Begam bazar
-
ఆ ‘స్వామి’ లీలలెన్నో: విలాస జీవితం.. పెళ్లి పేరుతో వంచన
సాక్షి, కామారెడ్డి: డీఎస్పీ అవతారమెత్తిన ‘స్వామి’ లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఖాకీ యూనిఫాంలో చేసిన ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. విలాసవంతమైన జీవితం కోసం అతడు అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. తాను చేసే తప్పుడు పనులు బయట పడకుండా ఉండేందుకు ఖాకీ అవతారం ఎత్తినట్లు సమాచారం. ఉద్యోగాలిప్పిస్తానంటూ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం, ఖాకీ దుస్తుల్లో సెటిల్మెంట్లు చేయడం ద్వారా మూడు, నాలుగేళ్లలో బాగానే వెనకేసుకున్నట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో నకిలీ స్వామి బాగోతం బట్టబయలైంది. డీఎస్పీ అవతారం ఎత్తిన బీబీపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిని బేగంబజార్ పోలీసులు రెండ్రోజుల క్రితం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడ్ని తమదైన శైలిలో విచారించగా ఆ స్వామి వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కామారెడ్డిలో మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసి ఓ మహిళను ఢీకొట్టిన ఘటనలో స్వామిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదైంది. ఈ కేసులో అతడ్ని రిమాండుకు తరలించారు. యూనిఫాంలో సెటిల్మెంట్లు.. పోలీసు అధికారిగా నమ్మించేందుకు స్వామి ఖాకీ దుస్తులు ధరించి సెటిల్మెంట్లకు వెళ్లడం అలవాటైనట్టు తెలిసింది. ఓ సెటిల్మెంట్కు సంబంధించిన వీడియో ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అంతేకాకుండా హైదరాబాద్‌లో పోలీసు దుస్తుల్లో వెళ్లి లాఠీ చేతపట్టి మహిళలను తరిమేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. భూములతో పాటు డబ్బులకు సంబంధించిన సెటిల్మెంట్ల విషయంలో స్వామి పోలీసు దుస్తుల్లో వెళ్లడం ద్వారా అక్కడ తాను పోలీసు అధికారినని నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడని తెలుస్తోంది. తన కారులో యూనిఫాం, లాఠీ, టోపీ ఉంటాయని సమాచారం. పెళ్లి పేరుతో వంచన.. హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ విలాస జీవితం మొదలుపెట్టిన స్వామి.. పలువురు అమ్మాయిలను పెళ్లి పేరుతో వంచించాడని తెలుస్తోంది. పొరుగునే ఉన్న సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో అతడికి పరిచయాలున్నాయి. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉద్యోగాల పేరుతో పలువురి వద్ద డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఉద్యోగాలు రాకపోగా, డబ్బులు తీసుకున్న స్వామి కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగిన పలువురు బాధితులు తుజాల్‌పూర్‌లోని ఆయన ఇంటికి పలుమార్లు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా టీఎస్పీఎస్సీ అధికారులు బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోకి దిగి నకిలీ స్వామి గుట్టు రట్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న అతడ్ని కస్టడీకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఖరీదైన మద్యంతో విందులు.. హైదరాబాద్ నుంచి నాలుగైదు రోజులకోసారి సొంతూరికి వచ్చే స్వామి ఇక్కడ తన దర్పం ప్రదర్శించుకునే వాడు. ఖరీదైన మద్యం సేవించే స్వామి.. స్నేహితులకు విందులు ఇచ్చే సందర్భంలోనూ ఖరీదైన మద్యం బాటిళ్లు తెప్పిస్తాడని సమాచారం. తుజాల్పూర్ గ్రామానికి వచ్చినపుడల్లా కొందరు దోస్తులను పిలవడం, వారికి విందులు ఇవ్వడం పరిపాటిగా చెబుతున్నారు. కొందరు పోలీసులతో కూడా అతడికి స్నేహం ఉందని, వాళ్లు కూడా విందులకు హాజరవుతుంటారని తెలిసింది. పోలీసు జాగిలాన్ని పోలిన అల్సెషన్ డాగ్‌ను కూడా కారులో తీసుకొస్తాడని స్థానికులు తెలిపారు. సొంతూరిలో రాత్రి ఉంటే పొద్దున ఆ కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లే వాడని చెప్పారు. అతడి కారుకు పోలీసు సైరన్ ఉంటుందని, దోమకొండ, బీబీపేట మండల కేంద్రాలకు చేరుకునే సమయంలో సైరన్ మోగిస్తూ వెళ్తాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు చిక్కి కటకటాలపాలైన నకిలీ డీఎస్పీ స్వామి గురించి బీబీపేట ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. నకిలి డీఎస్పీ నెల్లూరు స్వామిపై ఎస్పీ శ్వేతారెడ్డి ప్రెస్ మీట్ అమాయకులను మోసం చేస్తున్న నెల్లూరు స్వామికి ఎవరైనా సహకరించినట్లు విచారణలో తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ శ్వేతారెడ్డి హెచ్చరించారు. మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగాల నిమిత్తం నకిలీ డీఎస్పి నెల్లూరు స్వామి కి డబ్బులు ఇస్తే ఫిర్యాదు చేయండి. మార్చి 15న కామారెడ్డిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ నెల్లూరు స్వామి విషయంలో విచారణ చేస్తున్నాం. బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు’’ అని తెలిపారు. -
ది‘వాహ్’లీ ప్యాక్..
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు గిఫ్ట్‌బాక్సులు ఇచ్చే సంస్కృతి కొన్నేళ్లుగా కొనసాగుతోంది. పండగకు వారం పది రోజుల ముందు నుంచే గిఫ్ట్ బాక్స్‌లను వారికి పంపిస్తుంటారు. దీంతో బేగంబజార్ హోల్‌సేల్ మార్కెట్లో డ్రైఫ్రూట్స్ బాక్సుల విక్రయాలు జోరందుకున్నాయి. అందమైన ప్యాక్‌లలో డిజైన్ చేసి 250, 500, 750 గ్రాముల చొప్పున ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నారు. వీటి ధరలు రూ.250 నుంచి రెండు మూడు వేల వరకు అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ప్యాకింగ్ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. శానిటైజ్, థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే ఉద్యోగులను విధుల్లోకి అనుమతిస్తున్నారు. విక్రయాలు ఊపందుకున్నాయి ఉత్తరాది రాష్ట్రాల్లో పండగ పూట గిఫ్ట్‌లు ఇచ్చే సంస్కృతి ఉంది. ప్రస్తుతం నగరంలో కూడా ఉద్యోగులు, వ్యాపారులు గిఫ్ట్‌లు ఇస్తున్నారు. నగర ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా వివిధ సైజుల్లో ఆకర్శణీయమైన ప్యాకింగ్లతో డిజైన్ చేసి విక్రయిస్తున్నాం. ఇప్పటికే విక్రయాలు ఊపందుకున్నాయి. ప్రజలు పెద్దఎత్తున గిఫ్ట్ బాక్సులను తీసుకెళ్తున్నారు. - రాజ్‌కుమార్ టండన్, కశ్మీర్ హౌస్ యజమాని -
లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్ అడ్డాగా అబిడ్స్
సాక్షి, హైదరాబాద్ : ఢిల్లీ కేంద్రంగా నగరంలోని బేగం బజార్, అబిడ్స్‌లో లిక్కర్ చాక్లెట్ల స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠా కార్యకలాపాలను ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఛేదించారు. ఆయా స్థావరాలపై దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో లిక్కర్ చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న షాప్ యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. అబిడ్స్‌లోని కమల్ వాచ్స్&గిఫ్ట్స్ కంపెనీ షోరూం, బేగంబజార్, సిద్దంబర్ బజార్‌లోని హీరా కాంప్లెక్స్ చాక్లెట్ డిస్టిబ్యూటర్ కంపెనీపై దాడులు చేసినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. లక్షల విలువ చేసే లిక్కర్ చాక్లెట్లు.. పలు బ్రాండ్ల పేరుతో లిక్కర్ చాక్లెట్ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, మెడికల్ విద్యార్థులు, ఐటీ నిపుణులు, పాఠశాల విద్యార్థులకు వీటిని సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. మొత్తంగా 1081 బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. విదేశీ మాదక ద్రవ్యంలో వీటి విలువ లక్షల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రాధమికంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామని... వారిచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాగా లిక్కర్ చాక్లెట్లకు సంబంధించిన ముఠా బేగం బజార్, అబిడ్స్ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పోలీస్ విచారణలో తేలింది. -
తల్లిని చంపి... ఇంట్లోనే పాతిపెట్టారు
హైదరాబాద్: అమ్మ ప్రేమను మరిచారు... పేగు బంధాన్ని మర్చిపోయారు. లాలిస్తూ తినిపించిన గోరు ముద్దలూ గుర్తుకు లేవు. కన్నతల్లిని కడతేర్చడమే కాదు, తాము ఉండే ఇంట్లోనే తవ్వి పాతి పెట్టేశారు అన్నా చెల్లెళ్లు. ఏడాది క్రితం నగరంలోని బేగంబజార్ ప్రాంతంలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. ఈ ఘటనలో అన్నా చెల్లెళ్లు, బాబు, కిరణ్‌తో పాటు హత్యకు సహకరించిన నజామ్ అనే వ్యక్తిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. వివరాలు....బాబు, కిరణ్(మహిళ) చిన్నప్పుడే తండ్రి మరణించడంతో, వారి తల్లి మతం మారి ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. పిల్లలను కూడా మతం మార్చించగా... పెద్దయిన తర్వాత వారు తిరిగి హిందూ మతంలోకి మారినట్లు తెలుస్తోంది. దీనిపై వేధింపులు ఎక్కువ కావడంతో 2014 జనవరి 1న తల్లిని హత్యచేశారని పోలీసులు తెలిపారు. -
బేగంబేజార్లో దారి దోపిడి
హైదరాబాద్: నగరంలోని బేగంబజార్‌లో గురువారం భారీ దోపిడి చోటు చేసుకుంది. ఆటోలో వెళ్తున్న వ్యాపారులపై దాడి చేసి... వారి వద్ద నుంచి 2 కేజీల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించుకుని పరారైయ్యారు. దాంతో బాధితులు బేగంబజార్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేట్టారు. అయితే దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.