వరంగల్‌.. ట్రయాంగిల్‌ | Triangle fight in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌.. ట్రయాంగిల్‌

Published Thu, May 9 2024 4:56 AM | Last Updated on Thu, May 9 2024 4:56 AM

Triangle fight in Warangal

ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు 

కాకతీయుల కోటలో ఏ జెండా ఎగిరేనో..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: తొలి నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ. విప్లవ రాజకీయాలు, సామాజిక ఉద్యమాలకు నెలవు. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కేంద్రంగా ఉన్న ప్రాంతం. రాజకీయ చైతన్యానికి మారుపేరైన వరంగల్‌ సెగ్మెంట్‌ను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్‌..ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా ఉన్న వరంగల్‌ (హనుమకొండ) పార్లమెంట్‌ నియోజకవర్గంపై టీఆర్‌ఎస్‌ పట్టు బిగించింది.

 2009 పునర్విభజనలో వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. 1952 నుంచి 2019 వరకు మూడు ఉపఎన్నికలు కలుపుకొని మొత్తం 20 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్, రెండుసార్లు కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ ఐదు, టీఆర్‌ఎస్‌ నాలుగు, టీపీఎస్, పీడీఎఫ్‌ పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. జనరల్‌ స్థానంగా ఉన్నప్పుడు సైతం మూడుసార్లు ఇక్కడ ఎస్టీ అభ్యర్థులు విజయం సాధించారు.  

కడియం కావ్య (కాంగ్రెస్‌)
నాన్న తోడు.. పార్టీ బలమే గెలిపిస్తుందన్న ధీమా  
లోక్‌సభ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన కడియం కావ్య.. తండ్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్‌ పార్టీకున్న బలాన్ని నమ్ముకున్నారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఘన విజయం ఇచ్చారు. ఈ పార్లమెంట్‌ పరిధిలోని వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

 స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్‌లో చేరడం, ఆయన కూతురు కావ్యనే అభ్యర్థి కావడం అనుకూలంగా మారింది.  డాక్టర్‌గా, స్వచ్ఛంద సంస్థల ఏర్పాటు ద్వారా చేసిన ప్రజాసేవకుతోడు కాంగ్రెస్‌ పార్టీ బలం, యువ నాయకురాలిగా ప్రజలు ఆదరిస్తారనే ధీమాలో కడియం కావ్య ఉన్నారు. 

అయితే కడియం కావ్య స్థానికేతరురాలని, ఆంధ్రా ప్రాంతానికి చెందిన ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుందన్న ప్రత్యర్థుల ఆరోపణలు ఇబ్బందికరంగా మారాయి. ఎన్నికల షెడ్యూల్‌ సమయాన బీఆర్‌ఎస్‌లో ఉన్న కావ్య.. ఆ తర్వాత తండ్రితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరి అభ్యర్థి అయ్యారు. పార్టీ ఫిరాయింపులతో పాటు వీటన్నింటిపై ప్రతిపక్షాలు విమర్శనా్రస్తాలు సంధిస్తున్నాయి.

అరూరి రమేశ్‌ (బీజేపీ)
మోదీ చరిష్మా.. పాలకుల వైఫల్యాలే కలిసి వస్తాయంటూ.. 
2014, 2018 ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ సాధించిన అరూరి రమేష్‌.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అదే సెగ్మెంట్‌ నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిన ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారన్న సానుభూతికితోడు జాతీయస్థాయిలో మోదీ అనుకూల పవనాలు తనకు కలిసివస్తాయని భావిస్తున్నారు. గతంలో వరంగల్‌(హనుమకొండ)లో ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎంపీగా గెలిచారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న ప్రచారం కూడా అనుకూలమే.

 మామునూరు ఎయిర్‌పోర్టు, టెక్స్‌టైల్‌ పార్కు, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, మెట్రోరైలు సహా అనేక పథకాలకు మోక్షం కలుగుతుందని చెబుతున్నారు. బీజేపీ శ్రేణులు అరూరి రమేష్‌ గెలుపులో ఏమేరకు పాలు పంచుకుంటారన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ప్రధాని మోదీ వరంగల్‌ పర్యటన విజయవంతం,  కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ప్రచారంతో పాటు ప్రజలతో తనకున్న సంబంధాలతో గెలుస్తానని చెబుతున్నారు.

సుదీర్‌కుమార్‌ (బీఆర్‌ఎస్‌)
కేసీఆర్‌ చేసిన అభివృద్ధే గెలిపిస్తుందన్న ఆశ 
తెలంగాణరాష్ట్ర సమితి ఏర్పాటు నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్న డాక్టర్‌ మారెపెల్లి సు«దీర్‌కుమార్‌ మొదటిసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎంపీటీసీగా, ఎంపీపీగా, జెడ్పీ వైస్‌ చైర్మన్, హనుమకొండ జెడ్పీ చైర్మన్‌ వరకు అనేక పదవులు చేపట్టారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓరుగల్లుకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు పార్టీ మారారు. 

ఎంపీ పసునూరి దయాకర్‌ కాంగ్రెస్‌లో చేరగా, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థి కాగా, మేయర్‌ గుండు సు«ధారాణి, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవిందర్‌రావు తదితరులు సైతం బీఆర్‌ఎస్‌ను వీడారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, డా.టి.రాజయ్యలతో పాటు పలువురు పనిచేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు, తొలి సీఎంగా కేసీఆర్‌ ఈ రాష్ట్రానికి చేసిన మేలును చూసి ప్రజలు గెలిపిస్తారన్న ధీమాలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌కుమార్‌ ఉన్నారు.  

ముగ్గురిదీ బీఆర్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండే.. అందరూ మొదటిసారే 
వరంగల్‌ నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలకన్నా ముందు బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. తర్వాత ఆమె హస్తం గూటికి చేరడంతో జరిగిన పరిణామాలతో బీఆర్‌ఎస్‌కు అభ్యరి ఎంపిక కత్తిమీద సాములా మారింది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ తొలుత తాను బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపి.. ఆ తర్వాత బీజేపీలో చేరి బరిలో నిలిచారు.

 కాంగ్రెస్‌లో చేరిన కావ్యకు పోటీచేసే అవకాశం దక్కడంతో ఇక బీఆర్‌ఎస్‌ నుంచి హనుమకొండ జెడ్పీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.సు«దీర్‌కుమార్‌ను పోటీలోకి దింపారు. కాగా డాక్టర్‌ మారేపల్లి సు«దీర్‌కుమార్‌ ఆయుర్వేద వైద్యుడు కాగా, కడియం కావ్య సైతం వైద్యురాలే. బీఆర్‌ఎస్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఈ ముగ్గురు కూడా ఎంపీ ఎన్నికల బరిలో నిలవడం మొదటిసారి.  

ప్రభావితం చూపే అంశాలు  
» ఎంపీ సెగ్మెంట్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువ. వారి మొగ్గు ఎటువైపు ఉంటుందో.. 
» దళితుల ఓట్లూ కీలకమే
» నగర ఓటర్లు, విద్యావంతులూ ఎక్కువే
» బలమైన తెలంగాణవాదం

2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ఇలా..
» పసునూరి దయాకర్‌ (టీఆర్‌ఎస్‌) 6,12,498 
» దొమ్మాటి సాంబయ్య (కాంగ్రెస్‌) 2,62,200 
» చింతా సాంబమూర్తి (బీజేపీ) 83,777 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement