ముగిసిన ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్
ముగిసిన ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్
Published Thu, Aug 3 2017 11:29 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM
10255 దరఖాస్తులు..8150 మందికి బదిలీ
భానుగుడి(కాకినాడ): జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ ముగిసింది. ఎనిమిదేళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్య ఉపాధ్యాయ సంఘాల పోరు పుణ్యమా అని నేటికి సమసింది. జిల్లాలో 10,255 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోగా 8150 మంది బదిలీ అయ్యారు. 2105 మంది ఉపాధ్యాయులు కావాల్సిన పాఠశాలల్లో స్థానం దొరక్క పూర్వపు పాఠశాలలకే పరిమితమయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉపాధ్యాయులను ఆది నుంచీ గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది. ఏ బదిలీ సమయంలోనూ లేనంతగా ఏకంగా 21 జీవోలను, పలు సవరణలను విడుదల చేసి రోజుకో రీతిన ఇబ్బందులు సృష్టించింది. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చడం, తేదీలను మార్చడం, అర్ధరాత్రి జాబితాలను ప్రకటించడంతో ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా నెట్‌సెంటర్ల చుట్టూ ప్రదిక్షణలు చేసిన పరిస్థితి ఏర్పడింది.
60 మంది సిబ్బంది..రెండు సెంటర్లు..13 రోజులు.
బదిలీ కౌన్సెలింగ్‌లో డీఈఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రత్యేకాధికారులు ఇలా మొత్తంగా 120 మంది సిబ్బంది పని చేశారు. కౌన్సెలింగ్‌కు డీఈఓ కార్యాలయంలోని ఎస్‌ఎస్‌ఏ సమావేశ మందిరంతో పాటుగా, పీఆర్‌జీ బాలుర ఉన్నత పాఠశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. జులై 22 నుంచి ఆగస్టు 3 వరకూ 13రోజుల పాటు కౌన్సెలింగ్‌ను ఉదయం 9గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ పలు అంతరాయాల నడుమ కొనసాగించారు. కౌన్సెలింగ్ జరిగిన సమయంలో ప్రతీ రోజు ఏదొక సమయంలో సర్వర్ పనిచేయక అర్ధాంతరంగా కౌన్సెలింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చేది. దీంతో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ తేదీలలో మార్పులు చేయాల్సి వచ్చేది.
5న ఎస్జీటీల జాయినింగ్
ఆగస్టు 1 నుంచి 3 వరకూ జరిగిన ఎస్జీటీల కౌన్సెలింగ్‌లో బదిలీ పొందిన ఉపాధ్యాయులకు రిలీవింగ్ ఆదేశాలను శుక్రవారం అందిస్తామని వీరంతా ఆగస్టు 5న నూతన పాఠశాలల్లో ప్రవేశిస్తారని డీఈఓ ఎస్.అబ్రహం పేర్కొన్నారు.
Advertisement