సాక్షి, విశాఖపట్నం: అచ్యుతాపురం సెజ్ బాధితులకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, బాధితులను కలిసి ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బాధ్యతతో మాట్లాడాలని బొత్స హితవు పలికారు. ప్రమాదం జరిగితే అధికారంలో ఉన్నవాళ్లు పట్టించుకోలేదన్నారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పలేదని ఆయన దుయ్యబట్టారు. ‘‘విషాదం వేళ.. రాజకీయం ఎందుకు?. వెంటనే సేఫ్టీ ఆడిట్ జరపాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’’ అని బొత్స పేర్కొన్నారు.
‘‘ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నాము. తెల్లవారు జామున జరిగిన కూడా ఎక్కడ సహాయక చర్యలు ఆగలేదు. కరోనా సమయంలో కూడా సహాయక చర్యలు ఆగలేదు. స్థాయి మరిచి కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారు. వాటిని ప్రజలు గమనిస్తున్నారు. గత ఐదేళ్లలో ఏమి జరగలేదని మాట్లాడుతున్నారు. బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఎందుకు రాలేదని మేము అడిగిన తర్వాత సీఎం కేజీహెచ్‌కు వచ్చారు. ఒక మంచి నీళ్లు బాటిల్ కూడా బాధితులకు ఇవ్వలేదు. ఎల్‌జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన వెంటనే మృతిచెందిన వారికి కోటి రూపాయల చెక్కు అందించాము. అప్పటికప్పుడు 30 కోట్లు సిద్ధం చేశాము.’’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment