
కోల్‌కతా వైద్యురాలిపై హత్యచారం ఘటన అనంతరం దేశంలో ఎక్కడో ఒక్క చోట మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిన్నారులు, యువతులు, మహిళలు ఇలా అందరిపై లైంగిక వేధింపుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న మహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ అత్యాచారానికి పాల్పడిన సంగతి విదితమే. ఇది జరిగిన మరుసటి రోజే అదే జిల్లాలోని అకోలాలో మరో విద్యార్థినులపై వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది.
కాజీఖేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలకు అసభ్యకర వీడియోలు చూపిస్తూ వారిపై వేధింపులకు పాల్పడినట్లు తేలింది. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడు ప్రమోద్ మనోహర్ సర్దార్‌పై కేసు నమోదు చేసి మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రమోద్‌పై ఆరుగురు బాలికలు ఫిర్యాదు చేశారని అకోలా ఎస్పీ బచ్చన్ సింగ్ తెలిపారు. విద్యార్థినులను ఉపాధ్యాయుడు వేధింపులకు గురి చేసేవాడని, అసభ్యకరమైన వీడియోలు చూపించేవాడని పేర్కొన్నారు. బాధిత విద్యార్థినుల వాంగ్మూలాలను నమోదు చేశామని.. నిందితుడిపై బీఎన్‌ఎస్, పోక్సో చట్టంలోని సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment