అసలు ఇంతకీ తప్పు ఎవరిది? | KSR Comment On How Telangana AP CMs Use Bureaucracy, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

అసలు ఇంతకీ తప్పు ఎవరిది?

Published Fri, Feb 21 2025 11:10 AM | Last Updated on Fri, Feb 21 2025 11:28 AM

KSR Comment On How Telangana AP CMs Use bureaucracy

ఐఏఎస్‌, ఐపీఎస్‌, అఖిలభారత సర్వీసు అధికారుల తీరుతెన్నులపై తెలంగాణ ముఖ్యమంత్రి ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు. అధికారులు తమతో తప్పులు చేయించరాదని, నిస్పక్షపాతంగా ఉండాలని రేవంత్‌ రెడ్డి అనడం ఆహ్వానించదగ్గ పరిణామం. యాదృచ్ఛికమైన అంశం ఇంకోటి ఉందిక్కడ. రేవంత్‌రెడ్డికి రాజకీయ గురువుగా భావించే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి ఈ విషయంలో పూర్తి వ్యతిరేకం!. రెడ్‌బుక్‌ పేరుతో ఇప్పటికే ఏపీలో అరాచకం సృష్టిస్తున్న ఆయన తమది రాజకీయ పాలనేనని మొహమాటం లేకుండా పచ్చిగా... బహిరంగంగానే మాట్లాడుతుంటారు. 

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ  రాసిన పుస్తకావిష్కరణ సభలో రేవంత్ అఖిలభారత సర్వీసు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజకీయ నేతలు ఒక తప్పు చేయాలంటే.. అధికారులు మూడు తప్పులు చేద్దామంటున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా రాజకీయ నేతలు అధికారులతో తప్పులు చేయిస్తున్నారని చెప్పకనే చెప్పినట్లయింది. ఆ పాయింట్ ఆధారంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తదితరులు విమర్శలు చేశారు. విత్తు ముందా? చెట్టు ముందా? అన్నట్లు  నేతల కారణంగా అధికారులు తప్పులు చేస్తున్నారా? లేక అధికారులు నేతలతో తప్పులు చేయిస్తున్నారా? చర్చనీయాంశం. 

నిజానికి ఇది రెండువైపుల నుంచి జరుగుతున్న తప్పే. రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చేంత వరకూ ఒకలా.. ఆ తరువాత అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇంకోలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శ ఉంది. ఎన్నికల్లో గెలుపునకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి.. అధికారం దక్కితే పెట్టిన ఖర్చును ఎలాగోలా చక్రవడ్డీలతో రాబట్టుకోవాలని నేతలు యత్నిస్తూంటారు. ఈ క్రమంలో అధికారులు తమ మాట వినేలా చేసుకునేందుకు నేతలు అన్ని పన్నాగాలు పన్నుతూంటారు. చెప్పినట్లు వినని అధికారిని శంకరగిరి మాన్యాలు పట్టించేందుకూ వెనుకాడరు. 

ఇదిలా ఉంటే ఇంకోవైపు కొందరు అధికారులు ముఖ్యమంత్రిని తెగ పొగుడుతూంటే.. కొందరు మంత్రులతో గిల్లికజ్జాలకు దిగుతుంటారు. ముఖ్యమంత్రి, మంత్రి ఎవరైనా సమర్థులైన అధికారులను విసృ‍్తత ప్రజా ప్రయోజనాల కోసం వాడుకోగలుగుతున్నారా? అంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. రాజకీయ నేతల్లో మాదిరిగానే అధికార యంత్రాంగంలోనూ రాజకీయాలు, వర్గాలు ఉన్నాయన్నది నిజం. ఉత్తరాది, దక్షిణాది, కులం, ఒకే రాష్ట్రంలోని ప్రాంతం వంటి అంశాల ఆధారంగా అధికారులు ఒకరినొకరు విభేదించుకున్న సందర్భాలు బోలెడు. 

అఖిలభారత సర్వీసు అధికారులంటే పదవుల్లో ఉన్నవారు చాలా గౌరవం ఇచ్చేవారు. అధికారులు కూడా ప్రజలకు సేవ చేయాలన్న తలంపుతో వచ్చిన వారే ఎక్కువగా ఉండేవారు. కాని రాను, రాను నేతల్లో, అధికారుల్లోనూ మార్పు వచ్చింది. జనాన్ని నేతలు కరప్ట్ చేస్తున్నారా? లేక జనమే నేతలు కరప్ట్ అయ్యేలా చేస్తున్నారా? అంటే సమాధానం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దురదృష్టవశాత్తు అధికారులతోపాటు న్యాయ వ్యవస్థలోనూ సమాజంలోని అన్ని అవలక్షణాలు వచ్చి చేరుతూందన్న బాధ చాలామందిలో ఉంది. అది వేరే విషయం. ఒకప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిబంధనల ప్రకారమే నిర్ణయాలు చేయాలని చెప్పేవారు. 

కానీ ఆ తర్వాత కాలంలో ప్రజల ఆకాంక్షలలో మార్పులు రావడం వల్ల ,వారిలో స్వార్ధచింతన పెరగడం వల్ల నిబంధనలు ఎలా ఉన్నాయన్నది ముఖ్యంకాదు.. అవసరమైతే వాటిని మార్చండి.. మేము చెప్పే పనులు చేయండి అని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. దాంతో అధికారుల్లోనూ మార్పులు వచ్చాయి. పలువురు అధికారులు తమ సంగతేమిటి? అనే ఆలోచనకు వస్తున్నారు. ఉమ్మడి ఏపీలో కొందరు ముఖ్యమంత్రుల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి. 

ఒకప్పుడు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే సీనియర్ అధికారుల సంఖ్య  పరిమితంగా ఉండేది. కానీ రాను, రాను సీఎం ఆఫీసులోనే అధికారం కేంద్రీకృతమవుతోంది. దాంతో తమకు కావల్సిన అధికారులనే వీరు నియమించుకుంటున్నారు. ఎస్‌వీ ప్రసాద్ వంటి అధికారులు కొద్ది మంది మాత్రం పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్న దానితో సంబంధం లేకుండా పలువురు సీఎంల వద్ద కీలకమైన బాధ్యతలలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి మారితే ఆయన పేషీలోని అధికారులు, సీఎస్‌ పోస్టులో ఉన్నవారు సైతం తిరిగి పోస్టు కోసం ఇబ్బంది పడవలసి వస్తోంది. ఆ విషయంలో రేవంత్ ప్రభుత్వం కొంత బెటర్ అని చెప్పాలి. కేసీఆర్‌ ప్రభుత్వంలో ఉన్న సీఎస్‌ శాంతికుమారినే కొనసాగించారు. కానీ.. 

ఏపీలో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి జగన్ వద్ద పనిచేసిన అధికారులను చంద్రబాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి వంటి సీనియర్ అధికారుల పట్ల కూడా అవమానకర తీరులో వ్యవహరించింది. అంతెందుకు! రేవంత్ ఐసీఎస్‌లకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధించారన్న ఆరోపణ ఒక్కటి లేదు. కానీ చంద్రబాబు గత హయాంలో జరిగిన స్కామ్‌లపై విచారించారన్న కారణంగా కొందరు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఇలా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని కులపరంగా కూడా చీల్చే  యత్నం కనిపించదు. ఏపీలో మాత్రం కులం ఆధారంగా పోస్టింగ్‌లు, పార్టీ ఆధారంగా నియామకాలు జరుగుతున్న తీరు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఒకరు ఒక కుల సమావేశంలో పాల్గొని గత ముఖ్యమంత్రి జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి ఆ కులం వారంతా పనిచేయాలని పిలుపు ఇచ్చారు. అలాంటి అధికారికి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు పెద్ద పీట వేసి ఒక పెద్ద పదవి కూడా ఇచ్చేశారు. దీనిని బట్టే ఆ ప్రభుత్వ వ్యవహార శైలి అర్థమవుతుంది. ఆ అధికారి తన సర్వీసులో ఏ రకంగా వ్యవహరించింది చెప్పకనే చెబుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేష్‌ల ప్రభుత్వం రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలకు  పాల్పడుతుంటే ఐపీఎస్‌ అధికారులు వారికి మద్దతు ఇస్తున్నారు. కేసులు పెట్డడంలోనూ వివక్ష చూపుతున్నారు. చివరికి కొందరు ఐపీఎస్‌లే ముందస్తు బెయిల్ తెచ్చుకోవలసి వచ్చింది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై  తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏపీతో పోల్చితే తెలంగాణలో ఈ గొడవ తక్కువ. 

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  అధికారులకు స్వేచ్చ ఉండేది. వారు తమ అభిప్రాయాలు చెబితే వాటిని విని అవసరమైతే నిర్ణయాలలో మార్పు చేసుకునే వారు. ఒకవేళ అధికారులతో విభేధిస్తే, ‘‘మీరు మీ అభిప్రాయాలు రాయండి.. దానిపై నా అభిప్రాయం నేను రాస్తాను..’’ అని చెప్పేవారట. తద్వారా అధికారులకు ఇబ్బంది లేకుండా చూసేవారని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. 

అయినప్పటికీ కాంగ్రెస్, టీడీపీలు కలిసి వైఎస్ కుమారుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించే ప్రక్రియలో భాగంగా కొంతమంది ఐఎఎస్ అధికారులను  కూడా ఇరికించారు. ఉదాహరణకు బీపీ ఆచార్య అనే ఐఏఎస్‌ అధికారి ప్రస్తుతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాన్ని అభివృద్ది చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జగన్ కేసులో ఇరికించి జైలులో పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల విషయంలో అధికార యంత్రాంగం తలొగ్గక తప్పలేదని అంటారు. దాని ఫలితంగా ఇప్పుడు ఆ ప్రాజెక్టు పై ఏర్పడిన  విచారణ కమిషన్ ను ఎదుర్కోవలసి వస్తోంది.

ఇదే టైమ్‌లో ఇంకో సంగతి చెప్పాలి. కొంతమంది అధికారులు తమ తరపున ఏజెంట్లను  పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడుతుంటారన్న ఆరోపణలు  కూడా వినిపిస్తుంటాయి. అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనకు వెళ్లడం లేదని రేవంత్ అంటున్నారు. అది రాజకీయ నేతలకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ సమస్య ఏమిటంటే నిధుల వినియోగంలో ఉండే ప్రాధాన్యత క్రమాలు కూడా ముఖ్యం అని భావించాలి. డబ్బులు లేకుండా జనంలోకి వెళ్ళినా వారితో తిట్లు  తినడం తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. 

ఉదాహరణకు.. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు  ఇచ్చింది. వాటిని అమలు చేసే  బాధ్యత అధికారులు ఏ రకంగా తీసుకోగలుగుతారు?. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్య అధికారులు ఇన్నోవేటివ్ ఆలోచనలు చేయాలని పదే,పదే చెబుతున్నారు. ఆ ఇన్నోవేటివ్ పద్దతి ఏమిటో చెప్పకుండా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అని కొందరు వ్యాఖ్యానించారు.పైగా చంద్రబాబు ఈ మధ్య ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదు. గంటల తరబడి సమీక్షలు పెట్టడం వల్ల అధికారులకు విసుగు వస్తోందని ఆయన అనుకూల మీడియానే పేర్కొందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

జగన్ టైంలో స్పందన కార్యక్రమం పెట్టి అనేక ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించారు. అలాగే వలంటీర్లు, గ్రామ, వార్డు  సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య క్లినిక్‌.. ఇలాంటి కొత్త వ్యవస్థలు తీసుకు వస్తే వాటిని విధ్వంసం చేసే పనిలో చంద్రబాబు సర్కార్ ఉంది. మరి ఆ వ్యవస్థలను తీసుకురావడం కోసం పనిచేసిన అధికారులది తప్పవుతుందా? లేక ఇప్పుడు విధ్వంసంలో భాగస్వాములవుతున్న అధికారులది తప్పు అవుతుందా?. ఏది ఏమైనా నిబద్దత కలిగిన అధికారులకు ప్రోత్సాహం ఉంటుందని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని ముందుగా రాజకీయ నేతలలో ఆ నిబద్దత ఉంటే  ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం కూడా చాలా వరకు సర్దుకుంటుందని చెప్పాలి.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement