సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు.
స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు.
బోనాలతో ప్రత్యేక ర్యాలీ..
బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు.
ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు
ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment