ఢిల్లీ లీడర్లకు కేసీఆర్‌ భయం  | Minister KTR Participates In Malakpet Road Show | Sakshi
Sakshi News home page

ఢిల్లీ లీడర్లకు కేసీఆర్‌ భయం 

Published Sun, Nov 26 2023 6:38 AM | Last Updated on Sun, Nov 26 2023 5:11 PM

Minister KTR Participates In Malakpet Road Show - Sakshi

సాక్షి, కామారెడ్డి/అబిడ్స్‌/మలక్‌పేట: ‘కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్‌ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్‌ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్‌ షోలలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. 

గల్ఫ్‌ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... 
బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. డిసెంబర్‌ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. 

రేవంత్‌ కొడంగల్‌లో చెల్లని రూపాయి... 
‘2018 ఎన్నికల్లో కొడంగల్‌ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

కేసీఆర్‌ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. 
హైదరాబాద్‌ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్‌ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్‌ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్‌ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. 

ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. 
‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్‌ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్‌ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్‌ అర్హత కటాఫ్‌ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement