iran president
-
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా
వాషింగ్టన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్ మాట్లాడుతూ హెలికాప్టర్ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్ 212 హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్ ఖదీర్ తెలిపారు. హెలికాప్టర్లో సిగ్నల్ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్ సిగ్నల్ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో సిగ్నల్ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్ అన్నారు. -
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం
దుబాయ్: ఇరాన్ తూర్పు అజర్బైజాన్ పర్వతసానువుల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రాణాలు కోల్పోయా రు. ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దట్టమైన అటవీప్రాంతంలో కనిపించకుండా పోయిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీరబ్దుల్లాహియాన్ (60), ఈస్ట్ అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మాలిక్ రహ్మతీ, అధికారులు, పైలట్లు, అంగరక్షకులు చనిపోయారని ఇరాన్ అధికారిక మీడియా సోమవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ మార్గదర్శకంలో ఇజ్రాయెల్‌పై గత నెలలో ఇరాన్ జరిపిన భీకర డ్రోన్లు, క్షిపణి దాడుల ఘటన మరువకముందే రైసీ హఠాన్మరణంపై ప్రపంచవ్యాప్తంగా భిన్న కథనాలు వినవస్తున్నాయి. అయితే రైసీ మరణోదంతంలో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని ఇజ్రాయెల్ సోమవారం స్పష్టంచేసింది. హెలికాప్టర్ ప్రమాదంపై అత్యున్నతస్థాయి దర్యాప్తునకు సాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీ షొయిగు మాట ఇచ్చారు. రైసీ మరణం నేపథ్యంలో ప్రస్తుత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మొఖ్బర్ను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఖమేనీ ప్రకటించారు. ఉపవిదేశాంగ మంత్రి బఘేరీ కనీని నూతన విదేశాంగ మంత్రిగా నియమించారు. హెలికాప్టర్ కూలడానికి గల కారణాలను ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. అధ్యక్షుడి మరణవార్త తెలిసి ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని ప్రత్యేక ప్రార్థనలు మొదల య్యాయి. ఐదు రోజులు సంతాపదినాలుగా పాటించనున్నారు. లెబనాన్, సిరియా సైతం మూ డ్రోజులు సంతాప దినాలుగా ప్రకటించాయి. భార త్ సైతం ఒక రోజు(మంగళవారం)ను సంతాప దినంగా ప్రకటించింది. రైసీ, ఇతర నేతల మృతదేహాలను తబ్రిజ్ పట్టణానికి తీసుకొస్తున్నారు. రైసీ ఖనన క్రతువును మష్హాద్ నగరంలో చేసే అవకాశం ఉంది.జాడ చెప్పిన తుర్కియే అత్యాధునిక డ్రోన్భారీ వర్షం, దట్టంగా కమ్ముకున్న మంచు, దారిలేని పర్వతమయ అటవీప్రాంతం కావడంతో త్రివిధ దళాలు రంగప్రవేశం చేసినా గాలింపు చర్యల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో తుర్కియే తమ అత్యాధునిక నిఘా డ్రోన్‌ను రంగంలోకి దింపింది. అది అడవిలో ఉష్ణాగ్రతల్లో మార్పుల ఆధారంగా సరిహద్దుకు 20 కి.మీ.ల దూరంలోని పచ్చని అటవీప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని కనిపెట్టి సహాయక బృందాలకు సమాచారం చేరవేసింది. దీంతో దళాలు నేరుగా ఘటనాస్థలికి చేరుకోగలిగాయి. ఆ తర్వాతే రైసీ మరణవార్తను ధ్రువీకరించారు. సంతాపాల వెల్లువరైసీ మరణవార్త తెల్సి చాలా ప్రపంచదేశాలు తమ సంతాప సందేశాలను పంపించాయి. ప్రధాని మోదీ సైతం తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ‘‘ రైసీ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత్–ఇరాన్ సంబంధాల బలోపేతానికి రైసీ చేసిన కృషి చిరస్మరణీయం. రైసీ కుటుంబ సభ్యులకు, ఇరాన్ దేశ ప్రజలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ విచారకర సమయంలో ఇరాన్‌కు అండగా ఉంటాం’’ అని మోదీ సోమవారం ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. లెబనాన్, సిరియా, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, చైనా, టర్కీ, రష్యా, మలేసియా, హౌతీ, ఖతార్, ఇరాక్, పాకిస్తాన్, అజర్బైజాన్, పోలండ్, యూఏఈ, వెనిజులా దేశాలు, యూరోపియన్ యూనియన్, ఐక్యరా జ్యసమితి, నాటో, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ సంతాపం తెలిపాయి. గొప్ప సోదరుడిని కోల్పోయామని లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా, హమాస్‌తో పాటు హౌతీ తిరుగుబాటుదారులు సంతాపం ప్రకటించారు.నూతన అధ్యక్షుడి ఎంపిక ఎప్పుడు?తాత్కాలిక అధ్యక్షుడిగా మొఖ్బర్ కేవలం 50 రోజులు కొనసాగనున్నారు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని తాత్కాలికంగా చేపడతారు. ఈ నియామకానికి సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతులతో ఒక మండలిని ఏర్పాటుచేస్తారు. ఇది గరిష్ఠంగా 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.ఖైదీల సామూహిక ఉరి ఉదంతంలో ప్రమేయంమతబోధకుల కుటుంబంలో మస్హద్ నగరంలో 1960 డిసెంబర్ 14న రైసీ జన్మించారు. మోతాహరీ యూనివర్సిటీలో న్యాయవిద్యను చదివారు. 15 ఏళ్ల వయసులోనే ‘ఖ్వామ్’లో మతవిద్యను నేర్చుకున్నారు. 1979లో ఇస్లామిక్ విప్లవకాలంలో పశ్చిమదేశాల మద్దతున్న ఇరాన్ పాలకుడు షాకు వ్యతిరేకంగా ఆయాతొల్లా రుహొల్లా ఖొమేనీ చేసిన ఉద్యమంలో రైసీ పాల్గొన్నారు. 21 ఏళ్లకే కరాజ్ నగర ప్రాసిక్యూటర్‌గా, పాతికేళ్లకే టెహ్రాన్ డెప్యూటీ ప్రాసిక్యూటర్‌గా పనిచే శారు. అటార్నీ జనరల్ స్థాయికి ఎది గారు. తదనంతరకాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా పనిచేశారు. అయితే 1988 ఏడాది జూలై–సెప్టెంబర్ కాలంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు చెందిన వేలాదిమంది రాజకీయ ఖైదీలను దేశవ్యాప్తంగా సామూహికంగా ఉరితీసిన ఉదంతంలో రైసీ ముఖ్యపాత్ర పోషించారని అమెరికా, ఇతర దేశాలు ఆరోపించాయి. రైసీ 2017లో హసన్ రౌహానీతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2021లో మరోసారి అధ్యక్ష ఎన్నికలు పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ముఖ్యమైన ప్రత్యర్థి నేతలందర్నీ అనర్హులు గా ప్రకటించడంతో రైసీ గెలుపు సులువైంది. ఛాందసవాద మత సంప్రదాయాల పేరిట భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళా, మానవ హక్కులను కాలరాశారని ఆయనపై మాయని మచ్చ పడింది. ఈయన మార్గదర్శకత్వంలో అమల్లోకి వచ్చిన కఠిన హిజాబ్ చట్టాన్ని అమలుచేస్తూ నైతిక పోలీసులు 2022లో మహ్సా అమిని అనే మహిళను కొట్టిచంపడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ భవిష్యత్ రాజకీయ వారసునిగా రైసీ పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. హసన్ రౌహానీ కాలంలో కుదిరిన అణుఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నాక అణ్వస్త్ర స్థాయి యురేనియం శుద్ధిని రైసీ మరింత పెంచి అంతర్జాతీయ ఆంక్షలకు గురయ్యారు. పాత, కొత్త ఆంక్షల కారణంగానే కొత్త హెలికాప్టర్లు కొనలేక పాత హెలికాప్టర్ల విడిభాగాలు దొరక్క, మరమ్మతులు చేయలేక చివరకు అదే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. రైసీకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.మరోవైపు సంబరాలు!అతివాద రైసీ మరణవార్త తెల్సి ఇరాన్లో ఓవైపు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు జరుగుతుంటే మరోవైపు ‘టెహ్రాన్ నరహంతకుడు’ అంతమయ్యాడని వేలాది మంది బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఇరానీయన్లు వేడుకలు చేసుకుంటున్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నెటిజన్లు పేల్చుతున్న మీమ్స్, జోక్స్‌కు కొదవే లేదు. ‘హెలికాప్టర్ ప్రమాదంలో ఒకరు బతకడం కంటే చనిపోతేనే బాగుణ్ణు అని లక్షలాది మంది కోరుకోవడం మానవ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా’’ అని అమెరికాలో ఉన్న ఇరాన్ పాత్రికేయుడు మసీహ్ అలీనెజాద్ వ్యాఖ్యానించారు. వేలాది మంది రాజకీయ ఖైదీలను ఉరితీయించడం, కఠిన హిజాబ్ చట్టాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలు రైసీ మరణ సంబరాలకు కారణమని తెలుస్తోంది. -
ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్‌లో రేపు సంతాపదినం
న్యూఢిల్లీ: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆదివారం(మే19) జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. రైసీ మృతి పట్ల చాలా దేశాలు సంతాపం ప్రకటించాయి. ఇందులో భాగంగా రైసీకి గౌరవ సూచకంగా భారత్ మంగళవారం (మే 21) సంతాప దినంగా పాటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జాతీయజెండాను అవనతం చేయడంతోపాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా ఖొమేనీ కన్నుమూసినపుడు కూడా భారత్ మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించింది. -
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అజర్బైజాన్ సరిహద్దు సమీపంలోని పర్వత ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ వార్తలు వెలువడిన వెంటనే చమురు ఎక్కువ ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య ప్రాంతంలో రాజకీయ అనిశ్చితి మధ్య బంగారం ఆల్-టైమ్ హైని తాకింది. ముడి చమురు ధరలు పెరిగిపోయాయి.బంగారం ధరలపై ప్రభావంఇరాన్ అధ్యక్షుడి మరణ వార్తల తర్వాత సోమవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ అనిశ్చితుల మధ్య సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి మార్గంగా భావిస్తారు. 0811 జీఎంటీ అంటే భారతీయ కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1:41 గంటల సమయానికి స్పాట్ బంగారం ఔన్సు ధర 1 శాతం పెరిగి 2,438.44 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు సెషన్లో రికార్డు గరిష్ట స్థాయి 2,449.89 డాలర్లను తాకింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.1 శాతం పెరిగి 2,442.60 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా 11 సంవత్సరాల కంటే ఎక్కువ గరిష్ట స్థాయికి చేరుకుంది.ముడి చమురు ధరలుఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ క్రాష్ నివేదికలు వచ్చిన వెంటనే ప్రధాన చమరు ఉత్పత్తి దేశాలలో రాజకీయ అనిశ్చితి మధ్య అంతర్జాతీయ ముడి చమురు ధరలు సోమవారం లాభాలను పొడిగించాయి. ఆరోగ్యంతో సమస్యల కారణంగా సౌదీ అరేబియా యువరాజు జపాన్ పర్యటనను రద్దు చేసుకోవడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమైనట్లుగా తెలుస్తోంది.భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 12:02 గంటల సమయానికి బ్రెంట్ బ్యారెల్‌కు 41 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 84.39 డాలర్లకు చేరుకుంది, అంతకుముందు 84.43 డాలర్లకి పెరిగింది. మే 10వ తేదీ తర్వాత ఇదే అత్యధికం. -
కుప్పకూలిన హెలికాఫ్టర్ ఇరాన్ అధ్యక్షుడు మృతి
-
రైసీ క్షేమమేనా?.. ప్రమాద స్థలానికి రెస్క్యూ టీమ్స్.. క్షణక్షణం ఉత్కంఠ
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీని రక్షణ బలగాలు గుర్తించాయి. ట్రాఫిజ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని డ్రోన్ ద్వారా గుర్తించారు అధికారులు. ప్రస్తుతం 73 రెస్క్యూ టీంలు అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే కొండ ప్రాంతం కావడం, భారీ వర్షాలు పడుతుండడం, దట్టమైన పొగమంచుతో ఆ ప్రాంతానికి చేరుకోవడం ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. టర్కిష్ టెక్నాలజీ ఆధారిత డ్రోన్‌తో సెర్చ్ ఆపరేషన్‌ను ఇరాన్ లైవ్ టెలికాస్ట్ చేసింది. కొండ ప్రాంతంలో హెలికాఫ్టర్ కూలి.. పేలిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్నటి నుంచి సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఇరాన్ త్రివిధ దళాలు. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. రాత్రి సైతం నైట్ విజన్ హెలికాఫ్టర్లతో సోదాలు జరిగాయి. వాతావరణం వర్షం కారణంగా సహకరించకపోవడంతో గగన తల సెర్చ్ ఆపరేషన్ నిలిపివేశారు. దీంతో బలగాలు గ్రౌండ్ లెవల్లో సెర్చ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. AKINCI İHA, İran semalarında İran Cumhurbaşkanı Reisi ve heyetini arama kurtarma çalışmalarına destek veriyor https://t.co/ovXnx13UcY— AA Canlı (@AACanli) May 19, 2024ఇంకోవైపు.. రైసీ క్షేమంగా తిరిగొస్తారని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం ప్రపంచదేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. రైసీ సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమాద తీవ్రతపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు రైసీ క్షేమంగా తిరిగిరావాలని యావద్దేశం చేస్తున్న ప్రార్థనలు ఫలించేలా కనిపించడం లేదు.ఆదివారం ఓ అధికారిక కార్యక్రమంలో ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. ఇరాన్-అజర్బైజాన్ దేశాల సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను.. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం ఇరాన్ ఆర్థిక మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్ ప్రావిన్సు ఇమామ్లతో కలిసి తబ్రిజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో రెండు హెలికాప్టర్లూ వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే.. రైసీ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా ప్రమాదానికి గురైంది. హెలికాప్టర్ కూలిపోయిందని ఎక్కువ వార్తాసంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్ ప్రభుత్వరంగ మీడియా మాత్రం ప్రమాదాన్ని ధృవీకరించకుండా వస్తోంది. ఆయన వెంట బయలుదేరిన మిగతా రెండు హెలికాఫ్టర్లు మాత్రం సురక్షితంగా ల్యాండయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగిందనే ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ.. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
‘‘రైజినా డైలాగ్’’కు ఇరాన్ దూరం
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే ‘‘రైజినా డైలాగ్’’ సదస్సుకు ఇరాన్ హాజరు కావడం లేదు. ఈ సదస్సుకి హాజరుకావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సిన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్పై ప్రచార వీడియోలో ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కట్ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్షుడితో పాటు నిరసనకారుల్ని చూపించడాన్ని ఆక్షేపించిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దానిని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరుకాబోవడం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్‌ను నిర్వహిస్తోంది. -
జో బైడెన్‌తో భేటీ కాను
దుబాయ్: బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం, స్థానిక పౌరసేనలకు మద్దతు వంటి అంశాల్లో తమ వైఖరి మారబోదని ఇరాన్ కాబోయే అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కుండబద్దలు కొట్టారు. వీటిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో చర్చించబోనని, ఆయనతో భేటీ అయ్యే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 1988లో 5,000 మందిని సామూహికంగా ఉరితీసిన ఘటనలో రైసీ పాత్ర గురించి మీడియా ప్రస్తావించగా.. తనను తాను మానవ హక్కుల పరిరక్షకుడిగా అభివర్ణించుకున్నారు. ఇప్పుడు దేశ అధ్యక్షుడిగా మానవ హక్కులను కాపాడడం తన విధి అన్నారు. ఇరాన్‌పై విధించిన అన్ని రకాల అణచివేత ఆంక్షలను ఎత్తివేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉందని వ్యాఖ్యానించారు. తమ బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రామ్, స్థానిక మిలీషియా సంస్థలకు మద్దతుపై మాట్లాడాల్సింది, చర్చించాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు. తమ శత్రుదేశాలైన సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ దూకుడును అడ్డుకోవడానికి యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులకు, లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థకు ఇరాన్ అండగా ఉండటం తెల్సిందే. -
బెదిరించాలని చూడకు.. తట్టుకోలేవ్
వాషింగ్టన్: అమెరికాను బెదిరించాలని ప్రయత్నిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీని ట్విట్టర్లో హెచ్చరించారు. సింహం తోకతో ఆటలాడవద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే అంత సులువైనదికాదని ఆదివారం హసన్ రౌహనీ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు. దీనికి ట్రంప్ స్పందించారు. ‘అమెరికాను బెదిరించాలని చూడకండి. లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. బెదిరిస్తే భయపడే దేశం కాదు మాది. అమెరికా ఎప్పటికీ, ఎవరికీ భయపడదు’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ‘మానసిక యుద్ధతంత్రం’గా ఇరాన్ జనరల్ గోలామ్ హొస్సైన్ ఘెయ్పోర్ అభివర్ణించారు. -
హైదరాబాద్‌లో పర్యటించనున్న ఇరాన్ ప్రసిడెంట్
-
ఇరాన్ అధ్యక్షుడి పర్యటనకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ అధ్యక్షుడు డా.హసన్ రౌహనీ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. గురు, శుక్రవారాల్లో(15, 16 తేదీల్లో) రౌహనీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమిగ్రేషన్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను సీఎస్ జోషి ఆదేశించారు. రౌహనీకి బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి ఆర్పీ సింగ్ స్వాగతం పలుకుతారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇరానియన్లతో సమావేశం.. హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ మహ్మద్ హఘ్బిన్ ఘోమీ మాట్లాడుతూ, తమ దేశాధ్యక్షుడి పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతితక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అధ్యక్షుడి పర్యటనలో 21 మంది ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నారు. పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఇరానియన్లతో రౌహనీ సమావేశమవుతారని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, నగర పోలీస్ కమిషనర్ వి.వి.శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దానకిషోర్, హైదరాబాదు కలెక్టర్ యోగితారాణా, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, అడిషనల్ డీజీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ అర్విందర్ సింగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవీందర్, రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ ఈ.విష్ణువర్థన్‌రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డీజీ రాజీవ్ రతన్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు నగరానికి ఇరాన్ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ ఈ నెల 15న హైదరాబాద్ నగర పర్యటనకు రానున్నారు. ఆయన భారత దేశ పర్యటనలో భాగంగా తొలుత నగరానికి వస్తున్నారు. సాధారణంగా దేశ పర్యటనకు వచ్చే విదేశీ అధ్యక్షులు మొదట దేశ రాజధానికి వచ్చి అక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వేళ్లడం పరిపాటి. కానీ, నగరంతో ఇరానీలకు ఉన్న అనుబంధం వల్ల మొదట హైదరాబాద్‌కు వస్తున్నట్లు ఇరాన్ కాన్సులేట్ అధికారులు తెలిపారు. అదేవిధంగా నగరంలోని షియా, సున్నీల మధ్య ఐక్యత కోసం ఆయన ఇక్కడ పర్యటించనున్నారని కాన్సులేట్ మీడియా కో ఆర్డినేటర్ వివరించారు. నగరంలో రెండు రోజులు ఉంటారు. ఈ నెల 15న (గురువారం) సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు షియా, సున్నీ మతగురువులు, విద్యావేత్తలు, మేధావులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌తో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. అదే రోజు రాత్రి నగరంలోని షియా ప్రముఖులతో బంజారాహిల్స్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో సమావేశం అవుతారు. 16న చారిత్రక మక్కా మసీదులో ప్రార్థనల అనంతరం ప్రసంగిస్తారు. ఇరాన్‌తో నగరానికి 450 ఏళ్ల అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాన్‌తో 450 ఏళ్ల అనుబంధం ఉంది. నగర నిర్మాణం ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగర నమూనా మాదిరిగా ప్రముఖ అర్కిటెక్ట్ మీర్ మొమిన్ నిర్మించారు. గతంలో హైదరాబాద్ నగరాన్ని పాలించిన కుతుబ్ షాహీ పాలకులు ఇరాన్ నుంచి వచ్చినవారే. ఇంతకు ముందు 2004 జనవరి 28న అప్పటి ఇరాన్ అధ్యక్షుడు మహ్మద్ ఖాతిమీ నగర పర్యటనకు వచ్చారు. ఇప్పటి వరకు నగర పర్యటనకు ఇద్దరు ఇరాన్ అధ్యక్షులు మాత్రమే వచ్చారు. ఇప్పటి వరకు అరబ్బు దేశాలతో పాటు వివిధ ముస్లిం దేశాల అధ్యక్షులు నగర పర్యటనకు వచ్చారు. అయితే మక్కా మసీదులో విదేశీ అధ్యక్షుడు ప్రసంగం చేయడం మాత్రం ఇదే తొలిసారి. నగరంతో పాటు మక్కా మసీదు నిర్మాణం ఇరాన్ దేశస్థులైన కుతుబ్ షాహీ వంశస్థులే నిర్మించినందున విదేశీ అధ్యక్షుడికి మక్కా మసీదులో ప్రసంగించే అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. -
ఇరాన్ నమ్మకమైన భాగస్వామి
టెహ్రాన్: భారత ఇంధన అవసరాలు తీర్చటంలో తమ దేశం ఎప్పటికీ నమ్మకమైన భాగస్వామిగానే ఉంటుందని.. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ తెలిపారు. చమురుతోపాటు విద్య, శాస్త్ర సాంకేతిక, సంస్కృతి రంగాల్లోనూ భారత్‌తో బంధాలను మరింత బలోపేతం చేసుకుంటామన్నారు. ఇరాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్‌తో రౌహానీతో పాటు వివిధ శాఖల మంత్రులతో భేటీ అయ్యారు. ఇంధన రంగంలో సహకారాన్ని పెంచటంతోపాటు భారత్‌తో సంబంధాలకు కీలకమైన చబహార్ పోర్టును అభివృద్ధి చేయటంపై చర్చ జరిగింది. చబహార్ పోర్టు అభివృద్ధికి రూ. వెయ్యికోట్టు), భారత్ నుంచి స్టీల్ సరఫరా కోసం రూ. 2.6వేల కోట్లు అప్పుగా ఇవ్వనున్నట్లు సుష్మ తెలిపారు. -
ఇరాన్ అధ్యక్షుడితో ఒబామా సంభాషణ!!
ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఫోన్లో మాట్లాడారు! గడిచిన 30 ఏళ్లలో ఇలా ఈ రెండు దేశాల అగ్రస్థాయి నేతలు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి!! ఇరాన్ కొత్త నాయకత్వం వల్ల అభివృద్ధికి అద్భుతమైన అవకాశం రావొచ్చని పావుగంట పాటు సాగిన ఈ సంభాషణలో ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. 1979 తర్వాత అమెరికా, ఇరాన్ అధ్యక్షులు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. తమ సంభాషణ ఒక మంచి ముందడుగు అవుతుందని ఒబామా అన్నారు. ఇరాన్ అణు కార్యక్రమం విషయంలో ఒక ఒప్పందం కుదిరే అవకాశం కూడా ఉందని, దీనివల్ల సంబంధాలు కూడా మెరుగుపడతాయని ఒబామా చెప్పారు. చర్చలు విజయవంతం అయ్యే విషయంలో తామెవరం గ్యారంటీ ఇవ్వలేకపోయినా, ఒక సమగ్ర పరిష్కారం మాత్రం తప్పకుండా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. మరోవైపు ఇరాన్లో ఉన్న అమెరికన్ ఖైదీల గురించి మాత్రం ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తమ్మీత అణ్వస్త్రాల గురించి ఓ పరిష్కారం కనుగొనేందుకే ఇరు దేశాల అధినేతల సంభాషణ సాగినట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరాలన్నదే తమ ఆకాంక్ష అని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ కూడా చెప్పారు. అణుబాంబు తయారుచేయాలన్నది తమ ఉద్దేశం కాదని, పాశ్చాత్య దేశాలు మాత్రం అలాగే అనుకుంటున్నాయని తెలిపారు. గతం కంటే ప్రస్తుతం చర్చలకు వాతావరణం కూడా బాగుందని అన్నారు.