
‘‘ఈరోజు ప్రపంచం ఇలా ఉందంటే అందుకు కారణం నేనే.. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉందంటే అందుకు కారణం కూడా నేనే. సెల్ ఫోన్ తో ప్రపంచాన్ని క్షణాల్లో వీక్షించి వస్తున్నామంటే అందుకు కారణమూ నేనే’’ ఈ తరహా గప్పాలు కొట్టుకోవడం మన బాబుగారికి బాగా అలవాటు. ఏదైనా మంచి విషయం వెలుగులోకి వస్తే చాలు అందుకు ఆద్యుడిని తానే అంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి చెప్పుకోవడం అలవాటు. ఇది కేవలం బాబుగారికి మాత్రమే చెల్లిన అలవాటు. పొరపాటున కూడా ఆ అలవాటు మార్చుకోరు మన బాబు గారు.
లోకేష్‌కు సెల్‌ఫోన్ భయం..
మరి ఇప్పుడు ఆయన తనయుడు లోకేష్ కు సెల్ ఫోన్ ను చూస్తే భయవేస్తోందట. ఎవరి చేతుల్లోనైనా సెల్ ఫోన్ చూస్తే అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు మన చినబాబు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు(సోమవారం) లోకేష్ సమావేశమయ్యారు. వారికి ముందుగా ఒకే ఆజ్ఞ చేశారు చినబాబు.
‘సెల్ ఫోన్ లలో ఏమీ రికార్డు చేయొద్దమ్మా’ అంటూ తన స్టైల్ లో ఆదేశాలిచ్చారు లోకేష్. ఇదంతా ఎందుకంటే తనను ఎవరైనా నిలదీసి అది రికార్డు చేసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితి ఏమటనే కోణంలోనే లోకేష్ ముందుగా జాగ్రత్తలు పడ్డారు. ఈ భేటీలో సూపర్ సిక్స్ హామీలపై ఎవరైనా నిలదీసి అది సోషల్ మీడియా వరకూ చేరితే ట్రోలింగ్ గురి కావాల్సి వస్తుందని ముందే గ్రహించిన లోకేష్ దీన్ని మాత్రం చక్కగా అమలు చేస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా రికార్డింగ్ చేస్తే సెల్ ఫోన్స్ అమ్మి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. మన లోకేష్ బాబు ఏంటి.. ఇలా మాట్లాడుతున్నారంటే అనుకోవడం అక్కడకు వచ్చిన కార్యకర్తల వంతైంది.

లోకేష్ వ్యాఖ్యలను వినడానికి ఫోటోపై క్లిక్ చేయండి..
మరి నాన్నగారైన చంద్రబాబు సెల్ ఫోన్ కు రావడానికి కారణం తానేనని, ఆరోజు అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే సెల్ ఫోన్ వచ్చిందని బాబుగారు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికీ. మామూలుగా ఫోన్ చేసుకోవడానికే కాదు.. డబ్బులు సంపాదించుకోవడానికి సెల్ ఫోన్ అవసరం ఎంతో ఉంది. అదొక నిత్యావసర వస్తువంటూ 2023లో ఓ సందర్భంలో కామెంట్స్ చేశారు చంద్రబాబు. భార్య లేకపోతే భర్త ఉంటాడని, భర్త లేకపోతే భార్య ఉంటుందని, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండరంటూ బాబుగారు తన గొప్పను గొప్పగానే చెప్పుకున్నారు. ఇలా సమయం దొరికినప్పుడల్లా బాబుగారు సెల్ ఫోన్ కు ఎక్కువ ప్రమోషన్ ఇస్తూ.. తనను కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు.
కొసమెరుపు: మరి ఇప్పుడు అదే సెల్ ఫోన్ చూసి లోకేష్ భయపడుతున్నారంటే ఏమనాలి. ఇక నుంచి సెల్ ఫోన్ లో రికార్డింగ్ ఆప్షన్ తీసేయమని ఇప్పుడు బాబుగారికి చెబితే బాగుంటుందేమో మరి.