nuclear talks
-
అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం. -
ఉత్తర కొరియాలో ట్రంప్
పన్‌మున్‌జొమ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఉత్తర కొరియా వచ్చారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌తో సమావేశమయ్యారు. ఉభయ కొరియాల సరిహద్దుల మధ్య ఉన్న నిస్సైనిక మండలం(డీఎంజెడ్)లోని పన్‌మున్‌జొమ్ గ్రామంలో ఇరువురు నేతలు కలుసుకున్నారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా రావడం ఇదే మొదటిసారి కావడంతో ట్రంప్ పర్యటన చరిత్రాత్మకమయింది. ఉత్తర కొరియాలో అడుగుపెట్టిన ట్రంప్ ఆ దేశాధ్యక్షుడు కిమ్‌తో కలిసి నిస్సైనిక మండలంలోకి వచ్చారు. అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు మొదలు పెట్టేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. కాగా ట్రంప్ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. కొందరు దీనిపై ఆశాభావం వ్యక్తం చేయగా, మరికొందరు దీనిని వ్యర్థ ప్రయత్నంగా పేర్కొన్నారు. కిమ్‌ను అమెరికాకు ఆహ్వానించినట్టు ట్రంప్ తెలిపారు. ఆయన రావాలనుకుంటే ఏప్పుడయినా అధ్యక్ష భవనానికి రావచ్చని కిమ్‌కు చెప్పినట్టు ట్రంప్ వెల్లడించారు. ఉత్తర కొరియా రమ్మనడం నాకు గౌరవకారణం. అలాగే, నేను ఉత్తర కొరియాలో అడుగుపెట్టడం నాకు గర్వకారణం’అని ట్రంప్ ఉత్తర కొరియా అధినేతతో అన్నారు. చర్చలకు కూర్చుంటూ ఇద్దరు నేతలూ కరచాలనం చేసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల విభజనకు గుర్తుగా నిలిచిన ఈ ప్రాంతంలో మేం చేసుకున్న కరచాలనం గతాన్ని మరిచిపోవాలన్న మా ఆకాంక్షకు నిదర్శనం’ అని కిమ్ అన్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ ఇద్దరు నేతలు కలుసుకోవడం జరిగింది. ట్రంప్ శనివారం ట్విట్టర్లో ఉత్తర కొరియా అధినేత కిమ్‌కు ఆహ్వానం పంపారు. ఆదివారం వారిద్దరూ సమావేశమయ్యారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఉత్తర కొరియాను ఒప్పించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది సింగపూర్‌లో రెండు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అది విఫలమయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌లు వియత్నాంలో మళ్లీ చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలప్రదం కాలేదు. 2017లో ఉత్తర కొరియా ఆరు అణు పరీక్షలను నిర్వహించింది. అమెరికాను చేరుకోగల క్షిపణులను పరీక్షించింది. గత ఏడాది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయేల మధ్య నిస్సైనిక మండలంలో మొదటి సారి సమావేశం జరిగింది. ఉత్తర కొరియా, అమెరికాల మధ్య సయోధ్య కుదర్చడానికి మూన్ ప్రయత్నించారు.దానికి కొనసాగింపుగా ట్రంప్ ఇప్పుడు ఉత్తర కొరియాలో అడుగు పెట్టారు. ట్రంప్ కిమ్‌తో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడిని కూడా కలుసుకున్నారు. అణు చర్చలకు మార్గం సుగమం ట్రంప్ ఉత్తర కొరియా పర్యటనపై దక్షిణ కొరియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన అణు చర్చలు పునః ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరంటోంటే, వియత్నాం చర్చల్లాగే ఈ పర్యటన వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. త్వరలో ఎన్నికలు ఎదుర్కొనున్న ట్రంప్, మూన్‌లు ఇద్దరు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పని చేశారని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. -
ఐఎన్ఎఫ్ నుంచి వైదొలగిన అమెరికా
వాషింగ్టన్: రష్యాతో కుదుర్చుకున్న ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి ఐఎన్ఎఫ్ (ఇంటర్మీడియట్–రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్) ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి రష్యా క్షిపణులను తయారు చేసినందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. వైదొలిగే ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమై ఆర్నెల్లు కొనసాగుతుందనీ, ఆలోపు రష్యా తాను తయారు చేసిన ఆయుధాలను నాశనం చేసి చర్చలకు రావాలని కోరారు. ‘30 ఏళ్లకుపైగా ఈ ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉంది. కానీ రష్యా ఉల్లంఘనలకు పాల్పడుతున్నప్పుడు మేం కూడా ఈ ఒప్పందం నుంచి బయటకొస్తాం’అని పాంపియో తెలిపారు. ఈ ఆరు నెలల్లోపు రష్యా తన ఆయుధాలను నాశనం చేసి ఒప్పందానికి కట్టుబడుతుందని తాము భావిస్తున్నామన్నారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ఒబామా సంభాషణ!!
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు! గడిచిన 30 ఏళ్లలో ఇలా ఈ రెండు దేశాల అగ్రస్థాయి నేతలు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి!! ఇరాన్ కొత్త నాయకత్వం వల్ల అభివృద్ధికి అద్భుతమైన అవకాశం రావొచ్చని పావుగంట పాటు సాగిన ఈ సంభాషణలో ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. 1979 తర్వాత అమెరికా, ఇరాన్ అధ్యక్షులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. తమ సంభాషణ ఒక మంచి ముందడుగు అవుతుందని ఒబామా అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒక ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని, దీనివల్ల సంబంధాలు కూడా మెరుగుపడతాయని ఒబామా చెప్పారు. చర్చలు విజయవంతం అయ్యే విషయంలో తామెవరం గ్యారంటీ ఇవ్వలేకపోయినా, ఒక సమగ్ర పరిష్కారం మాత్రం తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. మరోవైపు ఇరాన్లో ఉన్న అమెరికన్ ఖైదీల గురించి మాత్రం ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తమ్మీత అణ్వస్త్రాల గురించి ఓ పరిష్కారం కనుగొనేందుకే ఇరు దేశాల అధినేతల సంభాషణ సాగినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరాలన్నదే తమ ఆకాంక్ష అని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ కూడా చెప్పారు. అణుబాంబు తయారుచేయాలన్నది తమ ఉద్దేశం కాదని, పాశ్చాత్య దేశాలు మాత్రం అలాగే అనుకుంటున్నాయని తెలిపారు. గతం కంటే ప్రస్తుతం చర్చలకు వాతావరణం కూడా బాగుందని అన్నారు.