ఎస్ఏ మెక్మస్టర్పై ట్రంప్ వేటు
వాషింగ్టన్: జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెక్మస్టర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేటు వేశారు. ఆయన స్థానంలో మాజీ రాయబారి జాన్ బోల్టన్‌కు బాధ్యతలు అప్పగించారు. 69 ఏళ్ల బోల్టన్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్టు ట్రంప్ శుక్రవారం ట్వీటర్లో ప్రకటించారు. మెక్‌మస్టర్ అద్భుతంగా విధులు నిర్వర్తించారని, ఆయన ఎప్పటికీ తనకు స్నేహితునిగా ఉంటారని పేర్కొన్నారు. కాగా, బోల్టన్ ఏప్రిల్ 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. మెక్మస్టర్కు ముందు పని చేసిన మైఖేల్ ఫ్లిన్‌ను.. అమెరికాలో రష్యా రాయబారి విషయంలో ఉపాధ్యక్షుడిని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలపై గత ఏడాది ట్రంప్ తొలగించారు. -
డిప్యూటీ ఎన్ఎస్ఏగా రాజిందర్ ఖన్నా
న్యూఢిల్లీ: నిఘా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ‘రా’ మాజీ చీఫ్ రాజిందర్ ఖన్నా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. గతేడాది ఆగస్టులో అరవింద్ గుప్తా పదవీకాలం ముగిసినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంటోంది. 1978 బ్యాచ్‌కు చెందిన ఖన్నాకు పాకిస్తాన్ వ్యవహారాలు, ఇస్లాం ఉగ్రవాదంపై పూర్తి అవగాహన ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిన ఖన్నా నియామకానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ పచ్చజెండా ఊపినట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. -
దోవల్ అదుర్స్.. నాడు ఫోన్లో.. నేడు భేటీలో
వాషింగ్టన్: సంస్కరణల విషయంలోనే కాదు.. దేశ సంరక్షణ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళుతోంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం కొద్ది రోజుల్లో కొలువు దీరనున్న నేపథ్యంలో అగ్ర రాజ్యంతో బలమైన దోస్తీకి చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్ అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా విధులు నిర్వర్తించనున్న మైఖెల్ ఫ్లిన్‌ను కలిశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు, ఉమ్మడిగా అమలుచేయాల్సిన వ్యూహాల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దోవల్‌కు మైఖెల్ గొప్ప గౌరవాన్ని ఇచ్చారంట. అంతేకాదు, ఆధునిక యుగంలో అత్యంత వేగంగా దూసుకెళుతున్న దేశం భారత్ అని, భారత ఆర్థిక వ్యవస్థను, విలువలను తాము గౌరవిస్తామని కూడా దోవల్ తో ఆయన అన్నట్లు భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. గతంలోనే మైఖెల్తో దోవల్ ఫోన్ లో మాట్లాడగా సమావేశానికి ఆయన అమెరికా ఆహ్వానించారట. ఆ మేరకే ఆయన తాజాగా వెళ్లి భారత్- అమెరికా రక్షణ అంశాలపై పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. -
దాడికి సూత్రధారి ఎవరు?
ఉడీలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారతీయుల గుండెలన్నీ ఒక్కసారిగా భగభగ మండిపోయాయి. ప్రతీకార జ్వాలలు రగులుకున్నాయి. పాకిస్థాన్ పీచమణచాల్సిన సమయం ఇదేనని మాజీ సైనికులు కూడా గర్జించారు. కానీ.. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఆశించిన స్పందన రాలేదు. జవాన్ల త్యాగాలు వృథాగా పోనివ్వబోమని మాత్రమే ప్రధానమంత్రి చెప్పారు. అయితే.. అప్పటికే తెరవెనక జరగాల్సింది అంతా జరిగిపోతోంది. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ప్రధానమంత్రికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎక్కడా తెరమీద కనిపించలేదు. తెర వెనకనుంచే ఇద్దరూ వ్యూహరచనలో మునిగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పారికర్ - దోవల్.. వీళ్లిద్దరూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నమ్మిన బంట్లు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తాను తలపెట్టిన ఆర్థిక సంస్కరణలను సరిగ్గా అమలుచేయడానికి మన్మోహన్ సింగ్‌ను ఎలా ఎంచుకుని తీసుకొచ్చారో.. అలాగే నరేంద్రమోదీ ప్రధాని పదవి చేపట్టిన వెంటనే అప్పటివరకు గోవా ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్‌ను కూడా రక్షణ మంత్రిగా అలాగే తీసుకొచ్చారు. మరోవైపు అప్పటివరకు యూపీఏ హయాంలో పెద్దగా ప్రాధాన్యం లభించని అజిత్ దోవల్‌ను కూడా జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. 2014 మే 26న మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, 30వ తేదీన దోవల్ ఎన్ఎస్ఏ పదవిలో నియమితులయ్యారు. అప్పటి నుంచి ప్రభుత్వం విదేశీ వ్యవహారాలకు సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం వెనక ఆయన హస్తం ఉండని సందర్భం లేదు. ఎవరీ దోవల్.. ఏం చేశారు అజిత్ దోవల్.. 1968 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. కేరళ కేడర్‌లో చేరిన ఈయన, 2004-05 సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1980లలో మిజో నేషనల్ ఫ్రంట్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో దోవల్ ఆ సంస్థలోకి చొరబడి, దాని అగ్రకమాండర్లు ఆరుగురిని మట్టుబెట్టారు. దాంతో ఎంఎన్ఎఫ్ ఉనికి దాదాపు నిర్వీర్యం అయిపోయింది. ఇక పాకిస్థాన్‌లో గూఢచారిగా ఏడు సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఒక భిక్షగాడి వేషంలో కూడా తిరిగేవారని అంటారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారులు పట్టుబడితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. చిత్రహింసలు పెట్టి మరీ చంపేస్తారు. అది తెలిసి కూడా ఏకంగా ఏడేళ్ల పాటు అక్కడే ఉండి వాళ్ల రహస్యాలను తెలుసుకున్న ఘనత దోవల్‌కు ఉంది. ఇక భారత సైన్యం ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సమయంలో దోవల్ ముందుగానే స్వర్ణదేవాలయంలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆయన పాకిస్థానీ గూఢచారిగా నటించి, ఉగ్రవాదుల ప్లాన్లు అన్నీ తెలుసుకుని, వాటిని సైన్యానికి అందించారు. కుక్కే పారే లాంటి కశ్మీరీ ఉగ్రవాదులను ఆయా ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా మార్చేశారు. ఇటీవలే ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది కాలానికే ఇరాక్ నుంచి 45 మంది భారతీయ నర్సులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చారు. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద రాజపక్స ఓటమి వెనక ఉన్నది కూడా అజిత్ దోవలే! రాజపక్స భారతదేశానికి తలనొప్పిగా మారి, చైనాకు అనుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. దాంతో తర్వాతి ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ఏమాత్రం వీల్లేదని భావించిన దోవల్.. అక్కడకు వెళ్లి ఏం మాయ చేశారో గానీ, మైత్రిపాల సిరిసేన తదుపరి అధ్యక్షుడయ్యారు. ఒకప్పుడు రాజపక్సకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే సిరిసేనను ఆయనపై రెచ్చగొట్టి పోటీకి నిలబెట్టింది కూడా దోవలే. అంతేకాదు.. మాజీ ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘేను పోటీ చేయొద్దని కోరి.. ఒప్పించారు కూడా. దాంతో రాజపక్స ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసి.. సిరిసేనను అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు! -
అమెరికా నుంచి ఫోన్.. సాయం చేస్తామని ఆఫర్
ఉగ్రవాద నిరోధక చర్యల్లో తమ నుంచి కావల్సినంత సాయం అందజేస్తామని భారతదేశానికి అమెరికా హామీ ఇచ్చింది. ఉడీ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా నుంచి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు ఫోన్ వచ్చింది. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు సుసన్ రైస్ ఈ ఫోన్ చేశారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద బృందాలు భారతీయులపై దాడి చేస్తున్న విషయాన్ని ప్రస్తావించి.. ఉడీ ఉగ్రవాద దాడి విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్థాన్‌ను కూడా కోరినట్లు చెప్పారు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర సంస్థలపై పాక్ కఠిన చర్యలు తీసుకుంటుందని తాము భావిస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ఉడీ ఉగ్రదాడి అనంతరం అమెరికాకు చెందిన ఒక అత్యున్నత అధికారి భారత జాతీయ భద్రతా సలహాదారు దోవల్‌కు ఫోన్ చేయడం ఇదే తొలిసారి. ఉగ్రవాద బాధిత దేశాలకు న్యాయం చేసేందుకు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనే ఒబామా సందేశాన్ని ఆమె దోవల్‌కు వివరించారు. -
పారికర్ వ్యాఖ్యలపై పాక్ ఆందోళన
ఇస్లామాబాద్: తీవ్రవాదులను తీవ్రవాదులతోనే తటస్థీకరించాలని భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తప్పుబట్టింది. ముల్లును ముల్లుతోనే తీయాలన్న పారికర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ జాతీయ భద్రత, విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ రక్షణ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భారత్ తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని పునరుద్ఘాటించారు. తీవ్రవాదం రెండు దేశాల ఉమ్మడి శత్రువని, దాన్ని ఓడించేందుకు ఇరుదేశాలు కలిసి పోరాడాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. తీవ్రవాదం కారణంగా తమ దేశమే ఎక్కువగా నష్టపోయిందన్నారు.