
3 రోజుల అంతర్జాతీయ సదస్సు
125 దేశాల నుంచి 3,500 మంది
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయాలు, ఆర్థికాంశాలపై భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ సదస్సు ‘రైసినా డైలాగ్’ 10వ ఎడిషన్ సోమవారం ఢిల్లీలో ప్రారంభం కానుంది. మూడు రోజులు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 125 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది ప్రతినిధులు కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
వీరిలో న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ తులసీ గబార్డ్, 20 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు పలువురు ప్రభుత్వాధినేతలు, సైనిక కమాండర్లు, పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులున్నారు. తొలిసారిగా తైవాన్ సీనియర్ భద్రతాధికారి కూడా ఇందులో పాల్గొననున్నారు. భారత్, తైవాన్‌ల మధ్య పెరుగుతున్న సహకారానికి ఇది నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు.
న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ సోమవారం కీలకోపన్యాసం చేస్తారు. వివిధ అంశాలపై కీలక చర్చలుంటాయి. వర్తమాన అంశాల్లో ప్రపంచ దేశాల మధ్య సహకారానికి ఈ సదస్సు అవకాశాలను అన్వేషిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఢిల్లీలో అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ భవనాలు, భారత ప్రభుత్వ అధికార స్థానానికి మారుపేరుగా నిలిచిన రైసినా హిల్ నుంచి ఈ సదస్సుకు రైసినా డైలాగ్ అని నామకరణం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment