నేను లాహోర్‌లో అడుగుపెట్టా.. మరి పాక్..: మోదీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌తో ఉన్న సమస్యలపై చర్చించేందుకు తాము సిద్ధమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అయితే, అంతకంటే ముందు ఆ దేశం ఉగ్రవాదాన్ని వదిలివేయడంతోపాటు , పూర్తిగా నిర్మూలించి వచ్చిన తర్వాతే తాము ఇరు దేశాలమధ్య సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. తాను భారత్ తరుపున లాహోర్ వరకు వెళ్లొచ్చానని, అయితే, శాంతి స్థాపనకు ఒక్క భారత్‌మాత్రమే అడుగేస్తే సరిపోదని అన్నారు.
ఎవరైతే సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తారో, అహింసను ప్రేరేపిస్తారో వారిని ఒంటరిని చేయాలని, నిర్లక్ష్యం చేయాలని సూచించారు. మంగళవారం ఢిల్లీలో రెండో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమం ప్రారంభమైంది. దీనిని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. వివిధ దేశాల మధ్య వర్తమాన, రాజకీయ, ఆర్థిక అంశాల గురించి సాధారణంగా ఈ కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన వ్యక్తులు తమ అభిప్రాయాలు చెబుతారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనుంది.
భారత విదేశాంగ శాఖతోపాటు వివిధ దేశాల విదేశాంగ శాఖల సమన్వయంతో తొలి సమావేశం గత ఏడాది (2016) మార్చి 1 నుంచి 3వరకు జరగగా తాజా సమావేశం రెండోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ..‘ రష్యా మాకు చిరకాల స్నేహితురాలు. అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు నాకు మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. అలాగే, అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న డోనాల్డ్ ట్రంప్‌తో కూడా మాట్లాడాను. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించుకునేందుకు అంగీకారం అయింది.
అన్ని దేశాలతో సంబంధాలు, శాంతి, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కాస్తంతా సున్నితంగా వ్యవహరించడంతోపాటు అందరి ఆందోళనలు గౌరవించాల్సి ఉంటుంది. రెండు పెద్ద పొరుగు దేశాలైన భారత్, చైనా మధ్య వైరుధ్యాలు ఉండటమనేది అసహజమేమి కాదు. దేశ పౌరుల భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. స్వప్రయోజనం మన సంస్కృతి కాదు. మన ప్రవర్తన కూడా కాదు.