raisina dialogue
-
Raisina Dialogue: అన్నీ అమ్మేసే తొందరేమీ లేదు..
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ (పీఎస్ఈ) హడావిడిగా వాటాలు విక్రయించేయాలన్న తొందరలో ప్రభుత్వమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. టెలికం సహా వ్యూహాత్మకమైన నాలుగు రంగాల్లో ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైజినా డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. పీఎస్ఈ పాలసీ ప్రకారం అటామిక్ ఎనర్జీ, అంతరిక్షం, రక్షణ; రవాణా, టెలికం; విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు; బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవల విభాగాలను నాలుగు వ్యూహాత్మక రంగాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాలసీ ప్రకారం ‘అన్నీ హడావిడిగా అమ్మేసేయాలన్న తొందర్లో ప్రభుత్వం లేదు. అలాగే గుండుసూదుల నుంచి పంటల దాకా ప్రతి వ్యాపారాన్ని ప్రభుత్వమే నడిపిస్తుందనీ ఈ పాలసీలో ఏమీ లేదు. కాబట్టి తన అవసరం లేని రంగాల్లో ప్రభుత్వం ప్రమేయం ఉండదు. కానీ వ్యూహాత్మక ప్రయోజనాలు ఇమిడి ఉన్న రంగాల్లో.. ఉదాహరణకు టెలికం వంటి వాటిల్లో ఉంటుంది. ప్రభుత్వ యాజమాన్యంలో, ప్రొఫెషనల్‌గా నడిచే ఒక టెలికం కంపెనీ ఉంటుంది‘ అని మంత్రి చెప్పారు. వ్యూహాత్మక రంగాల్లోనూ తమంతట తాము నిలదొక్కుకోగలిగేంత పెద్ద సంస్థల్లో ప్రభుత్వం కొనసాగుతుందని ఆమె వివరించారు. అలా కాకుండా మరీ చిన్నవి.. నిలదొక్కుకోలేనివి ఉంటే వాటిని పెద్ద సంస్థల్లో విలీనం చేసే అవకాశాలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ. 65,000 కోట్లు సమీకరించాలని భావించింది. కానీ దీన్ని తర్వాత రూ. 50,000 కోట్లకు సవరించింది. తాజా బడ్జెట్లో దాన్ని కాస్త స్వల్పంగా పెంచుతూ రూ. 51,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘‘రైజినా డైలాగ్’’కు ఇరాన్ దూరం
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే నెలలో జరిగే ‘‘రైజినా డైలాగ్’’ సదస్సుకు ఇరాన్ హాజరు కావడం లేదు. ఈ సదస్సుకి హాజరుకావాల్సిన ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సిన్ అమీర్ అబ్దుల్లా భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్ఛ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించనున్న రైజినా డైలాగ్పై ప్రచార వీడియోలో ఇరాన్లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ఒక మహిళ జుట్టు కట్ చేసుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఫొటో పక్కనే, మహిళ జుట్టు కత్తిరించుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉండడంపై ఇరాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధ్యక్షుడితో పాటు నిరసనకారుల్ని చూపించడాన్ని ఆక్షేపించిన భారత్‌లో ఇరాన్ రాయబార కార్యాలయం ప్రచార వీడియోలో ఆ భాగాన్ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వం దానిని తొలగించకపోవడంతో మనస్తాపానికి గురైన ఇరాన్ ఈ సదస్సుకి హాజరుకాబోవడం లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ వ్యవహారాలపై లోతైన చర్చ జరపడానికి 2016 నుంచి కేంద్ర ప్రభుత్వం రైజినా డైలాగ్స్‌ను నిర్వహిస్తోంది. -
ఇస్లాం అతివాదంతో పెను ముప్పు
న్యూఢిల్లీ: ఇస్లాం అతివాదం, ఉగ్రవాదుల చర్యలు అంత్యంత ప్రమాదకరమైనవనీ, అంతర్జాతీయ వ్యవస్థపై ఇవి తీవ్ర దుష్పరిణామాలు చూపగలవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు భారత్–ఇజ్రాయెల్ మధ్య మరింత బలమైన బంధం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఆరు రోజుల భారత పర్యటనలో ఉన్న నెతన్యాహు మంగళవారం ఢిల్లీలో రైసినా డైలాగ్ భౌగోళిక–రాజకీయ మూడో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇజ్రాయెల్‌కు భారత్ సహజ భాగస్వామి, మిత్రదేశమని చెప్పడంతో అక్కడే ఉన్న నరేంద్ర మోదీ పెదవులపై నవ్వులు విరిశాయి. ఒకప్పుడు ఏమీ లేని ఇజ్రాయెల్ ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తుల ద్వారానే నేడు బలమైన దేశంగా ఎదిగిందని నెతన్యాహు చెప్పారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు, కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వ పాత్రను పరిమితం చేసేందుకు మోదీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ప్రజాస్వామ్య దేశాలు కూటమిగా ఏర్పడటం చాలా ముఖ్యమని నెతన్యాహు పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు రైసినా డైలాగ్ సదస్సును 2016 నుంచి విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సంయుక్తంగా ప్రతి ఏడాది నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి మొత్తం 550 మంది ఈ ఏడాది హాజరవుతున్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబ, యూఎస్ పసిఫిక్ కమాండ్‌కు చెందిన కమాండర్ హ్యారీ హ్యారిస్ తదితరులు బుధవారం ప్రసగించనున్నారు. తాజ్‌ను సందర్శించిన నెతన్యాహు రైసినా డైలాగ్‌ను ప్రారంభించడానికి ముందు నెతన్యాహు తన భార్య సారాతో కలసి తాజ్‌మహల్‌ను సందర్శించారు. నెతన్యాహు దంపతులకు ఆగ్రా విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. నెతన్యాహు సందర్శన నేపథ్యంలో తాజ్‌మహల్‌లోకి రెండు గంటలపాటు సాధారణ ప్రజలను అనుమతించలేదు. కాగా, మోదీ గతేడాది ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు ఓల్గా బీచ్‌లో నెతన్యాహుతో కలసి నడిపిన గాల్–మొబైల్ జీప్‌ను నెతన్యాహు మోదీకి బహూకరించనున్నారు. దాదాపు రూ. 72 లక్షల విలువైన ఈ జీప్ సముద్రపు నీటిని నిర్లవణీకరణం చేసి తాగునీటిగా మారుస్తుంది. గాల్–మొబైల్ ఇప్పటికే భారత్‌కు చేరుకుంది. భారత్ ఇజ్రాయెల్ మధ్య 9 ఒప్పందాలు భారత్–ఇజ్రాయెల్ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా సోమవారం ఇరు దేశాల మధ్య సైబర్ భద్రత, గ్యాస్, ఆయిల్ తదితర రంగాల్లో మొత్తం 9 ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల అధికారులు వీటిపై సంతకాలు చేశారు. అలాగే ఢిల్లీలో సోమవారం జరిగిన ఇండియా–ఇజ్రాయెల్ వాణిజ్య సదస్సులో మోదీ మాట్లాడుతూ కంపెనీలు తమ వ్యాపారాన్ని మరింత అబివృద్ధి చేసుకునేందుకు భారత్‌లో అపార అవకాశాలున్నాయన్నారు. ముంబైకి మోషే 2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఇజ్రాయెల్ యూదు బాలుడు మోషే హోల్జ్‌బర్గ్ మంగళవారం మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం 11 ఏళ్ల వయసున్న మోషే, ఆ దుర్ఘటన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. తన తాతయ్య షిమోన్ రోజెన్బర్గ్తో కలసి వచ్చిన అతను...తన తల్లిదండ్రులు చనిపోయిన నారీమన్ హౌస్‌ను సందర్శించి నివాళి అర్పించాడు. భారత్‌కు రావడం ఆనందంగా ఉందన్నాడు. గతేడాది మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లినప్పుడు మోషేను, అతని కుటుంబాన్ని కలసిన మోదీ...వారు భారత్‌కు ఎప్పుడైనా రావొచ్చంటూ ఆహ్వానించారు. తాజాగా నెతన్యాహు పర్యటన నేపథ్యంలో మోషే ముంబైకి విచ్చేశాడు. -
నేను లాహోర్‌లో అడుగుపెట్టా.. మరి పాక్..: మోదీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అయితే, అంతకంటే ముందు ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలివేయడంతోపాటు , పూర్తిగా నిర్మూలించి వచ్చిన తర్వాతే తాము ఇరు దేశాలమధ్య సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను భారత్ తరుపున లాహోర్ వరకు వెళ్లొచ్చానని, అయితే, శాంతి స్థాపనకు ఒక్క భారత్‌మాత్రమే అడుగేస్తే సరిపోదని అన్నారు. ఎవరైతే సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తారో, అహింసను ప్రేరేపిస్తారో వారిని ఒంటరిని చేయాలని, నిర్లక్ష్యం చేయాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో రెండో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. వివిధ దేశాల మధ్య వర్తమాన, రాజకీయ, ఆర్థిక అంశాల గురించి సాధారణంగా ఈ కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన వ్యక్తులు తమ అభిప్రాయాలు చెబుతారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది. భారత విదేశాంగ శాఖతోపాటు వివిధ దేశాల విదేశాంగ శాఖల సమన్వయంతో తొలి సమావేశం గత ఏడాది (2016) మార్చి 1 నుంచి 3వరకు జరగగా తాజా సమావేశం రెండోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ..‘ రష్యా మాకు చిరకాల స్నేహితురాలు. అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు నాకు మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అలాగే, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న డోనాల్డ్ ట్రంప్‌తో కూడా మాట్లాడాను. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించుకునేందుకు అంగీకారం అయింది. అన్ని దేశాలతో సంబంధాలు, శాంతి, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కాస్తంతా సున్నితంగా వ్యవహరించడంతోపాటు అందరి ఆందోళనలు గౌరవించాల్సి ఉంటుంది. రెండు పెద్ద పొరుగు దేశాలైన భారత్, చైనా మధ్య వైరుధ్యాలు ఉండటమనేది అసహజమేమి కాదు. దేశ పౌరుల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. స్వప్రయోజనం మన సంస్కృతి కాదు. మన ప్రవర్తన కూడా కాదు.