భూపాల్‌పల్లి, పరకాల, నర్సంపేట, జనగామ సెగ్మెంట్లలో మూడు పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ సాగుతోంది. అయినప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నర్సంపేట నుంచి బీజేపీ తరపున రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీచేస్తే పోటీ టఫ్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సింగరేణి కాలరీస్ ప్రాంతమైన భూపాలపల్లిలో గని కార్మికుల ఓట్లే కీలకం. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న భూపాలపల్లి నుంచి గత ఎన్నికలో గెలిచిన గండ్ర వెంకట్ రమణారెడ్డి కారెక్కేసారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఆ పార్టీ నేతలే చెక్ పెట్టి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గతంలో స్పీకర్ గా పని చేసిన మధుసూదనాచారి కుమారుడు, గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి గండ్ర జ్యోతి సైతం అక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇటీవల గవర్నర్ కోటాలో మధుసూదనాచారి ఎమ్మెల్సీ కావడంతో గండ్ర ప్యామిలీకి రూట్ క్లియర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే గండ్రపై ఉన్న మైనస్ గులాబీ పార్టీపైన ప్రభావం చూపుతుందని చర్చసాగుతుంది.
గత ఎన్నికలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసి ప్రధాన పార్టీలకు ఝలక్ ఇచ్చిన గండ్ర సత్యనారాయణ రావు ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఈసారి కాంగ్రెస్ టిక్కెట్ ఆయనకే లభించే అవకాశం ఉంది. ఆయనతో పాటు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు సైతం భూపాలపల్లి పై కన్ను వేసారు. కొండా దంపతులు సైతం భూపాలపల్లి టిక్కెట్ అడిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ గెలవడంతోపాటు ఇప్పుడు కూడా కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితులే ఉన్నాయి. గండ్ర సత్యనారాయణకే టిక్కెట్ వచ్చే ఛాన్స్ ఉండడంతో ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
బీజేపీ విషయానికి వస్తే చందుపట్ల కీర్తి రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కీర్తి రెడ్డికి బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపు ప్రభావం పొరుగునే ఉన్న భూపాలపల్లి మీద ఉంటుందని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు. పెరుగుతున్న పార్టీ బలం, కుటుంబ నేపథ్యంతో తప్పక విజయం సాధిస్తానని కీర్తిరెడ్డి ఆశిస్తున్నారు.
పరకాలలో అభ్యర్థుల ఎంపిక మీదనే పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడి నుండి టిఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చేసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తాననే ధీమాలో ధర్మారెడ్డి వున్నారు. అయితే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వరరావు లు కూడా టికెట్ రేసులో ఉన్నామని చెపుతున్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇటీవలే స్థానిక సంస్థల నుండి MLC గా ఎన్నిక అయ్యాడు. ఈయనకు కేటీఆర్, రాజ్యసభ సభ్యులు సంతోష్ రావులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉద్యమకాలం నుండి పార్టీలో పని చేస్తున్న నాగుర్ల వెంకటేశ్వర రావు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
పరకాల నుంచి కాంగ్రెస్ తరపున ఇనుగాల వెంకట్ రామి రెడ్డి, కొండ మురళి లేదా ఆయన కూతురు సుస్మిత టికెట్ రేసులో వున్నారు. ఈ నియోజకవర్గంలో కొండా కుటుంబం హావా కొనసాగుతోంది. క్యాడర్‌తో కొండా కుటుంబసభ్యులు ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇనుగాల వెంకట్రామిరెడ్డి ఆర్ధికంగా బలంగా ఉన్నప్పటికీ సరియైన క్యాడర్ లేకపోవడం మైనస్‌గా భావిస్తున్నారు. కొండా ఫామిలీ కనుక టికెట్ గట్టిగా అడిగితే కొండా మురళికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీని తట్టుకునే శక్తి కొండా ఫ్యామిలీకి మాత్రమే ఉంది. అధికార పార్టీ మీద వ్యతిరేకతే తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.
బీజేపీ నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన విజయచందర్ రెడ్డి ఈసారి కూడా రేసులో వుండే అవకాశం ఉంది. ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున కూడా పోటీ చేసే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. హుజురాబాద్‌కు ఆనుకునే పరకాల నియోజవర్గం ఉంటుంది. బీజేపీకి ఇక్కడ క్యాడర్ ఉన్నప్పటికీ సరియైన నాయకత్వం లేకపోవడం వల్లనే ఓడిపోతునట్టు ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈటల జమున కనుక పరకాల నుండి పోటీ చేస్తే గట్టి పోటీ వుండే అవకాశం ఉంటుంది.
నర్సంపేట నుండి టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఓడిపోవడంతో క్యాబినెట్ హోదా గల పౌరసరఫరాలశాఖ చైర్మన్‌గా నియమించారు. సుదర్శన్‌కు కేసీఆర్, కేటిఆర్ లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎమ్మెల్యే అయ్యాక కొన్ని పనులు చేసినప్పటికీ... ఆశించిన స్థాయిలో చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో అందుబాటులో ఉంటున్నప్పటికీ ప్రభుత్య వ్యతిరేకత పెద్దికి పెద్ద సవాలుగా మారే ఆవకాశం కూడా ఉంది.
కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా దొంతి మాధవరెడ్డికి 2014లో నర్సంపేట టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రధాన పార్టీలను మట్టి కరిపించాడు. వ్యక్తిగత ఇమేజ్ దొంతి మాధవ రెడ్డి సొంతం. నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న వారి వెన్నంటే ఉంటారు మాధవరెడ్డి. MLA గా ఉన్న , లేకున్నా ప్రజల మధ్యే వుంటారన్న టాక్ నియోజకవర్గంలో ఉంది. బీజేపీ తరపున నర్సంపేట నుండి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ నుండి గతంలో రెండు సార్లు MLA గా ఉన్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేవూరి బీజేపీలో చేరారు. మళ్ళీ నర్సంపేట నుండి పోటీ చేసేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. టిడిపిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో ఉన్న సంబంధాలతో కాంగ్రెస్ లోకి లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రేవూరి కాంగ్రెస్ లోకి వెల్తే గన్ షాట్ గా గెలుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
జనగామ నుండి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెరాస తరపున రెండోసారి ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. ముత్తిరెడ్డి మీద భూ కబ్జా ఆరోపణలు బాగా ఉన్నాయి. మంత్రి హరిష్ రావుతో కూడా ముత్తిరెడ్డికి సంబంధాలు సరిగ్గా లేదన్నది బహిరంగ రహస్యం. జిల్లాకు చెందిన ఎర్రబెల్లితో కూడా పైకి బాగానే ఉన్నా ఆయనంటే మాత్రం అస్సలు గిట్టదు. ముత్తిరెడ్డి మీద ఇన్ని ఆరోపణలు ఉన్న సీఎం కేసీఆర్‌కి మాత్రం ఆయన మీద సాఫ్ట్ కార్నర్ ఉందనేది నిజం. టీఆర్‌ఎస్ స్థాపించినప్పటినుంచీ ఆర్ధికంగా కొంతవరకు సహాయం చేస్తున్నారు. అందువల్ల ఎవరెన్ని చెప్పినా అధిష్టానం మాత్రం ముత్తిరెడ్డి వైపే మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య , మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టు ఆధిపత్య పోరు సాగుతోంది. పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గంలో ఉండరనే అపవాదు ఉంది. ఎంపీ కోమటిరెడ్డికి పొన్నాల లక్ష్మయ్యతో పొసగదు. అందుకే కొమ్మూరి ప్రతాపరెడ్డిని కోమటిరెడ్డి ప్రోత్సహిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరిలో..కె.వి.ఎల్.ఎన్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అరుట్ల దశమంత్ రెడ్డి జనగామ జిల్లా సాధన సమితి కన్వీనర్ గా ఉండి జిల్లా ఏర్పాటుకోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ ఏ పని అప్పగించినా..విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీంతో బీజేపీ తరపున అరుట్లకే టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment