kamareddy district
-
మెట్ల బావులకు పూర్వవైభవం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పూడికతో ఉనికి కోల్పోయిన మెట్ల బావులకు మహర్దశ కలిగింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావి, భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయం వద్ద ఉన్న మెట్ల బావులకు అప్పటి కలెక్టర్ జితేష్ వి పాటిల్ చొరవతో పూర్వ వైభవం చేకూరింది. దీంతో పర్యాటకులు వాటిని సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కామారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మెట్ల బావులు ఉనికి కోల్పోతున్న విషయమై ‘సాక్షి’ అక్షర సమరం సాగించింది. 2022 జనవరి 29న లింగంపేటలోని నాగన్న బావి ఉనికి కోల్పోతున్న వైనంపై ‘మెట్ల బావిలో నిర్లక్ష్యపు పూడిక’ శీర్షికన, తరువాత వరుసగా ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలతో అప్పటి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్పందించారు. నాగన్నగారి బావిని సందర్శించిన కలెక్టర్.. గ్రామస్తులతో కలిసి ముళ్ల పొదలు, చెట్లను తొలగించడంతో మొదలైన పనులు.. పూడిక తొలగించే వరకు కొనసాగింది. రెయిన్ వాటర్ ప్రాజెక్టు అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ కల్పనా రమేశ్‌తో మాట్లాడి.. వారి సహకారంతో దానికి పూర్వవైభవం తీసుకువచ్చారు. భిక్కనూరు మండల కేంద్రంలోని సిద్దరామేశ్వరాలయ ప్రాంగణంలో మరుగున పడిన మెట్ల బావిని అద్భుతంగా తీర్చిదిద్దారు. మెట్ల బావి వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిద్దరామేశ్వరా లయం దర్శనానికి వెళ్లిన వారంతా.. మెట్ల బావి కట్టడాన్ని చూసి అబ్బురపడుతున్నారు. ఫొటోలు దిగుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో రెండు మెట్ల బావులు, రాజంపేట మండల కేంద్రంలో ఒకటి, లింగంపేట మండలం శెట్పల్లి, నాగిరెడ్డిపేట మండలం మాటూరు గ్రామాల్లో మెట్ల బావులను గుర్తించి.. వాటిలో పేరుకుపోయిన పూడికను తొలగించి పూర్వవైభవం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది.నాగన్నగారి బావిని సందర్శించిన ‘జూపల్లి’లింగంపేట మండల కేంద్రంలోని నాగన్నగారి బావిని గత నెలలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌తో కలిసి సందర్శించారు. మెట్ల బావికి పూర్వవైభవం తేవడాన్ని అభినందించారు. పర్యాటక శాఖ ద్వారా మరింత వైభవం తీసుకొస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గతంలో పనిచేసిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రత్యేక శ్రద్ధతో పూర్వవైభవం వచ్చింది. ప్రస్తుత కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దానికి మరింత వన్నె తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగతా మెట్ల బావులను కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మెట్ల బావులకు పూర్వవైభవం సమకూరడం పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తోంది. -
సైబర్ మోసానికి యువకుడు బలి!
-
ఆత్మహత్యలా.. హత్యలా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం/భిక్కనూరు: ఒకే సమయంలో, ఒకేచోట ఒక ఎస్ఐ, కానిస్టేబుల్, మరో యు వకుడు చనిపోవటం కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతోంది. భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ (32), బీబీపేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రుతి (30), బీబీ పేటకే చెందిన నిఖిల్ (29) అనే యువకుడి మృతదేహాలు జిల్లా కేంద్రానికి సమీపంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో లభ్య మయ్యా యి.శృతి, నిఖిల్ మృత దేహాలు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బయటకు తీయగా, గురువారం ఉదయం 8.30 గంటలకు సాయికుమార్ మృతదేహం కూడా అదే చెరువులో దొరికింది. దీంతో వీరు ఎలా చనిపోయారు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవి ఆత్మహత్యలా? లేక ఈ మరణాల వెనుక ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీస్ శాఖను కూడా కుదిపేస్తోంది. మృతులు ముగ్గురికి చాలాకాలం నుంచి పరిచయం ఉండటంతో రకరకాల చర్చ జరుగుతోంది. అనుకోకుండా బయటపడిన ఘటన.. ఈ మూడు మరణాల ఘటన కూడా అనుకోకుండా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ సాయికుమార్ ఫోన్ స్విచాఫ్ వస్తోంద ని ఆయన కుటుంబ సభ్యులు బుధవారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలపటంతో.. ఆయన మొబైల్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు. అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు వద్ద సాయికుమార్, నిఖిల్ చెప్పులు, సెల్ఫోన్లు.. శ్రుతి మొ బైల్ కనిపించాయి. ఎస్ఐ కారు కూడా చెరువు సమీపంలో ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు.. గజ ఈతగా ళ్లతో చెరువులో గాలించగా మరణాల మిస్టరీ బయటపడింది. జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి అక్కడే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. 3 మృతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం మధ్యాహ్నం పోస్టుమార్టం పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతుచిక్కని కారణాలు: ఈ ముగ్గురి మరణం వెనుక గల కారణాలు ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. వీరు ఎలా చనిపోయారన్నది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని ఎస్పీ సింధుశర్మ తెలిపారు. అయితే, వీరి మరణంపై జిల్లాలో తీవ్రంగా చర్చ సాగుతోంది. ఎస్సై సాయికుమా ర్ బీబీ పేట పోలీస్‌స్టేషన్‌లో పనిచేసిన సమయంలో శ్రుతితో సన్నిహితంగా ఉండేవారని ప్రచారం జరుగుతోంది. నిఖిల్ ఇటు సాయికుమార్‌తో అటు శ్రుతితో క్లో జ్గా ఉండేవాడని సమాచారం. ముగ్గురూ ఒకేసారి చనిపోవ డంతో వారి మధ్య నడిచిన వ్యవహా రం ఏమిటన్నది ఇప్పుడు కీలకంగా మారింది.సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం మండ లం కిష్టాపూర్ గ్రామం. 2018 ఎస్ఐ బ్యాచ్‌కు చెందిన ఆయన.. 2022 ఏప్రిల్ 13న బీబీపేటలో ఎస్ఐ గా చేరారు. గత ఏడాది ఆగస్టు 1న భిక్కనూరు ఎస్ఐగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి పనిచేస్తోంది. బీబీపేటకు చెందిన తోట నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే, కంప్యూటర్ల రిపేర్లు చేసేవాడు. పోలీస్‌స్టేషన్‌లో కంప్యూటర్లు మొరాయించినపుడు అతడే వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ముగ్గురికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కలిసి చనిపోయేదాకా ఎందుకు వచ్చిందన్నదానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నా కొడుకు పిరికివాడు కాదు: పోస్ట్‌మార్టం నిర్వహించిన కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు మృతులకు టుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున చేరుకొని బోరున విలపించారు. తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఎస్ఐ సాయికుమార్ తండ్రి అంజయ్యకన్నీరుమున్నీరయ్యాడు. ఎవ రో ఒకరిని కాపాడే ప్ర యత్నంలో చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తంచేశా రు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లా డుతూ.. ఈ ఘటన ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలని కోరారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీసు లు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. చదువులో టాపర్ఎస్ఐ సాయికుమార్ చిన్నతనం నుంచి చదువు లో టాపర్. 2007–2008లో పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్ కోర్సు పూర్తి చేశాడు. 2018లో పోస్టల్ డిపార్టుమెంట్, ఏఆర్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఎస్సైగా మొదటి పోస్టింగ్ సాధించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీబీపేట, భిక్కనూరులో ఎస్సైగా చేశాడు. రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నాడు. 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహాలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది. -
కామారెడ్డి జిల్లాలో ముగ్గురి అదృశ్యం విషాదాంతం
-
కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డిలో విషాదం
-
బ్యాంకోళ్ల జబర్దస్తీ!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంకు అధికారులు జబర్దస్తీకి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తున్నట్టుగా రైతులకు నోటీసులు ఇవ్వడమే గాకుండా, పొ లాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంకోళ్ల జబర్దస్తీతో తమ పరువు పోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) అధికారులు కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, అంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు.రైతుల భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువ పెట్టిన భూములను వేలం వేయడానికి తాము అ«దీనంలోకి తీసుకున్నట్టు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూన్‌లో లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో రైతుల భూములను వేలం వేస్తున్నట్టు పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయంపై ‘సాక్షి’ప్రచురించిన కథనంతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి సహకార బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరువు తీసేలా వ్యవహరించవద్దని ఆదేశించారు.దీంతో రైతుల భూముల వేలం నిలిచిపోయింది. తాజాగా నస్రుల్లాబాద్ మండలంలో సహకార బ్యాంకు అధికారులు తిరిగి అదే పద్ధతిని మొదలుపెట్టారు. ఈనెల 26న పలువురు రైతుల భూములను వేలం వేయనున్నట్టు రైతులకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రైతుల ఆవేదన..: బ్యాంకు అధికారులు తమ భూములను వేలం వేస్తున్నట్టు నోటీసులు ఇవ్వడంతో పాటు భూముల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు బయట అప్పులు చేసి బ్యాంకు రుణాలు తీర్చే ప్రయత్నం చేస్తుండగా, మరికొందరు ఆస్తులు అమ్ముకుని అయినా కడతామని, తమ భూములు వేలం వేసి పరువు తీయద్దని వేడుకుంటున్నారు. -
పప్పుల అంగడి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గంలో ఆచార వ్యవహారాలన్నీ భిన్నంగా కనిపిస్తాయి. ఇక్కడ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తారు. చాలా మంది ఇక్కడ శాకాహారులే ఉంటారు. ఈ ప్రాంతంలోని ప్రజలు తెలుగు, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. అందుకే దీన్ని త్రిభాషా సంగమం అని అంటుంటారు. జుక్కల్ నియోజకవర్గంలో జుక్కల్, మద్నూర్, పిట్లం, పెద్దకొడప్గల్, డోంగ్లీ, బిచ్కుంద, నిజాంసాగర్, మహ్మద్‌నగర్ మండలాలున్నాయి. ఆయా మండలాల్లో పలుచోట్ల అంగళ్లు (వారసంతలు) జరుగుతాయి. బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం, జుక్కల్‌లో గురువారం, పి ట్లంలో శుక్రవారం, మద్నూర్‌లో సోమవారం, డోంగ్లీ, మేనూర్‌లో శుక్రవారం అంగళ్లు జరుగుతాయి. ఆ ప్రాంత ప్రజలు ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, బట్టలు, వంట పాత్రలు.. ఏవైనా సరే అంగడికి వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పేద, మధ్య తరగతి వర్గాలు కూరగాయలు, నిత్యావసరాల కోసం అంగళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా పప్పులు అమ్ముతుంటారు. స్థానికంగా ఉన్న రైతులు వారు పండించిన పప్పుదినుసులను అంగళ్లలో అమ్ముతారు. పెసర, కంది, మినుము, శనగ, ఎర్రపప్పులతో పాటు జొన్నలు, గోధుమలు, ఆవాలు కూడా విక్రయిస్తారు. పొట్టు పప్పునకు భలే డిమాండ్ సాధారణంగా పంట చేతికి వచ్చిన తర్వాత పప్పు దినుసులు ఎక్కువ మొత్తంలో అమ్మకానికి వస్తాయి. ఆ సమయంలో ధర కొంత తక్కువగా ఉంటుంది. దీంతో ప్రజలు ఆయా అంగళ్లకు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. దుకాణాల్లో మరపట్టిన, పాలిష్ చేసినవి అమ్ముతుంటే అంగళ్లలో మాత్రం రైతులు నేచురల్ గా పండించిన పప్పుదినుసులు దంచి పొట్టుతో అమ్ముతుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. క్వింటాళ్ల కొద్దీ పప్పులు అమ్ముడు పోతాయని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా పప్పులకు కొరత రావచ్చు గానీ, జుక్కల్ ప్రాంతంలో మాత్రం ఏనాడూ పప్పుదినుసులకు కొరత ఏర్పడదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడే ఎక్కువగా పప్పుదినుసులు పండిస్తారు. అలాగే పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో కూడా పప్పుదినుసులు సాగుచేస్తారు. జొన్నలు, గోధుమలు కూడా విక్రయిస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా.. జుక్కల్, పిట్లం, మద్నూర్, బిచ్కుంద అంగళ్లకు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని దెగ్లూర్, హనేగావ్ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటకలోని ఔరద్ ప్రాంతానికి చెందిన వారు కూడా పప్పులు అమ్మడానికి వస్తుంటారు. అలాగే అంగళ్లలో పప్పులు, నిత్యావసరాలు, ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి మూడు రాష్ట్రాల ప్రజలు రావడం విశేషం. జుక్కల్ అంగడికి జుక్కల్ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కొన్ని గ్రామాల ప్రజలు కూడా వస్తుంటారు. మద్నూర్, మేనూర్‌లో జరిగే అంగళ్లకు చుట్టుపక్కల గ్రామాలు, మహారాష్ట్రలోని దేగ్లూర్ తాలూకాలోని గ్రామాల ప్రజలు వస్తారు. బిచ్కుంద అంగడికి బిచ్కుంద మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. పిట్లం మండల కేంద్రంలో జరిగే అంగడికి పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలతో పాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలోని కంగి్ట, కల్హేర్ మండలాల నుంచి వచ్చి కొనుగోళ్లు చేస్తారు.రెండు తరాలుగా ఇదే దందా మా కుటుంబం రెండు తరాలుగా పప్పులు, జొన్నలు పిట్లం అంగడిలో అమ్ముతున్నం. మా నాయిన అమ్మేవారు. తర్వాత నేనూ పదేళ్లుగా పప్పులు, జొన్నలు అమ్ముతున్నాను. చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పప్పులు, జొన్నలు కొంటారు. – రంజిత్, తిమ్మానగర్ (విక్రయదారుడు) పిట్లం అంగడిలోనే కొంటాను పిట్లం అంగడిలో ఏళ్ల నుంచి పప్పులు కొనుగోలు చేస్తున్నాం. తక్కువ ధరకు దొరుకుతాయి. పప్పులతో పాటు జొన్నలు కూడా అమ్ముతారు. ఇంట్లో అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తాను. ఎన్నో ఏళ్లుగా పిట్లం అంగడిలో కొన్నవే తింటున్నాం. – రాజు, ఎల్లారెడ్డి (కొనుగోలుదారుడు)నాణ్యమైన పప్పులు దొరుకుతాయి పిట్లంకు మా ఊరు దగ్గరగా ఉంటుంది. వారం వారం అంగడికి ఇక్కడికే వచ్చి అవసరం ఉన్నవి కొనుగోలు చేస్తాం. పప్పులు ప్రతిసారీ పిట్లం అంగడిలోనే కొంటాం. ఇక్కడ నాణ్యమైనవి దొరుకుతాయి. – రాజేశ్వర్, తాడ్కోల్, సంగారెడ్డి జిల్లా (కొనుగోలుదారుడు) -
ఊరులేని ఊరు: భూముల ధరలు మాత్రం ఆకాశానికి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరికో పేరుంది. ఊరి పేరున వందల ఎకరాల భూములు రికార్డుల్లో నమోదయ్యాయి. కానీ ఆ ఊళ్లలో ఇళ్లు ఉండవు. మనుషులూ నివసించరు. జనావాసాలు లేకున్నా అవి ఊళ్లే అంటే నమ్మాలి మరి. రెవెన్యూ రికార్డుల్లో ఇప్పటికీ అవి గ్రామాలుగానే కొనసాగుతున్నాయి. మరికొన్ని ఊళ్లకు పేర్లున్నా.. రికార్డుల్లో మాత్రం లేవు. తాతల కాలం కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతుంటారు. కొన్ని ఊళ్లల్లో ఇళ్లు, కోటలున్న ఆనవాళ్లు ఉండగా, మరికొన్ని చోట్ల ఆలయాలున్నాయి. కామారెడ్డి జిల్లాలోని ఇలాంటి ఊళ్లపై ‘సాక్షి’కథనమిది.⇒ మాచారెడ్డి మండల కేంద్రం పరిధిలో పోలోనిపల్లి అనే పేరుతో ఓ ఊరుంది. అక్కడ అప్పట్లో కొన్ని కుటుంబాలు నివసించేవి. కాలక్రమేణ వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయ భూ ములున్నాయి. అక్కడి పురాతన రామాలయం వద్ద తపోవనాశ్రమానికి భక్తులు వచ్చిపోతుంటారు. ⇒ బిచ్కుంద మండలంలో 200 ఏళ్ల కిందట మల్కాపూర్ గ్రామం ఉంండేది. ఇప్పుడు అక్కడ గ్రామం లేదు. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం నమోదైంది. బిచ్కుంద మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఆ ఊరిలో హనుమాన్ ఆలయం ఉంది. ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ⇒ గాంధారి మండలంలో బంగారువాడి, కోనాయిపల్లి గ్రామాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. కానీ అక్కడ జనాలెవరూ నివసించరు. వ్యవసాయ భూముల్లో పంటలు మాత్రం సాగవుతున్నాయి. వందల ఏళ్ల కిందట అక్కడ ఊళ్లు ఉండేవని చెబుతారు. ⇒కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని తాడ్వాయి మండలంలో అబ్దుల్లానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. వందల ఎకరాల భూములున్నాయి. అక్కడ అన్ని పంట చేలు, గుట్టలు, చెట్లు ఉన్నాయి. ఈమధ్య ఆ ప్రాంతంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేసి వెంచర్లు మొదలుపెట్టారు.⇒ కామారెడ్డి పట్టణ శివార్లలో సరంపల్లి గ్రామ పరిధిలో భూకన్పల్లి అనే ఊరుంది. అక్కడ ప్రఖ్యాత హనుమాన్ ఆలయం ఉంది. సరంపల్లి గ్రామ పరిధిలోకి వచ్చే భూకన్పల్లి హనుమాన్ ఆలయం వద్దకు భక్తులు వస్తుంటారు. సరంపల్లి గ్రామస్తులకు ఇంటి దైవం కూడా. చాలామంది ఆ ఊరి జనం తమ పిల్లలకు అంజయ్య, ఆంజనేయులు, అంజవ్వ, అంజమ్మ అనే పేర్లు పెట్టుకున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే పెద్ద అంజయ్య, చిన్న అంజయ్య అన్న పేర్లు కూడా ఉండడం విశేషం. ⇒ బాన్సువాడలో వాసుదేవునిపల్లి ఉంది. చింతల నాగారం పేర్లతో ఊళ్లున్నాయి. కానీ అక్కడ ఇళ్లు లేవు. మనుషులు ఉండరు. పొలాలు మాత్రమే ఉన్నాయి.⇒ దోమకొండ మండలం లింగుపల్లి సమీపంలో కుందారం అనే గ్రామం రికార్డుల్లో ఉంది. ఇక్కడ ఎలాంటి ఇళ్లు లేవు. ⇒ నస్రుల్లాబాద్ మండలం తిమ్మానగర్ పేరుతో రెవెన్యూ రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఎలాంటి నివాసాలు లేవు. పూర్వ కాలంలో కోట ఉన్న ఆనవాళ్లున్నాయి. పాత గుడి ఉండగా, కొత్తగా నిర్మాణం మొదలుపెట్టారు. ⇒ ఇదే మండలంలోని పోశెట్టిపల్లి అనే పేరుతో రికార్డుల్లో ఊరుంది. అక్కడ ఇళ్లు లేవు. వ్యవసాయ భూములున్నాయి. ఈ రెండు ఊళ్ల పరిధిలోని భూములు బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన వారికే ఉన్నాయి. కాగా ఆయా గ్రామాలు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. ఆ గ్రామాల పేరుతోనే పట్టా పాస్ పుస్తకాలు జారీ అవుతాయి.యాభైకి పైగా ఉనికిలో లేని గ్రామాలు కామారెడ్డి జిల్లాలో ఉనికిలో లేని రెవెన్యూ గ్రామాలు యాభైకి పైగా ఉంటాయని అంచనా. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఉనికి కోల్పోయిన ఆ ఊళ్లలో వ్యవసాయం మాత్రం కొనసాగుతోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని గ్రామాల్లో అయితే భూముల విలువ విపరీతంగా ఉంది. ఊరులేని ఊరిలో భూముల ధరలు మాత్రం ఆకాశాన్నంటడం విశేషం. -
నిషేధం.. నట్టింట్లో అపహాస్యం!
‘మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రానికి చెందిన దంపతులు ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో మొదటగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారు. ఆపై కురవిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికే ఆ ఆస్పత్రి యజమానిపై లింగనిర్ధారణ, ఆబార్షన్లు చేస్తున్నారని కేసు నమోదైంది. అయితే ఆస్పత్రి యజమాని, ఆ దంపతులు కలిసి ల్యాప్‌టాప్ సైజులో ఉన్న స్కానింగ్ మెషిన్ కొనుగోలు చేశారు. టెక్నికల్ పరిజ్ఞానం తెలిసిన ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్ఎంపీతో కలిసి గిరిజన తండాలు, పల్లెల్లో స్కానింగ్ చేయడం, ఆడపిల్ల అని తేలితే అక్కడే అబార్షన్లు చేసి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వసూళ్లు చేశారు. ఈ విషయం పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. మొబైల్ స్కానింగ్, అబార్షన్ వ్యవహారాన్ని బట్టబయలు చేసి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కురవి పోలీసులకు అప్పగించారు’ కామారెడ్డి జిల్లా రాజంపేటకు చెందిన ఒక ముఠా స్కానింగ్ మెషిన్‌ను ఓ గర్భిణి ఇంటికి తీసుకెళ్లి పరీక్షలు చేస్తుండగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. వీరు కొంత కాలంగా మొబైల్ స్కానింగ్ యూనిట్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్ని పరీక్షలు, నిర్ధారణలు చేశారన్న విషయంపై విచారణ కొనసాగుతోంది. సాక్షి, మహబూబాబాద్: ఇప్పటి వరకు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి.. నిబంధనల మేరకు పరీక్షలు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు కొనిచోట్ల పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన మొబైల్ స్కానింగ్ మెషిన్లు.. అదీ కూడా ల్యాప్‌టాప్ అంత సైజులో ఉన్నవి మార్కెట్లోకి రావడంతో అక్రమార్కుల పని సులువైంది. నాలుగైదు కేసులు ఉంటే.. లేదా చుట్టూ పక్కల తండాల్లోని గర్భిణులను ఒకచోటకు రమ్మని చెబుతున్నారు. చదవండి: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారంబ్యాగుల్లో మెషిన్లు పెట్టుకెళ్లి అక్కడే పరీక్షలు చేసి ఆడ, మగ శిశువు అని నిర్ధారిస్తున్నారు. పరీక్షలకు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలకు పైగా తీసుకుంటున్నట్టు సమాచారం. పరీక్ష తర్వాత మగశిశువు అయితే ఆ గర్భిణిని ఇంటికి పంపించడం.. ఆడశిశువు అయితే అక్కడే అబార్షన్లు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా చేయడంతో పలువురు మహిళలు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, పెద్ద ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకొని బతికి బయటపడిన సంఘటనలు ఉన్నాయని గిరిజనులు చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఇలా..మొబైల్ స్కానింగ్ పరికరాలతో లింగనిర్ధారణ చేసి ఆడశిశువును చంపేస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో మొబైల్ స్కానింగ్‌తో లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంటే పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో బీడీ ఖార్ఖానా ముసుగులో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ పట్టుపడ్డారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో గర్భవిచ్ఛిత్తి కేసులు బయటపడ్డాయి. అబార్షన్ సమయంలో మహిళలు చనిపోవడం, లేదా ప్రాణాపాయస్థితికి వస్తే కానీ బయటకు రావడం లేదు. మౌనంగా అధికారులుచట్టవిరుద్ధంగా లింగనిర్ధారణ చేయడం (illegal gender test) అబార్షన్లు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నా.. పలు జిల్లాల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. స్కానింగ్ సెంటర్ల తనిఖీల సమయంలో పెద్దగా పట్టించుకోవడం లేదని, సెంటర్ల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లతో కొందరు అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించి చట్టవిరుద్ధంగా నిర్వహించే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోకపోతే ఆడపిల్లల రేషియో మరింత పడిపోయే ప్రమాదం ఉందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
రాళ్లూ.. చిగురిస్తాయి..!
రాతి నేలల్లో సిరుల పంటలు పండుతున్నాయి. నాగళ్లకు ఎదురుతిరిగే రాతి నేలలవి. అలాంటి నేలల్లో సాగు చేయడం అంత తేలిక పని కాదు. రాతి నేలలకు పచ్చదనం అద్దిన రైతులు పడినది మామూలు కష్టం కాదు. మూడు తరాల రైతుల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు బోసిగా కనిపించిన రాతినేలలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులు కొండ ప్రాంతాల్లోని రాతినేలల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రాతినేలల్లో చెమటను, నెత్తుటిని చిందించి మరీ వారు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం గురించి తెలుసుకుందాం...విత్తనాలు వేసేటప్పుడు రాళ్లల్లో నడుస్తుంటే, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటాయి. రాళ్లల్లో మొలకెత్తిన కలుపు తీస్తుంటే, చేతులు చీరుకుపోయి నెత్తురు చిమ్ముతుంది. అయినా, వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సాగు చేస్తారు. తాతల కాలం నుంచి వారు ఇదే పని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, లింగంపేట, తాడ్వాయి, జుక్కల్, పెద్దకొడప్గల్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.ఈ జిల్లాలో 5.26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే, వాటిలో దాదాపు పదిశాతం రాతినేలలే! వీటినే నమ్ముకుని వేలాది రైతులు మూడు తరాలుగా సాగు చేస్తున్నారు. ఇదివరకటి కాలంలో నాగళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నాగళ్లతో దున్నేటప్పుడు ఎడ్ల కాళ్లకు గాయాలయ్యేవి. ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాక, పని కొంచెం సులువైనా, ఖర్చులు బాగా పెరిగాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఏటా రాళ్లు తీసి కుప్పలుగా పోస్తున్నా, తవ్వే కొద్ది రాళ్లు వస్తూనే ఉంటాయని, రాళ్ల మధ్యనే సేద్యం చేయడం తమకు అలవాటైపోయిందని ఈ రైతులు చెబుతారు.వర్షాధార వ్యవసాయం..ఈ రాతినేలల్లో వేసే పంటలకు వర్షాలే ఆధారం. మంచి వర్షాలు కురిసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి. వర్షాలు సరిగా కురవకపోయినా, అకాల వర్షాలు కురిసినా రైతులకు నష్టాలు తప్పవు. వర్షాధార పరిస్థితుల వల్ల ఇక్కడి రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈ రాతి నేలల్లో పత్తి, మొక్కజొన్న, సోయా పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలను అడవి జంతువుల దాడి నుంచి కాపాడుకోవడం రైతులకు పెనుసవాలు.పొలాల్లోకి అడవి జంతువులు చొరబడకుండా ఉండేందుకు కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు పొలాల చుట్టూ ఇనుప తీగెలు కట్టి, రాత్రివేళల్లో పొలాలకు కాపలా ఉంటున్నారు. రాళ్లతో కూడుకున్నవన్నీ నల్లరేగడి నేలలు కావడంతో ఇక్కడ పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది. రాళ్ల మధ్య తేమ వారం రోజుల వరకు అలాగే ఉంటుంది. వారం రోజుల తర్వాత వర్షం కురిస్తే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. రాతినేలలు ఉన్న ప్రాంతాలు సాధారణంగా వర్షాలకు అనుకూలంగానే ఉంటాయి. తగిన వానలు కురవకపోవడం వల్ల పంటల దిగుబడులు తగ్గిన సందర్భాలు ఈ ప్రాంతంలో అరుదుగానే ఉంటాయి.మూడు తరాల వాళ్లం కష్టపడ్డాం..మా తాత మందిరానాయక్, మా నాయిన నంగరాజ్, తరువాత నేను మూడు తరాల వాళ్లం రాళ్లను ఏరి చుట్టూ కంచె వేశాం. మూడెకరాల భూమిని రాళ్లు లేని భూమిగా తయారు చేసి, వరి పంట పండిస్తున్నం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా బావినీళ్లతో పంట పండుతుంది. ఇక్కడ బోర్లు వేస్తే పడవు. మూడు తరాల కష్టానికి మూడెకరాల వరి పొలం తయారైంది. – దేవిసింగ్, చద్మల్ తండాచేతులు పగిలి మంట పెడుతుంది..కలుపు తీస్తుంటే అరచేతికి, వేళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతది. మంట పెడుతున్నా కష్టపడుతున్నం. రాళ్లు ఎంత ఏరినా తగ్గిపోవు. అందుకే ఉన్న రాళ్లల్లోనే పంట వేస్తున్నం. కాలం మంచిగ అయితే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికైతే మా దిక్కు వానలు మంచిగనే పడ్డయి. ముందు ఇట్లనే ఉంటే బాగుంటుంది. – సురేఖ, బూర్గుల్ తండాఅరికాళ్లకు అన్నీ గాయాలే..మాకు నాలుగెకరాల భూమి ఉంది. ట్రాక్టర్‌తో దున్నించి మొక్కజొన్న పంట వేస్తుంటం. విత్తనం వేసినపుడు, కలుపు తీసినపుడు రాళ్లు గుచ్చుకుని అరికాళ్లు నొప్పిగా తయారై ఇబ్బంది పడుతుంటం. వాన పడితే పంట మంచిగనే వస్తది. వానలు కింద మీద అయితే రెక్కల కష్టం పోతది. దేవుని మీద భారం వేసి పంటలు వేస్తున్నం. – పారిబాయి, గుర్జాల్ తండాతాతల కాలం నుంచి ఇదే కష్టం..మాకు 1957లో పట్టాలు వచ్చినయి. అప్పటి నుంచి మా తాతలు, తరువాత మా తండ్రులు, ఇప్పుడు మేం రాళ్లల్లనే పంటలు వేస్తున్నం. మూడు ఎకరాల్లో పత్తి వేసినం. విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా అవస్థలు పడాల్సిందే! సమయానికి వాన పడితే పంటకు ఇబ్బంది ఉండదు. రోగాలు వచ్చినపుడు మందులు కొడుతుంటం. – ప్రేమ్‌సింగ్, గుర్జాల్ తండాఐదెకరాలూ రాళ్ల భూమే!నేను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్దే వ్యవసాయం చూసుకుంటున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. అది కూడా రాళ్ల భూమే! వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వేశాం. కొద్దిగా వరి కూడా పండిస్తున్నాం. మా ఊరి శివారే కాదు చుట్టుపక్కల ఊళ్లన్నీ రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములే ఉన్నయి. రాళ్ల భూములే అయినా కష్టపడుతున్నం. – ధన్‌రాజ్, గుర్జాల్ తండాఖర్చు ఎక్కువ..రాళ్ల భూములల్ల దున్నడానికి ట్రాక్టర్‌కు ఎక్కువ టైం తీసుకుంటది. అట్లనే కిరాయ కూడా ఎక్కువ అడుగుతరు. గంటలకు రూ.8 వందల నుంచి రూ.9 వందలు తీసుకుంటరు. దున్నడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు ఎక్కువవుతుంది. కలుపు ఇంటోళ్లమే తీసుకుంటున్నం. రాళ్లు తగిలి కాళ్లకు గాయాలైతున్నా భరిస్తం. – రవి, బూర్గుల్ తండాకాలం కలిసొస్తే మంచి దిగుబడులు..పంటకు అనుకూలంగా మంచి వర్షాలు కురిస్తే చాలు, మంచి దిగుబడులు వస్తాయి. రైతుల రెక్కల కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్నిచోట్ల ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. రాతినేలల్లో ఈ స్థాయి దిగుబడులు రావడం విశేషమే! సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించకుంటే, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తాయి. అయితే, ఈ రాతి నేలలను దున్నడంలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేలలను దున్నడానికి ట్రాక్టర్ యజమానులు ఆసక్తి చూపరు. సాధారణమైన సాగునేలలను దున్నడానికి గంటకు ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు.ఈ రాతినేలలను దున్నడానికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. సాధారణ పొలాల్లో ఎకరం దున్నడానికి గంట నుంచి గంటన్నర సమయం సరిపోతుంది. రాతి నేలలు దున్నడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఈ పరిస్థితి వల్ల దుక్కి దున్నడానికే రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరకరు. ఇక్కడ కలుపు తీస్తే చేతులకు గాయాలు తప్పవు. కూలీల కొరత వల్ల చాలా పొలాల్లో రైతుల కుటుంబ సభ్యులే కలుపు తీస్తుంటారు. ఇంతటి కఠోర శ్రమకు ఓరుస్తూనే ఈ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. – ఎస్.వేణుగోపాల చారి, సాక్షిప్రతినిధి, కామారెడ్డిఇవి చదవండి: కాలనీలో థ్రిల్ -
శిశు విక్రయ ఘటన.. కలెక్టర్ సీరియస్.. ఆసుపత్రి సీజ్
సాక్షి, కామారెడ్డి జిల్లా: శిశు విక్రయ ఘటనలో సమన్విత ఆసుపత్రిపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. వైద్య శాఖ అధికారులు ఆసుప్రతిని సీజ్ చేశారు. అనుమతి లేకున్నా.. ఫెర్టిలిటీ పేరుతో లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ యంత్రాలు ఏర్పాటు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ, స్త్రీ లింగం పై వివక్ష చట్టం కింద కేసులు నమోదు చేశారు. శిశు విక్రయ కేసులో ఆసుపత్రి ప్రభుత్వ వైద్యుడు సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.కాగా, పుట్ట బోయేది ఆడో మగో తెలుసుకోవడానికి జనం ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. వారి ఆసక్తిని సొమ్ము చేసుకుంటూ వాటి నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పుట్టేది అడబిడ్డ అని తెలియగానే కడుపులోనే చంపేయాల నుకుంటున్నవారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ అబార్షన్లు చేస్తున్నారు. స్కానింగ్, అబార్షన్ల కోసం రెండు మూడు రాష్ట్రాల నుంచి కామారెడ్డిలోని సమన్విత ఆస్పత్రికి వచ్చేవారంటే.. ఆ ఆస్పత్రి ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆస్పత్రులలో తనిఖీలు చేయకుండా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులూ ఈ పాపంలో భాగమయ్యారు.గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేనపు డు, బిడ్డ వల్ల తల్లికి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నపుడు అబార్షన్ చేస్తారు. దీనికి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అనుమతులు పొందాల్సి ఉంటుంది. సమన్విత ఆస్పత్రికి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేవని వైద్యారోగ్య శాఖ అధికారుల విచారణలో వెల్లడైంది. కాగా సమన్విత ఆస్పత్రిలో వైద్య సేవలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంటీపీకి సంబంధించి చార్జీలు పొందుపరచడాన్ని చూసి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల అవాక్కయ్యారు. మూడు నెలలలోపు గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 5 వేలు, మూడు నెలలు దాటిన గర్భవిచ్ఛిత్తి కోసం రూ. 10 వేలు చార్జీగా అందులో పేర్కొనడం విశేషం. -
‘అమ్మ’ వద్దంది.. ఆస్పత్రి అమ్మేసింది!
కామారెడ్డి క్రైం: పుట్టబోయే బిడ్డను వదిలించుకోవాలనుకున్న ఓ గర్భిణి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా డెలివరీ చేయడంతోపాటు నవజాత శిశువును విక్రయించిన ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బట్టబయలైంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పెళ్లికి ముందే గర్భం దాల్చడంతో.. జిల్లాలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు కామారెడ్డి మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మహేశ్‌తో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఆమెకు మరొకరితో సాన్నిహిత్యం ఉండటంతో ఆ కారణంగా పెళ్లి సమయానికే ఆమె గర్భం దాలి్చంది. పెళ్లయిన నెల రోజులకు భర్తకు ఈ విషయం తెలియడంతో నాటి నుంచి లావణ్య పుట్టింట్లోనే ఉంటోంది. పుట్టబోయే బిడ్డ తనతో లేకపోతే భర్త మళ్లీ చేరదీస్తాడని భావించిన లావణ్య.. ఏప్రిల్‌లో శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సమని్వత ఆస్పత్రిని సంప్రదించింది. గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వైద్యుడు ఇట్టం ప్రవీణ్‌కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు ఈ ఆస్పత్రిని నడుపుతున్నారు. అందుకు అంగీకరించిన వారు మొత్తం రూ. 2 లక్షలకు లావణ్య, ఆమె కుటుంబ సభ్యులతో బేరం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కాస్త నగదు, ఫోన్ పే ద్వారా రూ. లక్షా 30 వేలను లావణ్య కుటుంబ సభ్యులు చెల్లించారు.ఏప్రిల్ 11న అర్ధరాత్రి లావణ్యకు డెలివరీ చేయగా ఆడపిల్లకు జన్మనిచి్చంది. అప్పటికే రాజంపేటకు చెందిన ఇట్టం బాలకృష్ణ ద్వారా అతని బంధువైన సిరిసిల్లకు చెందిన దేవయ్యతో బిడ్డను కొనే వారితో డాక్టర్, ఆయన తండ్రి ఒప్పందం చేసుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాన గ్రామానికి చెందిన భూపతి అనే వ్యక్తికి పిల్లలు లేకపోవడంతో పసిబిడ్డను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాడు. రూ. 20 వేలు తీసుకుని ఏప్రిల్ 12న పాపను భూపతి దంపతులకు అప్పగించారు. మహేశ్ ఫిర్యాదుతో విషయం వెలుగులోకి.. విషయం తెలుసుకున్న లావణ్య భర్త మహేశ్ డీసీపీవో స్రవంతికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యుడు ఇట్టం ప్రవీణ్ కుమార్, ఆయన తండ్రి నడిపి సిద్దిరాములు, ఆస్పత్రి మేనేజర్ ఉదయ్ కిరణ్, వాచ్‌మన్ బాలరాజుతోపాటు లావణ్య, మధ్యవర్తులు బాలకృష్ణ, దేవయ్య, భూపతిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. పసిపాపను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. 2021లో కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నడిపిన డాక్టర్ ప్రవీణ్, ఆయన తండ్రి ఓ గర్భిణికి లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తేలడంతో సిద్దిరాములుతోపాటు కొందరిని అరెస్టు చేసి ఆస్పత్రిని సీజ్ చేశారు. -
నాలుగడుగుల లోతుల్లోనే నీరు
సాక్షి, కామారెడ్డి : చుట్టు పక్కల గ్రామాల్లో బిందెడు నీళ్లకు గోస పడుతుంటే ఆ ఊళ్లో మాత్రం చేదబావుల్లో నీరు పుష్కలంగా ఊరుతోంది. నాలుగు అడుగుల లోతులో ఉన్న నీళ్లను తోడుకునేందుకు బొక్కెన వేసి రెండు చేతులతో నీటిని పైకి లాక్కుంటారు. కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో ఇళ్లల్లో వందకు పైగా చేదబావులు ఉన్నాయి. తాతల కాలం నుంచి ఆ ఊరి జనం చేదబావులను వాడుతున్నారు. ఎక్కడ కరువొచ్చినా ఉప్పల్వాయిలో మాత్రం నీళ్లకు కరువు అన్న ముచ్చటే తెలియదని గ్రామస్తులు అంటున్నారు. ఇరవై ఏళ్ల నాడు ఒకసారి బావుల్లో నీరు కొంతమేర తగ్గినా, తర్వాతి కాలంలో ఏనాడూ ఊటలు తగ్గలేదని పేర్కొంటున్నారు. ఉప్పల్వాయి గ్రామంలో 438 ఇళ్లు ఉన్నాయి. గ్రామ జనాభా 2,478. గ్రామంలో 145 వరకు చేదబావులు ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా, చాలామంది చేదబావుల నీటిని కూడా వాడుతున్నారు. కొందరు చేదబావుల్లో మోటార్లు ఏర్పాటు చేసుకోగా, మిగతావారు గిరక ద్వారా చేదుకుంటున్నారు. చాలా ఇళ్ల ముందు చేతబావి కనిపిస్తుంది. బయటకు వెళ్లి వచ్చినవారు బొక్కెనతో నీటిని చేదుకొని కాళ్లు, చేతులు కడుక్కుని ఇంట్లోకి అడుగుపెడుతుంటారు. గ్రామంలో పాత ఇళ్ల వద్ద చేదబావులు ఉన్నాయి. కొత్తగా బంగళాలు నిర్మించుకుంటున్న వారు మాత్రం బోర్లు వేయించుకుంటున్నారు. బావులు ఎన్నడూ ఎండిపోలేదు నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్లపైనే ఉంటయి. నాకు బుద్ధి తెలిసిన నాటి నుంచి బావులు ఎండిపోయింది ఎన్నడూ ఎరుకలేదు. బిందెలతో ముంచుకున్నం. బొక్కెనలతో రెండు చేతులు వేస్తే చాలు నీళ్లు అందుతాయి. మా తాతల కాలం నుంచి ఊళ్లో నీళ్లకు కరు వు లేదు. బావుల్లో నీరు పుష్కలంగా ఉంటోంది. –ఆల నారాయణ, ఉప్పల్వాయి అవసరం ఉన్నప్పుడల్లా చేదుకుంటం... మా ఇంట్లో రెండు కుటుంబాలున్నాయి. అవసరం ఉన్నప్పుడల్లా బావిలో నుంచి చేదుకుంటాం. రెండుసార్లు చేతులు వేస్తే చాలు బొక్కెన పైకి వచ్చేస్తుంది. నాకు పెళ్లయి ఇక్కడికి వచ్చిన నాటి నుంచి బావుల్లో నీళ్లు ఎండిపోయింది ఎన్నడూ లేదు. నీళ్ల ఇబ్బంది ఎదురు కాలేదు. – సుతారి మహేశ్వరి, ఉప్పల్వాయి మా తాత తవ్వించిన బావి... మా ఇంటి దగ్గర మా తాతలు తవ్వించిన బావి ఎన్నడూ ఎండిపోలేదు. ఇప్పుడు మేం కూడా బావి నీటిని వాడుకుంటున్నం. బావికి మోటార్ బిగించి పైన ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చాం. ట్యాంకు ద్వారా నీటిని వాడుకుంటున్నాం. –శంకర్‌గౌడ్, ఉప్పల్వాయి -
కామారెడ్డి జిల్లా: భార్య ఘాతుకం.. పాడుబడ్డ ఇంటిలో షాకింగ్ దృశ్యం
సాక్షి, కామారెడ్డి జిల్లా: బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌లో దారుణం జరిగింది. రాములు అనే వ్యక్తిని గొడ్డలితో భార్య మంజుల, మృతుడి తండ్రి నారాయణ నరికి చంపారు. రాములును హత్య చేసి ఇంటి ప్రక్కనే ఉన్న మరో పాడుబడ్డ ఇంటి లోపల నీటి ట్యాంకులో పడేశారు. ఆపై దుర్వాసన వస్తుందని ఆ ఇంటి ఆవరణలోనే పాతిపెట్టారు.తన భర్త రాములు కనబడటం లేదని ఈ నెల 16న భార్య మంజుల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘాతుకం బయటపడింది. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న రాములు మృతదేహాన్ని బాన్సువాడ పోలీసులు వెలికితీశారు. తండ్రి నారాయణ, భార్య మంజులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పెట్టుబడిదారుల పార్టీకి..పేదల కన్నీళ్లు పట్టవు
సాక్షి, కామారెడ్డి/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘మోదీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైపోయింది. రూపాయి విలువ భారీగా పడిపోయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట దెబ్బతిన్నది. బీజేపీ దోపిడీదారులు, పెట్టుబడిదారులకే కొమ్ముకాసే పార్టీ. దాని ఎజెండాలో పేదల కష్టాలు, కన్నీళ్లు ఉండవు..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో కేసీఆర్ రోడ్‌షో నిర్వహించారు. జయప్రకాశ్ నారాయణ్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగులో ప్రసంగించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్‌షోలో కూడా మాట్లాడారు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చే దిన్ వచ్చినయ్ ‘ప్రధాని నరేంద్ర మోదీ వట్టి గ్యాస్ మాటలు చెబుతాడు. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పి సత్తె నాశనం చేశాడు. ఎగుమతులు బందయి, దిగుమతులు పెరిగాయి. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ పడావో..బేటీ బచావో, జన్‌ధన్ యోజన ఇవేవీ దేశానికి ఉపయోగపడలేదు. 150 వాగ్దానాలు చేసిండ్రు. అవేవీ ప్రజలను ఆదుకోలేదు. అచ్ఛే దిన్ ఏమోగానీ సచ్చేదిన్ వనయ్. పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు.అంతటా రూ.15 లక్షలు ఇస్తామన్నారు? కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచినందుకు ఇక్కడ రూ.30 లక్షలు ఇచి్చండ్రా? (లేదంటూ సభికులు కేకలు పెట్టారు) రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎక్కడా రైతులకు మేలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రంటూ మోదీ ప్రతిసారీ తెలంగాణ ఏర్పాటుపై విషం కక్కాడు. పేదలకు ఏమీ చేయని బీజేపీకి ఓటేయడమే దండుగ. ఆ పారీ్టకి 400 సీట్లు రానేరావు. మళ్లీ మోదీ ప్రధాని అయితే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 దాటిపోతాయి..’ అని కేసీఆర్ అన్నారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు ‘ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అసమర్థులు, పరిపాలన సాగించలేని తెలివితక్కువ వాళ్ల చేతుల్లోకి వెళ్లి ఐదు నెలల్లోనే ఆగమైంది. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారు. రూ.2 లక్షల వరకు రుణం మాఫీ చేస్తనంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడి దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నాడు. ఈ నెల 9 లోపు రైతుబంధు వేస్తా అన్న ముఖ్యమంత్రి తనే కుట్ర చేసి ఆపించాడు.ఐదెకరాలకు ఇస్త అంటడు. ఆరెకరాలు, ఏడెకరాల రైతులకు ఎందుకు ఇవ్వడు? తొమ్మిదేళ్లు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు ఇచ్చాం. కేసీఆర్ దిగిపోగనే కరెంటుకు ఏమైంది? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ వన నీళ్లు ఇప్పుడెందుకు రావడం లేదు? వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? ఫీజు రీయింబర్స్‌మెంటు చేయడం లేదు, 125 గురుకులాల్లో విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఐదు నెలల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి..’అని మాజీ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.అలాగైతే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి?‘రేవంత్‌రెడ్డి ఒట్లు పెట్టుకోవడం, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు రాజ్యమేలితే ఇలాగే ఉంటుంది. కృష్ణా నదిని కేఆర్ఎంబీకి అప్పగించిన కాంగ్రెస్ సర్కారు.. గోదావరి నదిని తమిళనాడుకు అప్పగిస్తోంది. ఉన్న ఒక్క గోదావరి నదీ జలాలు తమిళనాడుకు వెళితే తెలంగాణ ప్రాజెక్టులు ఏం కావాలి? మేం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే వాటిని తీసేస్తామని కాంగ్రెస్ అంటోంది. ఉద్యమాల్లో రాటుదేలిన, చైతన్యవంతమైన కామారెడ్డి, మెదక్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.పార్లమెంటు ఎన్నికల్లో 12, 13 స్థానాల్లో మనం గెలిస్తే రాష్ట్రం మెడలు వంచి హామీలు అమలు చేయించుకుందాం. కేంద్రంలో బీజేపీ పరిస్థితి బాగాలేదు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. 12, 13 స్థానాలు గెలిస్తే మనమే కీలకంగా మారతాం. కామారెడ్డితో పాటు ఇతర జిల్లాలు పోకుండా ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి. మన నదీ జలాలు మనకు రావాలన్నా, తెలంగాణ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మన అభ్యర్థులను గెలిపించాలి..’అని బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి చేశారు. ఈ సభల్లో మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హన్మంత్ షిండే, మెదక్, జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు వెంకట్రామ్ రెడ్డి, గాలి అనిల్‌కుమార్ పాల్గొన్నారు. చిన్నారులకు పకోడీలు తినిపించిన కేసీఆర్ ఇందల్వాయి ( నిజామాబాద్ రూరల్): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం చిన్న పిల్లలు, రైతులతో కాస్త సరదాగా గడిపారు. సాయంత్రం నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళుతూ 44వ నంబరు జాతీయ రహదారిపై ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద ఆగారు. అక్కడి హోటల్లో ఉల్లిగడ్డ పకోడి తిని టీ తాగారు. అక్కడ ఉన్న చిన్నారులకు పకోడీలు తినిపించారు. తనను కలిసేందుకు వన రైతులకు ఇచ్చారు. మరోవైపు హోటల్ వద్ద ఆగిన ప్రయాణికులు, చిన్నారులు కేసీఆర్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వారందరితో కేసీఆర్ సరదాగా సంభాíÙంచారు. హోటల్ యజమాని వెంకట రమణయ్యతోనూ ముచ్చటించారు. -
కామారెడ్డి జిల్లాలో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొన్న కారు
-
పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో అగ్నిప్రమాదం
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లాకేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయ ఆవరణలో ఉన్న పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో కార్యాలయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు పోస్టల్ అధికారులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాదంలో సామగ్రితోపాటు కంప్యూటర్లు, ఇన్వర్టర్లు, బ్యాట రీలు, ఫైళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. గది పక్కనే పోస్టల్ శాఖ ఉత్తరాల గది ఉండటంతో హుటాహుటిన సిబ్బంది ఆ ఉత్తరాల సంచులను బయటకు తీసుకువచ్చి ఎదురుగా ఉన్న ప్రధాన కార్యాలయంలోకి తరలించారు. పాస్‌పోర్టు ఈ సేవాకేంద్రంలో మాత్రం అంతా అగ్నికి ఆహుతైంది. పాస్‌పోర్టులకు సంబంధించి అన్ని వివరాలు ఆన్లైన్లో నమోదై ఉంటాయని, ఫైళ్లు ఎప్పటికప్పుడు తరలిస్తామని, ఎలాంటి డేటా, ముఖ్యమైన ఫైళ్లు నష్టపోలేదని, ఫరి్నచర్, కంప్యూటర్లు కాలిపోవడంతో స్వల్ప నష్టం వాటిల్లిందని పోస్టల్ శాఖ అధికారి రాజు తెలిపారు. 26 నుంచి కామారెడ్డి పీవోపీఎస్కేలో కార్యకలాపాలు నిలిపివేత రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): కామారెడ్డిలోని పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో నిర్వహణ కారణాలతో ఈ నెల 26 నుంచి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి జె. స్నేహజ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 26 నుంచి అపా యింట్మెంట్లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు వాటిని రీ షెడ్యూల్డ్ చేసుకునే ఆప్షన్లను ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు. -
పల్లె కడుపున రాచపుండు!
సాక్షి, కామారెడ్డి: కేన్సర్ వ్యాధి రాచపుండులా మా రి పల్లెల్ని వణికిస్తోంది. ఏమవుతోందో తెలుసుకు నే లోపే ప్రాణాలను కబళిస్తోంది. కుటుంబాలను వీధిపాలు చేస్తోంది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం కొన్నాళ్లుగా కేన్సర్ తో అల్లాడుతోంది. గత మూడేళ్లలోనే ఇక్కడ పన్నె ండు మంది కేన్సర్‌తో చనిపోయారని.. మరో పది మందికిపైగా చికిత్స పొందుతున్నారని గ్రామ స్తులు చెప్తున్నారు. ఈ వ్యాధి బారిన పడుతున్న వారిసంఖ్య మరింతగా పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. కొందరు బాధితులు మానసికంగా, శారీరకంగా దెబ్బతిని జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా కేన్సర్ బారినపడుతున్నారు. ఒక్క ఊరిలోనే ఇంతమంది కేన్సర్ బాధితులు ఉండటం ఆందోళన రేపుతోంది. వరుసగా మరణాలతో కలవరం మద్దికుంట గ్రామానికి చెందిన భారతి అనే మహిళ మూడేళ్ల కింద కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ మృతిచెందింది. తర్వాత ప్రమీల, లక్ష్మి, భూమవ్వ, భాగ్య, రాజవ్వ.. ఇలా మూడేళ్లలో పది మందికిపైగా కేన్సర్ బారినపడి చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిలో కొందరు రొమ్ము కేన్సర్, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) కేన్సర్‌తో చనిపోయినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఐదారుగురు మగవారు ఊపిరితిత్తుల (లంగ్స్) కేన్సర్, నోటి కేన్సర్లతో మరణించారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఓ మహిళకు రొమ్ము కేన్సర్ సమస్య తీవ్రం కావడంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ భాగాన్ని తొలగించారు. మరో మహిళ ఇదే సమస్యతో చికిత్స పొందుతోంది. ఇంకో ఇద్దరు మహిళలు సర్వైకల్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే పొరుగువారు, గ్రామస్తులు ఎలా స్పందిస్తారో, తమను ఎక్కడ దూరం పెడతారోనన్న ఆందోళనతో బాధితులు తాము కేన్సర్ బారినపడ్డ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. గ్రామస్తుల్లో ఆందోళన ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి కలెక్టర్ యోగితారాణా జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు సర్వైకల్ కేన్సర్ పరీక్షలు చేయించారు. పదుల సంఖ్యలో బాధితులను గుర్తించారు. చాలా మందికి ఇది ప్రారంభ దశలోనే ఉండటంతో వైద్యం అందించారు. పరీక్షలు చేయించుకోనివారు, చేయించుకున్నా బయటికి చెప్పకుండా ఏవో మందులు వాడుతున్నవారు తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలా మద్దికుంటలో ఎక్కువ మంది బాధితులు కనిపిస్తున్నారు. తరచూ గ్రామంలో ఎవరో ఒకరు పెద్దాస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం, వారిలో కొందరు చనిపోతుండటం చూసి గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి పరీక్షించాలని.. బాధితులను గుర్తించి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నారు. ఎంతో అవస్థ పడి కోలుకుంటున్నా.. ఏడాది కింద కడుపులో నొప్పి మొదలైంది. ఆర్ఎంపీ వద్ద చూపించుకుని, మందులు వాడినా తగ్గలేదు. కామారెడ్డిలోని ఆస్పత్రికి వెళ్తే.. స్కానింగ్ చేసి కడుపులో కేన్సర్ సమస్య ఉందని చెప్పి హైదరాబాద్‌కు పంపించారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నాను. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేసి గడ్డను తొలగించారు. మొన్నటి దాకా కెమో థెరపీ చేశారు. ఏడాది పాటు ఎంతో అవస్థ పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. పరీక్షలు, మందులు, రాకపోకలకు రూ.2 లక్షల దాకా ఖర్చయ్యాయి. – కుమ్మరి లత, మద్దికుంట, కామారెడ్డి జిల్లా కేన్సర్‌పై అవగాహన కల్పిస్తున్నాం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) గురించి అవగాహన కల్పించేందుకు తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఆయా వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన వైద్యసేవలు అందిస్తున్నాం. ఇటీవల దోమకొండ, భిక్కనూరులలో క్యాంపులు నిర్వహించాం. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పాలియేటివ్ థెరపీ ఏర్పాటు చేశాం. ఆరు బెడ్లతో సేవలు అందిస్తున్నాం. మద్దికుంటకు సంబంధించిన కేసులను పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, కామారెడ్డి -
గత పాలనలో ధనిక రాష్ట్రం అప్పులపాలు
నిజాంసాగర్(జుక్కల్): ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదిన్నరేళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు భావించి అధికారంలోకి తీసుకువచ్చారు’అని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని కౌలాస్ కోటను సందర్శించిన అనంతరం బిచ్కుంద, పిట్లం మండలాల్లోని ఎల్లారం తండా, కుర్తి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధనిక రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్‌కు అప్పజెప్పితే ఇప్పుడు రూ.7 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. అయినా ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై తొలి సంతకం చేశారని, ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో జుక్కల్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు తోట లక్ష్మికాంతరావు, సంజీవ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు. -
షాపింగ్ మాల్ బుగ్గి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాజ్‌టాకీస్ రోడ్‌లోని అయ్యప్ప షాపింగ్ మాల్లో రాత్రి 11.20 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన నైట్ వాచ్‌మన్ మాల్ యజమానికి, ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే ఫైర్ స్టేషన్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడానికి ప్రయత్నించేలోపే భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి, గాంధారి, ఇందల్వాయి, రామాయంపేట, నిజామాబాద్‌ల నుంచి ఆరు ఫైర్ ఇంజన్లను, 50 మంది సిబ్బందిని రప్పించారు. భవనం నాలుగు అంతస్తుల్లో ఉండటంతో హైదరాబాద్ నుంచి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్, ఫైర్ సర్విసెస్ విభాగం నుంచి భారీ స్కై లిఫ్ట్‌ను తెప్పించారు. ఆరు ఫైర్ ఇంజన్లతో పాటు స్కైలిఫ్ట్ ద్వారా మంటలను ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సుమారు 50 ట్యాంకర్ల నీటిని తీసుకు వచ్చి మంటలను ఆర్పారు. గురువారం ఉదయం 11 గంటల సమయానికి మంటలను అదుపులోకి తెచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు మంటలు పూర్తిగా ఆరిపోయాయి. అయితే మాల్లోని దుకాణాలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 6 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగిందని భావిస్తున్నారు. -
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్‌పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్‌లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
‘కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?’
సాక్షి, కామారెడ్డి జిల్లా: తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై హోంమంత్రి మహమూద్ అలీ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ ముందు రేవంత్‌రెడ్డి ఓ బచ్చా అని.. చిన్న పిల్లాడు అంటూ విమర్శించారు. రేవంత్‌రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి అని, కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీజేపీ కోవర్టు అంటూ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ‘ దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రం.. నంబర్‌వన్ సీఎం కేసీఆర్.కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డి ఓ బచ్చా.. చిన్న పిల్లాడు. రేవంత్ రెడ్డి పక్కా ఆరెస్సెస్ మనిషి.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ కోవర్టు.కొడంగల్‌లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?, సీఎం కేసీఆర్ స్వయంగా కామారెడ్డి రావడం ఇక్కడి ప్రజల అదృష్టం. మైనార్టీ సంక్షేమం కేవలం తెలంగాణలోనే అయింది. మైనార్టీల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యం. కామారెడ్డిలో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
చూసుకుందాం.. దమ్ముంటే రా
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తడని అనంగనే ప్రతిపక్షాల ఫ్యూజులు ఎగిరిపోయినయి. జబ్బలు చరిచినోళ్లు తప్పించుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే కామారెడ్డి తెలంగాణ ఉద్యమాల గడ్డ. షబ్బీర్ అలీ అసోంటోళ్లు పోటీ నుంచి తప్పుకున్నరు. ఇగ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీకి వస్తడట. రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే రా చూసుకుందాం. డిపాజిట్ కూడా దక్కనీయం. చిత్తుచిత్తుగా ఓడిస్తం. పోరాటాల గడ్డ మీద తెలంగాణ ద్రోహులకు స్థానం లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన సభల్లో కేటీఆర్ మాట్లాడారు. ‘కేసీఆర్ పోటీ చేస్తున్నడని తెలవంగనే కొందరు నాయకులు పోటీ నుంచి తప్పుకున్నరు. షబ్బీర్ అలీ పోటీ చేయనని పక్కన కూసున్నట్టు మీడియాలో చూసిన. కేసీఆర్ మీద పోటీ చేయడం అంటే పోచమ్మ గుడి ముందు మేకపోతును బలిచ్చినట్టే. గ్రామగ్రామాన ప్రజలే ఏకగ్రీవంగా కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నరు. పోటీ ఏకపక్షమే’అని పేర్కొన్నారు. కామారెడ్డికి గోదావరి తెస్తాం ‘పుట్టుక నుంచి చావు వరకు కేసీఆర్ పథకాలు ఇంటింటికీ చేరినయి అంటూ బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్టు వస్తది, ఏదేని పరిస్థితుల్లో ప్రాణాలు పోతే కేసీఆర్బీమాతో ఆదుకుంటాం’అని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేఖలే మారిపోతాయన్నారు. కామారెడ్డి ప్రాంతానికి గోదావరి జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతామన్నారు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. ‘కామారెడ్డిలో కేసీఆర్ గెలిస్తే ఎవరు చూసుకుంటరని కొందరు అంటున్నరు. ఇక్కడ ప్రత్యేక అధికారిని పెడతం. ఆయన పర్యవేక్షణలో అన్నీ జరుగుతయి. ఈ ప్రాంతానికి చెందిన ఆర్డీవో ముత్యంరెడ్డి గజ్వేల్‌లో ప్రత్యేకాధికారిగా పనిచేసి అక్కడి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు. అవసరమైతే ఆయన్నే ఇక్కడ పెట్టుకుని పాలన సాగించుకుంటాం. నాది పక్క నియోజక వర్గం సిరిసిల్ల.. నేను వారం, పదిరోజులకోసారి వస్తూపోతూనే ఉంట. ఇక మీదట కామారెడ్డిలో ఆగుత. ఇక్కడి ప్రజల కష్టాలను నేనే తీరుస్తా’అని కేటీఆర్ అన్నారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, విప్ గంప గోవర్ధన్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని పనులు చూస్తారని తెలిపారు. గంప గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో శ్రమించారని, ఇంకా సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలా అభివృద్ధి జరగాలంటే సీఎం పోటీ చేయాలని గంప గోవర్ధన్ సీఎంను కోరడంతో పోటీకి సిద్ధమయ్యాడన్నారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా కేసీఆర్ విజయం సాధిస్తారని, ఇక్కడ పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని చెప్పారు. వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా? కాంగ్రెస్‌కు 11 సార్లు అధికారం ఇస్తే వాళ్లు చేసిందేమి లేదని, ఇప్పుడు ఏదో చేస్తా అంటే ఎవరు నమ్మాలని కేటీఆర్ ప్రశ్నించారు.70 లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్ల రైతుబంధు ఇచ్చిన ప్రభుత్వం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. దేశంలో 28 రాష్ట్రాలుంటే ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తున్నరా అని ప్రశ్నించారు. మూడు గంటల కరెంటు ఇస్తామని రేవంత్‌రెడ్డి, రైతుబంధు వద్దని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని, వాళ్లకు ఓటేసి కష్టాలు పడదామా అని అన్నారు. సభలో విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షిస్తాం.... కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్‌పై మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... పార్టీ సీనియర్ నాయకుడు తిర్మల్రెడ్డిపై దౌర్జన్యం చేసినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు. తప్పుడు పనులు చేసేవారిని, ప్రజలను ఇబ్బంది పెట్టేవారిని క్షమించేది లేదన్నారు. పార్టీ నాయకుడైనా, కార్యకర్త అయినా సరే తప్పు చేస్తే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
లక్ష్మీపుత్రుడి లక్కెలా ఉందో?
అసెంబ్లీలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించినవారు ఓటమి పాలవుతారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనిని బలపరుస్తూ గతంలో పనిచేసిన స్పీకర్లు ఓడిన ఉదంతాలున్నాయి. 1999 నుంచి స్పీకర్లుగా పనిచేసిన వారిలో ఇప్పటివరకు ఎవరూ గెలుపును సొంతం చేసుకోలేకపోయారు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్‌ను తిరగరాస్తానన్న ధీమాలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. వయసు పైబడుతుండటంతో ఈసారి పోటీ నుంచి తప్పుకొని కుమారుడిని వారసునిగా నిలబెట్టాలని అనుకున్నా సీఎం మాత్రం తాను ఉన్నన్ని రోజులు శీనన్న ఉంటారని పేర్కొనడంతో ఎన్నికల బరిలో ఆయన నిలిచారు. సాక్షి, కామారెడ్డి: అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడు అని సంబోధిస్తుంటారు. అసెంబ్లీలోనే కాదు బహిరంగ సభల్లోనూ ఆయనను అలాగే గౌరవిస్తారు. పోచారం వ్యవసాయశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రైతుబంధు పథకం ప్రారంభించారు. రూ. వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, అందుకే శీనన్న లక్ష్మీపుత్రుడు అంటూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ...: కామారెడ్డి జిల్లా బాన్సువాడ సెగ్మెంట్ నుంచి 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం... 2004 మినహా 1999, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018 ఎన్నికల్లో విజయాలు సొంతం చేసుకున్నారు. 76 ఏళ్ల వయసులోనూ ఆయన నిత్యం జనం మధ్యే తిరుగుతుంటారు. వేకువజామునే లేచి బ్యాటరీ వాహనంలో ఊరంతా కలియ తిరుగుతారు. మున్సిపల్ సిబ్బంది మురికికాలువలు శుభ్రం చేస్తుంటే నిలబడి వారికి సూచనలు ఇస్తారు. ఇంటికి చేరగానే ఊళ్ల నుంచి వచ్చే ప్రజలు, పార్టీ నేతలతో మాట్లాడతారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.10 వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని లెక్కలతో సహా చెబుతారు. ఏ నియోజకవర్గంలో లేనివిధంగా బాన్సువాడలో 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి లబ్ది దారులకు అందించారు. విద్య, వైద్య రంగంలోనూ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపారు. బాన్సువాడలోని మాతాశిశు ఆస్పత్రి సేవల్లో దేశంలోనే ప్రథమ స్థానం దక్కించుకుంది. సెంటిమెంట్ ఏం చేస్తుందో? స్పీకర్ పదవిలో ఉన్న వారు తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతూ రావడం ఆనవాయితీగా మారింది. కానీ ఈ సెంటిమెంట్‌ను పోచారం అధిగమిస్తారని ఆయన అనుచరులు నమ్ముతున్నారు. నిత్యం జనం మధ్యే ఉంటూ, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పోచారం చరిత్రను తిరగరాస్తారంటున్నారు. నియోజకవర్గంలో ప్రత్యర్థులు బలంగా లేకపోవడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి మంత్రం పనిచేస్తుందా లేక సెంటిమెంటే పునరావృతం అవుతుందా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. -
గుండెపోటుతో అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, జగిత్యాల జిల్లా: కోరుట్ల మండలం కల్లూరులో ఊహించని విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో అన్నాచెల్లెళ్లు మృతి చెందారు. రంగుల పోషాలు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా మోస్రాలో ఉంటున్న చెల్లెలు పోషవ్వ.. అన్న మరణవార్త విని కన్నీటి పర్యంతమై గుండెపోటుతో హఠాన్మరణం చెందింది. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెను సవాల్ విసురుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. విద్యార్థుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు గుండెపోటు బారిన పడుతున్నారు. చదవండి: పిల్లలున్నా అతడితో లవ్ ట్రాక్.. చివరకు..