President of Russia
-
మోదీ గొప్ప స్నేహితుడు: పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప మిత్రుడంటూ పొగిడారు. రష్యాలోని కజాన్‌లో వచ్చే నెలలో జరిగే బ్రిక్స్ శిఖరాగ్రానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతాదారుల సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గురువారం అజిత్ దోవల్ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మోదీతో భేటీకి ఆసక్తిగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. దాదాపు మూడు వారాల క్రితం ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో జరిపిన పర్యటన, అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చల వివరాలను దోవల్ ఆయనకు వివరించారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రం సమయంలో అక్టోబర్ 22వ తేదీన మోదీతో సమావేశమవ్వాలని, రెండు దేశాల మధ్య విజయవంతంగా అమలవుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం, భద్రతా పరమైన అంశాలపై చర్చించాలని అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు’ అని రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెల 22–24 తేదీల్లో రష్యాలోని కజాన్ నగరంలో బ్రిక్స్ శిఖరాగ్రం జరగనుంది. జూలైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారత్, బ్రెజిల్, చైనాలకు కీలకంగా ఉన్నాయని ఇటీవల పుతిన్ పేర్కొనడం తెలిసిందే. కాగా, బ్రిక్స్ శిఖరాగ్రానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా హాజరవనున్నారు. ఈ విషయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ధ్రువీకరించారు. గురువారం ఆయన పుతిన్‌తో సమావేశమయ్యారు. -
వియత్నాంతో పుతిన్ చెట్టపట్టాల్
హనోయి: యుద్ధోన్మాదంతో ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగాక అంతర్జాతీయ మద్దతు కరువైన తరుణంలో రష్యా ఆసియా దేశాలతో మైత్రికి మొగ్గుచూపుతోంది. అందులోభాగంగానే ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ గురువారం అక్కడి నుంచి నేరుగా వియత్నాం చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా గురువారం వియత్నాం అధ్యక్షుడు టో లామ్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపారు. విద్య, శాస్త్ర సాంకేతికత, చమురు, సహజవాయువుల అన్వేషణ, ఆరోగ్య రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అణు శాస్త్ర సాంకేతికతపై ఉమ్మడి పరిశోధనకూ అంగీకరించారు. -
పుతిన్ ఐదోసారి ప్రమాణం
మాస్కో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ప్రమాణం చేశారు. మంగళవారం క్రెమ్లిన్ ప్రాసాదంలో 2,500 మంది ముఖ్య అతిథుల సమక్షంలో పుతిన్ రష్యా రాజ్యాంగంపై ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ..అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఐక్యంగా ఉంటూ లక్ష్యాలను అధిగమించి, విజయాలను అందుకుంటామని చెప్పారు.ఈ కార్యక్రమానికి అమెరికా నటుడు స్టీవెన్ సీగల్ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే, అమెరికా, యూకే, జర్మనీ దౌత్యవేత్తలు గైర్హాజరయ్యారు. అంతకుముందు పుతిన్ 30 గన్ సెల్యూట్ స్వీకరించారు. క్రెమ్లిన్ కేథడ్రల్ స్క్వేర్ వద్ద ప్రెసిడెన్షియల్ రెజిమెంట్ పరేడ్‌ను తిలకించారు. దగ్గర్లోని అనన్షియేషన్ కేథడ్రల్‌లో రష్యన్ ఆర్థోడాక్స్ పాటియార్క్ కిరిల్ ఆశీస్సులు అందుకున్నారు. ఆరేళ్ల పదవీ కాలానికి గాను 2030 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. -
2024 అధ్యక్ష ఎన్నికల బరిలో పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(71) 2030 వరకు పదవిలో కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూలేని విధంగా అత్యంత ప్రమాదకరమైన కాలంలో రష్యాను నడిపించాలని ఆయన భావిస్తున్నట్లు అక్కడి మీడియా అంటోంది. దీనిపై తుది నిర్ణయమైపోయిందని, ఇందుకు తగ్గట్లుగా పుతిన్ మద్దతుదారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సమాచారం. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టే ప్రత్యర్థులెవరూ లేరని పరిశీలకులు అంటున్నారు. -
నరేంద్ర మోదీ బిగ్ ఫ్రెండ్
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్ ఫ్రెండ్) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీíÙయేటివ్స్(ఏఎస్ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్లో ఉజ్బెకిస్తాన్‌లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే
మాస్కో/కీవ్: పొరుగుదేశం ఉక్రెయిన్‌పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్‌పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. ఆయా దేశాల చర్యకు ప్రతిచర్యగానే ఈ సైనిక చర్యకు శ్రీకారం చుట్టామన్నారు. రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్‌లో సోమవారం ‘విక్టరీ డే’ వేడుకల్లో పుతిన్ పాల్గొన్నారు. మిలటరీ పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే, పరిశీలకులు అంచనా వేసినట్లు పుతిన్ కీలక ప్రకటనలేదీ చేయలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధవ్యూహంలో మార్పు, పూర్తిస్థాయి యుద్ధ ప్రకటన గురించి ప్రస్తావించలేదు. 1945లో నాజీలపై రెడ్ ఆర్మీ సాగించిన పోరాటానికి, ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి మధ్య పోలికలు ఉన్నాయని పరోక్షంగా వెల్లడించారు. సరిహద్దుల అవతలి నుంచి తమ మాతృభూమికి ముప్పు పొంచి ఉండడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని పుతిన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర అత్యవసర చర్యేనని ఉద్ఘాటించారు. రష్యాకు ముప్పు రోజురోజుకూ పెరుగుతోందన్నారు. తాము సరైన సమయంలో, సరైన రీతిలో స్పందించామని అన్నారు. రష్యా భద్రతకు హామీతోపాటు ‘నాటో’ విస్తరణ యోచనను విరమించుకోవాలని కోరామన్నారు. అయినా ఫలితం కనిపించలేదని చెప్పారు. రష్యా దళాలు సొంతదేశం భద్రత కోసమే ఉక్రెయిన్‌లో వీరోచితంగా పోరాడుతున్నాయని ప్రశంసించారు. రష్యాపై దాడులు చేయడానికి ఉక్రెయిన్ గతంలోనే ప్రణాళికలు రచించిందని పుతిన్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై దాడులు ఇక ఉధృతం! రష్యా క్షిపణి దాడులను తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ఉక్రెయిన్ సైన్యం సోమవారం తమ ప్రజలను హెచ్చరించింది. రష్యాలోని బెల్గోరాడ్ ప్రాంతంలో 19 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పుతిన్‌కు విజయం అసాధ్యం: జి–7 రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిషేధించాలని జి–7 దేశాధినేతలు నిర్ణయానికొచ్చారు. అమెరికా, బ్రిటన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు ఆదివారం రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వర్చువల్‌గా భేటీ అయ్యారు. ఈ యుద్ధంలో పుతిన్ విజయం దక్కడం అసాధ్యమని జి–7 దేశాల నాయకులు తేల్చిచెప్పారు. కాగా, పోలండ్‌లోని రష్యా రాయబారి సెర్గీ అండ్రీవ్‌కు నిరసన సెగ తగిలింది. వార్సాలోని సోవియట్ సైనిక శ్మశాన వాటికలో దివంగత రెడ్ ఆర్మీ సైనికులకు నివాళులర్పించకుండా అండ్రీవ్‌ను అడ్డుకున్నారు. ఆయనపై ఎర్రరంగు చల్లారు. త్వరలో మాకు రెండు ‘విక్టరీ డే’లు: జెలెన్స్కీ త్వరలో తాము రెండు విక్టరీ డేలు జరుపుకోబోతున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ మేరకు సోమవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమ పూర్వీకుల ప్రాణ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఉక్రెయిన్ ప్రజలు విజయం సాధించారని, ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలోనూ కచ్చితంగా నెగ్గుతామని ఉద్ఘాటించారు. తద్వారా త్వరలోనే రెండు విక్టరీ డేలు జరుపుకుంటామన్నారు. కొందరికి(రష్యా) ఒక్క విక్టరీ డే కూడా ఉండబోదని వ్యాఖ్యానించారు. -
ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం
బీజింగ్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం మిత్ర దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి సంభాషణలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్ తెలపగా సంక్షోభం ముదరకుండా రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చెప్పారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని జిన్‌పింగ్‌కు వివరించారని తెలిపింది. భద్రతపై రష్యా వెలిబుచ్చుతున్న న్యాయపరమైన ఆందోళనలను అమెరికాతోపాటు నాటో కూటమి దేశాలు ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని పుతిన్ చెప్పారు. హామీలను మరిచి, రష్యా వ్యూహాత్మక భద్రతకు భంగం కలిగించేలా సైనిక మోహరింపులను పెంచుతూ వచ్చాయని చెప్పారు. బదులుగా జిన్‌పింగ్.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చైనా వైఖరి ఉందని వివరించారు. ‘ఈయూ, అమెరికాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి ఆలోచనలను పూర్తిగా విడనాడాలి. దేశాల న్యాయమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారని జిన్హువా వెల్లడించింది. -
మాట వినకపోతే కఠిన ఆంక్షలే
వాషింగ్టన్: జరిగిన రక్తపాతం చాలు, రష్యా ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హితవు పలికారు. రష్యా ఇదే వైఖరి కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతాయని పేర్కొన్నారు. పుతిన్ తమ మాట వినకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీన పర్చేలా మిత్రదేశాలతో కలిసి కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. బైడెన్ తాజాగా వైట్‌హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలపై రష్యా సైన్యం పాశవిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇది అన్యాయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. ఈ అరాచకత్వానికి పుతిన్ కొన్ని నెలల నుంచే ప్రణాళిక రూపొందించారని, 1,75,000 మంది జవాన్లను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని చెప్పారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. ఉక్రెయిన్ పరిణామాలకు పుతినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రష్యాపై ఈ రోజు అదనంగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని ప్రకటించారు. ‘నాటో’ దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ గురిపెడితే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, కచ్చితంగా జోక్యం చేసుకుంటామని బైడెన్ తేల్చిచెప్పారు. ఇప్పటికిప్పుడు పుతిన్‌తో మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. కఠిన ఆంక్షలతో పుతిన్‌ను కట్టడి చేయకపోతే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉక్రెయిన్‌లో పుతిన్‌కు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకోవడానికే యుద్ధం ప్రారంభించారని చెప్పారు. అలాంటి దేశాలు మా గౌరవాన్ని కోల్పోతాయి ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అలాంటి దేశాలు గౌరవాన్ని కోల్పోతాయని వ్యాఖ్యానించారు. పుతిన్ వెఖరి రష్యాకు నష్టదాయకంగా మారిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై పుతిన్ వెలివేతకు గురైన వ్యక్తిగా మారుతాడని బైడెన్ చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. రష్యా విషయంలో భారత్–అమెరికా మధ్య భేదాభిప్రాయాలు సమసిపోలేదని ఉద్ఘాటించారు. -
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలకు.. స్వతంత్ర హోదాకు రష్యా నిర్ణయం!
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచన లేదంటూనే సంక్షోభాన్ని మరింత పెంచే చర్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దిగుతున్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో వేర్పాటువాదుల అదీనంలోని రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఆయన నిర్ణయించారు. సోమవారం తన నేతృత్వంలోని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను సమావేశపరిచి ఈ విషయమై లోతుగా చర్చించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దీనిపై మాట్లాడారు. దీనిపై ఉక్రెయిన్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఐరాస భద్రతా మండలిని తక్షణం సమావేశపరిచి రష్యా దూకుడుపై చర్చించాలని కోరింది. ఆ రెండు వేర్పాటువాద ప్రాంతాల్లో రష్యా అనుకూల రెబల్స్ ప్రభుత్వాలు నడుపుతున్నాయి. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని, ఉక్రెయిన్ ఆక్రమణల బారినుంచి కాపాడి అన్నివిధాలా ఆదుకోవాలని రెబెల్స్ తాజాగా రష్యాను కోరారు. రష్యా పార్లమెంటు దిగువ సభ కూడా గత వారం పుతిన్‌కు ఆ మేరకు విజ్ఞప్తి చేసింది. -
పుతిన్.. ద క్యాలెండర్ బాయ్
కింగ్‌ఫిషర్ క్యాలెండర్ తెలుసు..! ప్లేబాయ్ క్యాలెండర్ తెలుసు..!! మరి పుతిన్ క్యాలెండర్ తెలుసా? ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరిట రూపొందిన క్యాలెండర్. ప్రస్తుతం రష్యాలో పుతిన్ క్యాలెండర్ ఓ సెన్సేషనల్ ట్రెండ్. 2017 సంవత్సరానికిగానూ పుతిన్ క్యాలెండర్ అప్పుడే మార్కెట్లోకి వచ్చేసింది. దీనిని పుతినే అధికారికంగా విడుదల చేస్తుండటం గమనార్హం. క్రిస్మస్ సందర్భంగా రష్యాలోని షాపులు, మాల్స్ ఈ క్యాలెండర్‌ను అమ్మేందుకు రెడీ అయిపోయాయి. ఈ క్యాలెండర్ పూర్తిగా పుతిన్ స్పెషల్. మొత్తం 12 పేజీల్లోనూ వెరైటీ స్టిల్స్‌తో రష్యా అధ్యక్షుడు దర్శనమిస్తారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మాదిరిగా టాప్‌లెస్‌గా గుర్రపు స్వారీ చేస్తూ.. సైబీరియాలో చేపలు పడుతూ.. తనలోని కొత్త యాంగిల్స్‌తో పుతిన్ ఈ క్యాలెండర్లో కనిపిస్తారు. ఫ్లైట్ నడుపుతూ.. స్కైడైవింగ్ చేస్తూ.. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ.. కుక్క పిల్లలతో ఆడుకుంటూ సరదాగా గడిపిన చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిని కొనేందుకు రష్యన్లు అమితాసక్తి చూపిస్తున్నారు. రష్యాలోనే కాదు జపాన్ తదితర దేశాల్లోనూ ఈ క్యాలెండర్‌కు చాలా క్రేజ్ ఉంది. అంటే రష్యన్లు ఉదయం నిద్ర లేవగానే పుతిన్ ఫొటోను చూసి రోజును ప్రారంభిస్తారన్నమాట. -
కావలిలో రష్యా అణు విద్యుత్ కేంద్రం?
రష్యా అధ్యక్షుడి పర్యటనలో ఒప్పందం అమరావతి: రాష్ట్రంలో మరో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు అమెరికా కంపెనీలు ప్రయత్నిస్తుండగా, తాజాగా రష్యా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం విజయంతో రాష్ట్రంలో కాలు మోపడానికి రష్యా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. రష్యాకు చెందిన రోస్టమ్ కంపెనీ నెల్లూరు జిల్లా కావలి సమీపంలో ఒక్కొక్కటి 1,000 మెగా వాట్ల సామర్థ్యంతో ఆరు భారీ అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కావాల్సిన భూమిని ఇప్పటికే గుర్తించినప్పటికీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ఈ విషయాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. వచ్చేనెలలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు వచ్చినపుడు ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా ఉప ప్రధాని దిమిర్తి రొగొజిన్ ముందస్తు కసరత్తు పూర్తి చేశారు. సుష్మతో రష్యా చర్చలు: నెల రోజుల్లోనే రెండు సార్లు ఆయన మన దేశ పర్యటనకు రావడం, విదేశీ వ్యవహారామంత్రి సుష్మాస్వరాజ్‌తో చర్చలు జరపడం ఈ విషయాలను మరింత బలపరుస్తున్నాయి. రెండు రోజుల క్రితం సుష్మాస్వరాజ్‌తో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు చేసే అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి ఒప్పంద పత్రాలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరు దేశాల భాగస్వామ్యంతో అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని, 2020 నాటికి దేశంలో 10 అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని రొగొజిన్ ఢిల్లీలో ప్రకటించడం గమనార్హం. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల జీ-20 సమావేశంలో కూడా ఇరువురి మధ్య ఈ అం శం చర్చకు వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు రష్యా పర్యటనలో కూడా ఈ అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు గురించి చర్చలు జరిపారు.