
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే ‘‘రైజినా డైలాగ్’’ సదస్సుకు ఇరాన్ హాజరు కావడం లేదు. ఈ సదస్సుకి హాజరుకావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సిన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్‌పై ప్రచార వీడియోలో ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కట్ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్షుడితో పాటు నిరసనకారుల్ని చూపించడాన్ని ఆక్షేపించిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దానిని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరుకాబోవడం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్‌ను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment