హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు.
కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నుంచి బరిలో..
ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్‌గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్‌కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం.
త్రిముఖ పోరు..?
మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది.
ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment