న్యూఢిల్లీ:బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్క మురికివాడను కూడా తొలగించబోమని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. మురికివాడల్లో కూల్చివేతల విషయంలో ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధమన్నారు. ఆదివారం(ఫిబ్రవరి2) ఢిల్లీ ఆర్కేపురం ప్రాంతంలో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని ఆప్,కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘ఢిల్లీలో ఒక్క మురికివాడను కూడా తొలగించం. మేం మాటలు చెప్పే వాళ్లం కాదు మాటకు కట్టుబడే వాళ్లం. బడ్జెట్‌లో రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయించి ఇది రుజువు చేశాం. మేం ప్రవేశపెట్టిన బడ్జెట్ మోస్ట్ ఫ్రెండ్లీ బడ్జెట్. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు అందుతున్న ఏ సంక్షేమ పథకాన్ని కూడా మేం వచ్చాక ఆపబోము. బిహార్,పూర్వాంచల్ నుంచి ఢిల్లీకి వచ్చి జీవనం సాగిస్తున్న వారికి అండగా ఉంటాం.
కాంగ్రెస్, ఆప్ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే.కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణలో కాంగ్రెస్ పార్టీపై పడ్డ అవినీతి మచ్చ ఎప్పటికీ పోదు.స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుతో ఆప్ ఢిల్లీ యువతను మోసం చేసింది’అని ప్రధాని విమర్శించారు. కాగా, ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment