ఆ ‘స్వామి’ లీలలెన్నో: విలాస జీవితం.. పెళ్లి పేరుతో వంచన | Kamareddy: Fake DSP Cheating Job Aspirants Shocking Details | Sakshi
Sakshi News home page

ఆ ‘స్వామి’ లీలలెన్నో: విలాస జీవితం.. పెళ్లి పేరుతో వంచన

Published Tue, Jul 20 2021 8:40 PM | Last Updated on Tue, Jul 20 2021 8:53 PM

Kamareddy: Fake DSP Cheating Job Aspirants Shocking Details - Sakshi

ఎస్పీ శ్వేతారెడ్డి ప్రెస్‌మీట్‌.. (ఇన్‌సెట్లో నకిలీ డీఎస్పీ స్వామి)

సాక్షి, కామారెడ్డి: డీఎస్పీ అవతారమెత్తిన ‘స్వామి’ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఖాకీ యూనిఫాంలో చేసిన ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. విలాసవంతమైన జీవితం కోసం అతడు అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. తాను చేసే తప్పుడు పనులు బయట పడకుండా ఉండేందుకు ఖాకీ అవతారం ఎత్తినట్లు సమాచారం. ఉద్యోగాలిప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఖాకీ దుస్తుల్లో సెటిల్‌మెంట్లు చేయడం ద్వారా మూడు, నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో నకిలీ స్వామి బాగోతం బట్టబయలైంది.

డీఎస్పీ అవతారం ఎత్తిన బీబీపేట మండలంలోని తుజాల్‌పూర్‌ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని బేగంబజార్‌ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడ్ని తమదైన శైలిలో విచారించగా ఆ స్వామి వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డిలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్‌ చేసి ఓ మహిళను ఢీకొట్టిన ఘటనలో స్వామిపై డ్రంకన్‌ డ్రైవ్‌ కేసు నమోదైంది. ఈ కేసులో అతడ్ని రిమాండుకు తరలించారు.   

యూనిఫాంలో సెటిల్‌మెంట్లు.. 
పోలీసు అధికారిగా నమ్మించేందుకు స్వామి ఖాకీ దుస్తులు ధరించి సెటిల్‌మెంట్లకు వెళ్లడం అలవాటైనట్టు తెలిసింది. ఓ సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అంతేకాకుండా హైదరాబాద్‌లో పోలీసు దుస్తుల్లో వెళ్లి లాఠీ చేతపట్టి మహిళలను తరిమేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. భూములతో పాటు డబ్బులకు సంబంధించిన సెటిల్‌మెంట్ల విషయంలో స్వామి పోలీసు దుస్తుల్లో వెళ్లడం ద్వారా అక్కడ తాను పోలీసు అధికారినని నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడని తెలుస్తోంది. తన కారులో యూనిఫాం, లాఠీ, టోపీ ఉంటాయని సమాచారం. 

పెళ్లి పేరుతో వంచన.. 
హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ విలాస జీవితం మొదలుపెట్టిన స్వామి.. పలువురు అమ్మాయిలను పెళ్లి పేరుతో వంచించాడని తెలుస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో అతడికి పరిచయాలున్నాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉద్యోగాల పేరుతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఉద్యోగాలు రాకపోగా, డబ్బులు తీసుకున్న స్వామి కోసం హైదరాబాద్‌ చుట్టూ తిరిగిన పలువురు బాధితులు తుజాల్‌పూర్‌లోని ఆయన ఇంటికి పలుమార్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా టీఎస్‌పీఎస్సీ అధికారులు బేగంబజార్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి నకిలీ స్వామి గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అతడ్ని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

ఖరీదైన మద్యంతో విందులు.. 
హైదరాబాద్‌ నుంచి నాలుగైదు రోజులకోసారి సొంతూరికి వచ్చే స్వామి ఇక్కడ తన దర్పం ప్రదర్శించుకునే వాడు. ఖరీదైన మద్యం సేవించే స్వామి.. స్నేహితులకు విందులు ఇచ్చే సందర్భంలోనూ ఖరీదైన మద్యం బాటిళ్లు తెప్పిస్తాడని సమాచారం. తుజాల్‌పూర్‌ గ్రామానికి వచ్చినపుడల్లా కొందరు దోస్తులను పిలవడం, వారికి విందులు ఇవ్వడం పరిపాటిగా చెబుతున్నారు. కొందరు పోలీసులతో కూడా అతడికి స్నేహం ఉందని, వాళ్లు కూడా విందులకు హాజరవుతుంటారని తెలిసింది. పోలీసు జాగిలాన్ని పోలిన అల్సెషన్‌ డాగ్‌ను కూడా కారులో తీసుకొస్తాడని స్థానికులు తెలిపారు.

సొంతూరిలో రాత్రి ఉంటే పొద్దున ఆ కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లే వాడని చెప్పారు. అతడి కారుకు పోలీసు సైరన్‌ ఉంటుందని, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాలకు చేరుకునే సమయంలో సైరన్‌ మోగిస్తూ వెళ్తాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ స్వామి గురించి బీబీపేట ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. 

నకిలి డీఎస్పీ నెల్లూరు స్వామిపై ఎస్పీ శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ 
అమాయకులను మోసం చేస్తున్న  నెల్లూరు స్వామికి ఎవరైనా సహకరించినట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్వేతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగాల నిమిత్తం నకిలీ డీఎస్పి నెల్లూరు స్వామి కి డబ్బులు ఇస్తే ఫిర్యాదు చేయండి. మార్చి 15న కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నెల్లూరు స్వామి విషయంలో విచారణ చేస్తున్నాం. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు’’ అని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement