
సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి (Kedar Selagamsetty) మరణంపై సీఎం రేవంత్‌రెడ్డి (cm revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజినెస్ పార్ట్‌నర్ ఫ్రెండ్ కేదార్ చనిపోవడం వెనక మిస్టరీ ఏమిటి? అంటూ ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ దానిపైన ఎందుకు విచారణ కోరడం లేదు? రాడిసన్ కేసులో కేదార్ నిందితుడుగా ఉన్నారని రేవంత్ అన్నారు.
‘‘కేసులతో సంబంధం ఉన్నవారు వరుసగా చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి? ముందు సంజీవరెడ్డి, తర్వాత రాజలింగం, ఇప్పుడు కేదార్.. వారి మరణాల వెనకాల మిస్టరీ ఉంది. దీనిపైన కేటీఆర్ ఎందుకు విచారణ కోరలేదు ఫిర్యాదులు వస్తే దర్యాప్తు చేస్తాం’’ అని రేవంత్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి .. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జరిగిన మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ మాట్లాడారు.
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ చర్చ
ప్రధాని మోదీతో ఐదు అంశాలపై చర్చించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ పేజ్ 2 విస్తరణ, దక్షిణభాగానికి రీజినల్ రింగ్ రోడ్డు అనుమతి, రీజినల్ రింగ్ రైల్వే ఏర్పాటు, మూసి పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం, మూసి గోదావరి లింకు కోసం ఆర్థిక సహాయం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని పీఎం మోదీని కోరినట్లు చెప్పారు.
ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా
ఇక శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (slbc) సొరంగ మార్గంలో ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు గురించి ఆరా తీసినట్లు రేవంత్ చిట్‌చాట్‌లో చెప్పారు. 11 శాఖలు సమన్వయంతో రెస్క్ ఆపరేషన్స్ చేస్తున్నామని, సొరంగంలో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే చర్యలు కొనసాగిస్తూనే.. ప్రమాదానికి కారణాలేంటి, దీని నుంచి ఎలా బయటపడాలనే కోణంలో ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోందని బదులిచ్చామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment