బాబుకు ఆ ఛాన్సే లేకుండా చేసిన రేవంత్‌! | KSR Comment: Chandrababu lagging behind Revanth Investments | Sakshi
Sakshi News home page

అరరె.. బాబుకు ఆ అవకాశమే లేకుండా చేసిన రేవంత్‌!

Published Sat, Feb 1 2025 12:30 PM | Last Updated on Sat, Feb 1 2025 12:54 PM

KSR Comment: Chandrababu lagging behind Revanth Investments

ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ల రికార్డు ఉన్న చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు దావోస్‌కు వెళ్లివచ్చారు. ఇంకోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి దావోస్‌ వెళ్లి వచ్చారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ అనుభవం 15 నెలలు మాత్రమే. అయినా రేవంత్ తెలంగాణకు పెద్ద స్థాయిలో పెట్టుబడులు వచ్చేలా ఎలా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు? చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇది ఆసక్తికరమైన పరిశీలన. 

👉దావోస్ లో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించడం అతి పెద్ద విజయం: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 

👉దావోస్‌తోనే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

పైగా చంద్రబాబు, రేవంత్‌ రెడ్డిలను గురుశిష్యులుగా చూస్తూంటారు. ఈ విషయాన్ని రేవంత్ అంగీకరించకపోయినా జనం దృష్టిలో వారిది బాగా దగ్గరి అనుబంధమే. ఓటుకు నోటు కేసు తర్వాత అది మరింత బలపడిందని భావిస్తూంటారు. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పుడు కూడా చంద్రబాబుకు చెప్పే వెళ్లారు. తన తెలివితోపాటు కాలం కలిసి వచ్చి రేవంత్ తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే చంద్రబాబును మరోసారి అదృష్టం వరించి ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు ఓకే. ఇప్పుడు వీరిద్దరి మాటలలో ఎవరిది ప్రామాణికంగా తీసుకోవాలి అనేది ప్రశ్న. 

రేవంత్ చెప్పినదాని ప్రకారం 25 సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వాటిలో ఒక్క అమెజాన్ సంస్థే రూ.20 వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. అలాగే సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రూ.45 వేల కోట్లు వెచ్చించనున్నట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రకు వచ్చిన రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోల్చితే తెలంగాణకు వచ్చింది తక్కువే కావచ్చు. కాని అసలు ఒక్క రూపాయి పెట్టుబడి రాని ఏపీతో కనుక పోల్చుకుంటే తెలంగాణ బాగానే సాధించినట్లు ఒప్పుకోవాలి. అందుకే రేవంత్ ధైర్యంగా.. ‘‘ఇది మా ప్రభుత్వ విజయం’’ అని చెప్పుకోగలిగారు. చంద్రబాబు మాత్రం దావోస్‌ ఒక మిథ్య అంటూ వేదాంతం చెప్పారు. తెలిసేట్టు చెప్పేది సిద్దాంతం.. తెలియకపోతేనే వేదాంతం అని ఒక కవి వ్యాక్యం. చంద్రబాబు పద్దతికి ఇది సరిపోతుంది. 

తనకు అనుకూలంగా ఉంటే అంతా బ్రహ్మాండం అని చెబుతారు. తను విఫలం అయితే వేదాంతంతో మాట్లాడి అంతా మిథ్య అని అంటారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మామూలుగా అయితే రేవంత్ మండి పడాలి. కాని ఎంతైనా గురువు కదా! దానిపై నేరుగా స్పందించలేదు. కాకపోతే పెట్టుబడులే కాకుండా.. ప్రపంచం పోకడ తెలుసుకోవడానికి కూడా దావోస్‌ వెళతామని రేవంత్ అన్నారు. చంద్రబాబు చేసిన కామెంట్లను తీసుకుంటే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్నవి కూడా ఉత్తుత్తి అగ్రిమెంట్లుగా కనిపించాలి. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్‌ సదస్సుకు వెళ్లి సుమారు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకు వచ్చారు. అప్పుడు ఇదే తెలుగుదేశం దేశంలోని పారిశ్రామికవేత్తలతో అక్కడకు వెళ్లి పెట్టుబడులు తెచ్చామంటే సరిపోతుందా? అని ప్రశ్నించింది. ఈసారి చంద్రబాబు వెళ్లి ఆ మేరకైనా దేశీయ కంపెనీలతో కూడా అవగాహన కుదుర్చుకోలేకపోవడం పెద్ద వైఫల్యం. అందువల్లే రేవంత్ తమ ప్రగతిశీల విధానాల వల్లే పెట్టుబడులు వచ్చాయని గర్వంగా చెప్పుకున్నారు. అయితే.. చంద్రబాబుకు అలా చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. 

చంద్రబాబు,మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేష్‌లు కలిసి అభివృద్ది విధానాలు కాకుండా, రెడ్ బుక్ పాలసీని అమలు చేస్తుండడం, రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుండడంతో పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. దానికి తోడు ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పై తప్పుడు కేసు పెట్టడానికి ఒక మోసకారి నటిని ఉపయోగించుకున్న వైనం కూడా ఏపీకు అప్రతిష్ట తెచ్చిపెట్టింది. జిందాల్‌ను కూటమి ప్రభుత్వం తరిమేసిందని వార్తలు వచ్చాయి. ఆయన వెళ్లి మహారాష్ట్రలో రూ.మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. 

ఇటు.. తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టిన దాఖలాలు పెద్దగా లేవని చెప్పాలి. అయితే  తెలంగాణలో ఉండే మెఘా కంపెనీ రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి దావోస్‌లో ఒప్పందం అవడాన్ని బీఆర్‌ఎస్‌ ఎద్దేవా చేసింది. దానికి రేవంత్ సమాధానం ఇస్తూ పెట్టుబడులు వస్తుంటే బీఆర్‌ఎస్‌కు అక్కసని ధ్వజమెత్తారు. అమీర్‌పేట్‌లోనే ఒప్పందం చేసుకోవాలా? అని మండిపడ్డారు. రిలయన్స్ సంస్థ మహారాష్ట్ర ప్రభుత్వంతో దావోస్‌లో అగ్రిమెంట్ చేసుకుంటే ఎందుకు తప్పు పట్టడం లేదు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై అపోహలు సృష్టించే యత్నం చేశారని, ఆర్థిక మూలాలు దెబ్బతీసే కుట్రలు జరిగాయని రేవంత్ అన్నారు. ఈ-ఫార్ములా రేస్ ద్వారా విదేశాలకు డబ్బులు తరలించారని ఆయన బీఆర్‌ఎస్‌పై ఆరోపించారు. 

నిజానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ.. ఇలాంటి ఆరోపణలవల్లే  దెబ్బతింటుందని  రేవంత్ గుర్తించాలి. అచ్చం చంద్రబాబు భాషలో కాకుండా రాష్ట్రానికి, కాంగ్రెస్‌కు ఉపయోగపడేలా మాట్లాడితే బాగుంటుంది. చంద్రబాబు అక్కడ పెట్టుబడులకు అవకాశం ఉన్న విశాఖ, రాయలసీమ ప్రాంతాలను పక్కనబెట్టి మూడు పంటలు పండే, వరద ముంపు అవకాశం ఉన్న భూములలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఇందు కోసం వేల కోట్ల వ్యయం చేస్తున్నారు. దాని వల్ల కూడా ఏపీకి నష్టం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఆచరణాత్మకంగా వ్యవహరించకుండా ఎంతసేపు ఏపీ పేద రాష్ట్రం అయిపోయిందని, ఐదేళ్లుగా ఏదో జరిగిపోయిందని అంతర్జాతీయంగా కూడా అసత్యాలు ప్రచారం చేస్తే పెట్టుబడిదారులు ఎందుకు ముందుకు వస్తారన్నది చాలా మంది ప్రశ్నగా ఉంది.  

ఇక.. ఏపీలో స్థానిక కంపెనీలు కూడా ఎవరూ పెట్టుబడుల ఎంఓయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమే. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒక రియల్  ఎస్టేట్‌ సంస్థ దావోస్ వెళ్లి లోకేష్‌ను కలిసి ఏపీలో గోల్ఫ్ సిటీ పెడతామని చెప్పిందని వార్తలు వచ్చాయి. అది కూడా కార్యరూపం దాల్చినట్లు కనిపించ లేదు.  చంద్రబాబు, లోకేష్‌ల దావోస్‌ పర్యటనకు ముందు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వెళుతున్నారని వార్తలు రాసిన ఎల్లో జాకీ మీడియా, టూర్ ముగిశాక పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్ వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వెళ్లారని మాట మార్చేసింది. పైగా ఏపీ బ్రాండ్ అంటూ కహానీలు  ప్రచారం చేసింది. 

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతుంటారు. కాని ఆయన  కూడా ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్ నెలకొల్పడానికి హామీ ఇవ్వలేదట. పదేళ్ల క్రితమే చంద్రబాబు దాని గురించి మాట్లాడినా ఫలితం దక్కలేదు. చంద్రబాబు 1995 నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత పలుమార్లు దావోస్‌వెళ్లి వచ్చారు. ఆ సందర్భాలలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని చెప్పేవారు. కాని ఈసారి పెట్టుబడి రాకపోవడంతో అదంతా ‘మిథ్య’ అని అన్నారు. 

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక విషయం చెప్పారు. మహారాష్ట్రకు ముంబై ఉండవచ్చు. కాని ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అన్నారట. మరి చంద్రబాబును చూసి పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఫడ్నవీస్ రూ.15 లక్షల కోట్ల  పెట్టుబడులు ఎలా తీసుకు వెళ్లగలిగారు? ఏది ఏమైనా చంద్రబాబువి కబుర్లు అయితే.. ఫడ్నవీస్, రేవంత్ లు పెట్టుబడులు తెచ్చుకున్నారన్నమాట. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు ఇతర రాష్ట్రాలు పెట్టుబడులు తెచ్చుకున్నా, దావోస్‌ వెళితే పరిశ్రమలు వస్తాయనుకోవడం మిథ్య అని చంద్రబాబు చెప్పుకుని తనను తాను మోసం చేసుకుంటూ.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారా?.

::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement