
ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సర్దుకోవడానికి రెండేళ్లు పడుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య.. ఆయనకు పెద్దగా ఉపకరించేదిగా కనిపించడం లేదు. పైగా ఈ వ్యాఖ్యల సందర్భంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుళ్ల పాలన గురించి అనవసరంగా ప్రస్తావించారు. అయితే అప్పటికి, ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా ఉన్న విషయాన్ని ఆయన గుర్తించి ఉండాల్సింది.
బీఆర్‌ఎస్ పాలనను(BRS Party Rule) తుప్పుతో వర్ణించిన రేవంత్ వదిలిచేందుకు పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. కానీ గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దేందుకు రెండేళ్లు పడుతుందని, వైఎస్సార్, చంద్రబాబుల పాలనల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే రేవంత్ చంద్రబాబుకు సన్నిహితుడన్న ముద్ర కలిగి ఉండటం. కాబట్టి ఆయన ఒక్కరి పేరు ఎందుకు ప్రస్తావించాలని అనుకుని వైఎస్సార్ పేరును కలిపారా? అనే ప్రశ్న తలెత్తకమానదు.
👉చంద్రబాబు నాయుడు 1994లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి. ఆ తరువాత ఎన్టీఆర్‌ను కూలదోసి సీఎం అయ్యారు. 2004 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంటే చంద్రబాబు పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి వైఎస్‌కు రెండేళ్లు పట్టిందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చెప్పదలిచారా?. చంద్రబాబు పాలన అంత అధ్వాన్నంగా ఉందని బహిరంగంగా చెప్పడానికి ఆయన ఇష్టపడతారా?. ముఖ్యమంత్రలు తమ అధికార అవధిలో కొన్ని కొన్ని విధానాలు పాటించడం సహజం. కానీ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనో, లేక మరో రకంగానో వైఎస్ పాలన సాగలేదు.
వైఎస్ అధికారం దక్కిన వెంటనే చంద్రబాబు పట్టించుకోని జలయజ్ఞం పనులు చేపటారు. హైదరాబాద్‌లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌తోసహా పలు అభివృద్ది పనులు చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు అందులో అత్యంత కీలకమైంది. అంతేతప్ప చంద్రబాబు ప్రభుత్వ తీరుతెన్నులపై మాట్లాడుతూ కూర్చోలేదు. చంద్రబాబు నాయుడు రైతులకు ఉచిత విద్యుత్ సాధ్యపడదని తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేవారు. రాజశేఖరరెడ్డి మాత్రం సీఎం అయిన వెంటనే అమలు చేసి చూపించారు.
👉గత ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వ్యవస్థ ఎటూ టేకప్ చేస్తుంటుంది. అది వేరే విషయం. వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekar Reddy) టైమ్‌లో కాంగ్రెస్ ఆచరణ సాధ్యం అయ్యే హామీలనే ఎక్కువగా ఇచ్చింది. దాని వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది రాలేదు. ప్రజలు ఆయన నాయకత్వాన్ని విశ్వసించారు. దానివల్లే 2009లో కూడా ఆయన మళ్లీ అధికారంలోకి రాగలిగారు. అయితే ఆయన అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తదుపరి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు ముఖ్యమంత్రులయ్యారు. వీరెప్పుడూ వైఎస్ పాలనను తప్పు పట్టలేదు. ఈలోగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయడం, దాని వల్ల ఎదురైన పరిణామాలు ప్రధానంగా రాజకీయాలను ఆక్రమించాయి. 2014లో విభజన జరిగిపోయింది. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రయ్యారు. విభజిత ఏపీకి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
👉కాంగ్రెస్ పార్టీ(Congress Party) రాష్ట్రాన్ని నాశనం చేసిందని చంద్రబాబు అప్పట్లో అనేవారు. కేసీఆర్ కూడా అరవై ఏళ్ల సమైక్య పాలనలో లోపాలు అంటూ ఎత్తి చూపుతుండేవారు. వీరిద్దరూ ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చారు. వాటిలో ఎక్కువ వాటిని అమలు చేయడానికి కేసీఆర్ ప్రయత్నించారు. అందువల్ల ఆయన రెండోసారి పెద్దగా ఇబ్బంది లేకుండా గెలవగలిగారు. ఏపీలో చంద్రబాబు ఆకాశమే హద్దుగా వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో ఆయన రెండేళ్లు ఏమిఖర్మ.. ఐదేళ్లపాటు అదే పాట పాడేవారు. నవ నిర్మాణ దీక్ష అంటూ కాంగ్రెస్‌ను తిట్టడానికి ఒక కార్యక్రమం నిర్వహించేవారు. ఇంతలో ఓటుకు నోటు కేసు రావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ వదలి హుటాహుటిన విజయవాడకు వెళ్లిపోయారు. అది అప్పటి కథ.
చంద్రబాబు హామీలు నెరవేర్చక పోవడంవల్ల ప్రజలలో అసంతృప్తి ఏర్పడి టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎప్పుడైనా ఒకటి, రెండు సందర్భాలలో గత ప్రభుత్వం అంటూ మాట్లాడారేమో కాని, ఎక్కువ భాగం తను ఇచ్చిన హామీలు, వాటి అమలుకు తీసుకోవల్సిన చర్యలపైనే దృష్టిపెట్టారు. తద్వారా ఆరు నెలలలోనే అనేక కొత్త వ్యవస్థలను సృష్టించారు. వాగ్దానాలు అమలుకు రెండేళ్లు తీసుకోలేదు. మధ్యలో రెండేళ్లపాటు కరోనా సంక్షోభం వచ్చినా జగన్ ఏపీని నిలబెట్టారు. కేసీఆర్ మిషన్ భగీరథ, కాళేశ్వరం తదితర భారీ ప్రాజెక్టులకు రెండో టర్మ్‌లో పూర్తి చేశారు. హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది పనులు చేశారు. ఈ ప్రభుత్వాలలో ఏవైనా లోపాలు ఉంటే ఉండవచ్చు. కాని వాటిని సరిదిద్దడానికి రెండేళ్లు పడుతుందని రేవంత్ అనడంలో ఆంతర్యం ఏమిటో తెలియదు.
కేసీఆర్ రెండో టర్మ్ కూడా గెలిచి 2023లో ఓటమి చెందారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చింది. వాటిలో కొన్నిటిని ఏడాది లోపు అమలు చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. రైతుల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్, రైతు బంధు, గ్యాస్ సిలిండర్లు, గృహజ్యోతి వంటివి పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతమేర అమలు చేసే యత్నం చేశారు.. ఇంకా అనేకం పెండింగులో ఉన్నాయి. ఉదాహరణకు మహిళలకు ఏడాదికి రూ.2500, స్కూటీల పంపిణీ, పెన్షన్‌ను రూ.నాలుగు వేలు చేయడం, దళితులకు రూ.పది లక్షల స్కీమ్ మదలైనవి ఉన్నాయి. వీటిని అమలు చేయడానికి నిధులు అవసరం. మరీ ఎక్కువగా హమీలు ఇచ్చామని చెప్పకుండా గత ప్రభుత్వం చేసిన తుప్పు వదలించుకోవడానికి పదేళ్లు పడుతుందని చెప్పడం ద్వారా సమస్యను డైవర్ట్ చేయడం ఒక లక్ష్యం అయితే, మరో టర్మ్ కూడా తనను ఎన్నుకోవాలని చెప్పడం మరో లక్ష్యంగా కనిపిస్తుంంది.
👉2024లో ఎన్నికైన చంద్రబాబు కూడా నిత్యం జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతుండడం చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అని చెబితే, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సూపర్ సిక్స్(Super Six Promises) అంటూ ఊదరగొట్టింది. వాటిని అమలు చేయకుండా ఏవేవో కథలు చెబుతూ, జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను వాస్తవాల నుంచి మళ్లించాలని చంద్రబాబు ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని రేవంత్ చెప్పడం లేదు. ఇందులో చంద్రబాబు కూడా కష్టపడుతున్నారని చెప్పదలిచారో, లేక రెండు రాష్ట్రాలలో ఇబ్బందులు ఉన్నాయని ప్రచారం చేయదలిచారో తెలియదు.
పరిపాలనపై పట్టు రావడానికి ఇంకా సమయం కావాలని రేవంత్ చెబుతున్నారు. పదిహేను నెలల పాలన తర్వాత ఆయన ఆ మాట అనడం ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్లే అవుతుంది. అసలు సమస్య పాలనపై పట్టు కాదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు అమలు కాకపోవడం, నిధులు లేకపోవడం , ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ప్రజలలో వ్యతిరేకత వస్తున్నదేమోనన్న భయం వెంటాడుతున్నట్లుగా ఉంది. ఏపీలో సైతం చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన వాగ్దానాలకు ఎగనామం పెడుతూ, వాటిని కప్పిపుచ్చడానికి రెడ్ బుక్ అంటూ అరాచకాలు సృష్టించడానికి, గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విద్వంసకర పాత్ర పోషిస్తోంది. హామీల అమలు యత్నంలో చంద్రబాబు కన్నా రేవంత్ కాస్త బెటర్. కానీ ఇద్దరూ గతం తవ్వుతూ కొత్త కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగానే ఉంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment