
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భారతదేశ ఆహ్వానాన్ని మన్నించారు. త్వరలో ఆయన భారత్‌కు రానున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ధృవీకరించారు. ఉక్రెయిన్ సంక్షోభం మొదలయ్యాక ఆయన భారత్‌కు వస్తుండడం ఇదే.
నరేంద్ర మోదీ(Narendra Modi) మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే పుతిన్‌ను ప్రధాని మోదీ భారత్‌కు ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానంపై ఇప్పుడు క్రెమ్లిన్ వర్గాలు ఒక ప్రకటన చేశాయి. మోదీ మూడోసారి గెలిచాక మా దేశానికే మొదట వచ్చారు. ఇక ఇప్పుడు మా వంతు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని సెర్గీ ప్రకటించారు. అయితే ఆ పర్యటన ఎప్పుడు ఉంటుందనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
భారత్-రష్యా మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉంటాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉక్రెయిన్ యుద్ధం సైతం దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. పైగా రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) మధ్య చర్చలు.. శాంతి ఒప్పందం ద్వారానే యుద్ధం ముగుస్తుందని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది.
పుతిన్ గతంలో చాలాసార్లు భారత పర్యటనకు వచ్చారు. 2000 సంవత్సరంలో అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ఆయన భారత భూభాగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు సదస్సులు, ద్వైపాక్షి ఒప్పందాల కోసం 2004, 2010, 2012, 2014, 2018, 2021లో పర్యటించారు.
ఇక భారత ప్రధాని హోదాలోనూ నరేంద్ర మోదీ నాలుగుసార్లు రష్యాకు వెళ్లారు. 2015లో బ్రిక్స్ సదస్సు కోసం తొలిసారి అక్కడికి వెళ్లిన ఆయన.. 2017, 2019, కాస్త గ్యాప్ తర్వాత 2024లో రష్యాలో పర్యటించారు.