సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత నగరానికి వస్తున్నారు. సాధారణంగా దేశ పర్యటనకు వచ్చే విదేశీ అధ్యక్షులు మొదట దేశ రాజధానికి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వేళ్లడం పరిపాటి. కానీ, నగరంతో ఇరానీలకు ఉన్న అనుబంధం వల్ల మొదట హైదరాబాద్‌కు వస్తున్నట్లు ఇరాన్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా నగరంలోని షియా, సున్నీల మధ్య ఐక్యత కోసం ఆయన ఇక్కడ పర్యటించనున్నారని కాన్సులేట్ మీడియా కో ఆర్డినేటర్ వివరించారు. నగరంలో రెండు రోజులు ఉంటారు.
ఈ నెల 15న (గురువారం) సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు షియా, సున్నీ మతగురువులు, విద్యావేత్తలు, మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. అదే రోజు రాత్రి నగరంలోని షియా ప్రముఖులతో బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో సమావేశం అవుతారు. 16న చారిత్రక మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తారు.
ఇరాన్‌తో నగరానికి 450 ఏళ్ల అనుబంధం
హైదరాబాద్ నగరానికి ఇరాన్‌తో 450 ఏళ్ల అనుబంధం ఉంది. నగర నిర్మాణం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగర నమూనా మాదిరిగా ప్రముఖ అర్కిటెక్ట్ మీర్ మొమిన్ నిర్మించారు. గతంలో హైదరాబాద్ నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీ పాలకులు ఇరాన్ నుంచి వచ్చినవారే. ఇంతకు ముందు 2004 జనవరి 28న అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ ఖాతిమీ నగర పర్యటనకు వచ్చారు. ఇప్పటి వరకు నగర పర్యటనకు ఇద్దరు ఇరాన్ అధ్యక్షులు మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు అరబ్బు దేశాలతో పాటు వివిధ ముస్లిం దేశాల అధ్యక్షులు నగర పర్యటనకు వచ్చారు. అయితే మక్కా మసీదులో విదేశీ అధ్యక్షుడు ప్రసంగం చేయడం మాత్రం ఇదే తొలిసారి. నగరంతో పాటు మక్కా మసీదు నిర్మాణం ఇరాన్ దేశస్థులైన కుతుబ్ షాహీ వంశస్థులే నిర్మించినందున విదేశీ అధ్యక్షుడికి మక్కా మసీదులో ప్రసంగించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది.
రేపు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు
Published Wed, Feb 14 2018 3:01 AM | Last Updated on Wed, Feb 14 2018 3:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment