ఇరాన్ అధ్యక్షుడితో ఒబామా సంభాషణ!!
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు! గడిచిన 30 ఏళ్లలో ఇలా ఈ రెండు దేశాల అగ్రస్థాయి నేతలు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి!! ఇరాన్ కొత్త నాయకత్వం వల్ల అభివృద్ధికి అద్భుతమైన అవకాశం రావొచ్చని పావుగంట పాటు సాగిన ఈ సంభాషణలో ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. 1979 తర్వాత అమెరికా, ఇరాన్ అధ్యక్షులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి.
తమ సంభాషణ ఒక మంచి ముందడుగు అవుతుందని ఒబామా అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒక ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని, దీనివల్ల సంబంధాలు కూడా మెరుగుపడతాయని ఒబామా చెప్పారు. చర్చలు విజయవంతం అయ్యే విషయంలో తామెవరం గ్యారంటీ ఇవ్వలేకపోయినా, ఒక సమగ్ర పరిష్కారం మాత్రం తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. మరోవైపు ఇరాన్లో ఉన్న అమెరికన్ ఖైదీల గురించి మాత్రం ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తమ్మీత అణ్వస్త్రాల గురించి ఓ పరిష్కారం కనుగొనేందుకే ఇరు దేశాల అధినేతల సంభాషణ సాగినట్లు తెలుస్తోంది.
ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరాలన్నదే తమ ఆకాంక్ష అని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ కూడా చెప్పారు. అణుబాంబు తయారుచేయాలన్నది తమ ఉద్దేశం కాదని, పాశ్చాత్య దేశాలు మాత్రం అలాగే అనుకుంటున్నాయని తెలిపారు. గతం కంటే ప్రస్తుతం చర్చలకు వాతావరణం కూడా బాగుందని అన్నారు.