
ఫైల్‌ఫోటో
విజయవాడ: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గట్టి షాక్ తగిలింది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన పాకలపాటు రఘువర్మ ఓడిపోయారు. రఘువర్మపై పీఆర్టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపొందారు. అయితే తమ అభ్యర్థి ఓడిపోగానే టీడీపీ యూటర్న్ తీసుకుంది. అసలు తాము అక్కడ అభ్యర్థినే పెట్టలేదంటూ కొత్త పల్లవి అందుకుంది. ఇక శ్రీనివాసుల నాయుడు గెలుపును కూటమి ఖాతాలో వేసుకునే యత్నం చేస్తోంది టీడీపీ. తమ మద్దతుతోనే శ్రీనివాసుల నాయుడు గెలిచాడని మంత్రి అచ్చెన్నాయుడు వింత ప్రకటన చేశారు.
ఓడిపోయిన రఘువర్మ తమ అధికారిక అభ్యర్థి కాదని కొత్త రాగంఅందుకుంది. ఎన్నికల ముందు రఘువర్మని తమ అభ్యర్థి అని ప్రకటించిన టీడీపీ, జనసేనలు.. ఓడిపోగానే మాట మార్చేశారు. కూటమి పార్టీల మద్దతు తోనే విజయం సాధించామని ప్రకటన చెయ్యాలని గాదె శ్రీనివాసులు నాయుడుపై అచ్చెన్ననాయుడు ఒత్తిడి తెస్తున్నారు. ఓడిపోతే తమ అభ్యర్థి కాదని, గెలిస్తేనే తమ అభ్యర్థిని చెప్పుకుంటున్న టీడీపీ వైఖరి చూసి జనం విస్తుపోతున్నారు.
ప్రభుత్వంపై ప్రభుత్వ టీచర్ల వ్యతిరేకత
ఉత్తరాంధ్ర టీచర్ ఎన్నికల ఫలితాలతో 9 నెలలకే ప్రభుత్వంపై టీచర్ల వ్యతిరేకత సుస్పష్టమైంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు తిరుగుబాటు ప్రకటించారు. అందుకు ఊతం ఇచ్చేలా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ టీచర్లు కూటమికి ఓటమి రుచి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘు వర్మను ఓడించారు. పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడిని గెలిపించారు.
చంద్రబాబుకు ఓటమి రుచి చూపించిన ప్రభుత్వ టీచర్లు
రఘువర్మను కూటమి అభ్యర్థిగా టీడీపీ, జనసేన,బీజేపీలు పోటీకి పెట్టాయి. తొలి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యతలోనూ కూటమి అభ్యర్థి వెనకపడ్డారు. బ్యాలెట్ ఓటింగ్‌లో కూటమి పార్టీ అభ్యర్థికి భంగపాటు ఎదురైంది. దీంతో చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాని చేదు అనుభవం కూటమి ప్రభుత్వానికి ఎదురైంది. ఎన్నికల్లో గెలిచాక ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసం చేసింది. ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఊసెత్తలేదు. దీంతో ప్రభుత్వ టీచర్లలో చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. ఫలితంగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు ఓటమి అనివార్యమైంది.

Comments
Please login to add a commentAdd a comment