బైడెన్‌తో మోదీ చర్చలు
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు
విల్లింగ్టన్ లోని తన నివాసంలో ఘనస్వాగతం పలికిన బైడెన్
క్వాడ్, ఐరాస సదస్సుల్లో పాల్గొననున్న ప్రధాని
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై లోతుగా చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ప్రధాని అమెరికా చేరుకున్నారు. అనంతరం నేరుగా డెలావెర్‌లో విల్లింగ్టన్ లోని బైడెన్ నివాసానికి వెళ్లారు. మోదీకి అధ్యక్షుడు ఘనస్వాగతం పలికారు. వారిద్దరూ ఆతీ్మయంగా కౌగిలించుకున్నారు.
అనంతరం మోదీ చేయి పట్టుకుని బైడెన్ లోనికి తీసుకెళ్లారు. పలు అంశాలపై నేతలిద్దరూ చాలాసేపు చర్చలు జరిపారు. ఉక్రెయిన్ సంక్షోభానికి ఈ భేటీలో పరిష్కార మార్గం లభించవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్–గాజా ఘర్షణతో పాటు అమెరికా–భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తదితర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అంతకుముందు పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆయన్ను చూసేందుకు ప్రవాస భారతీయులు భారీగా తరలివచ్చారు. వారితో ఆయన కరచాలనం చేస్తూ అటోగ్రాఫ్‌లు ఇస్తూ సందడి చేశారు.
అమెరికాతో బంధం బలోపేతం
ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతికి కృషి చేయడానికి భావసారూప్య దేశాలకు ‘క్వాడ్’ అత్యంత కీలకమైన వేదిక అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా బయల్దేరే ముందు ప్రకటన విడుదల చేశారు. ‘‘బైడెన్, ఆ్రస్టేలియా ప్రధాని అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో భేటీ అయ్యేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. అమెరికాలోని ప్రవాస భారతీయులను కలుసుకోబోతుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. మోదీ అమెరికాలో కీలక సదస్సులు, సమావేశాల్లో పాల్గొంటారు. బైడెన్‌తో పాటు పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. విల్మింగ్టన్‌లో క్వాడ్ సదస్సులో, న్యూయార్క్‌లో ఐరాస సాధారణ సభలో ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’లో ప్రసంగిస్తారు. లాంగ్ ఐలండ్‌లో ప్రవాస భారతీయుల భేటీలో పాల్గొంటారు. ప్రఖ్యాత అమెరికా కంపెనీల సీఈఓలతో సమావేశమై ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ వంటి అధునాతన సాంకేతికతపై చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment