నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా! | KSR Comment: CBN And Son Lokesh Davos Troubles Continue | Sakshi
Sakshi News home page

నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా!

Jan 28 2025 12:06 PM | Updated on Jan 28 2025 12:42 PM

KSR Comment: CBN And Son Lokesh Davos Troubles Continue

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌ల దావోస్ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులేవీ తేకపోయినప్పటికీ ఒక రకంగా ఉపయోగపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతటి ముఖ్యమైన కార్యక్రమాలనూ రాజకీయాలకు వేదికగా చేసుకోవచ్చునని, తమకు కావాల్సిన విధంగా ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చునని టీడీపీ ప్రభుత్వం నిరూపించింది. ఖాళీ చేతులతో తిరిగి వచ్చినా, ఏపీ బ్రాండ్ అంటూ కొత్త డైలాగుతో మీడియా మేనేజ్మెంట్‌లో తమకు తామే సాటి అని చెప్పుకోవడం హైలైట్‌!. 

దావోస్‌లో చంద్రబాబు, లోకేష్‌లు చాలా కష్టపడ్డారని మీడియాలో కథనాలు  వచ్చాయి. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ మాత్రం లోకేషే భావి ముఖ్యమంత్రి అని పొగడటంలో బిజీ అయిపోయారు. ఏపీలో లోకేష్‌లాగా చదువుకున్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారా అని అడగడం ఒక హైలైట్‌ అయితే.. ఆ మిషతో భావి ఉప ముఖ్యమంత్రి ఆయనే అని జనసేన అధినేత పవన్‌కు సిగ్నల్స్‌ ఇవ్వడం ఇంకో హైలైట్‌. అయితే దావోస్‌ పర్యటనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లో మీడియా ఇచ్చిన కవరేజీ బహుశా బాబు, లోకేష్‌లను ఇరకాటంలో పెట్టేసి ఉంటాయి. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి రావడమే తరువాయి అన్నట్టుగా సాగింది ఈ మీడియా బ్యాండ్‌ బాజా. తీరా పర్యటన ముగిసిన తరువాత చూస్తే.. సున్నకు సున్నా.. హళ్లికి హళ్లి!! 

ప్రతిపక్షంలో ఉండగా పవన్.. 'దావోస్ వెళ్లి సాధించే పెట్టుబడులు ఏముంటాయి? సూటు,బూటు వేసుకువెళ్లి హడావుడి చేయడం తప్ప.రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటే పారిశ్రామికవేత్తలే ఏపీకి వస్తారు’ అని చెప్పినట్లే.. ఇప్పుడు రెడ్‌బుక్‌ రాజ్యాంగం పుణ్యమా అని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అనుకోవాలి.  మహారాష్ట్రకు రూ. 15 లక్షల కోట్లు, తెలంగాణకు రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరడమేమిటి.. ఏపీకి ఒక్కటంటే ఒక్క ఎంఓయూ కూడా కుదరక పోవడం ఏమిటి? కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి బాబు, లోకేష్‌లు సాధించింది ఏమిటీ అంటే.. ‘‘ఏపీ బ్రాండ్‌’’ను ప్రచారం చేసి వచ్చారట! మరి.. చంద్రబాబు గతంలోనూ చాలాసార్లు దావోస్‌ వెళ్లివచ్చారే? అప్పట్లో ఏపీకి బ్రాండ్‌ ఇమేజీ రానట్టేనా? పైగా అప్పట్లో దావోస్‌ వెళ్లిన ప్రతిసారి అదిగో పెట్టుబడులు.. ఇదిగో ఇన్వెస్ట్‌మెంట్లు అని ఎల్లోమీడియా భలే బాకాలూదేదే? బాబు స్వయంగా తనను చూసి బోలెడన్ని కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని చెప్పుకుంటూ ఉంటారు కదా? ఈసారి ఏమైంది? విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించినప్పుడు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరిగింది. అయితే.. 

వీటిల్లో అధికమొత్తం బోగస్‌ ఒప్పందాలన్న విమర్శ వచ్చింది. దారిన పోయేవారిని కూడా కంపెనీ సీఈవోలుగా ముస్తాబు చేసి ఫొటోలు దిగారు అని ససాక్ష్యంగా నిరూపితమైంది. ఇప్పుడు ఆ డ్రామా కూడా ఆడలేకపోయారు. చంద్రబాబు, లోకేష్‌లు కంపెనీలతో చర్చలు జరిపారని వార్తలొచ్చాయి. మంచిదే. కానీ అక్కడ కూడా వైసీపీ ప్రభుత్వం గురించి, గత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసి కంపెనీల్లో అనుమానాలు రేకెత్తించారా? ఈ అనుమానం ఎందుకొస్తుందంటే.. జగన్‌ మళ్లీ వస్తాడేమో అని పెట్టుబడిదారులు భయపడుతున్నట్లు లోకేష్‌ చాలాసార్లు వ్యాఖ్యానించారు మరి!. అలాగే ‘జగన్‌ రాడు’ అని బాండ్ రాసి ఇమ్మంటున్నారని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు కూడా అదే రీతిలో మాట్లాడుతుంటారు. పారిశ్రామికవేత్తలు  ఆ బాండ్లను నమ్మలేదా? జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వాళ్లు నమ్మారని అనుకోవాలా?.. 

ఇదీ చదవండి: దావోస్‌ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య

మూడేళ్ల క్రితం జగన్ దావోస్‌ వెళ్లినప్పుడు రూ.1.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ఈ పారిశ్రామికవేత్తలే. విశాఖలో సదస్సు పెడితే అంబానీ, అదాని వంటివారూ వచ్చి జగన్‌ను  అభినందించి వెళ్లారే? ఆ తరువాత అదానీ పెద్ద ఎత్తున సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో విద్యుత్ ఉత్తత్తి ప్లాంట్‌ల ఏర్పాటుకు సిద్ధమయ్యారే? కూటమి అధికారంలోకి వచ్చాక అదానీ సిబ్బంది పై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే మనుషులు కడప జిల్లాలో దాడులు చేశారే? ఆ విషయం ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయేందేమో!. 

ఇక లోకేష్ రెడ్ బుక్ ఉండనే ఉంది. ఏపీలో కూటమి అదికారంలోకి వచ్చింది మొదలు టీడీపీ వారు వైసీపీ వారిపై చేసిన దాడులు, హింసాకాండ, అరాచకాల సమాచారం కూడా వారికి అందిందేమో! ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్  ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి జగన్ టైమ్ లో ముందుకు వచ్చారు. కాని కూటమి అధికారంలోకి రావడంతోనే ఎవరో మోసకారి నటిని పట్టుకొచ్చి ఏపీలో పోలీసు అధికారులపైనే కాకుండా, జిందాల్ పై కూడా కేసుపెట్టి అరెస్టు చేసే ఆలోచనవరకు వెళ్లారే..సహజంగానే ఒక పారిశ్రామికవేత్తను ఒక రాష్ట్ర  ప్రభుత్వం ఇంతగా హింసించే ప్రయత్నం చేస్తుంటే ఆ విషయం ఇతర పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా?. అందువల్లే పైకి కబుర్లు చెప్పినా, పెట్టుబడి కింద వందల, వేల కోట్లు వ్యయం చేయడానికి ఏపీకి రావడానికి భయపడ్డారేమో! దాని ఫలితంగానే ఏపీకి జిందాల్ గుడ్ బై చెప్పి మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. 

జిందాల్‌ను ఇబ్బందిపెట్టకపోయి ఉంటే ఆయన ఇక్కడ కొన్ని  వేల కోట్లు అయినా పెట్టుబడి పెట్టడానికి సిద్దమై ఉండేవారేమో కదా? ఆ రకంగా ఏపీకి పెట్టుబడి రాకుండా ఒక పారిశ్రామికవేత్తను తరిమేశారన్న అపఖ్యాతిని చంద్రబాబు, లోకేష్‌లు మూటకట్టుకున్నట్లయింది కదా! ఎల్లో మీడియా ఇప్పటికి జగన్ పై తప్పుడు రాతలు రాస్తుంటుంది. ఆయన టైమ్‌లో పరిశ్రమలను తరిమేశారని పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేశాయి. కాని ఫలానా పరిశ్రమ  వెళ్లిపోయిందని మాత్రం చెప్పలేదు. కేవలం వదంతులు సృష్టించి ప్రజలలో అనుమానాలు రేకిత్తించడంలో టీడీపీతో పాటు ఎల్లో మీడియా బాగా కృషి చేసింది. 

ఇదీ చదవండి: దావోస్‌లో ఒప్పందాలు చేసుకోరు.. చర్చిస్తారు

దావోస్‌లో యూరప్ లోని టీడీపీ అభిమానులుగా ఉన్న ఏపీ ప్రవాసులతో సమావేశం అయి కూడా రెడ్ బుక్, అందులో రాసుకున్నవారిని వదలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ స్వయంగా చెప్పినట్లు వీడియోలు వచ్చాయి కదా!. కక్ష సాధింపు లేదంటూనే  ఈ మాట చెప్పాక, ఎవరైనా పరిశ్రమలవారు భయపడకుండా ముందుకు వస్తారా? పోనీ వచ్చిన తెలుగువారిలో ఎవరైనా పరిశ్రమలు పెడతామని ఎందుకు ఆసక్తి చూపలేదు? అమరావతి  ప్రపంచం అంతా ఆకర్షితమవుతోందని చెబుతారు కదా. అక్కడ కూడా ఏమైనా  పెట్టుబడులు పెడతామని ఎవరూ చెప్పలేదే?. 

ఇప్పుడేమో దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయని అనడం మిథ్య అని బాబు కొత్త సిద్ధాంతం చెబుతున్నారు. అంతకాడికి కోట్ల రూపాయలు ప్రజాధనం వెచ్చించి వెళ్లడం ఎందుకు! అక్కడేదో అద్భుతం జరగబోతోందని బిల్డప్ ఎందుకు ఇచ్చుకున్నట్లు? ఎవరూ ఎంవోయూలు కుదుర్చుకోవడానికి ముందుకు రాకపోవడంతో ఏపీ పరువును అంతర్జాతీయంగా నడిబజారులో తీసేసినట్లు కాలేదా! చంద్రబాబు మాటలు ఎప్పటికీ మిథ్య అన్నది మరోసారి తేలినట్లే కదా!!!. 

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
 
Advertisement
Advertisement