న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు.
‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment