
మస్కట్ (ఒమన్): యురేనియం శుద్ధి కార్యక్రమం వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్‌తో అమెరికా చేపట్టిన మూడో దఫా పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో ముగిశా యి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చర్చల తర్వాత అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఒమన్ నుంచి తమ స్వదేశాలకు పయనమయ్యారని విశ్వస నీయ వర్గాలు వెల్లడించాయి.
‘‘పరస్పర గౌరవం, హామీలకు కట్టుబడేలా ఒప్పందం కుదర్చుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి కనబర్చాయి. కీలక ప్రతిపాదనలు, సాంకేతిక అభ్యంతరాలు, తదితరాలపై మరోదఫా చర్చలు జరుపుతాం. వచ్చే వారం సైతం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మే మూడో తేదీన తదుపరి భేటీ ఉంటుంది’’అని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. గతంలో మస్కట్, రోమ్‌లో ఇలా పరోక్ష చర్చలు జరిగాయి. గతంలో మాదిరే ఈసారి చర్చల్లో సైతం ఒమన్ విదేశాంగ మంత్రి బుసైదీ మధ్యవర్తిగా ఉన్న విషయం విదితమే.
చర్చలకు ముందు విట్కాఫ్ రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. చర్చలు మొదలైన సమయంలోనే దక్షిణ ఇరాన్‌లో రజేయీ నౌకాశ్రయంలో శనివారం పేలుళ్లు సంభవించడం గమనార్హం. అర్ధశతాబ్ద శత్రుత్వాన్ని పక్కనబెట్టిమరీ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను సడలిస్తామని, అందుకు ప్రతిగా అణ్వాయుధంలో ఉపయోగించే యురేనియం శుద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేయడం తెల్సిందే. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే దాడులతో తెగబడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే అందుకు దీటుగా బదులిస్తామని ఇరాన్ ప్రతిస్పందించడం విదితమే.