మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్ ఫ్రెండ్) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీíÙయేటివ్స్(ఏఎస్‌ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు.
ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం
తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment