వాషింగ్టన్: జరిగిన రక్తపాతం చాలు, రష్యా ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హితవు పలికారు. రష్యా ఇదే వైఖరి కొనసాగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారుతాయని పేర్కొన్నారు. పుతిన్ తమ మాట వినకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీన పర్చేలా మిత్రదేశాలతో కలిసి కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికి, శాంతిని నెలకొల్పడానికి తాము చేస్తున్న ప్రయత్నాలను పుతిన్ తిరస్కరిస్తున్నారని ఆరోపించారు.
బైడెన్ తాజాగా వైట్‌హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లోని సామాన్య ప్రజలపై రష్యా సైన్యం పాశవిక దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఇది అన్యాయమైన, అనాగరిక చర్య అని పేర్కొన్నారు. ఈ అరాచకత్వానికి పుతిన్ కొన్ని నెలల నుంచే ప్రణాళిక రూపొందించారని, 1,75,000 మంది జవాన్లను ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించారని చెప్పారు. ఉక్రెయిన్ వల్ల భద్రతకు ప్రమాదం పొంచి ఉందంటూ రష్యా ఒక రాజకీయ నాటకాన్ని మొదలుపెట్టిందని దుయ్యబట్టారు.
ఉక్రెయిన్ పరిణామాలకు పుతినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రష్యాపై ఈ రోజు అదనంగా మరిన్ని ఆంక్షలు విధిస్తున్నామని ప్రకటించారు. ‘నాటో’ దేశాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ గురిపెడితే తాము చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, కచ్చితంగా జోక్యం చేసుకుంటామని బైడెన్ తేల్చిచెప్పారు. ఇప్పటికిప్పుడు పుతిన్‌తో మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు. కఠిన ఆంక్షలతో పుతిన్‌ను కట్టడి చేయకపోతే మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉక్రెయిన్‌లో పుతిన్‌కు ఎన్నో ఆశలు, ఆకాంక్షలు ఉన్నాయని, వాటిని నెరవేర్చుకోవడానికే యుద్ధం ప్రారంభించారని చెప్పారు.
అలాంటి దేశాలు మా గౌరవాన్ని కోల్పోతాయి
ఉక్రెయిన్ విషయంలో రష్యాకు మద్దతుగా నిలుస్తూ తమకు(నాటోకు) వ్యతిరేకంగా ఉన్న దేశాలకు జో బైడెన్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అలాంటి దేశాలు గౌరవాన్ని కోల్పోతాయని వ్యాఖ్యానించారు. పుతిన్ వెఖరి రష్యాకు నష్టదాయకంగా మారిందని తెలిపారు. అంతర్జాతీయ వేదికపై పుతిన్ వెలివేతకు గురైన వ్యక్తిగా మారుతాడని బైడెన్ చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. రష్యా విషయంలో భారత్–అమెరికా మధ్య భేదాభిప్రాయాలు సమసిపోలేదని ఉద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment