ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌ గట్టెక్కుతుందా? | Will TRS Face Big Fight From Opposition Parties In Kamareddy District | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాలో టీఆర్‌ఎస్‌ గట్టెక్కుతుందా?

Published Fri, Sep 2 2022 3:22 PM | Last Updated on Fri, Sep 2 2022 4:05 PM

Will TRS Face Big Fight From Opposition Parties In Kamareddy District - Sakshi

కామారెడ్డి జిల్లాలోని సెగ్మెంట్లలో కూడా గులాబీ పార్టీ మీద అంత పాజిటివ్‌ ఒపీనియన్స్‌ లేవనే చెప్పాలి. ఎమ్మెల్యేల మీద ప్రజల నుంచి గతంలో మాదిరిగా సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు. ప్రత్యర్థులు బలహీనంగా ఉంటేనే టీఆర్ఎస్‌ గట్టెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కామారెడ్డి జిల్లాలో అధికార టీఆర్ఎస్‌కు గతంలోలాగా పరిస్థితులన్నీ అనుకూలంగా లేవని చెప్పొచ్చు.  సిటింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రూప్ పాలిటిక్స్ కూడా అధికారపార్టీకి మైనస్ అనే వాదన వినిపిస్తోంది. ఉర్దూ అకాడమీ చైర్మన్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన ముజీబ్ ఈసారి ఎమ్మెల్యే టిక్కెట్‌ఆశిస్తున్నారు. గతంలో అతణ్ని మంత్రి కేటీఆర్ బుజ్జగించి జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు, ఉర్దూ అకాడమీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.

గతంలో బీజేపి టిక్కెట్ ఆశించి భంగపడ్డ నిట్టు వేణుగోపాల్ కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉండటంతో ఇక్కడ గులాబీ పార్టీ మూడు గ్రూపులుగా మారింది. అయితే గంప గోవర్ధన్ కొడుకు శశాంక కూడా నియోజకవర్గంలో కలియతిరుగుతుండటంతో... కొడుకునూ భవిష్యత్ నేతగా తీర్చిదిద్దే పనిలో గోవర్ధన్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తనకు దక్కకపోతే... కొడుకుకైనా దక్కించుకోవాలనే యత్నంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు రెండుసార్లు పోటీ చేసి ఓటమి పాలైన కాంగ్రెస్‌నేత షబ్బీర్ అలీపై ఈసారి సానుభూతి కనిపిస్తోంది. కామారెడ్డిలో మైనార్టీల ఓట్లు ఎంత కీలకమో..అదే స్థాయిలో హిందువుల ఓట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ సెగ్మెంట్ లో ఎన్నిక మత ప్రాతిపదికన కీలకం కానుంది. గతంలో షబ్బీర్ అలీ సోదరుడు నయీంపైన ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ నువ్వు చూసుకో... కామారెడ్డి నేను చూసుకుంటా అంటూ నయూం ఏకంగా పత్రికల్లో యాడ్ ఇవ్వడం వంటివి షబ్బీర్ కు మైనస్ గా మారాయి. అయితే ఇటీవల తరచూ నియోజకవర్గానికి వస్తుండటం.. పబ్లిక్లో ఉండటంతో షబ్బీర్ వైపు ఈసారి సానుభూతి పవనాలు వీస్తున్నాయి. 

బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపెల్లి వెంకటరమణారెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ కాషాయ పార్టీకి హైప్ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతల అవినీతంటూ కొన్ని భూకబ్జాలకు సంబంధించి.. రమణారెడ్డి సవాల్ విసరడం... టీఆర్ఎస్ దాన్ని స్వీకరించడంతో కామారెడ్డి రాజకీయం రక్తికడుతోంది. బీజేపి నుంచి గతంలో బరిలోకి దిగి ఓటమిపాలైన ఇద్దం సిద్ధిరాములు కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి ఆయనకు టిక్కెట్ దక్కుతుందా.. కాటిపెల్లిని వరిస్తుందా.. లేక, ఇంకెవరైనా రాష్ట్రస్థాయి నేత కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారా అనే ఆసక్తికరమైన చర్చ కాషాయసేనలో జరుగుతోంది. 

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పాలిటిక్స్‌హాట్ హాట్ గా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న సెగ్మెంట్ ఎల్లారెడ్డి. ప్రస్తుతం గులాబీ కండువా ధరించిన జాజుల సురేందర్ గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన గెల్చిన ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పక్షాన గెల్చి... టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయాడన్న ఒక అపవాదు ఇప్పటికే  సురేందర్ కి మైనస్‌గా ప్రచారంలో ఉంది. కాని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయనకు శ్రీరామరక్షగా నిల్చే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ కు బలమున్నప్పటికీ ప్రస్తుతం ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నాయి. గతంలో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి అతి తక్కువ ఓట్ల తేడాతో ఓటమిచెందిన మదన్ మోహన్ రావు ప్రస్తుతం ఎల్లారెడ్డి అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఇక్కడ ఇంఛార్జ్ గా ఉన్న సుభాష్ రెడ్డికి, మదన్ మోహన్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ మధ్య పలుచోట్ల రచ్చబండ కార్యక్రమాల్లో మదన్ మోహన్ వర్గీయులు, సుభాష్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగిన సంఘటనలు మరోసారి కాంగ్రెస్ పరువును మంజీరాలో కలిపేశాయి. అయితే ఎల్లారెడ్డి వేదికగా జరిగిన రేవంత్ సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తున్నా.. ప్రత్యర్థి పార్టీతో ఫైట్ చేయాల్సిన ఆ పార్టీ కార్యకర్తలు తమలో తామే కొట్టుకోవడం ఇప్పుడు పార్టీకి మైనస్సని చెప్పాల్సి ఉంటుంది. 

ఉద్యమకాలం నుంచి గులాబీ పార్టీలో ఉండి.. ఆ తర్వాత కాషాయకండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు..గతంలో బీజేపి తరపున పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి కమలం పార్టీ ఆశావహులుగా ఉన్నారు. రవీందర్ రెడ్డికి గనుక టిక్కెట్ దక్కితే మాత్రం నియోజకవర్గంలో హోరాహోరీ తప్పదు. కాంగ్రెస్ నుంచి మదన్ మోహన్ కు నెట్ వర్క్ ఎక్కువ ఉండటం.. స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఆయనకు టిక్కెట్ దక్కితే కచ్చితంగా ఎల్లారెడ్డిలో మూడుపార్టీలు ఢీ అంటే ఢీ అంటాయి. 

బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కంచుకోట అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడినుంచి పోచారం ఆరుసార్లు వరుసగా గెలిపొందిన చరిత్ర ఉంది. నియోజకవర్గంలో అణువణువు గురించి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. పోచారం కుమారులు డీసీసీబి చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు బరిలోకి దిగుతారన్న ప్రచారమూ ఉంది. భాస్కర్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నట్టుగా తెలుస్తోంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం మీద, రెండుసార్లుగా అధికారంలో ఉన్న గులాబీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోగల ప్రత్యర్థులు నియోజకవర్గంలో కనిపించడంలేదు.  

కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజు.. గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. ఎల్లారెడ్డి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మదన్మోహన్ రావు ఇక్కడి నుంచి కూడా ప్రయత్నించే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు కాంగ్రెస్‌నేతలు. బీజేపి నుంచి స్థానిక నేత మాల్యాద్రిరెడ్డి పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే మాల్యాద్రిరెడ్డి గతంలో పోటీ చేసి ప్రత్యర్థులకు  సహకరించాడనే అపవాదు ఉంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ ఆరోపణ వినిపిస్తోంది. బీజేపీలోనూ ఇక్కడ  రెండు వర్గాలుండటం... ఆ రెండువర్గాల మధ్య తారాస్థాయిలో విభేదాలుండటం కాషాయసేనకు మైనస్‌గా చెప్పవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేంత స్థాయిలో లేవు. అందుకే మరోసారి పోచారం ఫ్యామిలీలో ఎవరికి టిక్కెట్ దక్కినా విజయం అటువైపేనన్న ప్రచారమూ ఉంది.

ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గమైన జుక్కల్ లోనూ రసవత్తర రాజకీయమే కనిపిస్తోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకే మళ్లీ గులాబీ పార్టీ టిక్కెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నుంచి గతంలో నాల్గుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన గంగారాం మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే మూడుసార్లుగా ఓటమిపాలు కావడంతో గంగారాంకు ఈసారి సానుభూతి లభించవచ్చంటున్నారు. అయితే గడుగు గంగాధర్ కూడా కాంగ్రెస్‌నుంచి జుక్కల్ టిక్కెట్ ఆశిస్తున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఆశీస్సులతో ఎలాగైనా టిక్కెట్ సాధించేందుకు గంగాధర్ ప్రయత్నిస్తున్నారు. చారంలో ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే గంగారాంకు పీసీసీ చీఫ్ రేవంత్‌మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు గంగారాం ప్రత్యర్థిగా ఉన్నంత కాలం హన్మంత్ షిండే గెలుపుకు ఢోకా లేదనే ఓ టాక్ కూడా ఇక్కడ వినిపిస్తుంది. 

నిజామాబాద్ కు చెందిన అరుణతార జుక్కల్ లో బీజేపీ తరపున ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్నారు. ఈమె కామారెడ్డి జిల్లా బీజేపి అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో నియోజకవర్గంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. అదే సమయంలో క్యాడర్ కూడా ఆమెకు పెద్దగా సహకరించడంలేదని..ఆమె క్యాడర్‌ను కాపాడుకోలేకపోతున్నారని వినిపిస్తోంది. తరచుగా పార్టీలు మారతారన్న నెగటివ్ ప్రచారం కూడా అరుణతారకు మైనస్ అవుతోంది. ఈ మధ్య ప్రతీ ఫంక్షన్ కీ హాజరవుతూ..ప్రజల్లో ఉండే యత్నం చేయడంతో ఇప్పుడు యాక్టివ్‌గా ఉన్నారనే టాక్‌సంపాదించుకున్నారు అరుణతార. సిట్టింగ్ ఎమ్మెల్యే షిండే అభివృద్ధి విషయంలో చెప్పుకునేంత చేయకపోయినా.. వివాదరహితుడనే పేరు మాత్రం తెచ్చుకున్నారు. 

మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు పరిస్థితులను చూస్తే.. టీఆర్ఎస్ అన్ని సెగ్మెంట్లల్లో విజయాలు సాధించడం అంత తేలిక కాదనేది మాత్రం స్పష్టం అవుతోంది. అలాగే కాంగ్రెస్, బీజేపీలు గట్టిగా ఫైట్ చేస్తూఉంటే.. వారికి కనీసం చెరో  రెండైనా సీట్లు దక్కే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎత్తులు...దానికి ప్రత్యర్థుల పై ఎత్తులు..టిక్కెట్లెవ్వరికి దక్కనున్నాయి..  పార్టీల్లోని అంతర్గత విభేదాలు... ఇలా ఎన్నో అంశాలు వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement