Teachers unions
-
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీకానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు అప్పుడే మద్దతు కూడగట్టే పనిలో పడ్డాయి. 2025 మార్చి 29తో వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆలోగా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 30న ఓటరు నమోదుకు నోటిఫికేషన్ జారీచేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బలం పెంచుకునేందుకు.... రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి తమ సంఘం నుంచి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పీఆర్టీయూ అప్పుడే కసరత్తు ప్రారంభించింది. పెద్దఎత్తున ఓటర్లను నమోదు చేయించేందుకు చర్యలు చేపట్టింది. యూటీఎఫ్ కూడా అదే పనిపై దృష్టి సారించింది. నెల రోజుల నుంచి సంఘ సభ్యత్వ నమోదు ముమ్మరంగా చేస్తోంది. గతంలో పోగొట్టుకున్న స్థానాన్ని ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో పీఆర్టీయూ ఉంది. సంఘంలోని నాయకుల్లో ఉన్న అభిప్రాయభేదాలను పక్కన పెట్టి అంతా కలిసి పనిచేసేలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో సంఘాన్ని వీడిన, సంఘం నుంచి సస్పెండ్ చేసిన నేతలను కూడా మళ్లీ చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండలో పీఆర్టీయూ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారని సస్పెండ్ చేసిన సుంకరి బిక్షంగౌడ్‌తోపాటు మరికొంతమంది నాయకులను ఇటీవల మళ్లీ సంఘంలోకి చేర్చుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే వారిని తిరిగి చేర్చుకున్నారన్న చర్చ సాగుతోంది. ఇక యూటీఎఫ్, ఎస్టీయూ, టీపీటీఎఫ్ కూడా ఈనెలాఖరు వరకు తమ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. త్వరలోనే పీఆర్టీయూ అభ్యర్థుల ఖరారు పీఆర్టీయూ ప్రస్తుతం జిల్లా కార్యవర్గాల సమావేశాలు నిర్వహిస్తోంది. వాటిని ఈనెలాఖరులోగా పూర్తి చేసి, రాష్ట్ర కార్యవర్గ సమావేశం వచ్చే నెల 7న నిర్వహించాలని నిర్ణయించింది. అందులో కొత్తగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఎన్నుకోనుంది. ఆ సమావేశంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ తరఫున పోటీలో ఉండే వారి పేర్లను ఖరారు చేసే అవకాశముంది. వరంగల్–ఖమ్మం–నల్లగొండ స్థానం నుంచి గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీచేయగా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన పులి సరోత్తంరెడ్డి రెబెల్‌గా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం పీఆర్టీయూ నుంచి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఎమ్మెల్సీగా పోటీచేయాలని భావిస్తున్నట్టుగా సంఘంలో చర్చ సాగుతోంది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్–కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్‌రావు పోటీ చేయాలని భావిస్తున్నారు. వారిలో ఎవరిని ఖరారు చేస్తారన్నది మొదటి వారంలోనే తేలనుంది. మరోవైపు టీపీటీఎఫ్, యూటీఎఫ్ కూడా అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. ఈసారి పార్టీల నుంచి పోటీ.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో ఈసారి కాంగ్రెస్, బీజేపీ తరఫున కూడా అభ్యర్థులను పోటీలో నిలుపుతారన్న చర్చ సాగుతోంది. అదే జరిగితే బీజేపీ తరపున ఈసారి వరంగల్–ఖమ్మం– నల్లగొండ స్థానంలో పోటీచేయాలని పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులి సరోత్తంరెడ్డి భావిస్తున్నారు. ఆయనతోపాటు టీపీయూఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సాయిరెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ –కరీంనగర్ స్థానంలో బీజేపీ నుంచి నరహరి లక్ష్మారెడ్డి, సుధాకర్‌రెడ్డి పోటీచేయాలని భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడి నుంచి పార్టీ పోటీ చేయమని చెబితే అక్కడి నుంచి పోటీచేసేందుకు సిద్ధమని పేర్కొంటున్నారు. -
జీపీఎస్ గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి
అనకాపల్లి/భీమవరం: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆదివారం కూడా ఆందోళన బాటపడ్డాయి. రాజపత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తుందని ఆశించామని.. కానీ, మా ఆశలను వమ్ముచేస్తూ జీపీఎస్‌కు చట్టబద్ధత తెచ్చి గెజిట్ నోటిఫికేషన్ జారీచేయడం చాలా అన్యాయమంటూ ఆదివారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయం వద్ద యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వత్సవాయి శ్రీలక్ష్మి, గొంది చినబ్బాయిలు విమర్శించారు. గెజిట్ కాపీలను దగ్థంచేశారు. పైగా.. జీపీఎస్ విధానాన్ని అమలుచేస్తూ పాత తేదీలతో రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమని చెప్పారు. జీపీఎస్ కంటే మెరుగైన విధానాన్ని అమలుచేస్తామని పవన్‌కళ్యాణ్, నారా లోకేశ్‌లు కూడా హామీ ఇచ్చారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుని, పాత పెన్షన్ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లయ్యబాబు, ఎంవీ అప్పారావు, జిల్లా కార్యదర్శి శేషుబాబు, కోశాధికారి జోగా రాజేష్, మున్సిపల్ ఉపాధ్యాయుల నాయకులు సతీ‹Ù, మోడల్ స్కూల్ నాయకులు ఆశాలత, ఏపీసీపీఎస్ఈఏ నాయకులు ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలుచేస్తుందని భావించామని.. కానీ, అందుకు విరుద్ధంగా కొత్త ప్రభుత్వం జీపీఎస్‌పై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా అన్యాయమని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి బి.గోపిమూర్తి, జిల్లా అధ్యక్షుడు పీఎస్ విజయరామరాజు అన్నారు. భీమవరంలో ఆదివారం వారు జీఓ కాపీలను దగ్థం చేశారు. కొలువుదీరిన ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను అమలుచేయడం దేనికి సంకేతమని వారు ప్రశి్నంచారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సీహెచ్ పట్టాభిరామయ్య, జిల్లా కార్యదర్శులు సీహెచ్ కుమారబాబ్జి, డి. ఏసుబాబు, ఎస్.రత్నరాజు, జి. రామకృష్ణంరాజు పాల్గొన్నారు. -
ఇంత ఘోరంగా మోసం చేస్తారా?
సాక్షి, అమరావతి/నూజివీడు/సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం(జీపీఎస్) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కూటమి పార్టీలు మాట తప్పి తమను నిలువునా మోసం చేశాయని మండిపడ్డాయి. వెంటనే గెజిట్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం తీసుకురావాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించాయి. ఇది దుర్మార్గం: ఎస్జీటీఎఫ్ ఎన్నికల ప్రచారంలో జీపీఎస్ దుర్మార్గమని ప్రచారం చేసి.. ఇప్పుడు అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అని కూటమి ప్రభుత్వంపై సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వం జీపీఎస్‌పై ముందుకు వెళ్లలేదన్నారు. కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు సరైన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చాయన్నారు. కానీ ఇప్పుడు ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేశాయని మండిపడ్డారు. మాట తప్పడం అన్యాయం: సీపీఎస్ ఉద్యోగుల సంఘం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీపీఎస్, జీపీఎస్‌పై సమీక్ష జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామంటూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని.. కానీ ఇప్పుడు ఎలాంటి సమీక్ష లేకుండా గెజిట్ జారీ చేశారని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు గార్లపాటి సునీల్ మండిపడ్డారు. గెజిట్ రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సహనాన్ని పరీక్షించొద్దు: ఆప్టా ఉద్యోగుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్న జీపీఎస్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం(ఆప్టా) డిమాండ్ చేసింది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరావు, ప్రధాన కార్యదర్శి ప్రకా‹Ùరావు ఓ ప్రకటనలో హెచ్చరించారు. మేం కోరుకున్నది ఓపీఎస్: బీటీఏ కూటమి ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వంపై బహుజన టీచర్స్ అసోసియేషన్(బీటీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.మనోజ్ కుమార్, సీహెచ్.రమేశ్ మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్నది పాత పెన్షన్ స్కీం(ఓపీఎస్) మాత్రమేనన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పిన కూటమి పారీ్టలు.. అధికారంలోకి వచ్చాక జీపీఎస్ గెజిట్ జారీ ద్వారా ముంచేసిందని మండిపడ్డారు. 16, 17 తేదీల్లో నిరసన: ఏపీటీఎఫ్ జీపీఎస్ గెజిట్ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. 2004లోపు నోటిఫికేషన్ ద్వారా నియామకమైన టీచర్లు, పోలీసులు, ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈనెల 16, 17 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేయనున్నట్టు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్.చిరంజీవి తెలిపారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టే లా, పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, 12వ పీఆర్సీ ప్రక్రియ మొదలుపెట్టాలని, ఆలోగా 30 శాతం మధ్యంతర భృతి విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానమే కావాలి: పీఆర్టీయూ ఏపీ పాత పెన్షన్ విధానమే కావాలని.. జీపీఎస్ గెజిట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్(పీఆర్టీయూ–ఏపీ) రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య డిమాండ్ చేశారు. 2023 జూలై నుంచి నూతన పీఆర్సీ అమలు చేయాలని, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
డీఏపై కేబినెట్లో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుతో పాటు ఇతర అంశాలపై ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలపై కక్ష గట్టి రద్దు చేస్తే, ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్నే రద్దు చేశారని ఎద్దేవా చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల వారీగా ఉద్యోగ సంఘాలు ఉండాల్సిందేనని, మంత్రివర్గ ఉప సంఘం శాఖల వారీగా సంఘాలతో సమావేశం నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని అన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో ఆదివారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొనసాగింపుపై త్వరలో నిర్ణయం గత పదేళ్లుగా తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉద్యోగులకు అవకాశం లభించలేదని, వారి ఆవేదన వినేవారు లేక ఇబ్బందులు పడ్డారని సీఎం అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతోనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఇన్నాళ్లూ ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కేసీఆర్ కుటుంబ సభ్యులే వ్యవహరించారని విమర్శించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న 1100 మంది రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గవర్నర్‌ను సంప్రదించి ప్రొఫెసర్ కోదండరాంను శాసనమండలికి పంపుతామని, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికి గౌరవమన్నారు. బడులు, కళాశాలలకు ఉచిత విద్యుత్! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని, దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఉద్యోగుల తరఫున ప్రాతినిధ్యం ఉండాలన్నారు. తెలంగాణ బాపు జయశంకరే.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రాజకీయ పార్టీ తామే సాధించామని చెప్పుకున్నా అది అసంబద్ధమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడతారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో ఎవరి రక్తం చిందలేదేమో కానీ, తెలంగాణ కోసం కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వారు రక్తాన్ని చిందించారని, శ్రీకాంతాచారి లాంటి వారు మాంసపు ముద్దలయ్యారని తెలిపారు. తెలంగాణ బాపు తానే అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని, అలా చెప్పుకోవడానికి కనీస పోలిక ఉండాలని విమర్శించారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకరే అని, తెలంగాణ ఆత్మను గౌరవించకపోతే సమాజం మనల్ని క్షమించదని అన్నారు. రోజుకు 18 గంటలు పని చేస్తూ పాలన ను గాడిలో పెడుతున్నామని, తాము పదేళ్లు అధి కారంలో ఉండటం ఖాయమని సీఎం అన్నారు. -
తప్పు.. మీదంటే మీదే
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో డిప్యుటేషన్ల వ్యహారం చిచ్చురేపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం రంగంలోకి దిగింది. సమగ్ర వివరాలు అందించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఇదే సమయంలో ఇష్టానుసారంగా డిప్యుటేషన్లు ఇస్తున్నారంఊ ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా మండిపడుతున్నాయి. సీఎంకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు సంఘాల నేతలు ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు పంపారు. సాధారణ బదిలీలు చేపట్టకుండా, అయినవారు, ముడుపులు ఇచ్చి న వారిని కోరుకున్న ప్రాంతానికి పంపుతు న్నారని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ‘సాక్షి’లో టీచర్లు సిటీకి.. చదువులు గాలికి’అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ వార్తపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, అంతర్గత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. కొత్త వివాదానికి దారి తీస్తున్న డిప్యుటేషన్లు టీచర్ల డిప్యుటేషన్ అంశం అధికారుల మధ్య కొత్త వివాదానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో ఉన్నతాధికారులు కొంతమంది ఈ తంతుతో తమకు సంబంధమే లేదని చెబుతున్నారు. తాను వ్యతిరేకించినా డిప్యుటేషన్ ఆర్డర్ ఎలా వచ్చిందో తెలియదని ఓ అధికారిణి తెలిపారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్నా, ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తోందని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, విద్యాశాఖ ఉన్నతాధికారి మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఫైల్ సంబంధిత అధికారిణి ద్వారానే తనకు వస్తుందని, ఆమెకు తెలియకుండా ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మానవతకోణంలో బదిలీలు చేస్తున్న విషయాన్ని ఆమె ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారో తెలియడం లేదని విద్యాశాఖ ఉన్నతాధికారి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగినట్టు విద్యాశాఖ వర్గాల సమాచారం. పరస్పరం సీఎంఓకు ఫిర్యాదులు చేసుకుంటున్న వైనం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. రంగంలోకి మధ్యవర్తులు తీవ్ర విమర్శలు వస్తున్నా డిప్యుటేషన్ వ్యవహారం ఆగడం లేదు. ఆసిఫాబాద్ నుంచి మంచిర్యాలకు గత నెల 11వ తేదీన ఓ టీచర్‌ను డిప్యుటేషన్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇవే కాకుండా మరికొన్ని డిప్యుటేషన్లు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని ఉపాధ్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. డిప్యుటేషన్ల బేరసారాలు పలు జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయని టీచర్లు అంటున్నారు. అనారోగ్య సర్టీఫికెట్లు సృష్టించి మరీ డిప్యుటేషన్లు ఇప్పిస్తామని నమ్మబలుకుతున్నారని వారు చెబుతున్నారు. కొంతమంది రాజకీయ పలుకుబడిని ముందుకు తెస్తుంటే, మరికొంతమంది తమకు విద్యాశాఖలో ఉన్నతాధికారి తెలుసునని, ఆయనకు కొంత ముట్టజెబితే డిప్యుటేషన్ సులభమని నమ్మిస్తున్నారని పలువురు టీచర్లు తెలిపారు. ప్రభుత్వం విశ్వసనీయత నిలుపుకోవాలి ఉపాధ్యాయుల బదిలీల్లో పారదర్శకత పాటించి విశ్వసనీయతను కాపాడుకోవాలి. పలుకుబడి కలిగిన ఉపాధ్యాయులకు డిప్యుటేషన్ పేరిట జిల్లాలు దాటించి బదిలీలు చేయటం సమంజసం కాదు. అనారోగ్యం, భార్యభర్తలు తదితర సహేతుక కారణాలతో బదిలీలు చేయాలనుకుంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని అవసరమైన, అర్హులైన ఉపాధ్యాయులకు అవకాశం ఇవ్వటం సమంజసం. ఉపాధ్యాయులు బదిలీలకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి కల్పించారు. నూతనంగా ఏర్పాటైన ప్రజా ప్రభుత్వంలో అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ ప్రధానకార్యదర్శి -
కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలకులు తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, జూలై ఒకటో తేదీతో వర్తించేలా కరువు భత్యం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూయూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించింది. దశల వారీగా పోరాట కార్యాచరణను స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 18, 19 తేదీల్లో మండలాల్లో బైక్ ర్యాలీలు. ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని, సెపె్టంబర్ 1 న చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రస్థాయి ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జీíపీఎస్, జీఎస్ జిఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్, బీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఇహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు.. పదోన్నతులివ్వాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని, తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో సర్విస్ పర్సన్స్ ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు. జీఓ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి(డీటీఎఫ్), యు పోచయ్య, డి సైదులు (ఎస్టీఎఫ్ టీఎస్), సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్ పిటిఎ), కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి (బీటీఎఫ్), బి కొండయ్య (టీఎస్ ఎంఎస్టీఎఫ్), ఎస్ హరికృష్ణ, వి శ్రీను నాయక్ (టీటీఎ), జాదవ్ వెంకట్రావు (ఎస్సీ ఎస్టీ టీఎ), వై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీ యూయస్ టీఎస్) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సిపిఎస్ రద్దు చేయాలని, 2004 సెపె్టంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు. -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
మాస్టార్ల బదిలీలు, పదోన్నతులు ఎప్పుడు? రగులుతున్న అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముందుకెళ్ళకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంటోంది. ఏడాదిగా అటు ప్రభుత్వం, ఇటు ఉపాధ్యాయ సంఘాలు తమతో ఆటలాడుతున్నాయని టీచర్లు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. టీచర్ల సంఘాల నేతలపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల విద్యాశాఖ మంత్రిని కలిసిన పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. న్యాయ పరమైన చిక్కులు తొలగించేందుకు విద్యాశాఖ ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. నాన్–స్పౌజ్ పేరుతో న్యాయ వివాదం సృష్టించిన వ్యక్తుల వెనుక స్వార్థం ఉందని, దీన్ని న్యాయస్థానానికి సరిగా వివరించడంలో విద్యాశాఖ విఫలమైందంటున్నారు. హెచ్ఆర్ఏ కోసమేనా ఈ రగడ? భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే చోట ఉండేలా చూడాలనేది ప్రభుత్వ విధానం. ఈ నేపథ్యంలోనే బదిలీలు చేపడుతున్నారు. కానీ కొంతమంది నాన్–స్పౌజ్ పేరుతో కొత్త వివాదం తెరమీదకు తెచ్చారు. బదిలీ అయ్యే 80 వేల మంది టీచర్లలో 30 వేల మంది ఉపాధ్యాయులు స్పౌజ్ పాయింట్లు వాడుకుని 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటే పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వస్తున్నారనేది నాన్–స్పౌజ్‌ల వాదన. నిజానికి జిల్లా యూనిట్‌గానే టీచర్ల బదిలీలు ఉంటాయి. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో స్పౌజ్ అనే అంశంతో సంబంధం లేకుండానే జిల్లాల్లోని అందరికీ ఒకే హెచ్ఆర్ఏ ఇస్తారు. రంగారెడ్డి జిల్లాలోని 5 మండలాలు, సంగారెడ్డి జిల్లాలోని 3 మండలాలు తప్ప రాష్ట్రంలో మిగిలిన 30 జిల్లాలకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తించదు. స్పౌజ్ పాయింట్లు 8 ఏళ్ళకోసారి ఇస్తారు. అది కూడా దంపతుల్లో ఒకరికే వర్తిస్తుంది వాస్తవాలు గుర్తించరేం? వాస్తవాలు అలా ఉంటే నాన్ స్పౌజ్‌ల పేరుతో అభ్యంతరాలు లేవనెత్తే వ్యక్తులు అసత్య ప్రచారంతో నమ్మిస్తున్నారనేది మెజారిటీ టీచర్ల వాదన. స్పౌజ్‌లు అందరూ దీన్ని అడ్డం పెట్టుకుని హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కోరుకుంటే, ఇలాంటి వాళ్ళు 60 వేల మంది వరకు ఉండాలి. కానీ ఈ విషయాన్ని విద్యాశాఖ గుర్తించడం లేదని టీచర్లు అంటున్నారు. అసలు కోర్టులో వివాదం లేవనెత్తిన వాళ్ళల్లో ఎక్కువ మంది అధిక హెచ్ఆర్ఏ పొందుతూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు. ఇలా కేసులు వేసి, వాళ్ళను వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది స్వార్థం కాదా? : జైపాల్ రెడ్డి (స్పౌజ్ ఉద్యోగుల నేత) వివాదం లేవనెత్తుతున్న నాన్ స్పౌజ్‌ల్లో 13 ఏళ్ళకుపైగా హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 8 మండలాల్లోనే పనిచేస్తున్నారు. వీరికి 24 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. ఇందులో చాలా మంది రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వీరి ప్రయోజనం కోసం 80 వేల మంది టీచర్ల బదిలీల ప్రక్రియకు అడ్డం పడుతున్న వాస్తవాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు. ఇప్పటికైనా వివాదం వెనుక వాస్తవాలు గుర్తించి, బదిలీల ప్రక్రియ సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. గతేడాది బదిలీల షెడ్యూల్ ఇచ్చినా.. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులకు ప్రభుత్వం గత ఏడాది షెడ్యూల్ ఇచ్చింది. అయితే టీచర్లు ఆప్షన్లు ఇచ్చే దశలోనే నాన్ స్పౌజ్‌లు తమకు అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయుల బదిలీలు, సర్వీసుకు సంబంధించిన నిబంధనలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం రాష్ట్ర శాసనసభ రూపొందించి గవర్నర్ ఆమోదంతో జారీ చేయాలని నాన్ స్పౌజ్‌లు వాదిస్తున్నారు. కానీ జీవో 5, శాసనసభ, గవర్నర్ ఆమోదం లేకుండా అధికారులే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 162, 163 (3) ప్రకారం గవర్నర్ ఇచ్చిన బిజినెస్ రూల్స్ ప్రకారం జారీ చేశారని, ఇది చట్టబద్ధం కాదని కోర్టుకు తెలిపారు. దీంతో బదిలీలు, పదోన్నతులపై కోర్టు స్టే విధించింది. ఈ దశలో విద్యాశాఖ వాస్తవాలు చెప్పడంలో విఫలమైందనేది టీచర్ల ఆరోపణ. -
ప్రతీ 600 మందికి ఒక వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: ప్రతీ జిల్లాకు వైద్య కళాశాల ఏర్పాటు చేయడం వల్ల రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతీ 600 మందికి ఒక డాక్టర్ ఉంటారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఏఐఎఫ్‌టీవో) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని, వెయ్యికి పైగా రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ప్రతీ విద్యార్థిపై ఏడాదికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తోందని తెలిపారు. విదేశాల్లో చదివే పేద విద్యార్థులకు రూ.20 లక్షలు అందిస్తోందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐఎఫ్‌టీవో జాతీయ అధ్యక్షుడు అశ్వినికుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు నష్టం కలిగిస్తున్న కాంట్రి బ్యూటరీ పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం సెక్రటరీ జనరల్ చగన్‌లాల్ రోజ్, జాతీయ ఉపాధ్యక్షుడు పి. శ్రీపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు పాల్గొన్నారు. -
ఒత్తిడైనా.. ఒప్పించడమైనా.. ఇప్పుడే!
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతుల సాధనకు ఇదే సరైన సమయమని ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సంసిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే నేపథ్యం, టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చే నిర్ణయం తమకు కలిసి వస్తుందని టీచర్లు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది ఉపాధ్యాయులు, 4 లక్షల మంది కుటుంబసభ్యులున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో వీరి పాత్ర లేకున్నా, ఎంతోకొంత ప్రభావం ఉంటుందనేది వాస్తవం. దీంతో ప్రభుత్వం ముందున్న తమ డిమాండ్ల సాధనకు ఉపాధ్యాయ సంఘాలు పావులు కదుపుతున్నాయి. విద్యాశాఖలో దాదాపు 20 వేల ఖాళీలుండగా, 10 వేల మందికి తక్షణ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. దీంతో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నియామకం అవసరం ఉంటుంది. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు ఏడేళ్లుగా బదిలీలు కోరుకుంటున్నారు. ఎవరి వ్యూహం వారిదే ప్రభుత్వంతో సత్సంబంధాలతో ముందుకెళ్లే సంఘాలు ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వారం రోజుల్లో ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు యత్నిస్తున్నాయి. బదిలీలు, పదోన్నతులు ఇస్తే ఉపాధ్యాయులు ప్రభుత్వం పట్ల మరింత సానుకూల ధోరణితో ఉండే వీలుందని సంఘాల వారు నచ్చజెప్పాలనుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే వీలైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేయొచ్చని, దీంతో లక్షల మంది ఉపాధ్యాయ కుటుంబాల్లో నమ్మకం పెరుగుతుందని వివరించాలనే యోచనలో ఉన్నారు. కొన్ని సంఘాలు విపక్షాలతో కలిసి దీన్నో రాజకీయ అంశంగా మలిచే అవకాశం ఇవ్వకూడదనే ధోరణిని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నాయి. ఇదిలాఉంటే, బదిలీలు, పదోన్నతులపై ఇంతకాలం ఆందోళనలు చేసిన సంఘాలు, వీటిని మరింత తీవ్రతరం చేసే యోచనలో ఉన్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఇలాంటి సమయంలో ఆందోళనల తీవ్రత పెరగకూడదనే ఆలోచనలో ఉంటుందని, కాబట్టి తమ పోరాటాలకు తలొగ్గే అవకాశముంటుందని భావిస్తున్నారు. వివరిస్తాం.. సాధిస్తాం బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉంది. మొదట్నుంచీ మా సంఘం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. వచ్చే వారం మరోసారి ఈ వ్యవహారంపై సర్కార్ పెద్దలను కలిసి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తాం. ఉపాధ్యాయ కుటుంబాలకు సర్కార్ సానుకూలంగా ఉందనే సంకేతాలు అందిస్తాం. – బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరాటంతోనే సాధన బదిలీలు, పదోన్నతులు సాధించేందుకు ఇప్పటివరకు ఎన్నో పోరాటాలు చేశాం. ఇప్పుడు దీన్ని మరింత ఉధృతం చేస్తాం. త్వరలోనే ఉపాధ్యాయ ఐక్య పోరాట వేదిక సమావేశమవుతుంది. కలిసి వచ్చే సంఘాల అభిప్రాయాలు తీసుకుంటాం. ఉపాధ్యాయ సమస్యల సాధనలో కొత్త తరహా ఆందోళనలు చేపడతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. – చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఏపీలో ఉపాధ్యాయ సంఘాలకు షాక్
-
విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. మెరుగైన విద్యకు బాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్జీటీ, ఇద్దరు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్‌పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్‌లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు. -
టీచర్స్ జాక్టో చైర్మన్‌గా సదానందగౌడ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) పూర్తిస్థాయి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకుంది. సమితి చైర్మన్‌గా జి.సదానందగౌడ్, కార్యదర్శిగా ఎం.రాధాకృష్ణ, కోశాధికారిగా కె.కృష్ణ, ప్రచార కార్యదర్శిగా కల్వదర్శి చైతన్య, కో–చైర్మన్లుగా కొంగల వెంకట్, సిహెచ్.శ్రీనివాస్, జి.హేమచంద్రుడు, డీవీ రావ్, వైఎస్ శర్మ, అలీంబాబా ఎన్నికైనట్టు జాక్టో ఓ ప్రకటనలో తెలిపింది. ఉపాధ్యాయ సమస్యలపై బలమైన పోరాటాలు నిర్మించాలని ఈ సందర్భంగా జాక్టో తీర్మానించింది. -
ఫోన్ వచ్చింది.. మాట మారింది
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనుక బయట శక్తుల ప్రమేయం ఉన్నట్లు పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. వారి వెనుక రాజకీయ అజెండా దాగుందని, ఆ సంఘాలపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని వెల్లడించింది. ఫిట్మెంట్ మినహా మిగిలిన పీఆర్సీ అంశాలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒప్పుకున్నాక ముగ్గురు ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు రావడంతో మాట మార్చారని బహిర్గతం చేసింది. పీఆర్సీ అంశంపై తమకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, కొందరి ప్రోద్బలంతో జరుగుతున్న ఆందోళనలపై ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్, ఎస్టీయూ అధ్యక్షులు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో సమ్మె విరమణకు అంగీకరిస్తున్నామని తెలియచేసి బయటకు వచ్చాక ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట మారుస్తున్నారని తెలిపారు. ఫోన్లు రావడంతో వెళ్లిపోయారు: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల సందర్భంగా ఫిట్మెంట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు వచ్చాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏను దాదాపు తెలంగాణతో సమానంగా సాధించామన్నారు. కొంతమంది ప్రతి అంశంలోనూ చర్చల్లో పాల్గొని ఇప్పుడు తమను మాట్లాడనివ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. ఫిట్మెంట్ వారికి ప్రధాన అంశమైనప్పుడు మిగతా అంశాలపై చర్చల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన తర్వాత జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఫిట్మెంట్ మినహా అన్నీ బాగా జరిగాయని వారే అన్నారని గుర్తు చేశారు. సమ్మె విరమిద్దామంటే సరేనన్నారని చెప్పారు. ఒకరిద్దరు ప్రెస్మీట్లో కూర్చుని ఫోన్లు రావడంతో వెళ్లిపోయారని తెలిపారు. దీన్నిబట్టి ఎవరు, ఎవరి వల్ల ప్రభావితమవుతున్నారో ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. కొందరికి సమ్మె జరగలేదనే అసంతృప్తి ఉందని, వారే రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగులైతే మా శవయాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై దుష్ప్రచారాలు, ట్రోలింగ్లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఒప్పుకున్నాక ఫోన్లు చేసిందెవరు?: బొప్పరాజు హెచ్ఆర్ఏ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తామే సాధించామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పుకుంటున్నారని, అదే సమయంలో చర్చల్లో తమను మాట్లాడనీయడంలేదని చెబుతున్నారని, దీన్నిబట్టే వారు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుస్తోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ మినిట్స్ చూస్తే ఎంత పారదర్శకంగా చర్చలు జరిపామో తెలుస్తుందని స్పష్టం చేస్తూ ఆ పుస్తకాన్ని చూపారు. హెచ్ఆర్ఏ, సీసీఏ తామే సాధించామని చెప్పుకుంటున్నప్పుడు వారిని మాట్లాడకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకున్నాక ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? ఎవరి నుంచి వారికి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు. తమతోపాటు ప్రెస్‌మీట్‌కు వస్తూ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ హృదయరాజు వెళ్లిపోయారని వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ఒత్తిడి వచ్చిందని, ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. సంతకాలు చేసి బయటకు వెళ్లాక మాట మార్చారన్నారు. ప్రతి విషయాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా సీఎం చెప్పారన్నారు. సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత రాజకీయ అజెండాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులను ఒత్తిడి చేయవద్దని వారి వెనుక ఉన్న పెద్దలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులతో సంబంధం లేదని శక్తులు ఇందులో జొరబడుతున్నాయన్నారు. ఐక్య ఉద్యమాల్లో పని చేసినప్పుడు ఏది జరిగినా సమష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతరులపై నిందలు మోపడం ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఎవరు నేర్పారని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికీ లాభమే: బండి కొందరు ఉపాధ్యాయులు తమ ఫొటోలకు దండలు వేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, దహన సంస్కారాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సూచించారు. తమ కుటుంబ సభ్యుల్ని కూడా బూతులు తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి జీతంలో రూ.6 నుంచి రూ.7 వేల నష్టాన్ని నివారించి రూ.6 నుంచి రూ.8 వేల లాభం వచ్చేలా చేశామన్నారు. తాము ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని చెప్పారు. తాము ఉద్యోగులకే విశ్వాసంగా ఉన్నామని తెలిపారు. చేతిలో సెల్‌ఫోన్ ఉందని ఇష్టం వచ్చిన్లు ట్రోల్ చేయడం మర్యాద కాదన్నారు. తమపై చెడుగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ముసుగులో ఇదంతా ఎవరు చేస్తున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు పోరాటం చేసి ఎక్కువ ఫిట్మెంట్ సాధిస్తే వారి కాళ్లకు దండం పెడతామన్నారు. అంత జనాభా లేకున్నా సాధించాం: సూర్యనారాయణ ఉద్యోగులతో సంబంధం లేనివారు తమ నలుగురిని దోషులుగా చిత్రీకరిస్తూ సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడరని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అంత జనాభా లేకపోయినా వెలగపూడికి 24 శాతం హెచ్ఆర్ఏ సాధించటాన్ని బట్టి పెరిగినట్లా.. తగ్గినట్లా? అనేది ఉద్యోగులు ఆలోచించాలన్నారు. పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలని విధానపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐదేళ్లకు వెనక్కి తీసుకురావడం గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర అనుబంధ ఉద్యోగులకు తమతోపాటు పీఆర్సీ అమలు చేసేలా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎంతో సమావేశంలో టీచర్ల సంఘాల నేతలు ఏమన్నారంటే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చాలా భేషుగ్గా అమలు చేస్తున్నారనేది వాస్తవం సర్. అమ్మఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలు లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ ఐదు సంవత్సరాలే మా వర్గానికి చేసే అవకాశం ఉంటుంది. పీఆర్సీ అమలులో ఒక్కొక్కసారి ఒక్కో జీవోలో కొంతమందిని విస్తరిస్తున్నారు. పబ్లిక్ సెక్టార్‌కు, గురుకుల టీచర్లకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా 5 సంవత్సరాల నుంచి ఆలస్యమవుతోంది. వాళ్ల బడ్జెట్లో, వాళ్ల బోర్డుకి సంబంధించి ఇచ్చే జీవోలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు ఇచ్చే జీవోలోనే అందరు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేలా చూడాలి. అశోతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటకు రాకపోతే చాలా అంశాల్లో మాస్టర్ స్కేల్స్ లాంటివి బయటకురావు. అవి బయటకు వస్తేనే కొన్ని అంశాల్లో ముందుకుపోయే పరిస్థితి ఉంటుంది. అదనపు పెన్షన్ అలాగే ఉండేలా చూడాలి. హెచ్ఆర్ఏ, సీసీఏ కొత్తగా ఇవ్వకపోయినా, అలాగే ఉంచినా సరిపోతుంది. ఫిట్‌మెంట్‌పై మీరే ఆలోచన చేసి చేయాలని కోరుకుంటున్నాను. అనామలిస్ కమిటీ మీ ద్వారానే వేయాలని కోరుతున్నా. – హృదయరాజు, ఏపీటీఎఫ్ నేత సీఎంతో నాటి సమావేశంలో టీచర్ల సంఘం నేత ఏమన్నారంటే.. (వీడియో సాక్ష్యంతో) స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూలేని సంస్కరణలు విద్యాశాఖలో తీసుకొచ్చిన సీఎంకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు స్వయంగా పరిశీలించి విద్యార్థులకు షూలు, యూనిఫామ్స్, బ్యాగ్‌తో సహా ఇస్తూ విద్యాభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకువెళుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మావి 2 సమస్యలున్నాయి. సర్వీసు రూల్స్ లేకపోవడంతో ఒక ఉపాధ్యాయుడు చేరిన దగ్గర నుంచి 35, 40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్ అవుతున్నారు. మీరు తప్పనిసరిగా విద్యా శాఖ సర్వీసు రూల్సు రూపొందించి పదోన్నతులకు శ్రీకారం చుట్టాలి. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేయాలి సర్. మాకు బల్క్‌గా సాధారణ బదిలీలు ఇస్తే బాగుంటుంది. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సర్.. – ఎస్టీయూ నేత జోసెఫ్ సుధీర్‌బాబు -
ముందు ఒప్పుకొని.. ఆపై మాట మార్చడం తగదు
సాక్షి, అమరావతి/ఏఎన్‌యూ: పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు పలు టీచర్ల సంఘాలు కూడా చర్చల్లో పాల్గొని, ఆయా అంశాల్లో ఆమోదం తెలిపాక.. బయటకొచ్చి మాటమార్చడం సరికాదని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హితవుపలికాయి. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా నిరసనల పేరుతో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులను రెచ్చ గొట్టడం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ప్రకటనలు విడుదల చేశాయి. కొందరు టీచర్ల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చర్చలు జరిగి డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకొన్నాక కూడా మళ్లీ ధర్నాలు, నిరసనలకు దిగడం, జేఏసీ నాయకులను దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటప్పారెడ్డి ప్రశ్నించారు. పది మందికి చదువులు చెప్పే ఉపాధ్యాయుల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలను తెరవకున్నా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ సకాలంలో వేతనాలు అందేలా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. నాయకులమని చెప్పుకొనే వారు రాష్ట్ర ప్రజల గురించి కూడా ఆలోచించి మసలుకోవాలని హితవుపలికారు. పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యల్లో చాలా వాటిని సీఎం పరిష్కరింపజేసి మేలు చేశారని, యూనివర్సిటీల్లో ఉన్న బోధనేతర సిబ్బందికి హెచ్ఆర్ఏను 8 శాతం నుంచి 16 శాతం వరకూ పెంచారని గుర్తు చేశారు. గతంలో ఉద్యోగులు అడగకున్నా ఐఆర్‌ను 20 శాతం నుంచి 27 శాతానికి పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా అడిగినవన్నీ దాదాపుగా ఒప్పుకున్నందున సీఎం వైఎస్ జగన్‌కు వెంకటప్పారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం? మంత్రుల కమిటీతో సుదీర్ఘ చర్చల అనంతరం హెచ్ఆర్ఏ రేట్ల పెంపుతో పాటు, ఐఆర్ రికవరీ నిలుపుదల, ఐదేళ్ల కోసారి పీఆర్సీ, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి తెలిపారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఫిట్మెంట్ 23 శాతం కంటే ఎక్కువ ఇవ్వలేకపోయామని స్వయంగా సీఎం చెప్పారని, కానీ కొన్ని సంఘాలు చర్చల సమయంలో అన్నింటికీ ఒప్పుకుని, బయటకొచ్చి వ్వతిరేకిస్తున్నామనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే చేయలేమని, అర్థం చేసుకోవాలని సీఎం కోరాక కూడా నిరసనలకు పిలుపునిచ్చారంటే ఎవరివో రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం చెప్పినందున నిరసనల విషయంలో పునరాలోచించాలని జాలిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరితో సమానంగా పీఆర్సీ వర్తింపు చరిత్రాత్మకం ఇదిలా ఉండగా ఏపీ మోడల్ స్కూల్స్ సొసైటీతో పాటు ఇతర గురుకులాల సొసైటీల్లో పనిచేస్తున్న టీచర్లకూ ఇతర ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల టీచర్లతో పాటు ఏకకాలంలో 11వ పీఆర్సీని వర్తింపజేయడం సంతోషకరమని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోషియేషన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడపర్తి చంద్రశేఖర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకముందు అందరికీ వర్తింపజేసినా ఒకటి లేదా రెండేళ్లకు గానీ సొసైటీ టీచర్లకు పీఆర్సీ అమలుచేసేవారు కాదని, ఇప్పుడు నేరుగా వర్తింపజేయడం చరిత్రాత్మకమని వారు కొనియాడారు. మిగతా టీచర్లతో పాటు మోడల్ స్కూళ్ల టీచర్లకూ మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తూ ఈ పీఆర్సీ జీవోలోనే పొందుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
సంతకాలు పెట్టి.. బయటకు వెళ్లాక మాట మారుస్తారా?
సాక్షి, అమరావతి: చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఉపాధ్యాయుల గురించి వారు అడగడంవల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను 9 శాతం నుంచి 10 శాతానికి పెంచి రూ.10 వేల సీలింగ్‌ను రూ.11 వేలకు పెంచామని తెలిపారు. ఫిట్మెంట్ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఫిట్‌మెంట్‌పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైనా చర్చించే వారమని సజ్జల తెలిపారు. చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు. అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదన్నారు. బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయట నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
తల్లిదండ్రుల ఓటు ఇంగ్లిష్ మీడియానికే
పేద పిల్లలు ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రపంచంతో పోటీపడాలని ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు అడ్డుకోవడం తగదని పలు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పోటీని దీటుగా ఎదుర్కొనేలా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తల్లిదండ్రులందరూ మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6వ తరగతి వరకు.. ఆ పై సంవత్సరాల్లో వరుసగా ఇతర తరగతుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని అమ లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీలు తమ స్కూళ్లలో పిల్లలకు ఆంగ్ల మాధ్యమం ద్వారా విద్యనందించాలని తీర్మానాలు చేసి పంపించాయి. విచిత్రం ఏమిటంటే ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగు తోంది. తెలుగు మాధ్యమం ఆప్షన్ వారి దరఖాస్తు ఫారాల్లో ఉండదు. తెలుగును పూర్తిగా విస్మరించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు సబ్జెక్టును ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాల ప్రకారం కాకుండా తమ వర్క్ పుస్తకా ల ద్వారా ప్రశ్నలు, జవాబులను బట్టీ పట్టిస్తున్నాయి. బడుగులకు ఇంగ్లిష్ మీడియం వద్దా? ► ప్రభుత్వ పాఠశాలల్లో దిగువ మధ్య తరగతి, పేద, బడుగు, బలహీన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారు. వారందరికీ ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందించడానికి, నాణ్యమైన చదువు చెప్పించడానికి వైఎస్ జగన్ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని వేగంగా అడుగులు వేసింది. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతూ జీవోలు జారీ చేసింది. ప్రభుత్వం సమున్నత లక్ష్యంతో, సామాజిక బాధ్యతతో ఈ నిర్ణయం తీసుకుందని బడుగు, బలహీన వర్గాల నుంచి విశేష స్పందన వచ్చింది. ► సమాజంలోని అన్ని వర్గాలు.. ఇంగ్లిష్ మీడియం పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ప్రభుత్వానికి మంచి పేరు రావడాన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా.. ‘మాతృ భాష పరిరక్షణ’ పేరుతో పలు రూపాల్లో అడ్డుతగలడం ప్రారంభించాయి. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా, తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుందని.. మాతృభాషకు ఇబ్బంది రానివ్వమని ప్రభుత్వం ఎంత చెప్పినా వారి చెవికెక్కలేదు. ► ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మొదలు, ఆ పార్టీ నాయకులంతా వ్యతిరేకించారు. ఏదో రకంగా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. న్యాయ స్థానాలను ఆశ్రయించి, ప్రభుత్వ నిర్ణయాలు అమలు కాకుండా అడ్డుకున్నారు. ఆహ్వానించిన టీచర్ల సంఘాలు ► రాష్ట్రంలోని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఇంగ్లిష్ మీడియం బోధనకు సిద్ధం ► ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగును మరింత పరిపుష్టం చేసేలా తప్పనిసరి చేస్తూ ఆ పాఠ్యపుస్తకాలను మరింత పటిష్టమైన రీతిలో రూపొందించింది. ► టీచర్లకు ఆంగ్ల మాధ్యమ నైపుణ్యం కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే సెలవుల్లో సైతం సంతోషంగా హాజరయ్యారు. శిక్షణ లో నేర్చుకున్న అంశాల తర్వాత వారి లో మరింత ఉత్సాహం, ఆత్మ విశ్వాసం పెరిగింది. ► ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ స్కూళ్లు మూతపడి ఉన్నప్పటికీ వారంతా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు బోధ్ శిక్షా లోకమ్ యాప్ ద్వారా ఆంగ్ల మాధ్యమ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో నిమగ్నమయ్యా రు. స్కూళ్లు తెరవగానే తమ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలోనే ఆయా సబ్జెక్టులను బోధించేందుకు సిద్ధమవుతున్నారు. ► రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో కలుపుకొని 3,05,856 మంది టీచర్లున్నారు. వారిలో దాదాపు 2 లక్షల మంది వరకు ప్రభుత్వ టీచర్లు.. టీచర్ ఎలిజిబులిటీ టెస్టు, ఆపై టీచర్ రిక్రూట్మెంటు టెస్టు (డిఎస్సీ)లో మెరిట్ సాధించి ఆయా పోస్టులు సాధించిన వారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు స్కూళ్లలో కంటే ప్రభుత్వ స్కూళ్లలోనే ఆంగ్ల మాధ్యమాన్ని విజయవంతం చేయగలుగుతామని టీచర్లంతా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆ మేరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ► మరోవైపు తెలుగు మాధ్యమం పాఠశాలను కూడా మండలానికి ఒకటి ఏర్పాటు చేసి, విద్యార్థులు వచ్చి వెళ్లేందుకు వీలుగా అన్ని సదుపాయాలు కల్పించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. -
జిల్లాలో చీలిన ‘తపస్’
సిద్దిపేటఎడ్యుకేషన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్)కు మూకుమ్మడిగా రాజీమానామాలు చేసిన ఆ సంఘం రాష్ట్ర, జిల్లా, ప్రాథమిక సభ్యులు పలువురు శుక్రవారం రాత్రి భారతీయ ఉపాధ్యాయ సంఘం పేరుతో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం నూతన సంఘం కన్వీనర్ పబ్బతి శ్రీనాకర్‌రెడ్డి మాట్లాడుతూ తపస్ జిల్లా శాఖలో ఏడాదిగా జరిగిన పరిణామాలను ఎప్పటికప్పుడు రాష్ట్రశాఖ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఇటీవల జరిగిన సంఘం జిల్లా ఎన్నికల విషయంలో సైతం అవకతవకలు జరిగియాని ఆరోపించారు. దీంతో తాము తీవ్ర మనస్థాపానికి గురై తప్పనిసరి పరిస్థితుల్లో నూతన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. భారతీయ ఉపాధ్యాయ సంఘం దేశం కోసం నిలబడుతుందని చెప్పారు. విలువలను పెంపొందిస్తూ దేశభక్తిని కలిగి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతామని చెప్పారు. కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తూ విద్యాభివృద్ధికి తోడ్పడతామని పేర్కొన్నారు. తమ సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. అందులో భాగంగా త్వరలో పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకుని అన్ని జిల్లాల్లో పర్యటించి సమావేశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఉపాధ్యాయున్ని కలిసి తమ సంఘం విధి విధానాలు, చేపట్టే కార్యక్రమాలను వివరించి అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కో కన్వీనర్లు మొలకంల శ్రీనివాస్, ధరవాత్ రమేశ్, వైవి శశికుమార్, గడీల శ్రీకాంత్, ప్రవీణ్, బి. శశికుమార్, బొజ్ఞ అశోక్, సభ్యులు సింగోజు జనార్థన్, వంగ నర్సిరెడ్డి, కొండం మధుసూధన్ రెడ్డి, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, రిక్కల రవీందర్‌రెడ్డి, 20 మంది సభ్యులు పాల్గొన్నారు -
టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ నియోజకవర్గ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల అభ్యర్థిగా కోమటిరెడ్డి నర్సింహారెడ్డి పోటీ చేయనున్నారు. పదేళ్ల పాటు నల్గొండ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడిగా, సహా అధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం పీఆర్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు పీఆర్టీయూ టీచర్లతో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి పీఆర్టీయూ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ పూల రవీందర్ పోటీలో ఉంటారని ఇప్పటికే పీఆర్టీయూ ప్రకటించగా, ప్రస్తుతం నర్సింహారెడ్డి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. -
దారితప్పిన ‘ప్రత్యేక అభివృద్ధి నిధి’!
సాక్షి, హైదరాబాద్: తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగించాల్సిన ప్రత్యేక అభివృద్ధి నిధి దారితప్పుతోంది. ప్రజా ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడాల్సిన ఈ నిధి ప్రజాప్రతినిధుల అవసరాలు తీర్చేలా తయారవుతోంది. ప్రణాళిక శాఖ పరిధిలోని ప్రత్యేక అభివృద్ధి నిధి (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కేటాయింపులు నేరుగా ముఖ్యమంత్రి ఆదేశానుసారం జరుగుతాయి. సాధారణంగా ఈ నిధులను గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, రోడ్లు, శాఖలపరంగా కేటాయించని వాటిలో తక్షణ అవసరాలు, ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అత్యవసర కార్యక్రమాలకు వినియోగిస్తారు. కానీ ఈసారి కొత్తగా ఒక గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘ భవనానికి మరమ్మతుల నిమిత్తం కేటాయించడం చర్చనీయాంశమైంది. నారాయణగూడలోని ఓ ఉపాధ్యాయ సంఘ భవనానికి మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.86 లక్షలు కేటాయించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు పరిపాలనా అనుమతులిస్తూ ఈ నెల 1న ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ ఉత్తర్వుల కాపీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సిఫారసుతో.. నారాయణగూడలోని ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యాలయ భవనానికి మరమ్మతుల నిమిత్తం నిధులు కేటాయించాలంటూ అధికార పార్టీకి చెందిన ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విన్నవించారు. ఎమ్మెల్సీ కాపీకి జతగా సంఘం తరఫున లెటర్‌ప్యాడ్‌తో కూడిన వినతిపత్రాన్ని జోడించారు. దీనికి సంబంధించిన ఫైలు గత నెల 31న ముఖ్యమంత్రికి చేరిన వెంటనే సీఎం సంతకం చేశారు. మరమ్మతులకు సంబంధించిన ఫైలుకు ఒక్కరోజులోనే మోక్షం లభించడం గమనార్హం. ఇదిలా ఉండగా, ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధులు కేటాయించిన భవనానికి రెండేళ్ల క్రితమే దాదాపు రూ.76 లక్షలతో మరమ్మతులు చేసినట్లు సమాచారం. ఈ నిధులను అప్పట్లో సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం) కోటాలో సదరు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతకు ముందు కూడా రూ.10 లక్షలతో మరమ్మతులు చేశారని సమాచారం. రెండేళ్ల క్రితమే ప్రభుత్వ నిధులతో మరమ్మతులు నిర్వహిస్తే.. మళ్లీ అదే స్థాయిలో నిధులు కేటాయించడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పనుల నిర్వహణలో లోపాయికారీ ఒప్పందాలు ఉన్నాయంటూ ఉపాధ్యాయ సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. -
వెబ్ కౌన్సెలింగ్ వద్దే..వద్దు
ఉపాధ్యాయుల బదిలీల్లో వెబ్‌కౌన్సెలింగ్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలిరోజు శనివారం జరిగిన హెచ్ఎంల వెబ్‌కౌన్సెలింగ్‌లో గందరగోళం నెలకొంది. ఆప్షన్లు ఇచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం, ఖాళీలు కనిపించకపోవడం తదితర పరిణామాలతో ఆందోళనకు దిగారు. – నల్లగొండ నల్లగొండ : టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబం ధించి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సెలింగ్ రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, టీచర్లు ఆందోళనకు దిగారు. తొలిసారిగా శనివారం జరిగిన ప్రధానోపాధ్యాయుల వెబ్‌కౌన్సెలింగ్ గందరగోళానికి దారితీసింది. వెబ్‌కౌన్సెలింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్ కాకపోవడంతో ఆప్షన్లు ఇచ్చుకునే క్రమంలో హెచ్ఎంలు అనేక రకాలు ఇబ్బందులు పడ్డారు. స్పౌజ్ కేటగిరీలో బదిలీ అయిన పోస్టు ఒక దగ్గర చూపిస్తే.. స్పౌజ్ పనిచేస్తున్న ప్రదేశం మరో దగ్గర చూపిస్తుందని హెచ్ఎంలు తెలిపారు. బదిలీ అయిన తర్వాత ఏర్పడిన ఖాళీ పోస్టుల వివరాలు వెబ్‌కౌన్సెలింగ్‌లో కనిపించడం లేదని దాంతో తాము కోరుకున్న ప్రదేశంలో కాకుండా మరోచోటుకు ఆప్షన్ వెళ్తుందని తెలిపారు. ఆప్షన్ పెట్టుకున్న ప్రదేశం ఆన్లైన్లో సేవ్ కావడం లేదని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో శనివారం రెండొందల మందికి పైగా హెచ్ఎంలు వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. అయితే ఆన్లైన్ కౌన్సెలింగ్ గందరగోళంగా మారడంతో వెబ్ ఆప్షన్ల సమయాన్ని పొడగించారు. సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడగించినట్లు అధికారులు తెలిపారు. కేవలం రెండొందల మంది హెచ్ఎంల కౌన్సెలింగ్‌లోనే ఇన్ని రకాల ఇబ్బందులు ఎదురైన పక్షంలో ఎస్జీటీలు ఉమ్మడి జిల్లాలో నాలుగు వేల మందికి పైగా ఉన్నారు. కావున ఆన్లైన్ సమస్యలు తొలగించాకే కౌన్సెలింగ్ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తునారు. నాలుగో కేటగిరీ వివాదం కొలిక్కి... కౌన్సెలింగ్ నాలుగో కేటగిరీ పాఠశాలల వివాదం కొలిక్కి వచ్చింది. 2015లో జరిగిన టీచర్ల కౌన్సెలింగ్‌లోనే నాలుగో కేటగిరీ పాఠశాలలను రద్దు చేశారు. 2012లో జరిగిన కౌన్సెలింగ్‌లో ఉమ్మడి జిల్లాలో నాలుగో కేటగిరీ పాఠశాలలు 466 ఉంటే...2013లో నాలుగు స్కూళ్లకు పడిపోయాయి. దీంతో 2015కు వచ్చేసరికి అసలు జిల్లాలో నాలుగో కేటగిరీ స్కూళ్లే లేకుండాపోయాయి. అయితే 2009 నుంచి 2013 వరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనకుండా లాంగ్‌స్టాండింగ్‌లో పనిచేసిన టీచర్లకు ఈ కౌన్సెలింగ్‌లో అదనపు పాయింట్లు కల్పించాలని టీచర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహా విధానం అన్ని జిల్లాలో కల్పించినప్పటికీ నల్లగొండ జిల్లాలో మాత్రమే నాలుగో కేటగిరీకి కౌన్సెలింగ్‌లో స్థానం కల్పించలేదు. దీంతో శనివారం టీచర్లు విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్‌ను కలిశారు. విద్యాశాఖ జేడీ, డీఈఓలతో సమావేశమైన కలెక్టర్ నాలుగో కేటగిరీ అంశాన్ని పరిశీలించారు. 2012 వరకు వందల సంఖ్యలో ఉన్న నాలుగో కేటగిరీ స్కూళ్లు 2013లో అనూహ్యంగా పడి పోవడాన్ని ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. నల్లగొండ జిల్లాలో రవాణా సౌకర్యం ఉన్నటువంటి కుక్కడం, కొత్తపల్లి వంటి స్కూళ్లను నాలుగో కేటగిరీలో చేర్చడంపైన కలెక్టర్ ఆరా తీశారు. 2009 నుంచి 2013 వరకు నాలుగో కేటగిరీలో ఉన్న స్కూళ్ల జాబితాను పరిశీలించి అర్హత కలిగిన స్కూళ్ల జాబితాను పంపించేందుకు మండల స్థాయిలో కమిటీ వేశారు. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓలు ఆ స్కూళ్ల జాబితాను పరిశీలించి వెంటనే డీఈఓ కార్యాలయానికి పంపాలని సూచించారు. మండలాల నుంచి వచ్చే నాలుగో కేటగిరీ స్కూళ్ల జాబితాను డైరక్టరేట్‌కు పంపించి అక్కడి నుంచి అనుమతి పొందాక మళ్లీ సీనియారిటీ జాబితాలో మార్పులు చేయడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. -
అడ్డదారిలో టీచర్ల బదిలీలు
సాక్షి, హైదరాబాద్ : విద్యాశాఖలో అడ్డదారి బదిలీలకు తెరలేచింది. సాధారణ బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏకంగా వందలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం స్థానచలనం కల్పించింది. ఈ మేరకు విద్యాశాఖ గుట్టుగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగులకు సాధారణ బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. బదిలీ మార్గదర్శకాల రూపకల్పనలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఈ తరుణంలో అక్రమ బదిలీల ప్రక్రియ విద్యాశాఖలో కలకలం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి దాదాపు 100 మంది టీచర్లను బదిలీ చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో 150 మంది టీచర్ల బదిలీలకు సంబంధించి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో అత్యధికులు అంతర్ జిల్లా (ఇతర జిల్లాలకు) బదిలీలు పొందగా.. మరికొందరు జిల్లా పరిధి (విత్ ఇన్ డిస్ట్రిక్ట్)లో బదిలీ అయ్యారు. పలుకుబడికే పట్టం టీచర్ల బదిలీలకు భారీ మంత్రాంగమే నడిచింది. ప్రముఖుల అండదండలున్న టీచర్లకే స్థానచలనం కలిగింది. ఒక్కో టీచర్ బదిలీకి భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు తెలిసింది. సాధారణ బదిలీలు జరిగితే పట్టణ ప్రాంత పోస్టులు భర్తీ అవుతాయని భావించిన కొందరు రాజకీయ నేతలు.. అధికారులతో చేతులు కలిపి దొడ్డిదారి బదిలీలకు తెరతీశారు. అందులో భాగంగా ప్రత్యేక ఉత్తర్వులతో పట్టణ ప్రాంతాల్లో పాగా వేయాలని భావించి రంగంలోకి దిగారు. మొత్తంగా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో టీచర్ల బదిలీ వ్యవహారం సాఫీగా జరిగింది. వాస్తవానికి ఒకట్రెండు రోజుల్లో ఉపాధ్యాయుల సాధారణ బదిలీలకు మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. బుధవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రత్యేక బదిలీలు చేపట్టొద్దని సంఘాలు స్పష్టం చేశాయి. మంత్రి సైతం అంగీకరించారు. కానీ సమావేశం ముగిసిన గంటల వ్యవధిలోనే అడ్డగోలుగా బదిలీ ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. 30 శాతం హెచ్ఆర్ఏ కోసం.. తాజాగా బదిలీ పొందిన వారంతా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకే ట్రాన్స్ఫర్ అయ్యారు. పట్టణ ప్రాంతాల బదిలీకి ప్రధాన కారణం 30 శాతం హెచ్ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) రావడమే. అంతేకాకుండా రాజధాని నగరంలో నివసించే వెసులుబాటు ఉంటుందని భావించిన టీచర్లు భారీ మొత్తంలో నజరానాలు ఇచ్చుకుని మరీ దొడ్డిదారిలో బదిలీలు పొందారు. బుధవారం రాత్రి వచ్చిన బదిలీ ఉత్తర్వుల్లో సగానికిపైగా టీచర్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకే వచ్చారు. ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆయా టీచర్లు కొత్త పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు పరుగులు పెట్టారు. ఉదయం పదిన్నర గంటల సమయంలోనే డీఈవో కార్యాలయాలకు వచ్చి రిపోర్టు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 32, మేడ్చల్‌లో 19, కరీంనగర్లో 12 బదిలీలు జరిగాయి. మిగతా బదిలీలు నల్లగొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో జరిగినట్టు తెలిసింది. స్థానికులకు అన్యాయమే! ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీల వ్యవహారంతో స్థానిక నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరగనుంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా నష్టపోనున్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే స్థానిక, స్థానికేతర ఉపాధ్యాయుల నిష్పత్తి పరిమితికి మించి ఉంది. సాధారణంగా 20 శాతం ఉండాల్సిన స్థానికేతర నిష్పత్తి.. 40 శాతాన్ని మించింది. తాజాగా మరిన్ని అంతర్ జిల్లా బదిలీలు కావడంతో జిల్లాలో ఉన్న ఖాళీలు తగ్గిపోనున్నాయి. దీంతో నియామకాల సమయంలో స్థానిక అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోనున్నాయి. మండిపడ్డ సంఘాలు.. రేపు డైరెక్టరేట్ ముట్టడి అడ్డదారి బదిలీలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఎస్టీయూ, యూటీఎఫ్, టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీఆర్టీయూ సంఘాల నేతలు వీటిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచి ప్రభుత్వమే ఇలా అడ్డదారిలో బదిలీలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం కేంద్రంగా పైరవీ బదిలీలు జరగడం దారుణమన్నారు. ఈ బదిలీల రద్దుకు ఆందోళన చేస్తామని ప్రకటించారు. జాక్టో, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ను ముట్టడించాలని నిర్ణయించాయి. -
1998 డిఎస్సీ అభ్యర్థులను ముంచుతారా?
ఉమ్మడి రాష్ట్రంలో 1998లో డిఎస్సీకి ఎంపికైన అభ్యర్థులు వారికి జరిగిన అన్యాయం గురించి తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ 2015 జనవరి 11న వరంగల్ జిల్లా పర్యటనలో మాట్లాడుతూ 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డికి ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఎంపీ పసునూరి దయాకర్ ఇదే విషయం చెప్పారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై ముఖాముఖీ చర్చిం చారు. అన్యా యం జరిగిందని సీఎం స్వయంగా ప్రకటించారు. హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు మంత్రి, విద్యాశాఖ అధికారులు తిరకాసులు పెడుతూ సీఎంనే తప్పు తోవ పట్టిస్తున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. 1998 డిఎస్సీ లో నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత, నిబంధనలకు విరుద్ధంగా, అర్హత మార్కులను 5 వరకు తగ్గించి, మరల అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిపించి, వారికి ఉద్యోగం ఇచ్చారు. తెలం గాణ ప్రభుత్వంలోని 40 మంది ఎన్నికయిన శాసనసభ సభ్యులు, 6 గురు ఎమ్మెల్సీలు, 6గురు పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, 10 ఉపాధ్యాయ సంఘాలు 1998 డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. బుధవారం సీఎం కేసీఆర్, ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ సంఘ సభ్యులతో చర్చలు జరిపిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ముంచుతారా, తేలుస్తారా, ఇచ్చిన హామీలను (సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి) అమలు చేస్తారా అని 1,500 మంది క్వాలిఫైడ్ టీచర్ల కుటుంబాలు ఆశలు పెట్టుకుంటున్నారు. రాజేష్ రావుల, లెక్చరర్, కరీంనగర్ మొబైల్ : 98488 11424 -
సీపీఎస్ విధానం రద్దు చేయాలి
వేములవాడఅర్బన్ : సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం కొనసాగించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల నాయకులు డిప్యూటీ తహసీల్దార్ నవీన్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సేవా నిబంధనలను అమలు పరచడానికి కోర్టు ద్వారా క్లీయర్ చేసి, పదోన్నతులు, బదీలీలు చేపట్టాలన్నారు. అర్హత గల ఎస్ఎలకు జెఎల్స్, డైట్ లెక్చర్స్గా పదోన్నతులు కల్పించాలన్నారు. మండల అధ్యక్షుడు రవి, శ్రీనివాస్, శ్రీధర్‌చారీ, గోపాల్‌కిషన్, కనుకయ్య, సుజాత, జీవన్‌రెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. సర్వీస్ రూల్స్ అమలు చేయాలి కోనరావుపేట : విద్యారంగంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్‌కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్)నాయకులు బుధవారం వినతిపత్రాన్ని సమర్పించారు. అధ్యక్షుడు కనుకయ్య మాట్లాడుతూ సీపీఎస్ విధానంతో ఉపాధ్యాయులు నష్టపోతున్నారని, ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏకీకృత సేవా నిబంధనలు అమలు చేయాలన్నారు. శ్రీకాంత్‌రావు, ప్రసాద్, హరిప్రసాద్, నరేశ్, రమేశ్, శ్రీనివాస్ ఉన్నారు.