తిరువనంతపురం: విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ట్యూషన్ టీచర్‌కు కేరళలోని స్పెషల్ ఫాస్ట్–ట్రాక్ కోర్టు ఏకంగా 111 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. సంరక్షకుడిగా వ్యవహరించాల్సిన వ్యక్తి, ఇటువంటి నేరానికి పాల్పడినందున జాలి చూపాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన మనోజ్(44) తను ఉండే ఇంట్లోనే ట్యూషన్లు చెబుతుండేవాడు. అతడి వద్దకు వచ్చే 11వ తరగతి బాలికను 2019లో ఓ రోజు ప్రత్యేక క్లాసుకని పిలిపించుకున్నాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదంతా సెల్‌ఫోన్‌లో షూట్ చేశాడు.
ఈ ఘటనతో భయపడిపోయిన బాలిక ట్యూషన్‌కు వెళ్లడం మానేసింది. మనోజ్ తన ఘనకార్యాన్ని చెప్పుకునేందుకు ఆ ఫొటోలను మరికొందరికి పంపాడు. విషయం తెలిసి బాధితురాలి కుటుంబీకులు ఫోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మనస్తాపానికి గురైన మనోజ్ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. మనోజ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి సెల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. బాలికపై అత్యాచారం జరిపిన ఫొటోలు అందులో ఉన్నట్లు గుర్తించారు.
అయితే, అదే సమయంలో ఆఫీసులో ఉన్నట్లు అక్కడి రిజిస్టర్‌లోని సంతకం చూపి పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. కానీ, మనోజ్ ఫోన్‌లోని కాల్ రికార్డుల ఆధారంగా అవన్నీ తప్పని తేలింది. దీంతో, ప్రత్యేక కోర్టు నిందితుడికి 111 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.1.05 లక్షల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఏడాది అదనంగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని జడ్జి ఆర్.రేఖ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment