
న్యూఢిల్లీ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ నేడు(మంగళవారం) ఢిల్లీకి రానున్నారు. ఏప్రిల్ 8, 9 తేదీలలో రెండు రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌ను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరపనున్నారు.
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారతదేశంలో చేస్తున్న మొదటి అధికారిక పర్యటన ఇది. ఆయన వెంట యూఏఈకి చెందిన పలువురు మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు ప్రముఖ వ్యాపారవేత్తల బృందం ఉండనుంది. ఏప్రిల్ 8న ప్రధాని నరేంద్ర మోదీ.. షేక్ హమ్దాన్ కోసం విందును ఏర్పాటు చేశారు. అనంతరం జరిగే సమావేశంలో ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, సాంస్కృతిక సహకారంపై చర్చించనున్నారు. ఏప్రిల్ 9న షేక్ హమ్దాన్ ముంబైకి వెళ్లనున్నారు. అక్కడ ఆయన భారత్, యూఏఈలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనుంది.
ప్రధాన అజెండా
1. వాణిజ్య సంబంధాల విస్తరణ
భారత్-యూఏఈ మధ్య వాణిజ్యం 2023-24లో 85 బిలియన్ డాలర్లను దాటింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తన పర్యటనలో ఇరు దేశాల వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం, కొత్త ఒప్పందాలపై చర్చలు చేయనున్నారు.
2. పెట్టుబడుల పెంపు
భారతదేశంలోని మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, స్మార్ట్ సిటీలు, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో యూఏఈ నుంచి పెట్టుబడులను పెంచేందుకు గల అవకాశాలను అన్వేషించనున్నారు.
3. రక్షణ సహకారం
షేక్ హమ్దాన్ యూఏఈ రక్షణ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నందున భారత్-యూఏఈ మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరపనున్నారు.
4. స్టార్టప్ ఇకోసిస్టమ్
భారతీయ స్టార్టప్‌లు- దుబాయ్‌లోని పెట్టుబడిదారుల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంపై చర్చలు జరపనున్నారు.
5. సాంస్కృతిక సంబంధాలు
రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
ఇది కూడా చదవండి: వెజ్ ఆర్డర్ చేస్తే చికెన్ బిర్యానీ.. రెస్టారెంట్ యజమాని అరెస్ట్