ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , మంత్రి లోకేష్‌లు ప్రజలను భయపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేమో తాము కక్షరాజకీయాలు చేయబోమని, అదే టైమ్ లో తప్పు చేస్తే వదలబోమని తన అనుభవాన్ని రంగరించి తెలివిగా మాట్లాడుతున్నారు.పవన్ కల్యాణ్ తనే కొత్త రాజ్యాంగం రాసినట్లు వైఎస్సార్‌సీపీ నేతలు నోరెత్తితే ఊరుకోరట. టివీలలో మాట్లాడితే వాళ్ల సంగతి చూస్తారట. వాటిని రికార్డ్ కూడా చేస్తున్నారట. మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతారట. ఇలా పవన్ కల్యాణ్ ఏదేదో ప్రసంగం చేస్తూ సినిమా డైలాగులు చెబుతున్నారు.
ఒకపక్క రాష్ట్రంలో మహిళలపై ఘోరమైన అత్యాచారాలు, అఘాయిత్యాలు, హింసాకాండ జరుగుతుంటే నిన్నటివరకు నోరు విప్పకుండా కళ్లు మూసుకు కూర్చున్న మూడు రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, వైకాపా నాయకులు వాళ్ల మద్దతుదార్లు మహిళల జోలికి వస్తే కాళ్లు కీళ్లు విరగ్గొడతామనడంలోని ఆంతర్యం అర్థమవుతోంది. కేవలం టీవీల్లోగానీ ఇతరత్రాగానీ ,తన అసలు రూపాన్ని రంగును బయటపెడుతున్నవారిని భయపెట్టడానికే పవన్ కల్యాణ్ అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మహిళలజోలికి ఎవరు వెళ్లినా చర్య తీసుకోవాల్సిందే. ఆయనకు నిజంగానే అంత దమ్ముంటే పిఠాపురంలో అత్యాచారానికి పాల్పడిన టీడీపీ నాయకుడి కాళ్లు కీళ్లు ఎందుకు విరగ్గొట్టలేదో చెప్పాలి.
తూర్పు గోదావరి జిల్లాలో మహిళలపై కొందరు వ్యక్తులు అరాచకాలు చేస్తే వాళ్ల జోలికి ఎందుకు వెళ్లలేదో తెలియదు.కాకినాడ రూరల్ లో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పై జనసేన కార్యకర్తలే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ముందుగా వాళ్ల కాళ్లు విరగ్గొట్టే పని పవన్ చేయాలి కదా. జనసేన ఎమ్మెల్యే నానాజి ఒక దళిత ఫ్రొఫెసర్ పై దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఏమి చేశారు? అంటే ఇలాంటి దారుణమైన పనులు టీడీపీ, జనసేనవారు ఎవరైనా చేస్తే పట్టించుకోరా? వైఎస్సార్‌సీపీకి 11 సీట్లే వచ్చినా నాయకుల నోళ్లు మాత్రం మూత పడలేదట.
భవిష్యత్తులో నోటినుండి మాట రాకుండా పవన్ చేస్తారట. 2019లో ఈయన రెండు చోట్ల ఓడిపోయినా ఐదేళ్లపాటు ఇష్టారీతిన చెలరేగిపోయారు కదా. ఇప్పటం వద్ద కారుమీద కూర్చొని అల్లరి చేశారు కదా. మంత్రులను పట్టుకొని చెప్పుతో కొడతా అన్నారు కదా. చంద్రబాబు అరెస్టయితే రోడ్డు మీద పడుకొని నానా యాగీ చేశారు కదా. అంటే జగన్ ప్రభుత్వంలో అంత స్వేచ్ఛ ఆయనకు వచ్చినట్టే కదా. ఇప్పుడు మాత్రం వైఎస్సార్‌సీపీ వారు నోరు విప్పకూడదట.
జగన్ టైమ్‌లో సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనలు ఎంత దారుణమైన పోస్టులను పెట్టారో అందరికీ తెలుసు. వారికి చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లు ఎంతగానో అండగా నిలబడ్డారు. నిజానికి సోషల్ మీడియాలో ఏ రాజకీయపార్టీ అయినా, ఏ వ్యక్తి అయినా అభ్యంతరకర పోస్ట్ పెట్టకూడదు. అంతెందుకు తాజాగా టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి చూడండి 2022లో వైఎస్ విజయమ్మ వాహనం టైర్ ఫంక్చర్ అయిన ఘటనను ఇటీవలే జరిగినట్టు పేర్కొంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో టీడీపీ సోషల్ మీడియా అప్ లోడ్ చేసింది.
మరి దీన్ని పవన్ కల్యాణ్ సమర్థిస్తారా? ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. తమది మంచి ప్రభుత్వమని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. అనేక హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నా తమది మంచి ప్రభుత్వమని పవన్ కల్యాణ్ బాజా వాయించుకోవడాన్ని తప్పుపట్టలేం. వైసీపీ ఇంకా వేషాలు వేస్తే తొక్కి నార తీస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించడమంటే ఆయనేదో సొంత రాజ్యాంగం రాసుకున్నట్టుంది. ముందుగా ఆయన రాష్ట్రంలో పలు చోట్ల జనసేన నేతలు,కార్యకర్తలు టీడీపీవారి చేతిలో అవమానాలకు గురవ్వుతున్నారు. దెబ్బలు తింటున్నారు.
అలా జనసేనపై దాడులు చేస్తున్న టీడీపీవారిని తొక్కి నారతీస్తే ఆ తర్వాత వైసీపీ గురించి మాట్లాడవచ్చు. చంద్రబాబును పొగడడానికే తెగ ఆరాటపడుతున్న పవన్ కల్యాణ్ పోలీసు ఉన్నతాధికారులను బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు? పవన్ కల్యాణ్ గ్యాస్ బండ్ల కార్యక్రమంలో పాల్గొని వెళుతున్నప్పుడు కొందరు మహిళలు తమకు అన్యాయం జరిగిందని రోదిస్తూ ఆయన్ని కలవడానికి ప్రయత్నిస్తే ఆగి కనీసం పలకరించకుండా వెళ్లిపోయిన పవన్ కల్యాణ్ డైలాగులకు ఏ పాటి విలువ వుంటుంది.
గతంలో 35 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కథలు చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పటివరకు ఎంతమంది నిందితులను పట్టుకొని తాటతీశారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక సనాతన ధర్మ పరిరక్షణ అనేది ఆయన పేటెంట్‌గా మార్చుకున్నట్టున్నారు. ఆ ధర్మమంటే ఏమిటో తెలియకపోయినా మతాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారు.ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది కదా.
ఇక రెడ్ బుక్ రాజ్యాంగ కర్త అయిన లోకేష్ అమెరికా వెళ్లి మరీ రెడ్ బుక్ ఛాప్టర్ 3 తెరుస్తామని అంటున్నారు. ఒక పక్క పెట్టుబడులు ఆహ్వానిస్తామంటున్నారు.. ఇంకొక పక్క రెడ్ బుక్ ఛాప్టర్ 3 పేరుతో తమ ఇష్టారాజ్యంగా అరాచకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన హింసాకాండ, దౌర్జన్యాలు, విధ్వంసాలతో లోకేష్ కు సంతృప్తి కలిగినట్టు లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలను రెడ్ బుక్ అంటూ భయపెడుతు తిరుగుతున్న లోకేష్ ను, ఆయన్ని మంత్రిగా పెట్టుకొని నిస్సహాయుడిగా మిగిలిపోయిన చంద్రబాబును చూసి జనం విస్తుపోతున్నారు.
వీరిద్దరికి భిన్నంగా చంద్రబాబు మాత్రం కక్షలకు దూరమని చెబుతూనే తాము పగ తీర్చుకోబోతున్నామని పరోక్ష సంకేతాలు ఇస్తుంటారు. చంద్రబాబేమో తెలివిగా కక్ష రాజకీయాల గురించి మాట్లాడుతుంటే పవన్, లోకేష్‌లు మాత్రం పచ్చిగా దారుణంగా మాట్లాడి ప్రత్యర్థి రాజకీయ నాయకులను, తమకు గిట్టనివారిని భయాందోళనలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు.
కాకపోతే దీనికి చట్టాన్ని ఉల్లంఘించినవారు అని ఒక ముసుగు వేస్తున్నారు. టీడీపీ , జనసేనలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలుగానీ, సుమారు రెండువందల వాగ్ధానాలనుగానీ అమలు చేయలేక, చేతులు ఎత్తేస్తున్నామని చెప్పలేక వాటి గురించి ప్రశ్నించేవారిని వేధించాలని నోళ్లు మూయించాలని అనుకుంటే అది సాధ్యమయ్యేది కాదని చరిత్ర చెబుతోంది. తమ నియంతృత్వంతో ఎల్లకాలం అధికారంలో ఉంటామని వారు భావిస్తుంటే అది భ్రమే అవుతుంది. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవడం మాని అబద్ధాలతో మోసం చేస్తూ, రెడ్ బుక్కులతో భయపెడుతూ పాలన సాగిస్తే ప్రజలు ఎంతకాలం సహించగలుగుతారు?
::: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment