బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్‌’ స్ట్రోక్‌! | Teachers union candidate Gade Srinivasulu Naidu wins in MLC Election | Sakshi
Sakshi News home page

బాబు ప్రజా కంటక పాలనకు టీచర్ల చెంపదెబ్బ..‘మాస్టర్‌’ స్ట్రోక్‌!

Published Tue, Mar 4 2025 3:28 AM | Last Updated on Tue, Mar 4 2025 3:28 AM

Teachers union candidate Gade Srinivasulu Naidu wins in MLC Election

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న గాదె శ్రీనివాసులునాయుడు

ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రఘువర్మ ఓటమి 

ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం

రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై రూళ్ల కర్ర ఝళిపించిన టీచర్లు 

అధికార బలం ఉపయోగించినా, ప్రలోభాలు పెట్టినా ఫలించని పన్నాగాలు.. టీడీపీ కూటమి 

సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనం 

ఏడాదిలోపే ఈ స్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత మీద సర్వత్రా చర్చ 

ముందంజలో ఆలపాటి.. ఏలూరులో తొలి రౌండ్‌లో రాజశేఖర్‌ ఆధిక్యం

నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు: విజేత గాదె  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టి.. పది నెలలుగా ప్రజా కంటక పాలనతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలింది! అధికార మదంతో విర్రవీగుతున్న కూటమి నేతలకు విజ్ఞులైన ఉపాధ్యాయులు బెత్తంతో బడిత పూజ చేశారు! ప్రజాస్వామ్య విలువలను చాటిచెబుతూ.. కూటమి మోసాలను తిప్పికొడుతూ గుణపాఠం లాంటి తీర్పు ఇచ్చారు. 

పట్టుమని పది నెలల్లోనే టీడీపీ కూటమి సర్కారుపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టాయి. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న రెడ్‌బుక్‌ పాలన, ప్రజా కంటక విధానాలకు ఉపాధ్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారు. మొత్తం యంత్రాంగాన్ని మోహరించి అధికార బలాన్ని ప్రయోగించినా కూటమి సర్కారు పాచికలు పారలేదు. 

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన రఘువర్మ పరాజయం పాలయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అధికార పార్టీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బలాన్ని ప్రయోగించినా.. ఓటుకు నోట్లు ఎరవేసినా ఈ సర్కారు పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు స్పష్టంగా ఓటు రూపంలో వ్యక్తం చేశారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత నెలకొందో స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించిందని మండిపడుతున్నారు. కూటమి అభ్యర్థి రఘువర్మ గెలుపు కోసం కృషి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వెబెక్స్‌ ద్వారా స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చినా భంగపాటు తప్పలేదు. 

ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసికట్టుగా తమ అభ్యర్ధిగా ప్రకటించిన గాదె శ్రీనివాసులు నాయుడును గెలిపించి కూటమి సర్కారుపై తమ ఆగ్రహాన్ని చాటుకున్నాయి. తమ ఓటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకమని స్పష్టంగా తేల్చి చెప్పారు. కాగా తమ అభ్యర్థి ఓడిపోవడంతో కూటమి నేతలు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. 

పోలింగ్‌ రోజు వరకూ తమ అభ్యర్థి రఘువర్మను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించి అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ నేతలు ఆయన ఓడిపోవడంతో.. గెలిచిన గాదె శ్రీనివాసులు కూడా తమవారేనంటూ కొత్త పల్లవి అందుకోవడం టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. 

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాలతోనే రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్‌ తగలడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు. దీని నుంచి బయటపడేందుకు పోలీస్‌ కమిషనర్‌ ఫోన్‌ ద్వారా గెలిచిన అభ్యర్థి గాదెతో ఆయన స్వయంగా ఫోన్‌లో మాట్లాడారంటే టీడీపీని పరాజయం ఏ స్థాయిలో వణికించిందో అర్థం అవుతోంది.  

సజావుగా జరిగి ఉంటే.. ఆ రెండు చోట్ల కూడా! 
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు భారీగా నగదు పంపిణీతో పాటు పీడీఎఫ్‌ అభ్యర్థి కుటుంబ సభ్యులు, ఏజెంట్లపై దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. దొంగ ఓట్లను నమోదు చేసి... ఏకంగా రిగ్గింగుకు కూడా తెగబడ్డారు. స్వయంగా అధికార పార్టీ నేతలే విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే ఇక్కడ కూడా అధికార కూటమికి కచ్చితంగా ఓటమి ఎదురయ్యేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  
రెండో స్థానం కోసం పోటాపోటీ... 
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ నుంచి బరిలో నిలిచిన గాదె శ్రీనివాసులు నాయుడు ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యతను కనబరిచారు. ఏ రౌండ్‌లో కూడా కూటమి అభ్యర్థి రఘువర్మకు మెజార్టీ రాకపోవటాన్ని గమనిస్తే టీడీపీ సర్కారుపై ఉపాధ్యాయుల్లో ఎంత వ్యతిరేకత ఉందో తేటతెల్లమవుతోంది. 

పైగా పీడీఎఫ్‌ నుంచి బరిలో నిలిచిన విజయగౌరి నుంచి రెండో  స్థానం కోసం కొన్ని రౌండ్లల్లో రఘువర్మ పోటీని ఎదుర్కొన్నారు. ఒక దశలో పీడీఎఫ్‌ అభ్యర్థికి, కూటమి అభ్యర్థి రఘువర్మకు మధ్య పెద్దగా తేడా లేకపోవడంతో మూడో స్థానానికి పడిపోతారా? అనే ఆందోళన కూటమి నేతల్లో గుబులు రేపింది. ప్రధానంగా అధికార టీడీపీ, జనసేన పట్ల తమ వ్యతిరేకతను ఉపాధ్యాయులు ఓట్ల ద్వారా చాటిచెప్పారు. 

రాజకీయ జోక్యంతో...! 
టీడీపీ, జనసేన అధికారికంగా రఘువర్మను తమ అభ్యర్థిగా ప్రకటించాయి. గెలుపు కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలు విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి పార్టీల తరపున బరిలో నిలిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీని గెలిపించాలంటూ టీచర్లపై ఒత్తిళ్లు తెచ్చారు. ప్రధానంగా ప్రైవేటు టీచర్లను బెదిరించే ధోరణిలో వ్యవహరించారు. 

ఎంత చేసినా ప్రజా వ్యతిరేకతను తప్పించుకోలేకపోయారు. అధికార పార్టీకి చెందిన విద్యాలయాల్లో పని చేసే ప్రైవేట్‌ టీచర్లు సైతం కూటమి అభ్యర్ధికి వ్యతిరేకంగా ఓటేశారంటే ఈ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత నెలకొందో ఊహించవచ్చు.  

కూటమికి చెంపదెబ్బ: బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వానికి చెంప దెబ్బ లాంటివని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ, జనసేన కూటమి పార్టీలకు ఏడాదిలోపే చావుదెబ్బ తగిలిందన్నారు. 

అధికారం ఉందనే అహంకారంతో అరాచకాలు చేస్తున్న టీడీపీ, జనసేన పార్టీలకు విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు బెత్తంతో కొట్టి మరీ గట్టిగా గుణపాఠం చెప్పారన్నారు. ఫలితాలపై సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు ప్రజాస్వామ్య విలువలను మరోసారి చాటిచెప్పారు. కూటమి ప్రభుత్వ మోసాలను తిప్పికొడుతూ గట్టి తీర్పు ఇచ్చారు. 

ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్లు ఎన్నికల్లో పాల్గొన్న తీరు, వచ్చిన ఫలితం.. ఈ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంతటి వ్యతిరేకత ఉందో తేటతెల్లం చేస్తున్నాయి. ఎన్నికల్లో హామీలిచ్చి ఓట్లేయించుకుని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను మోసగించింది. 

ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేసింది. ఇప్పటికైనా ఎన్నికల హామీలను అమలు చేయాలి. లేదంటే స్థానిక ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకూ కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని బొత్స పేర్కొన్నారు.
విశాఖ ఏయూలోని కౌంటింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాల్ని లెక్కిస్తున్న పోలింగ్‌ సిబ్బంది   

అవునా.. అచ్చెన్న మద్దతిచ్చారా!  : గాదె
తమ ఫొటోలు పెట్టుకొని గెలిచారని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు గాదె శ్రీనివాసులు నాయుడును కోరగా.. అవునా..! అచ్చెన్న మద్దతిచ్చారా.. దానిపై నాకు అవగాహన లేదంటూ బదులిచ్చారు.  ‘ఫొటోల వల్ల కాదు.. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో మాత్రమే గెలిచా’ అని పేర్కొన్నారు.  

కూటమికి కౌంట్‌డౌన్‌ : ధర్మాన కృష్ణదాస్‌
నరసన్నపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్ధికి ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని, కూటమికి కౌంట్‌డౌన్‌ మొదలైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. విజయం సాధించిన గాదె శ్రీనివాసులు నాయుడికి అభినందనలు తెలిపారు. కూటమి బలపరిచిన అభ్యర్థి ఓటమికి కారణం ప్రభుత్వం పట్ల వ్యతిరేకతేనన్నారు. అధికారం కోసం అలవికాని హామీలు ఇచ్చి కూటమి నాయకులు ప్రజల్ని మభ్య పెట్టారన్నారు. తొమ్మిది నెలల్లోనే కూటమి పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్నారు.  

ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం ఉత్తరాంధ్ర ఫలితం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిని ఘోరంగా ఓడించి తొమ్మిది నెలల ప్రభుత్వ పాలనపై ఉపాధ్యాయులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చూపించారని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం సు«దీర్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఆదర్శ పాఠశాలల ఏర్పాటుపై ఒత్తిడి తగదు 
ఆదర్శ పాఠశాలల ఏర్పాటుకు గ్రామస్తులను ఒప్పించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయొద్దని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.

ఆధిక్యంలో ఆలపాటి
గుంటూరు ఎడ్యుకేషన్‌: ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఐదో రౌండు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ 47,872 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం పోలైన ఓట్లు 1,40,297 కాగా చెల్లని ఓట్లు 14,888 ఉన్నాయి. పోలైన ఓట్లలో ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు 84,595, పీడీఎఫ్‌ అభ్యర్థి కేఎస్‌ లక్ష్మణరావుకు 36,723 వచ్చాయి. కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.  

ఉభయ గోదావరి తొలిరౌండ్‌ ఫలితాల వెల్లడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తొలి రౌండ్‌ పూర్తయింది. మొదటి రౌండులో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌కు 16,520 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీర రాఘవులుకు 5,815 ఓట్లు, జీవీ సుందర్‌కు 1,968 ఓట్లు వచ్చాయి. 2,416 చెల్లని ఓట్లుగా గుర్తించారు. ప్రతి రౌండ్‌కూ 28 వేల ఓట్ల చొప్పున 9 నుంచి 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా అధికారులు కౌంటింగ్‌లో మార్పులు చేశారు.  

ఇకనైనా సమస్యలపై దృష్టి సారించాలి 
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలి. గత తొమ్మిది నెలలుగా ఈ ప్రభుత్వ పాలనలో తమ సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదన్న విషయాన్ని ఈ ఫలితం ద్వారా చాటారు. ఉపాధ్యాయుల సరెండర్‌ లీవ్స్, సీఎఫ్‌ఎంఎస్‌లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలి. డీఏ బకాయిలను చెల్లించడంతో పాటు పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలి.   
    – డాక్టర్‌ కరుణానిధి మూర్తి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్, పీఆర్‌టీయూ

పాలక పార్టీల ఓటమికి నిదర్శనం.. 
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు ఒక అభ్యర్ధికి మద్దతు ప్రకటించి ప్రచారం చేశాయి. అధికార పార్టీ నేతలు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా అధికారాన్ని ఉపయోగించి ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నించారు. ఒకటో తేదీనే జీతాలు అని హామీ ఇచ్చినా ఆలస్యం అవుతున్నాయి. 

డీఏ బకాయిలు చెల్లించలేదు. పీఆర్‌సీ కమిటీని నియమించలేదు. బకాయిల విషయంలో స్పష్టత లేదు. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించలేదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించడం పాలక పార్టీల ఓటమికి నిదర్శనం.         
    – హృదయరాజు, ఏపీటీఎఫ్‌ (1938) రాష్ట్ర అధ్యక్షుడు

కూటమి పార్టీలు – ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ.. 
రాజకీయ పార్టీల కూటమి.. ఉపాధ్యాయ సంఘాల మధ్య జరిగిన పోటీ ఇది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ సంఘాల కూటమి విజయం సాధించింది. ఉపాధ్యాయ సంఘాలు సమస్యలపై పోరాడి సాధించుకోవాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోవడం సరికాదు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థి రఘువర్మకు మద్దతుగా నిలిచాయి. ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడును బరిలో నిలిపి 
గెలిపించుకున్నాయి.  
    – పైడి రాజు, విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ

ప్రభుత్వంపై సామ దాన భేద దండోపాయాలకు సిద్ధం
ఈవిజయం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులందరిదీ. నా గెలుపు కోసం మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. ఈ విజయంతో నాకు కీలక బాధ్యతలు అప్పగించారు. నా విజయానికి ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతుతోనే నేను గెలుపొందా. 

నా గెలుపును రాజకీయాలతో ముడిపెట్టొద్దు. ఉపాధ్యాయుల రుణం తీర్చుకుంటా. నా పనితీరును బట్టి నన్ను గెలిపించారు. 2007 నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రాజకీయాలకు అతీతంగానే  పనిచేశా. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తా. అవసరమైతే ప్రభుత్వంపై సామ దాన బేధ దండోపాయాలకు సిద్ధంగా ఉన్నా. 
    – గాదె శ్రీనివాసులునాయుడు, ఉత్తరాంధ్ర టీచర్స్‌ ఎమ్మెల్సీ విజేత  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement