పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. ఈ ఉదంతంపై ఆగ్రహాజ్వాలలు రగులుతున్న నేపథ్యంలో మరికొన్ని చోట్ల సైతం చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన రేపుతోంది.
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ కామాంధుడి దాహానికి బాలిక బలైపోయింది. 14 ఏళ్ల మైనర్‌పై ఓ కీచక టీచర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే బాధితురాలు 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచింది. రాష్ట్రంలోని సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిందితుడు విశాంబర్ ఇంకా పరారీలో ఉండటం గమనార్హం.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పాఠశాలలో స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో పాల్గొనేందుకు బాలికను పిలిచాడు. అనంతరం ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక భయపడి ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఘటన తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది.
ఆమెను ఛత్తీస్‌గఢ్‌లోని బంధువుల వద్దకు పంపగా.. అక్కడ ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో బాధితురాలు మౌనం వీడి తనకు జరిగిన విషయాన్ని అత్తకు చెప్పడంతో ఆమె ఆస్పత్రిలో చేర్చింది. అనంతరం కుటుంబ సభ్యులు నిందితుడిని నిలదీయగా.. అతడు వారికి రూ. 30 వేలు ఇచ్చి ఈ విషయం ఎవరికి చెప్పవద్దని బెదిరించాడు.
దీంతో కుటుంబ సభ్యులు భయపడి ఘటనపై అధికారులకు ఫిర్యాదు చేయలేదు. అయితే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమె తండ్రి జూలై 10న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాకు చెందిన విశాంబర్‌పై కేసు నమోదు చేశారు. బాలికను వారణాసిలోని బనారస్ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మరణించింది.
మరోవైపు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా కోల్‌కతాలో వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నేడు దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్ధులు ఆందోళనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వైద్యులు నిరసనకు దిగారు. ఆదివారం ఉదయం 6 గంటల వరకు వైద్యుల నిరసన కొనసాగనుంది. డాక్టర్ల ఆందోళనలతో ఓపీ సేవలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment