dharna chowk
-
విజయవాడ ధర్నా చౌక్ లో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ వీఓఏల ధర్నా
-
తెలంగాణ రాష్ట్రమంతా ఓపీ బంద్
సాక్షి నెట్వర్క్: కోల్‌కతాలో యువ డాక్టర్‌పై హత్యాచారాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా శనివారం ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ వైద్య సేవలు నిలిచిపోయాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా కేంద్రాల్లో పలు రూపాల్లో డాక్టర్లు, వైద్యసిబ్బంది నిరసన వ్యక్తం చేశాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా చేశారు. పెద్దఎత్తున డాక్టర్లు, వైద్య సిబ్బంది, రాజకీయనేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పొల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ తాను ఒక ఎంపీగా ఇక్కడకు రాలేదని ఓ వైద్యురాలిగా తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధతో ఇక్కడకు వచ్చినట్టు తెలిపారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతానని ఆమె డాక్టర్లకు హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా ఉరి తీసినా తప్పు లేదన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కాళీప్రసాదరావు మాట్లాడుతూ డాక్టర్లకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలతోపాటు భద్రత కల్పించాలన్నారు. అనేక చట్టాలు ఉన్నా, వాటి అమలు తీరు సరిగ్గా లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. చట్టాల పటిష్ట అమలుతోనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ ప్రధానకార్యదర్శి డాక్టర్ విజయ్‌రావు, ఫైనాన్స్ సెక్రటరీ ఆర్కే.యాదవ్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ దయాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఓపీ మినహా అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోవడంతో వేలాది మంది రోగులు ఇబ్బందులు పడ్డారు. అసలే రోగాల సీజన్ కావడంతో ఓపీకి వచ్చిన వారంతా డాక్టర్ల కోసం ఎదురుచూశారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట వైద్యుల ధర్నా వైద్యులు, వైద్య విద్యార్థులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లా వైద్యులు డాక్టర్ బీఎన్.రావు, రఘురామన్, విజయ్‌మోహన్‌రెడ్డి, రమణాచారి, చల్మెడ, ప్రతిమ మెడికల్ కళాశాల డాక్టర్లు, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు. పాలమూరులో భారీ ర్యాలీ ఐఎంఏ, ప్రభుత్వ జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ విజయేందిర బోయికి వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ కలెక్టర్‌కు రాఖీ కట్టిన రిమ్స్ జూడాలు ఆదిలాబాద్ రిమ్స్ జూనియర్ వైద్యులు కలెక్టర్ రాజర్షి షాకు రాఖీలు కట్టి రక్షణ కల్పించాలన్నారు.వరంగల్‌లో నిరసన వెల్లువ వరంగల్‌లో వైద్యులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. జూనియర్ వైద్యులు ఓ పక్క విధులు బహిష్కరించి నాలుగు రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న క్రమంలో వారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నర్సింగ్ విద్యార్థులు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుంచి కాకతీయ మెడికల్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేఎంసీ ప్రధానగేటు వద్ద నిరసన తెలిపారు. -
నేడు ధర్నాచౌక్‌లో బీజేపీ ధర్నా
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ‘ఫోన్‌ట్యా పింగ్’ అంశాన్ని రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం చేయాలని బీజేపీ భావి స్తోంది. ఫోన్‌ట్యాపింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ లేదా సమగ్ర దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌తో ధర్నాలు, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైంది. ఈ కార్యాచరణలో భాగంగా...శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహించనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ కొనసా గుతున్న నేపథ్యంలో...ఈ ధర్నా నిర్వహణకు ఎన్ని కల కమిషన్ అనుమతి కోరుతూ రాష్ట్ర పార్టీ లేఖ రాసింది.ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు పోలీసుల అనుమతి కోరుతూ సంబంధిత అధికారులకు లేఖను అందజేసింది. ఈ ఆందోళనా కార్యక్రమంలో బీజేపీ ఓబీసీమోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణను నీరుగార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. -
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో కాంగ్రెస్ ధర్నా
-
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తారట సార్!
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్‌లో ధర్నా చేస్తారట సార్! -
బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తీసుకెళ్లే క్రమంలో కిషన్‌రెడ్డి సొమ్మసిల్లిపడి పోయారు. ఆ తర్వాత ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. బుధవారం ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టింది. కిషన్‌రెడ్డి నేతృత్వంలో.. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలపరంపరతో సాయంత్రం దాకా గడిచింది. అయితే సాయంత్రం ఆరు దాటగానే.. దీక్షా సమయం ముగిసిందని పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేసి వెళ్లిపోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అయితే ఇది 24 గంటల దీక్ష అని.. తెల్లవారు దాకా దీక్ష చేసి తీరతానని కిషన్‌రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయనతో చాలాసేపు సంప్రదింపులు జరిపారు. ఈలోగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. అక్కడున్నవాళ్లను బయటకు పంపించే యత్నం చేశారు. కిషన్‌రెడ్డి మాత్రం లిఫ్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయడానికి కిషన్‌రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రూల్స్ ప్రకారం గడువు ముగిసినా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. -
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
నవ్వుల పువ్వుల తోటమాలి
‘ధర్నా దుర్గ’ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దుర్గ ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయలేదు. సింగిల్ నినాదం కూడా చేయలేదు. అయితే ఆమె నవ్వులు మాత్రం ధర్నా చేయకపోయినా హల్చల్ చేస్తాయి. నాప్స్టాప్గా నవ్వేలా చేస్తాయి... ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేక పోయినా దుర్గ ఉండాల్సిందే. ఎందుకంటే దుర్గ ఉన్నచోట ‘హాహాహో’లతో కూడిన భారీ నవ్వుల వర్షం కురుస్తుంది. ఆ నవ్వుల వర్షంలో తడిసిపోవడానికి చుట్టాలు పక్కాలు అమిత ఉత్సాహం చూపుతారు. ఆ నవ్వుల బలంతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్‌గా బోలెడు పేరు తెచ్చుకుంది దిల్లీకి చెందిన ధర్నా దుర్గ. నిజజీవితంలోని సంఘటనల చుట్టూ హాస్యాన్ని అల్లుకునే ధర్నా దుర్గకు సామాజిక మాధ్యమాలలో భారీ అభిమాన గణం ఉంది. హీరోయిన్ల గొంతును అనుకరించడం తన ప్రత్యేకత. సారా అలీఖాన్ గొంతును అద్భుతంగా అనుకరిస్తుంది. సారా ఫేవరెట్ డైలాగ్ ‘నమస్తే దర్శకో’పై ఫన్నీగా వీడియో చేసింది దుర్గ. ఈ వీడియో చూసి సారా అలీఖాన్ ముచ్చటపడడమే కాదు, దుర్గను మెచ్చుకుంటూ వీడియోను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో, ఇంటికే పరిమితం కావాల్సిన అనివార్యత వల్ల చాలామందిలాగే దుర్గ కూడా బోర్‌గా ఫీలైంది. దాని నుంచి బయటపడడానికి సెలబ్రిటీలను అనుకరిస్తూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇవి తన స్నేహితులకు తెగ నచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది. ఇక అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తలపై ‘కామెడీ క్వీన్’ అనే కిరీటం వచ్చి చేరింది. ‘ఈ వీడియోలు ఏమిటో, లైక్‌లు ఏమిటో!’ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసేవారు దుర్గ తల్లిదండ్రులు. వారికి అన్నీ ఓపికగా చెప్పేది దుర్గ. తమ చుట్టాలు పక్కాలలో ‘ఫస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా తొలి గుర్తింపు తెచ్చుకుంది దుర్గ. నాటక రంగ నేపథ్యం ఉన్న దుర్గకు లోతైన పరిశీలన శక్తి ఉంది. అది తాను చేసే ఫన్నీ వీడియోలకు ఎంతో ఉపయోగపడుతుంది. రియాలిటీ షోలపై దుర్గ వేసే ఫన్నీ పంచ్‌లకు నవ్వు ఆపుకోవడం చానా కష్టం. ‘బిగ్ బాస్’లాంటి ప్రసిద్ధ రియాలిటీ షోల నుంచి క్యారెక్టర్లను అల్లుకొని ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. నృత్య నైపుణ్యం దుర్గ అదనపు బలం. కొరియోగ్రాఫర్లపై ఫన్నీ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘డ్యాన్సర్ ధర్నా దుర్గ’గా పేరు తెచ్చుకుంది. వేలాదిమందిని నవ్విస్తున్న ధర్నా దుర్గ... ‘నవ్విస్తే ఇంత పేరు వస్తుందని తెలియదు’ అంటోంది నవ్వుతూ! -
మీ సాయం కోరే చిన్నారులం
సాక్షి, హైదరాబాద్: నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే చేపట్టాలని సోమవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన ఆవేదన దీక్ష తల్లిదండ్రులతో పాటు చిన్నారుల, వృద్ధుల వేడుకోళ్లతో ఉద్విగ్నవాతావరణంలో సాగింది. 13 జిల్లాల నుంచి ఉపాధ్యాయ దంపతులతో పాటు వారి పిల్లలు, వయోధికులైన వారి తల్లిదండ్రులు కూడా దీక్షకు తరలివచ్చారు. స్పౌజ్ బదిలీలు నిర్వహించి తమ తల్లిదండ్రులను, కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆవేదన చెందడం అందరినీ కలచివేసింది. తమ తల్లిదండ్రుల బదిలీలు జరగకపోవడంతో వారి కుటుంబాలు అనుభవిస్తున్న ఇబ్బందులను పిల్లలు కన్నీటి రోదనల మధ్య వివరించారు. ఇప్పటికైనా తమ తల్లిదండ్రులను కుటుంబాలను కలపాలని చిన్నారులు ఆ సభ ద్వారా ముఖ్యమంత్రిని వేడుకున్నారు. బోనాలతో ప్రత్యేక ర్యాలీ.. బోనాలతో తెలంగాణ అంతటా పండుగ వాతావరణం ఉన్న ఈ సందర్భంలోనూ.... తమ బదిలీలు జరగక ఆవేదనలో ఉన్నామని.. అమ్మవారికి ప్రత్యేక బోనాలను తయారు చేయించి.. మహిళా ఉపాధ్యాయులు ర్యాలీగా అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బదిలీలు వెంటనే చేపట్టాలని.. భార్య ఒక జిల్లాలో, భర్త మరొక జిల్లాలో 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి స్పౌజ్ బదిలీలు జరిపించాలని అభ్యర్థిం చారు. ప్రగతిభవన్ ముట్టడికి సైతం వెనుకాడం: ఉపాధ్యాయ సంఘాలు ఈ ఆవేదన సభకు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. యుటీఎఫ్, టీపీటీఎఫ్, తపస్, ఎస్టీయూ, ఆర్.యూ.పీ.పీ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి చేరుకొని తమ మద్దతును ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, అవసరమైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని, ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని నాయకులు హెచ్చరించారు. -
వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 73 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వందలాది మంది వీఆర్ఏలు మంగళవారం ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడానికి పెద్దఎత్తున తరలివచ్చారు. కానీ దీనికి అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని వీఆర్ఏలను అరెస్ట్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రోడ్డుపై బైఠాయించిన వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. వాళ్లను బలవంతంగా అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీంతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం -
ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకం కావాలి: ఇందిరా శోభన్
సాక్షి, హైదరాబాద్: ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా.. దేశంలో ఇంకా పేదరికం, ఆకలి చావులు కొనసాగుతుండడం దురదృష్టకరమన్నారు. అందరికీ విద్య, వైద్యం అందని ద్రాక్షగానే మిగిలాయని ఇందిరా శోభన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలోనూ సమానత్వం, భావప్రకటన స్వేచ్ఛ లేకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. ప్రజాస్వామ్య ముసుగులో నిరుపేదలను అణచివేస్తున్నారని ఆమె వాపోయారు. తెలంగాణ ప్రజలు స్వతంత్రంగా, స్వేచ్ఛగా మెలగాలంటే అది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రశ్నించే గొంతుకలన్నీ ఏకమై.. అటు దేశాన్ని, ఇటురాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇందిరా శోభన్ పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అనాథ చిన్నారులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆకుల ప్రవీణ్, రాజ్ కుమార్, బెట్టీనాలంక, సత్తి సూరిబాబు, మునిరామ్, ప్రశాంత్, మనోజ్, నిఖిల్, శంషోద్దీన్, సిద్ధు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
కవాడిగూడ(హైదరాబాద్): బోధన చేసే ఉపాధ్యాయలోకం వేదనతో రోడ్డెక్కింది.. రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిమంది టీచర్లు కదిలివచ్చారు. నినాదాలతో ధర్నాచౌక్‌ను హోరెత్తించారు. ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో), ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ మహాధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్‌కు వచ్చే రహదారులపై బైఠాయించారు. పీఆర్సీని అమలు చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టా లని డిమాండ్ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పైసా ఖర్చు లేని బదిలీలూ చేపట్టరా: నర్సిరెడ్డి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారాలను మొత్తం తన వద్ద ఉంచు కోకుండా విద్యారంగానికి సంబంధించిన అధికారాలను విద్యాశాఖ మంత్రికి ఇవ్వాలని, తక్షణమే పీఆర్సీ, టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఒక్క పైసా ఖర్చు లేకుండా చేపట్టే బదిలీలు, పదోన్నతులు సైతం ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. టీచర్లు పోలీసుస్టేషన్లలోనా? మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ మాట్లాడుతూ.. 3 నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ 30 నెలలుగా ఎందుకు జాడలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. క్లాసు రూం లో ఉండాల్సిన టీచర్లను అరెస్టు చేసి.. పోలీస్ స్టేషన్లో ఉంచడం సిగ్గుచేటన్నారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఆర్సీ లేటుతో టీచర్లకు 18 నెలలుగా ఐఆర్ ఇస్తూ ఆదుకుంటున్నారని, మరి తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యు డు అజీజ్‌పాషా, సీపీఎం నేత వెంకట్, న్యూడెమోక్రసీ నేతలు పోటు రంగారావు, కె.గోవర్ధన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు రవి, కె.రమణ, శ్రీనివాసులు, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడం దుర్మార్గం: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సాక్షి, హైదరాబాద్: హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె. చక్రధరరావు, హరగోపాల్‌లు తీవ్రంగా ఖండిచారు. మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్న ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేయడాన్ని వారు తప్పుబట్టారు. న్యాయమైన డి మాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా ఉ ద్యమాన్ని అణిచివేసేలా వ్యవహరించడం దారుణమని విమర్శించారు. టీచర్ల పట్ల, విద్యావ్యవస్థ పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. -
మరణశిక్ష వేయాలి
కవాడిగూడ: హైదరాబాద్ నగర శివారులో జరిగిన ‘దిశ’ అత్యాచా రం, హత్యను నిరసిస్తూ సోమవారం అఖిల భారత విద్యా ర్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో బాగ్‌లింగంపల్లి పార్క్ నుంచి ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ పోలీసులు విధించిన ఆంక్షలను ధిక్కరిస్తూ విద్యార్థులు కదంతొక్కారు. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా వందలాది మంది ర్యాలీ చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు, బారికేడ్లను ఏర్పాటు చేశారు. పోలీసు వలయాల మధ్య ఆర్టీసీ క్రాస్‌రోడ్, అశోక్‌నగర్, ఇందిరాపార్క్ చౌరస్తా వరకు ధర్నా కొనసాగింది. ఇందిరాపార్క్ చౌరస్తా వద్దకు రాగానే పోలీసులు ర్యాలీని అడ్డుకోవాలని యత్నించగా.. పోలీసులకు, ఏబీవీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు ధర్నాచౌక్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. బహిరంగసభ నిర్వహించారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించి ఉరితీయాలని నినా దాలు చేశారు. ప్రభుత్వం విఫలం..: నిధి త్రిపాఠి ఈ నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను అరికట్టడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. దిశ కేసులో నిందితులకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, నగర కార్యదర్శి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలి
హైదరాబాద్: ప్రియాంకారెడ్డిపై జరిగిన అఘాయిత్యం పట్ల రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీలు బాధ్యతారహితంగా హేళనగా మాట్లాడటం సమంజసం కాదని, దీనికిగానూ తక్షణమే వారిద్దరూ క్షమాపణ చెప్పాలని మాజీ మం త్రి, బీజేపీ నాయకురాలు డి.కె.అరుణ డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ ధర్నాచౌక్ వద్ద మౌనదీక్ష నిర్వహించింది. ప్రియాంక కుటుంబానికి న్యాయం చేయాలని, మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేసింది. మౌనదీక్షకు ముందు జరిగిన సభలో డి.కె.అరుణ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణలో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా అత్యాచారాలు, హత్యలు, యాసిడ్ దాడు లు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
'వైఎస్ జగన్‌పై మాకు విశ్వాసం ఉంది'
సాక్షి, విజయవాడ : విజయవాడలోని ధర్నాచౌక్‌లో వెంకటాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నిరసన చేపట్టారు.పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని వెంకటాపురం కాలనీలో గత 20సంవత్సరాలుగా పోరంకి గ్రామస్తులు చెత్తను తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వెంకటాపురం కాలనీ వాసులు ధర్నా చేపట్టారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ.. మా కాలనీ మొత్తాన్ని ఒక డంపింగ్ యార్డుగా తయారు చేసి ఇష్టం వచ్చినట్లుగా చెత్తను పారవేస్తున్నారు. మొత్తం 52 ఎకరాలు కలిగిన వెంకటాపురం కాలనీని కబ్జా చేసి అందులో 642 ఫ్లాట్లు నిర్మించాలని చూస్తున్నారు. 20 సంవత్సరాలుగా చెత్తను తొలిగించాలని గత ప్రభుత్వాలను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాకు విశ్వాసం ఉందని, కేవలం మా సమస్యలు పరిష్కరించాలనే నిరసన చేపట్టామని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని సీఎం దృష్టికి చేర్చాలని, మా కాలనీని స్వచ్చ వెంకటాపూర్‌గా తీర్చిదిద్దాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. -
ధర్నాచౌక్ వద్ద అఖిలపక్ష బృందం దీక్ష
-
ధర్నాచౌక్‌లో విద్యార్థుల స్మారకస్థూపం
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా.. ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో అఖిలపక్షం నిరసన దీక్షలు చేపట్టింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల స్మృతిగా స్మారకస్థూపాన్ని ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కె.నారాయణ ఎల్.రమణ హాజరై నిరసన తెలిపారు. -
నిరసన : పోలీసుల బూట్లు తుడిచేందుకు యత్నం
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి రాగానే రెండున్నర కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ మాట తప్పిందని స్టూడెంట్స్ యూనియన్ ఎన్ఎస్యూఐ విమర్శలు గుప్పించింది. అయిదేళ్ల పాలనాకాలంలో నిరుద్యోగ నిర్మూలనకు ప్రధాని మోదీ చేపట్టిన చర్యలు శూన్యమని ఆరోపించింది. ఉద్యోగాల కల్పన విషయంలో బీజేపీ విఫలమైందని ఆరోపిస్తూ..ధర్నా చౌక్‌లో బుధవారం షూ పాలిష్ చేసి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. అక్కడే ఉన్న పోలీసులకు సైతం షూ పాలిష్ చేసేందుకు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్ఎస్యూఐ నాయకులు వెల్లడించారు. -
‘ఆందోళన ఉదృతం చేస్తాం’
సాక్షి, హైదరాబాద్ : తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్‌లో అగ్రిగోల్డ్ భాదితులు ఆందోళన చేపట్టారు. తెలంగాణాలో అగ్రిగోల్డ్ కష్టమర్లుకు రావలసిన 500 కోట్లు ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఉన్న సుమారు 1200 ఎకరాల అగ్రిగోల్డ్ భూమిని వెంటనే వేలం వేసి న్యాయం చేయాలని కోరారు. ఏపీలో మాదిరిగానే తెలంగాణాలో కూడా మరణించిన బాధితులకు 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. -
ఈవీఎం వద్దు.. బ్యాలెట్ ముద్దు
హైదరాబాద్: ఈవీఎంల పనితీరుపై ప్రజలు, రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున బ్యాలెట్ పేపర్ విధా నం తీసుకురావాలని మహాకూటమి నేతలు డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరుపుతున్నారని గుర్తు చేశారు. ఈవీఎంలపై హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన దేశవ్యాప్త ఉద్యమానికి నాంది అని పేర్కొన్నారు. ఓటరు జాబితా అవకతవకలపై ఎన్నికల కమిషనర్ క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం ధర్నా జరిగింది. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నానుద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మార్జిన్ ఒక శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంటింగ్ చేయాల్సి ఉండగా వీవీ ప్యాట్ల రీకౌంటింగ్‌కు ఈసీ ఒప్పుకోకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అందుకే బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలన్నారు. తప్పుదోవ పట్టించారు: కోదండరాం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ అందరికీ ఓటుహక్కు ఉన్నదా, లేదా అనే దానిని బట్టి ఏ దేశమైనా ప్రజాస్వామ్య దేశమా, కాదా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారన్నారు. 31, 32 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల మధ్య తేడా ఉందని, దీంతో కొన్నిస్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని, దీనిపై ఇప్పటివరకు ఈసీ కారణా లు చెప్పలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, సీపీఐ నేత అజీజ్ పాషా, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌నేతలు అంజన్‌కుమార్ యాదవ్, నిరంజన్, వినోద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌లు పాల్గొన్నారు. -
ధర్నాచౌక్‌కు ప్రాణప్రతిష్ట
హైదరాబాద్ నగరంలోని ధర్నాచౌక్‌లో యధావిధిగా బహిరంగసభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించుకోవచ్చునంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు హర్షించదగినవి. ఇరవైయ్యేళ్లపాటు సామాన్యుడి సమస్యలను ఎలుగెత్తి చాటిన ధర్నా చౌక్ ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలతో మూగబోయింది. నిషేధాజ్ఞలకు ప్రభుత్వం చెప్పిన కారణాలు వింతగా ఉన్నాయని అప్పట్లోనే ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమాలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని స్థానిక ప్రజలు ఫిర్యాదు చేస్తుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. ప్రభుత్వ విధానాలపై అసమ్మతి వ్యక్తం చేయడం, వాటికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరాహారదీక్షలు నిర్వహిం చడం, సభలు పెట్టడం మన రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఆ హక్కుకు భంగం వాటిల్ల కుండా చూడటం వల్ల పాలకులకు రెండు ప్రయోజనాలుంటాయి. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకొచ్చినవారు దానికి బద్ధులై పరిపాలిస్తున్నారన్న అభిప్రాయం ప్రజలకు కలిగితే అది పాలకులకుండే గౌరవాన్ని పెంచుతుంది. మరోపక్క తాము తీసుకునే నిర్ణయాలపై ప్రజల్లో స్పందన ఎలా ఉందన్న సంగతి పాలకులకు అర్ధమై, సవరించుకోవడానికి వీలవుతుంది. ధర్నా లకూ, నిరసనలకూ అవకాశం లేకుంటే ఇదంతా సాధ్యపడదు. స్థానికుల వినతి మేరకే ధర్నా చౌక్‌ను మార్చవలసి వచ్చిందన్న ప్రభుత్వ సంజాయిషీలో అబద్ధమేమీ లేదు. ఈ విషయంలో అంతకుముందే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తమ పరిసరాల నుంచి దీన్ని తరలించేలా ఆదేశించమని ఆ పిటిషన్ కోరింది. దానిపై విచారణ పెండింగ్‌లో ఉండగానే తెలంగాణ సర్కారు ధర్నాచౌక్‌ను సరూర్‌నగర్ స్టేడియానికి తరలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిరసన సమస్యే అను కుంటే, ఆ సమస్య ధర్నాచౌక్ పరిసరాల్లోని వారికి మాత్రమే కాదు... రేపన్నరోజున సరూర్ నగర్ ప్రాంతవాసులకు కూడా ఏర్పడొచ్చు. అప్పుడు మళ్లీ దాన్ని ఇంకోచోటకు తరలిస్తారా? ఇలా అస మ్మతిని, నిరసన గళాలను శివార్లకు నెట్టుకుంటూ పోవడం ప్రజాస్వామిక పరిష్కారమవుతుందా? దీన్ని హైకోర్టు ధర్మాసనంతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పాలకులే నిశితంగా ఆలోచించి ఉంటే వారికే బోధపడేది. నిరసనలు వ్యక్తం చేయడం, బంద్‌లు, ధర్నాలు నిర్వహించడం మహాపాపమన్న అభిప్రాయం పాలకుల్లో మాత్రమే కాదు... మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజానీకంలో కూడా ఇటీవలి కాలంలో కనబడుతోంది. వారి దృష్టిలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలపై అయిదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఓటేయడం ద్వారా అభిప్రాయం చెబితే సరిపోతుంది. అందుకు భిన్నంగా నిరసనలు రోడ్డెక్కడం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోందని వారి ఫిర్యాదు. నిరుడు అక్టోబర్‌లో జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) మరో అడుగు ముందుకేసి విచిత్రమైన ఉత్తర్వులిచ్చి అంద రినీ దిగ్భ్రాంతిపరిచింది. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సాగే నిరసనలవల్ల ఆ ప్రాంతం కాలు ష్యమయమైందని, నిరసనల్లో పాల్గొనేవారి కార్యకలాపాలు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నా యని అది మండిపడింది. ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిందే తడవుగా ఢిల్లీ పోలీసులు ఆందోళనకారులం దరినీ వెళ్లగొట్టారు. మళ్లీ మొన్న జూలైలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దీన్నంతటినీ చక్కదిద్దాల్సి వచ్చింది. ఎన్జీటీ వంటి ఉన్నతస్థాయి సంస్థే నిరసనల్లో పర్యావరణానికి ముప్పు కలిగించే ప్రమా దాన్ని పసిగట్టినప్పుడు, కొన్ని గంటలపాటు నడిరోడ్డుపై చిక్కుకుపోయే సామాన్యులకు చికాకు కల గడంలో, వారు కోర్టుకెక్కడంలో వింతేముంది? నిరసనలకు ఎటు నుంచి ముప్పు కలుగుతుందో చెప్పడం కష్టం. ఎన్నాళ్లుంటుందో తెలియని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) ఆమధ్య కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే అధ్యా పకులకు జైల్ మాన్యువల్‌ను తలపించేలా ఒక హుకుం జారీ చేసింది. విద్యావేత్తలెవరూ ప్రభు త్వాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయరాదని దాని సారాంశం. 1964నాటి కేంద్ర పౌర సర్వీసుల నియమావళి(సీసీఎస్) అధ్యాపకులకు కూడా వర్తిస్తుందని యూజీసీ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వాలు రూపొందించే విధానాల్లో భాగస్తులవుతారు గనుక ఆ విధానాలను విమర్శిస్తూ అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని నిబంధనావళి చెబుతోంది. దాన్ని కొంతవరకూ అర్ధం చేసుకోవచ్చు. కానీ విశ్వవిద్యాలయ అధ్యాపకులు వారికి భిన్నమైనవారు. వారి నోరు నొక్కితే భిన్నాభిప్రాయం బెడద సమసిపోతుందని పాలకులు భావిస్తున్నారు. ఈ విష యంలో అధ్యాపకుల తరఫున మాట్లాడి విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిని కాపాడాల్సిన యూజీసీ... ప్రభుత్వ మనోగతాన్ని అధ్యాపకులపై రుద్దాలని చూస్తోంది! ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకి నిరసనలంటే మొదటినుంచీ వెగటే. అమరావతి దరిదాపుల్లోకి అది చేరకుండా ఆయన కట్టడి చేశారు. నిజానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సచివాలయం సమీ పంలో ఉండే నిరసన వేదిక ఇప్పటి ధర్నాచౌక్‌కు తరలడం ఆయన నిర్వాకమే. ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పక్షం తన ఇష్టానుసారం పరిపాలించడం కాదు. అది చట్టసభలో విపక్షం వ్యక్తం చేసే అభిప్రాయాలతోపాటు, దాని వెలుపల ఉన్న విశాల ప్రజానీకం మనోభావాలను గుర్తించడం కూడా. చలనశీలమైన సమష్టి మేధోమథనం ద్వారానే ప్రజాస్వామ్యం నిలబడుతుంది తప్ప అందరి నోళ్లూ నొక్కి ప్రశాంతత నెలకొల్పడం ద్వారా కాదు. ఎవరూ ధర్నాలు, నిరసనలు చేయనవసరం లేని పరిస్థితులు ఏర్పరిచేందుకు చిత్తశుద్ధితో పాటుపడ దామనుకుంటే మంచిదే. అంతేతప్ప వాటిని నిషేధిస్తామని, ఊరు వెలుపలకు గెంటేస్తామని అన డం అప్రజాస్వామికమవుతుంది. హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విలువైనవి. అవి దేశంలోని పాలకులందరూ పరిగణనలోకి తీసుకోదగ్గవి. -
దద్దరిల్లనున్న ధర్నాచౌక్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసనలను ప్రభుత్వం నిషేధించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. నిరసన గళం అనేది ప్రజాస్వామ్యానికి మూలస్తంభం వంటిదని, అటువంటి నిరసన గళాన్ని అణచివేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇటువంటి చర్యలను తాము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్య్ర హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సమావేశమయ్యే హక్కు దేశ పౌరులందరికీ ఉందని, సహేతుక ఆధారాలు లేకుండా ఈ హక్కులపై ఏకపక్ష ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని తేల్చి చెప్పింది. ధర్నాచౌక్ కాకుండా నిరసన కార్యక్రమాల నిర్వహణకు వేదికగా సరూర్‌నగర్ స్టేడియాన్ని ఎంపిక చేశామని, అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహించుకున్నా తమకు ఇబ్బంది లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోలాగే ధర్నాచౌక్‌ను వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే నిరసనల నిర్వహణ సమయంలో అర్థవంతమైన ఆంక్షలు విధించవచ్చని పోలీసులకు సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఆరు వారాలపాటు అమల్లో ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టేందుకు తమ ఈ ఉత్తర్వులు ఎంతమాత్రం లైసెన్స్ కాదని తేల్చి చెప్పింది. స్థానికులకు ఇబ్బంది అవుతోందనే... ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలతోపాటు ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాల్లో కాంగ్రెస్ నేత నగేష్ ముదిరాజ్ ఇదే అభ్యర్థనతో ఇంప్లీడ్ అయ్యారు. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. శరత్ కుమార్ వాదనలు వినిపిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు చేపడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే ఇందిరాపార్క్ చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని, నిరసనల వల్ల భారీగా ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోందన్నారు. అంతేకాక ఆ ప్రాంతం అత్యధిక జనసాంద్రతగల ప్రాంతమని వివరించారు. అందుకే సరూర్‌నగర్ స్డేడియాన్ని ధర్నా చౌక్‌గా గుర్తించామని, అక్కడ నిరసనలు చేపట్టేందుకు తమకు అభ్యంతరాలు లేవన్నారు. ఆ గళాల వల్లే ప్రజాస్వామ్య బతికిబట్టకడుతోంది... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు చెప్పేది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు పెట్టుకోవద్దంటారు అంతేనా? జనాలు ఉన్న చోట కాకుండా అడవుల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలా? ఇంట్లో ఏడుస్తున్న పిల్లాడిని పైగదిలోకి వెళ్లి ఏడువు అన్నట్లు మీ వాదన ఉంది. నిరసనల వల్ల ఇబ్బంది ఉంటే అర్థవంతమైన ఆంక్షలు విధించండి. పరిమితులు, షరతులతో అనుమతులివ్వండి. అంతేకానీ నిరసన గళాలు వినిపించకుండా చేస్తామంటే ఎలా? ఇంకా ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతోందంటే ఈ నిరసన గళాలే కారణం. ఇవే ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. ఇవి లేకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. ట్రాఫిక్ సమస్య ఉంటే వేల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్న కార్ల సంఖ్యను వాటిని వందల సంఖ్యలోకి తీసుకురండి’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తిరిగి శరత్ వాదనలు వినిపిస్తూ ధర్నాచౌక్ వద్ద అనుకోని ఘటన ఏదైనా జరిగితే బయటపడటం కష్టమని పేర్కొనగా ఇప్పటివరకు అటువంటి ఘటనలు ఎన్ని జరిగాయని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ప్రైవేటు’కోసం నిరసనలను అడ్డుకోమంటారా?! ‘ఆ చుట్టుపక్కల అన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు ఎవరు ఇవ్వమన్నారు? అన్ని విద్యా సంస్థలకు అనుమతులు ఎందుకిచ్చారు. ఇందులో ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఎన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయి? ఎన్ని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దేశం అభివృద్ధి చెందాలన్నది రాజ్యాంగకర్తల ఆలోచన. అయితే ఇప్పుడు అంతా ప్రైవేటుమయం అయిపోయింది. అందుకు మీరు చెబుతున్న ఉదాహరణలే ప్రత్యక్ష సాక్ష్యం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కోసం నిరసన గళాలను అడ్డుకోమంటారా? ఈరోజు ధర్నాచౌక్ వద్ద నిరసనలు చేపట్టడానికి వీల్లేదంటారు. రేపు నిరసన కార్యక్రమాలు ఎలా చేయాలని కూడా నిర్ధేశిస్తారు. మీ (ప్రభుత్వ) వాదనతో మేం ఎంత మాత్రం ఏకీభవించడం లేదు’అని ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే ఎన్నికల అనంతరానికి ఈ వ్యాజ్యాలను వాయిదా వేయాలని, ఇప్పుడు ధర్నాచౌక్ వినియోగానికి అనుమతినిస్తే ఎన్నికల సమావేశాలన్నీ అక్కడే జరుగుతాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్ పేర్కొనగా ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు. ప్రస్తుతం ధర్నాచౌక్ వద్ద పరిస్థితి ఏమిటని ధర్మాసనం ఆరా తీయగా వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ అక్కడ ప్రైవేటు టూరిస్ట్ ఆపరేటర్లు తమ బస్సులను పార్కింగ్ చేస్తున్నారన్నారు. ఆ హక్కు ఎందుకు లేదు..? ఈ సమయంలో నిరసన తెలియచేసే ప్రాంతాన్ని ఎంచుకునే హక్కు ఆందోళనకారులకు లేదని శరత్ వాదించగా ఎందుకు లేదని ధర్మాసనం ఎదురు ప్రశ్నించింది. స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా సమావేశమయ్యే హక్కు ఈ దేశ పౌరులకు ఉందని స్పష్టం చేసింది. ఈ సమయంలో చాడ వెంకటరెడ్డి తరఫు న్యాయవాది బొమ్మగాని ప్రభాకర్, వీహెచ్ తరఫు న్యాయవాది దామోదర్‌రెడ్డి స్పందిస్తూ గత 20 ఏళ్లుగా ధర్నాచౌక్ కొనసాగుతోందని, ఎప్పుడూ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, ఒకవేళ ఏవైనా జరిగి ఉంటే అవి పోలీసుల అత్యుత్సాహం వల్లే జరిగాయన్నారు. ఈ సమయంలో ఇంప్లీడ్ పిటిషనర్ నగేష్ ముదిరాజ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ రాజకీయ పార్టీలే నిరసన కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, వాస్తవానికి అక్కడ దివ్యాంగులు, విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, చిరుద్యోగులూ నిరసన కార్యక్రమాలు చేపడుతుంటారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అదే చీఫ్ జస్టిస్ బంగ్లాకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తారు... ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ‘ధర్నా చౌక్‌కు ఒక ప్రాంతంగా గుర్తింపు ఉంది. ఇప్పుడు నేను మా కారు డ్రైవర్‌ను ధర్నా చౌక్ వద్దకు తీసుకెళ్లమంటే నేరుగా తీసుకెళ్తాడు. అదే ఓ ఆటో డ్రైవర్‌ను నన్ను చీఫ్ జస్టిస్ బంగ్లా వద్దకు తీసుకెళ్లమంటే వింతగా చూస్తాడు. అది ఎక్కడుందని అడుగుతాడు. తాజ్‌కృష్ణకు సమీపంలో ఉందని, అక్కడి నుంచి ముందుకెళ్లి ఎడమ వైపు తిరిగి చీఫ్ జస్టిస్ బంగ్లా వస్తుందని చెప్పినా కూడా నేరుగా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ ధర్నా చౌక్ పరిస్థితి అది కాదు. దానికున్న గుర్తింపు అలాంటిది’అంటూ వ్యాఖ్యానించింది. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుంటూ ధర్నాచౌక్‌ను గతంలోలాగా వినియోగించుకునేందుకు అనుమతినిచ్చింది. -
ధర్నాచౌక్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలని మంగళవారం హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందనే కారణంతో ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో నిరసనలు తెలుపడంపై నిషేధం విధించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హైకోర్టును ఆశ్రయించారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాచౌక్ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఆరు వారాల వరకు ధర్నా చౌక్‌ను యథావిధిగా కొనసాగించాలని న్యాయస్థానం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆరు వారాలు పరిశీలించిన తర్వాత ఈ అంశంపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపింది. ఇకపై ధర్నా చౌక్‌లో యథావిధిగా నిరసనలు తెలుపడానికి కోర్టు అనుమతినిచ్చింది. -
అణచివేత కుదరదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరసన ప్రదర్శనలను ప్రభు త్వం నిషేధించడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతంలో ధర్నాలపై ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబట్టింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతే తప్ప ఎక్కడో ఊరు అవతల 50 కిలోమీటర్ల దూరంలో ధర్నాలు చేసుకోమంటే ఎలా? అడవిలో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. మనుషులు ఉన్న చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్ కూడా. జనాల మధ్యలో ధర్నాలు చేయకుండా రిషీకేశ్‌కు వెళ్లి చేయమంటారా? అధికారంలోకి వచ్చేందుకు ఈ ధర్నా చౌక్ చాలా మందికి ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?’అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ధర్నాచౌక్ కోసం గుర్తించిన ప్రాంతాలు, అక్కడ కల్పించిన సౌకర్యాల వంటి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ రోజున ధర్నాచౌక్ వ్యవహారాన్ని తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయగా ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హనుమంతరావు తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి వాదిస్తూ ఎన్నో ఏళ్లుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకే దానికి ధర్నాచౌక్ అని పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్ వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతివ్వడం లేదని, నగరానికి 25 కిలోమీటర్ల అవతల ధర్నాలు చేసుకోవాలని చెబుతోందని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ శంషాబాద్, షామీర్పేట, జవహర్‌నగర్, మేడిపల్లి తదితర ప్రాంతాలను ధర్నాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేశామని, వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపడుతుండటం వల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. చెరువుల దగ్గర ఇళ్లు కట్టుకుని.. నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయంటే ఎలా? ఈ సందర్భంగా ధర్మాసం స్పందిస్తూ ‘ఎప్పటి నుంచో ఉన్న చెరువు దగ్గరకు వచ్చి జనాలు ఇళ్లు కట్టుకుంటారు. ఆ తరువాత ఆ చెరువు వల్ల వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని, దాన్ని పూడ్చేయాలని అడుగుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. ఇందిరాపార్క్ ఎప్పటి నుంచో ఉంది. ఆ తరువాతే దాని చుట్టుపక్కల ఇళ్లు వచ్చాయి. ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాలు, నిరసన కార్యక్రమాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతేతప్ప నిషేధం విధిస్తామంటే ఎలా? ఎక్కడో 50 కిలోమీటర్ల దూరానికి వెళ్లి ధర్నాలు చేసుకోమనడం ఎంత వరకు సబబు? సెల్‌ఫోన్ టవర్లను అడవుల్లో పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది. సింహాలు, పులులు సెల్ఫోన్లు వాడవు కదా. అందుకే మనుషులు ఉండే చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్‌లు కూడా. జనాల మధ్యలో కాకుండా రిషీకేశ్‌లో ధర్నాలు చేసుకోమంటారా?’అంటూ ప్రశ్నించింది. ధర్నాచౌక్ వద్ద ధర్నాలు, ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించడం ఏమాత్రం సబబు కాదని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. 2017లో దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణ నాటికి కౌంటర్ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది. ధర్నాల కోసం పలు ప్రాంతాలను ఎప్పటిక చేశామని చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తదుపరి విచారణలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, వాదనల సందర్భంగా రిటైర్డ్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు బిగ్గరగా మాట్లాడటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ కేసులో మీరు పిటిషనర్ కాదు. మీరు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతోంది. లేఖ రాయడంతో మీ పని ముగిసింది. మీరు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు’అని తేల్చిచెప్పింది. దీంతో ఆయన వాదనలు ముగిసే వరకు మౌనంగా ఉన్నారు. -
ధర్నాచౌక్‌పై నిషేధం ఎత్తేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌పై నిషే ధాన్ని ఎత్తేయాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం మగ్దూమ్‌భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరు తూ ఈ నెల 11న సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, సీఎం, సీఎస్‌లకు వినతిపత్రాలను ఇస్తామన్నారు. -
సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయి..
జనగామ : రాష్ట్రంలో నిరుద్యోగ యువతీయువకులకు మంచి రోజులు వస్తాయని నమ్మబలికి.. గెలిచి గద్దెనెక్కిన తర్వాత మొడిచేయి చూపిన సీఎం కేసీఆర్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కె.అమృతాసాగర్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట గురువారం ‘నిరుద్యోగ ధర్నా’ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి 500 మందితో ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. లోనికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకుని గేట్లు మూసి వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అమృతాసాగర్ మాట్లాడుతూ లక్ష ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన కేసీఆర్.. నాలుగేళ్లలో 12 వేలు మాత్రమే భర్తీ చేశారని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరఫున 2016లో గ్రూప్–2, గురుకుల నోటిఫికేషన్లను వేసినట్టే వేసి.. అభ్యర్థులను న్యాయస్థానాల చుట్టూ తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. మొక్కుబడి నోటిఫికేషన్లతో కాలయాపన తప్ప నిరుద్యోగులకు చేసింది శూన్యమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మొసలి కన్నీరు కార్చిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో అంతకు రెట్టింపు వివక్ష చూపిస్తున్నారని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి హయాంలో తెలంగాణ సుఖశాంతులతో ఉంటే, ఇప్పుడు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందున్న వారికి ఈ ప్రభుత్వంలో తీరని అన్యా యం జరుగుతోందన్నారు. నిరుద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిరాశలో నిరుద్యోగులు : కళ్యాణ్ నిరుద్యోగులు నిరాశలో మునిగి పోయారని పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్యాణ్‌రాజ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ వివిధ కేటగిరీల్లో న్యాయపరమైన చిక్కులను తొలగించి, పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 25న జిల్లా వ్యాప్తంగా అన్ని మం డల కేంద్రాల్లో ఉద్యోగ ధర్నా నిర్వహించామని చెప్పారు. అంతకుముందు పలు వురు కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎస్సై పరమేశ్వర్ ఆధ్వర్యంలో అడ్డుకున్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. అంతకు ముందు సాక్షర భారత్ కోఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీ కార్మికుల దీక్షలకు అమృతాసాగర్ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కేసరి సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరబోయిన సమ్మయ్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మానెగల్ల మంజుల, జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, జిల్లా సంయుక్త కార్యదర్శి కంతి చిరంజీవి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామిండ్ల ఐలయ్య, జిల్లా యూత్ అధ్యక్షుడు బక్క జంపన్న, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు చిన్నపాగ వెంకటరత్నం, కల్లెపు ప్రవీణ్ కుమార్, నోముల జయపాల్‌రెడ్డి, జనగామ మండల మహిళా అధ్యక్షురాలు వసంత, యూత్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్‌రాజ్ ఆధ్వర్యంలో బచ్చన్నపేట మండలానికి చెందిన యువకులు పార్టీలో చేరారు. అమృతాసాగర్ కండువా కప్పి స్వాగతం పలికారు. -
‘50 ఏళ్లకే పింఛను ఇవ్వాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : 50 ఏళ్లు దాటిన వృత్తిదార్లందరికీ పింఛను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కలెక్టరేట్ వద్ద వృత్తిదారులు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ చేతివృత్తుల ద్వారా ఉపాధి పొందుతున్న వారు జిల్లాలో 9 లక్షల మంది వరకు ఉన్నారని తెలిపారు. ఇప్పటివరకు రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వలేదని వాపోయారు. మత్స్యకారులు, గొర్రెల పెంపకం దారులు, క్షౌ ర, రజక, చేనేత, గీత, వడ్రంగి, మేదరి, ఎరుకలి, వంటి కులాల వారు వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకానికి వయోపరిమితి పెంచాలన్నారు. చనిపోయిన వృత్తిదారులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. గీత కార్మికుల కల్లును నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ధర్నాలో పి.సాంబమూర్తి, జి.పాపయ్య, ముగడ రాములు, ఎన్.రాజారావు, డి.అప్పారావు పాల్గొన్నారు. -
ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి
సాక్షి, టవర్‌సర్కిల్ : ధాన్యం డబ్బులు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదట సర్కస్ గ్రౌండ్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు తరలివచ్చారు. సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. టీడీపీ శ్రేణులు కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గిట్టుబాటు ధరలకు అమ్ముకోలేని దుస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పిన మాటలు నీటి మూటలుగా మారాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు 2014 నాటి స్థాయిలోనే ఉన్నా.. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను భారం కారణంగా ధరలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు జోజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి ప్రవీణ్, నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్, కళ్యాడపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, జాడి బాల్‌రెడ్డి, కొరటాల శివరామకృష్ణ, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, దూలం రాధిక, అనసూర్యనాయక్, కరుణాకర్‌రెడ్డి, తీట్ల ఈశ్వరి, ఆనందరావు, కిశోర్, గట్టయ్య, శ్రీనివాస్‌రెడ్డి, రొడ్డ శ్రీనివాస్, తీగుట్ల రమేశ్, నూజెట్టి వాణి, రవీందర్, ఇందు తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాచౌక్ వద్ద బీజేపీ వర్సెస్ టీడీపీ
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటా పోటీ ధర్నాలతో ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ప్రధానిపై టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నాచౌక్‌లో బీజేపీ నేతలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మద్యాహ్నం వరకూ బీజేపీ నేతల ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. అయితే బీజేపీ ధర్నాను నిరసిస్తూ తెలుగుదేశం నేతలు సైతం అదే ధర్నాచౌక్‌లో నిరసన చేపట్టాడికి సిద్ధమయ్యారు. బీజేపీ ధర్నా ముగిసిన అనంతరం ధర్నా చేయడానికి టీడీపీ నేతలు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో ధర్నాచౌక్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల నేతలు, కార్యకర్తలు అక్కడ చేరడంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీగా బలగాలను మొహరించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ బీజేపీకి మధ్యాహ్నం వరకే అనుమతి ఉందని తెలిపారు. వారు వెల్లిన అనంతరం టీడీపీకి అనుమతి ఇచ్చామని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే పోలీసులను మొహరించినట్లు తెలిపారు. -
సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు పెంచాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సహకార సంఘ ఉద్యోగుల వేతనాలు 50 శాతం పెంచుతూ వెంటనే జీఓను వెంటనే విడుదల చేయాలని ఏపి స్టేట్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయిస్ యూనియన్, సీఐటీయూ సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి రావూరి దిలీప్‌కుమార్ మాట్లాడుతూ జీఓ 151 వచ్చినా 2014 నుంచి వేతనాలు, అరియర్స్ చెల్లించాల్సి ఉందన్నారు. వాటిని వెంటనే చెల్లించాలని కోరారు. గ్రాడ్యుయుటీని రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహకార సిబ్బందికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ధర్నాకు పెంట్యాల హనుమంతరావు, నాయకులు కె. లక్ష్మీనారాయణ, షేక్ మౌళాలి, శ్రీకాంత్, ఈశ్వర్, రామాంజనేయరెడ్డి, రత్నకుమారి, పాల్గొన్నారు. -
ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారో..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర విధానాలకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్న సీఎం కేసీఆర్ ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను ఎందుకు ఎత్తేశారో సమాధానం చెప్పాలని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఇది కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా అని ప్రశ్నిం చారు. తనను అరెస్టు చేస్తామంటూ బెదిరిస్తున్నారని చెప్తున్న ముఖ్యమంత్రి, బెదిరించింది ఎవరో కూడా చెప్పాలన్నారు. ఓటమి భయంతో ఉన్న కేసీఆర్ కేవ లం ప్రజల సానుభూతి కొల్లగొట్టేందుకు ఇలాంటి చవకబారు మాటలు చెబు తున్నారన్నారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేక రుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ బీజేపీని కేసీఆర్ తక్కువ చేసి కామెడీగా మాట్లాడుతున్నారని, కానీ త్రిపురలో వచ్చిన ఫలితం ఇక్కడా వస్తుందని, అప్పు డు ఏం చేస్తారని ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. దేశంలో కేసీఆర్ తన బలమెంతో బేరీజు వేసుకుని ఫ్రంట్‌లాంటి కామెంట్లు చేస్తే మంచిదన్నారు. చలో ప్రగతి భవన్ సందర్భంగా బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేయటాన్ని ఖండిస్తు న్నామన్నారు. కేసీఆర్ నిర్వహించుకున్న సొంత సర్వేల్లో టీఆర్ఎస్ దారుణ ఓటమి తథ్యమని తేలిందని, దీంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పలు నాటకాలను తెరపైకి తెస్తున్నారని ఇంద్రసేనారెడ్డి ఎద్దేవా చేశారు. -
జంతర్‌మంతర్ వద్ద నిరసనల బహిష్కారం!
-
‘ధర్నా చౌక్’ కోసం ధర్నా
జంతర్ మంతర్ వద్ద గళమెత్తిన విపక్షాలు సాక్షి, న్యూఢిల్లీ: ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి. ధర్నాలను నిషేధించి సీఎం కేసీఆర్ నిజాం పాలనను మరిపించేలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. సోమవారం విపక్ష పార్టీలు జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీనికి టీజేఏసీ చైర్మన్ కోదండరామ్, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, ఆప్ నేత ప్రొ.విశ్వేశ్వరరావు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. ధర్నాచౌక్‌ను తిరిగి సాధించుకున్నప్పుడే తెలంగాణలో ప్రజాస్వామ్య జీవితాన్ని పునరుద్ధరించుకున్నట్టని అన్నారు. తెలంగాణ సాధించుకున్నా ఏ వర్గమూ సంతోషంగా లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం లేకనే.. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు యత్నిస్తున్నారని ఉత్తమ్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దందాలు, భూ కుంభకోణాల్లో మునిగితేలుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. భావస్వేచ్ఛను హరిస్తూ పోలీసుల పహారాలో ప్రభుత్వం పాలన సాగిస్తోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలకు అనుమతించకపోతే హైదరాబాద్ అంతా ధర్నాచౌక్‌గా మారుతుందని తమ్మినేని హెచ్చరించారు. కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఉంది కేసీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ధర్నాచౌక్ ఉంది. పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తోంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ధర్నాచౌక్ వద్ద ఎందుకు అనుమతి ఇవ్వదు. ఉద్యమ సమయంలో ధర్నాచౌక్‌లో చేసిన ధర్నాలు కేసీఆర్‌కు గుర్తుకు లేవా? – సురవరం సుధాకర్‌రెడ్డి బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఢిల్లీ బైట్ క్లబ్లో ఉన్న ధర్నాచౌక్‌ను అప్పటి కేంద్రం ఢిల్లీ వెలుపలకు తరలించింది. కానీ అప్పుడు పోరాడి జంతర్‌మంతర్‌ను సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో ధర్నా చౌక్‌ను సాధించుకుంటాం. – సీతారాం ఏచూరి ధర్నాచౌక్‌ను పునరుద్ధరించేలా ఆదేశాల్విండి రాజ్‌నాథ్‌కు నేతల విన్నపం ఇందిరాపార్క్ వద్ద ప్రభుత్వం ఎత్తేసిన ధర్నాచౌక్‌ను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను నేతలు కోరారు. ఎంపీ డి.రాజా నేతృత్వంలో కోదండరాం, వీహెచ్, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితరులు సోమవారం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
నిరసన పదం వింటే సర్కార్‌కు భయం
► ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సెమినార్లో తమ్మినేని ► ప్రభుత్వంలో చలనం లేదు: కోదండరాం సాక్షి, హైదరాబాద్: నిరసన అనే పదం వింటే నే తెలంగాణ ప్రభుత్వం భయపడు తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరి రక్షణ కోసం ఈ నెల 22న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలిపే నిరసనకు దేశవ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణలో పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ‘పౌరహక్కులు–నిర్బంధం’ అం శంపై జరిగిన సెమినార్లో ఆయన మాట్లా డారు. కమిటీ కన్వీనర్ చాడ వెంకట్‌రెడ్డి, కో–కన్వీనర్ విశ్వేశ్వర్రావు, విరసం నేత వరవరరావు, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమాజహితం కోరుకునే మేధావులను గౌర వించుకోవడం అందరి బాధ్యతని, కానీ, దానికి పూర్తి విరుద్ధంగా రాష్ట్ర పాలకులు వ్యవ హరిస్తున్నారని తమ్మినేని విమర్శించారు. వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా స్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, దేశం లో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పాలన సాగుతోందన్నారు. ధర్నాచౌక్ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. కేసీఆర్ సామ్రాజ్యవాద ఏజెంట్ మాదిరిగా పనిచేస్తు న్నారని వరవరరావు ఆరోపించారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, సమస్యలను చెప్పు కునే అవకాశం లేకుండా చేశారన్నారు. ఢిల్లీలో ధర్నాచౌక్‌గా జంతర్‌మంతర్ కొనసాగుతోంది కానీ, ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను ఫాసిస్టు పద్ధతిలో కేసీఆర్ రద్దు చేశారన్నారు. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వం లో చలనం రాకపోవడం బాధాకరమని కోదండరాం అన్నారు. ధర్నాచౌక్ ఎత్తివేయ డంవల్ల సమస్యలు సమసిపోతాయనుకోవ డం సరికాదని, ధర్నాచౌక్‌గా ప్రగతిభవన్ ఎప్పుడో అయిపోయిందని చెప్పారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిదని, జాతీయ స్థాయిలో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళతామన్నారు. రియల్ఎస్టేట్ కోణంలో మాత్రమే సచివాల యం తరలింపు జరుగుతోందని, దీన్ని అంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. -
‘ఆ మాట వింటేనే సర్కారు భయపడుతోంది’
హైదరాబాద్: నిరసన అనే పదం వింటేనే తెలంగాణ ప్రభుత్వం భయపడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22వ తేదీన జంతర్ మంతర్ వద్ద తెలిపే నిరసనకు దేశ వ్యాప్త మద్దతు కూడగట్టాలని పిలుపు నిచ్చారు. తెలంగాణలో పాలన చూస్తుంటే ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మఖ్దూమ్ భవన్లో శనివారం ధర్నా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో ‘ పౌరహక్కులు- నిర్భంధం’ అనే అంశంపై సెమినార్ జరిగింది. సమాజ హితవు కోరుకునే వారిలో మేధావులు ముందు ఉంటారని ఆయన అన్నారు. అలాంటివారిని గౌరవించు కోవడం బాధ్యతని, దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణలో పాలనా నడుస్తోందని తమ్మినేని విమర్శించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పాలన సాగుతుందని విమర్శించారు. ధర్నా చౌక్ విషయంలో ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామన్నారు. కేసీఆర్ సామ్రాజ్యవాద ఏజెంట్ మాదిరిగా పనిచేస్తున్నారని విరసం నాయకుడు వరవరరావు ఆరోపించారు. ప్రజల హక్కులు హరిస్తున్నారని, ప్రజల సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేశారన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించిన క్యాంపు కార్యాలయం దగ్గరకు ప్రజలు రాకుండా చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ధర్నా చౌక్‌గా జంతర్ మంతర్ కొనసాగుతోంది కానీ, ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఫాసిస్టు పద్దతిలో సీఎం కేసీఆర్ రద్దు చేశారని దుయ్యబట్టారు. ఎన్ని విధాలుగా నిరసన తెలిపినా ప్రభుత్వంలో చలనం రాకపోవడం బాధాకరమని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ధర్నా చౌక్ ఎత్తివేయటం వల్ల సమస్యలు సమసి పోతాయి అనుకోవడం సరికాదని,ధర్నా చౌక్‌గా ప్రగతిభవన్ ఎప్పుడో అయిపోయిందన్నారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరిదీ అని, జాతీయ స్థాయిలో మద్దతు కోసం అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెలదామన్నారు. సెక్రెటరియేట్ తరలింపు రియల్ ఎస్టేట్ కోణంలో మాత్రమే జరుగుతోందని, దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోదండదాం కోరారు. 22న ఢిల్లీలో జరిగే నిరసనకు అన్ని సంఘాల మద్దతు కూడగట్టి జాతీయ స్థాయిలో ధర్నా చౌక్ అవశ్యకతని చాటి చెబుతామన్నారు. ఈ సెమినార్లో పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో-కన్వీనర్ విశ్వేశ్వరరావు, వరవరరావు, జేఏసీ చైర్మన్ కోదండరాం, వామపక్ష పార్టీల నేతలు, పౌరహక్కుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ నేతల అరెస్టు
► సీఎంకు వినతిపత్రం ఇవ్వాలనుకున్న ప్రయత్నాన్ని భగ్నం చేసిన పోలీసులు ► మఖ్దూం భవన్లో కమిటీ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కువద్ద ధర్నా చౌక్‌ను ఎత్తివేయవద్దని కోరేందుకు సీఎం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం ఇవ్వాలనుకున్న ‘ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ’ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గురువారం ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎంను కలవనున్నామని కమిటీ నేతలు ప్రకటించిన వెంటనే సీపీఎం, సీపీఐ కార్యాలయాల వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని విడుదల చేశాక సీపీఐ కార్యాలయం మఖ్దూం భవన్లో ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ కోదండరాం హాజరు 10 వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. కోదండ రామ్ మాట్లాడుతూ..ధర్నా చౌక్ ఎత్తివేసినప్పట్నుంచీ ప్రగతి భవన్ ధర్నాభవన్గా మారిందన్నారు. ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఈ నెల 22న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని, ప్రతిపక్ష పార్టీల నేతలనూ ఈ ధర్నాకు ఆహ్వానించామన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..ప్రజా ఉద్యమాలను ప్రభుత్వం పోలీసులతో అణచివేయిస్తుందన్నారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతుందని, రజకార్ల కంటే అధ్వాన్నంగా ఉందని ఎద్దేవా చేశారు. ధర్నాచౌక్ మార్చడానికి కారణాలు చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగే మేధావుల సదస్సులో మేధావులందరినీ ఏకం చేస్తామన్నారు. అనంతరం చాడా మాట్లాడుతూ..ధర్నాచౌక్ పరిరక్షణ కోసం వినతిపత్రం సమర్పించేందుకు కూడా సీఎం అవకాశం ఇవ్వడం లేదన్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తోంది :నారాయణ వామపక్ష పార్టీల నేతల అరెస్టును సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. కార్యాలయాల్లోకే వచ్చి అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలవడమనేది కలలో కూడా తలవద్దనే సందేశాన్ని కేసీఆర్ ప్రభుత్వం పంపుతోందని, ఇది నిరంకుశత్వానికి పరాకాష్ట అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పరుగెత్తిన చాడ ధర్నాచౌక్‌ను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ.. సీఎంను కలసి వినతి పత్రం ఇవ్వాల నుకున్న ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మఖ్దూం భవన్ నుంచి కారులో బయటకు వెళ్లేందుకు బయటకు రాగా ప్రధాన గేటు వద్దే పోలీసులు కారుని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే చాడ కారు దిగి పరుగెత్తుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. -
తమ్మినేని వీరభద్రం అరెస్ట్
హైదరాబాద్: ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ప్రగతి భవన్‌కు ర్యాలీగా వెళ్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, జాన్ వెస్లీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ధర్నాచౌక్‌తో ఇబ్బంది లేదు
►ఇది ప్రజాభిప్రాయం.. ►దీనివల్ల స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి ►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి కవాడిగూడ: ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనివల్ల స్థానికంగా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఉపాధి దొరుకుతోందని ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదివారం ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, టీజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజల అభిప్రాయల సేకరణకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భీమమైదానం, తాళ్లబస్తీ, ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, అంబేడ్కర్‌నగర్ తదితర బస్తీల్లో ఇంటింటికి వెళ్లి ధర్నాచౌక్‌తో గల ఇబ్బందులను అడిగారు. దీంతో స్థానికులు పైవిధంగా స్పందించారు. ప్రజలు తమ బాధలు చేప్పుకునేందుకు అనేక సంవత్సరాలుగా ధర్నాచౌక్‌కు వస్తున్నారని, వారివల్ల ఇబ్బందులు లేవన్నారు. ఇందిరాపార్కు వద్దనే ధర్నాచౌక్‌ను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో–కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకురాలు, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహయ కార్యదర్శి జి.అనురాధ, ఝాన్సీ మాట్లాడారు. ప్రజాగొంతుకగా ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివార్లకు తరిలించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కుట్రలో భాగమయ్యారన్నారు. ధర్నా చౌక్ తరలింపు వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నారు. ప్రజలంతా ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగాలని కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. దీనిపై అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి, అఖిలపక్షంతో సమాలోచనలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
ధర్నాచౌక్‌కు మద్దతుగా నేడు పాదయాత్ర
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమంలో భాగం గా ఆదివారం ఇందిరాపార్కు సమీపంలోని ఎల్ఐసీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నెల 15న ధర్నాచౌక్ ఆక్రమణను చేపట్టిన అనంతరం, దీని పున రుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి వారం సమయా న్నిచ్చింది. అనంతరం తదుపరి కార్యాచరణ చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీలోని వివిధ వామ పక్షాలు, ప్రజాసంఘాలు, సామాజిక సంఘాలు ఆదివారం ఎల్ఐసీ కాలనీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పాదయాత్రను చేపట్టి ధర్నాచౌక్ పునరుద్ధరణ అవసరాన్ని అక్కడి ప్రజలకు వివరించాలని నిర్ణయించాయి. ధర్నాచౌక్ పునరుద్ధరణకు స్థానిక ప్రజల మద్దతును కూడగట్టాలనే నిర్ణయానికి వచ్చాయి. ఈ పాదయాత్రలో కమిటీ సభ్యులు చాడ వెంకటరెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొంటారు. -
అది ‘రియల్’ కుట్ర!
ధర్నాచౌక్, సచివాలయం తరలింపుపై కోదండరాం సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్, సచివాలయం తరలింపు వెనుక రియల్ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యా నించారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీ నర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశం మఖ్దూం భవన్లో మంగళవారం జరిగింది. తమ్మినేని వీరభద్రం, డి.జి.నర్సింహారావు (సీపీఎం), మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), వేము లపల్లి వెంకట్రామయ్య, హనుమేశ్ (సీపీఐ ఎంఎల్ –న్యూడెమొక్రసీ), కె.గోవర్దన్ (న్యూడె మోక్రసీ), రవిచంద్ర, నలమాస కృష్ణ (టీపీ ఎఫ్), భూతం వీరన్న (సీపీఐ– ఎంఎల్), తాండ్ర కుమార్, ఉపేందర్‌రెడ్డి (ఎంసీపీఐ– యూ), జె.జానకిరాములు (ఆర్ఎస్పీ), గాదె ఇన్నయ్య (తెలంగాణ ప్రజా వేదిక), సజయ పాల్గొన్నారు. వ్యాపారుల కోసమే..! సమావేశం అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడుతూ... ధర్నా చౌక్ చుట్టూ ఉన్న స్థానిక బస్తీలను ఎత్తివేసి, హుస్సేన్‌సాగర్ చుట్టూ వ్యాపార కేంద్రంగా మార్చే యత్నం జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. ధర్నాచౌక్, సచి వాలయం తరలింపు ద్వారా ప్రజల సమిష్టి ఆస్తులను ఒకరిద్దరు వ్యాపా రులకు తాకట్టుపెట్టే ప్రయత్నాలు జరు గుతు న్నాయన్నారు. సచివాలయాన్ని పరేడ్ గ్రౌండ్లో నిర్మించ డంపై అక్కడి వాకర్స్ అసోసియేషన్ వ్యతి రేకిస్తూ తీర్మానించిందని కోదండరాం వెల్లడించారు. 28న పాదయాత్ర... ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమం కొనసాగిం పుగా ఈ నెల 28న ఇందిరాపార్కు పరిసర బస్తీల్లో పాదయాత్రలు నిర్వహి స్తామని చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. -
ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారు: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: సర్కారు వైఫల్యాలు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఉద్దేశించిన ధర్నాచౌక్‌లో ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడికి పోలీసులను వాడుకోవడం దారుణమని లోక్‌సత్తా పార్టీ తెలంగాణ విమర్శించింది. సోమవారం జరిగిన ఘటనలో కాలనీవాసుల ముసుగులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, వాకర్ల ముసుగులో మఫ్టీ పోలీసులు ధర్నాచౌక్‌ను రణరంగంగా మార్చారని ధ్వజ మెత్తింది. ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ ఏ విధంగానైతే పబ్బం గడిపారో, అదే తరహాలో ధర్నాచౌక్ దగ్గర లోకల్–నాన్‌లోకల్ అంటూ తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేత జన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. -
‘తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చు’
హైదరాబాద్ : సోమవారం ధర్నాచౌక్ ఘటనలో కాలనీవాసుల ముసుగులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు, వాకర్ల ముసుగులో మఫ్టీ పోలీసులు రణరంగంగా మార్చారని తెలంగాణ లోక్‌సత్తా పార్టీ ధ్వజమెత్తింది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ఉద్ధేశించిన ధర్నాచౌక్‌లో ప్రతిపక్షాలపై దాడికి ప్రభుత్వం వాడుకోవడం దారుణమని విమర్శించింది. ఉద్యమ సమయంలో ఆంధ్ర, తెలంగాణ అంటూ ఏ విధంగానైతే పబ్బం గడిపారో, అదే తరహాలో ధర్నాచౌక్ దగ్గర లోకల్-నాన్‌లోకల్ అంటూ తెలంగాణ ప్రజల మధ్యే చిచ్చుపెట్టే ప్రయత్నం చేశారని ఆ పార్టీ నేత జన్నేపల్లి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. ధర్నాచౌక్ చరిత్రలో ఏనాడైనా బాహాబాహికి దిగిన ఉదంతాలున్నాయా అని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాగా, ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో సాధారణ దుస్తులతో ఫ్లకార్డులు ప్రదర్శించి లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ మహిళా సీఐ శ్రీదేవి మీడియాకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. -
మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు
హైదరాబాద్ : లేక్ వ్యూ పోలీస్ స్టేషన్ మహిళా సీఐ శ్రీదేవిపై బదిలీ వేటు పడింది. ఆమెను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో నిన్న సీఐతో పాటు కొందరు మహిళా కానిస్టేబుళ్లు సాధారణ దుస్తులతో ఫ్లకార్డులు పట్టుకుని అందరి మధ్య కూర్చున్నారు. అయితే మీడియా ఈ విషయాన్ని గుర్తించడంతో కొంతసేపటికి వాళ్లంతా ప్లకార్డులను అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇలా ధర్నాలో కూర్చున్న మహిళా సీఐ... మధ్యాహ్నం పోలీసు యూనిఫాంలో తిరిగి ధర్నా చౌక్ వద్దకు వచ్చి, విధులు నిర్వర్తించారు. దీంతో ప్రభుత్వమే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లేక్ వ్యూ పీఎస్ నుంచి సీఐ శ్రీదేవిని బదిలీ చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీదేవి వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. విచారణ అనంతరం ఆమెపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ధర్నాలో పాల్గొన్న ఇతర కానిస్టేబుళ్లను కూడా వివరణ కోరినట్లు డీసీపీ చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదించినట్లు డీసీపీ తెలిపారు. -
హిట్లర్‌ను తలపిస్తున్న కేసీఆర్ పాలన
∙రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్ ∙లాఠీచార్జి్జపై నిరసన ∙ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నర్సంపేట: ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి, రాజ్యాంగం కల్పించిన హామీ లను కాలరాస్తూ కేసీఆర్ ప్రభుత్వం హిట్లర్ నియంతనపాలనను తలపిస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద పోలీ సుల లాఠీచార్జి, దమనకాండలను నిరసిస్తూ నర్సంపేటలో ప్రభుత్వ దిష్టిబొ మ్మను సీపీఎం నాయకులు దహనం చేశారు. రమేష్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసమస్యలను ఎలుగెత్తి చాటకుండా, అడిగే హక్కు లేకుండా చేయాలని చూడడం అప్రజాస్వామికమన్నారు. ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ను కొనసాగించాలని ఆయన డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి వం గాల రాఘసుధ, సీపీఎం పట్టణ నాయకులు వెంకన్న, రవి, శోభ, రాజు, రమేష్, రాములు, కార్తీక్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో.. ధర్నాచౌక్‌ను ప్రభుత్వం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న వారి పై ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించడం అప్రజాస్వామికమని ఎన్డీ జిల్లా కమిటీ సభ్యుడు లావుడ్య రాజు అన్నారు. లాఠీచార్జి్జకి వ్యతిరేకంగా సోమవారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన వ్యక్తంచేశారు. పార్టీ డివిజన్ నాయకులు చెల్లమల్ల నర్సన్న, మాడ అశోక్ పాల్గొన్నారు. -
ధర్నా యుద్ధం
‘ధర్నాచౌక్ ఆక్రమణ’ ఉద్రిక్తం ► ఉదయం నుంచే బైఠాయింపులు.. నిరసనలు ► హోరెత్తిన నినాదాలు, పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజాసంఘాలు ► కోదండరాం, తమ్మినేని, చాడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ► ధర్నాచౌక్ వద్దంటూ స్థానికుల పేరుతో టీఆర్ఎస్ పోటీ ధర్నా ► పోటీ ధర్నా ఏర్పాట్లపై ఆందోళనకారుల దాడి.. విధ్వంసం.. ► ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు ► మఫ్టీలో ఆందోళనకు దిగిన ఓ మహిళా సీఐ, పలువురు కానిస్టేబుళ్లు సాక్షి, హైదరాబాద్ మూడు నెలలుగా మూగబోయిన ధర్నాచౌక్ దద్దరిల్లింది. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులతో హోరెత్తింది. పోలీసుల లాఠీచార్జితో రణరంగంగా మారింది. ధర్నాచౌక్ వద్దంటూ వాకర్స్ అసోసియేషన్, స్థానిక కాలనీ సంఘాల పేరుతో టీఆర్ఎస్ కార్యకర్తలు, మఫ్టీలో కొందరు పోలీసులు పోటీ ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఇందులో సుమారు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆందోళనకారులు వెనుకడుగు వేయకుండా ధర్నాచౌక్‌ను ఆక్రమించుకున్నారు. అన్ని దారులు ఇందిరాపార్కు వైపే.. తెలంగాణ జేఏసీ, ప్రతిపక్షాలతో ఏర్పడిన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం నుంచే వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున ‘ధర్నాచౌక్ ఆక్రమణ’కు తరలివచ్చారు. నగరంలోని అన్ని దారులు ఇందిరాపార్కు వైపునకే కదిలాయి. ఉద్యమకారుల నినాదాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ధర్నాచౌక్ ప్రాంతం మార్మోగింది. ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఉదయం 6 గంటలకే అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం సీపీఐ నాయకులు వందలాదిగా తరలివచ్చారు. ఇదే సమయంలో ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని స్థానికులు, వాకర్స్ ముసుగులో ముషీరాబాద్, ఎల్బీనగర్, నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు మఫ్టీ పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనాకారులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య పలుమార్లు వాగ్వాదం, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల మధ్య బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు బస్‌భవన్ నుంచి టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, న్యూడెమోక్రసీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో వేలాది మంది ధర్నాచౌక్ చౌరస్తాకు చేరుకున్నారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహం... జేఏసీ, వామపక్ష, న్యూడెమోక్రసీ నేతల రాకతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు ధర్నాచౌక్‌ను ఆక్రమించుకునేందుకు బారికేడ్ల వద్దకు దూసుకొచ్చారు. ధర్నాచౌక్ లోపల టీఆర్ఎస్ కార్యకర్తలు, బయట ఆందోళనకారులు పోటాపోటీ నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఆందోళకారులు అక్కడున్న కుర్చీలను పగుల కొట్టి వాటిని టీఆర్ఎస్ నాయకుల వైపు విసిరివేశారు. మరికొందరు బారికేడ్లను ఎక్కగా మరికొందరు వాటిని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. అయినా ఆందోళనకారులు బారికేడ్లను తొలగించుకుని ధర్నాచౌక్ వైపు పరుగెత్తారు. దీంతో అప్పటివరకు అక్కడే ఉన్న టీఆర్ఎస్ ముషీరాబాద్ ఇంచార్జి ముఠా గోపాల్, పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు వెళ్లిపోయారు. పలువురికి గాయాలు.. ధర్నాచౌక్ ఆక్రమణ సందర్భంగా ఆందోళనకారులపై జరిపిన లాఠీచార్జిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి నుదిటిపై బలంగా లాఠీ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌తోపాటు న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్రావు, పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, సీపీఐ నాయకులు అజీజ్ పాషా, జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కొండా రాఘవరెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత గోవర్ధన్, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, జనసేన నాయకులు శంకర్‌గౌడ్, అరుణోదయ విమల, పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకులు చెరుకు సుధాకర్, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్షం ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రజలు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైందని, దానిపట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర రాజధానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ధర్నాలకు, ఆందోళనలకు అనుమతినివ్వడం దారుణమన్నారు. ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమం విజయవంతమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరపాలని, ధర్నాచౌక్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జేఏసీ తదుపరి కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మరింత ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని ఆశిస్తే అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మఫ్టీ పోలీసులతో దాడులకు దిగారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ధర్నాచౌక్‌ను ఆక్రమించారని తమ్మినేని పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానన్న కేసీఆర్ ఇక్కడ మాత్రం ధర్నాచౌక్ ఎత్తివేయడం హాస్యాస్పదంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఉదయం ప్లకార్డుతో.. మధ్యాహ్నం పోలీస్ డ్రెస్‌లో.. సోమవారం ధర్నాచౌక్‌ను కొనసాగించాలంటూ ఒకవైపు.. లేదు తరలించాలంటూ మరోవైపు ధర్నాలు జరుగుతున్నాయి. అయితే ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో లేక్‌వ్యూ పోలీస్‌స్టేషన్ మహిళా సీఐ, కొందరు మహిళా కానిస్టేబుళ్లూ కనిపించారు. సాధారణ దుస్తుల్లో, ప్లకార్డులను పట్టుకుని మరీ అందరి మధ్య కూర్చున్నారు. మీడియా ఈ విషయాన్ని గుర్తించడంతో కొంతసేపటికి ప్లకార్డులను అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇలా ధర్నాలో కూర్చున్న మహిళా సీఐ... మధ్యాహ్నం పోలీసు యూనిఫాంలో తిరిగి ధర్నా చౌక్ వద్దకు వచ్చి, విధులు నిర్వర్తించడం గమనార్హం. దీంతో ప్రభుత్వమే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు కేసులు నమోదు ధర్నా చౌక్ వద్ద జరిగిన ఘటనలకు సంబంధించి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద నుంచి ధర్నా చౌక్‌ను తరలించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు, ధర్నా చౌక్‌ను ఇక్కడే కొనసాగించాలని కోరుతున్న పరిరక్షణ కమిటీ.. ఈ రెండు ధర్నాలకూ అనుమతి ఇచ్చామని చెప్పారు. పరిరక్షణ కమిటీ ర్యాలీ ఇందిరాపార్కుకు చేరుకునే ముందు వరకు కూడా పరిస్థితులు మామూలుగానే ఉన్నాయని... ఆ ర్యాలీ ధర్నా చౌక్‌కు చేరుకోగానే ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరిగాయని డీసీపీ పేర్కొన్నారు. కుర్చీల ధ్వంసం, పోలీసు అధికారిపై దాడి, స్థానికులపై దాడికి సంబంధించి నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమేమీ లేదని.. అయితే పోలీసు లాఠీచార్జిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ధర్నాచౌక్ తరలింపు అనుకూల శిబిరంలో ఓ మహిళా సీఐ, కానిస్టేబుళ్లు ప్లకార్డులు పట్టుకుని కూర్చున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. దానిపై విచారణ జరుపుతామని చెప్పారు. -
ధర్నాచౌక్ ప్రజల హక్కు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు ధర్నాచౌక్‌ను అందుబాటులో లేకుండా చేయాలనే ప్రభుత్వ కుట్ర దుర్మార్గమని, ధర్నాచౌక్ ప్రజల హక్కు అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు పాల్గొనడానికి ముందు టీపీసీసీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను అందుబాటులో లేకుండా చేయాలనే ప్రభుత్వ కుట్రకు వ్యతిరేకంగా ప్రజలు స్వచ్చందంగా ఉద్యమిస్తుంటే అదే సమయంలో ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్.., స్థానికుల నుంచి వ్యతిరేకత అని.. ప్రభుత్వమే కుట్రలు చేస్తోందని విమర్శించారు. రెండు వర్గాలకు ఏకకాలంలో అనుమతి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం దుర్మార్గమైన క్రీడకు తెరలేపిందని మండిపడ్డారు. స్థానికుల పేరుతో ప్రభుత్వం కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడికి పంపించిందని చెప్పారు. ధర్నాచౌక్‌కు వస్తున్న వారిపై దాడులకు ఉసిగొలిపి, హింసను రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వమే దిగడం నీచమన్నారు. ధర్నాచౌక్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని స్థానికులు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రజలతో చర్చించారని ఆయనవద్ద కూడా స్థానికులు అభ్యంతరాలు చెప్పలేదని అన్నారు. ధర్నా చౌక్‌ను నగరానికి దూరంగా తరలించడం.. ప్రజలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న భయానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. పాలకులు సరైన పాలన చేపడితే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు టి.జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, టి.రాంమోహన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. -
హింస బాధ్యత సర్కారుదే!
స్పష్టం చేసిన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ - ప్రభుత్వం అనుకూల, వ్యతిరేక వర్గాలకు ఒకేరోజు అనుమతి ఇచ్చింది - అనుకూల ధర్నా పేరిట వచ్చింది టీఆర్ఎస్ శ్రేణులు, మఫ్టీ పోలీసులే - పోలీసులు దాడిలో 35 మందికిపైగా తీవ్రంగా గాయాలయ్యాయి - ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసాగించాల్సిందే - కమిటీ నేతలు కోదండరాం, చాడ, తమ్మినేని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద సోమవారం జరిగిన హింసకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ స్పష్టం చేసింది. ఈ అంశంపై అనుకూల, వ్యతిరేక వర్గాల నిరసనలకు ఒకే రోజు ప్రభుత్వం అవకాశం కల్పించి రెచ్చ గొట్టిందని మండిపడింది. ధర్నాచౌక్ కొన సాగింపుపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పంద న కోసం వారం పాటు వేచి చూస్తామని.. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. సోమవారం ధర్నాకు ప్రభుత్వం అనుమతినిచ్చి అక్కడే టెంట్లు, కుర్చీలు, మంచినీళ్లు ఏర్పాటు చేసినందున.. అది ఇక ముందు కూడా కొనసాగుతుందని ఆశిస్తు న్నట్లు పేర్కొంది. ఈ ధర్నాకు సంఘీభావం ప్రకటించి, పాల్గొన్న కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్సార్సీపీ, జనసేన నేతలకు ధన్య వాదా లు తెలిపింది. ధర్నాచౌక్ ఘటనపై సోమ వారం సాయంత్రం మగ్దూంభవన్‌లో పరి రక్షణ కమిటీ సమావేశమైంది. ఇందులో చాడ వెంకటరెడ్డి, ఆదిరెడ్డి (సీపీఐ), తమ్మినేని వీర భద్రం, డీజీ నరసింహారావు (సీపీఎం), కోదండరాం, వెంకటరెడ్డి (టీజేఏసీ), సాది నేని వెంకటేశ్వరరావు, కె.గోవర్ధన్ (న్యూ డెమోక్రసీ–చంద్రన్న), పోటు రంగారావు, రమాదేవి (న్యూడెమోక్రసీ– రాయల), విమ లక్క (అరుణోదయ), రవిచంద్ (టీడీఎఫ్), నలమాస కృష్ణ (టీపీఎఫ్), పీఎల్ విశ్వే శ్వరరావు (ఆప్), తాండ్రకుమార్ (ఎంపీసీఐ– యూ), నరహరి (ఎస్‌యూసీఐ–సీ), కె.సజ య (సామాజిక కార్యకర్త) పాల్గొని చర్చిం చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరు కుట్ర పూరితం ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వం వ్యవహ రించిన తీరును ఖండిస్తున్నామని చాడ వెంక టరెడ్డి చెప్పారు. తమ ధర్నాకు అనుమతి ఇచ్చి నట్లే ఇచ్చి... అనుకూల ధర్నా పేరిట తమ నిరసనను అణచివేయడానికి కుట్ర పన్నార న్నారు. సీఐ శ్రీదేవి, కొందరు కానిస్టేబుళ్లు మఫ్టీలో అనుకూల ధర్నాలో పాల్గొన్నారని, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందు లో చేరి ప్రణాళిక ప్రకారం వ్యవహరించారని చెప్పారు. ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసా గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అతి తెలివిగా వ్యవహరించడమే సోమవారం నాటి ఘటనకు కారణమని తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాకు అనుమతించాక అక్క డికి చేరుకోవడం తమ హక్కు అని.. దానిని ఉల్లంఘించిన పోలీసులపై చర్య తీసుకోవా లని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ నేతలు అధికార గర్వంతో వ్యవహరిస్తున్నారని, తెలంగాణ సమాజానికి వారే క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. ఏసీపీ నర్సయ్య స్వయంగా లాఠీ పట్టుకుని కార్యకర్తలను కొట్టారని, ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు తనను విచక్ష ణారహితంగా కొట్టి, గాయపరిచారని సాది నేని వెంకటేశ్వర రావు తెలిపారు. మహిళలపై మగ పోలీసులు దాడి చేశారని విమలక్క చెప్పారు. అనుకూల ధర్నాకు టెంట్లు, సదు పాయాలు ఎవరు సమకూర్చారో చెప్పాల న్నారు. ధర్నాచౌక్‌తో మార్నింగ్ వాకర్స్‌కు ఇబ్బంది లేదని వారి సంఘం కూడా స్పష్టం చేసిందని డా.సుధాకర్ వెల్లడించారు. హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు: కోదండరాం ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం, ఐక్యంగా పనిచేస్తామని.. టీజేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు. పోలీసులు ధర్నాకు అనుమతిచ్చామని చెప్పి.. నిర సనకారులను గొడ్లను బాదినట్లు బాదా రని మండిపడ్డారు. 35 మందికిపైగా గాయపడ్డారని, అందులో 12 మందికి తలకు దెబ్బలు తగలడంతో పాటు కాళ్లు, చేతులు విరిగాయని వెల్లడించారు. సోమ వారం నుంచి ధర్నాచౌక్‌ను ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘నాలుకలు కొస్తాం, తలకాయలు తీస్తా మన్న భాషే ప్రభుత్వంలోని వారికి వచ్చి న భాష’ అని విమర్శించారు. ఖమ్మం మిర్చి రైతులపై పెట్టిన రాజద్రోహం కేసును ఉపసంహరించు కోవాలన్నారు. -
పోలీసుల వల్లే అదుపు తప్పింది: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: ధర్నాచౌక్ వద్ద ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న ప్రతిపక్షాల కార్యకర్తలు, ప్రజలపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని బీజేపీ ఖండించింది. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మఫ్టీ పోలీసులు ప్లకార్డులు పట్టుకుని నిరసనకారులపై డాడి చేయడం వల్లే పరిస్థితి అదుపు తప్పిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వమే హింసను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, ఒత్తిళ్లతో ప్రజల మధ్య ప్రభుత్వం చిచ్చుపెట్టడం సిగ్గుచేటని విమర్శించింది. ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ధర్నాచౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రజలు, ప్రతిపక్షాలకు ఉంటుందని, దాన్ని హరించాలని చూడటం సరికాదన్నారు. లాఠీ చార్జ్ వల్ల గాయపడిన వారికి వెంటనే వైద్య సహాయం అందించాలని సాంబమూర్తి డిమాండ్ చేశారు. -
‘నాలుకలు చీరేస్తారు.. జాగ్రత్త’
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్దని స్థానికులు పదేళ్లుగా కోరుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామంటేనే ఈ రోజు కార్యక్రమానికి పోలీస్‌లు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఆందోళనకారులు ఐరన్ పైపులతో వచ్చారని ఆరోపించారు. తాము ఎవరినీ సమీకరించలేదని.. తలుచుకుంటే పది లక్షల మందిని అక్కడకు రప్పించ గలిగేవాళ్లమని చెప్పారు. విపక్షాల దౌర్జాన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలనీ వాసులను ధర్నా చౌక్‌కు రావద్దని ఒత్తిడి తెచ్చినా వారు ఆవేదన చెప్పుకోవడానికి వచ్చారని తెలిపారు. విపక్షాలను ప్రజలు చీదరించుకుంటున్నాయని అన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం దుర్మార్గం అన్నారు. సీఎం కుటుంబ సభ్యులను ఇలాగే ఏకవచనంతో సంభోదిస్తే ప్రజలు నాలుకలు చీరేస్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా విపక్షాలు పద్దతి మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలకు అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. -
‘ప్రభుత్వం తొండి చేసింది’
హైదరాబాద్: ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు అనుమతి ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం తొండి చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ధర్నాలో ప్రభుత్వమే హింసకు పాల్పడిందని ఆరోపించారు. పోలీసులు హింసకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. టీఆర్ఎస్ సర్కారు అతి తెలివి ప్రదర్శించిందని, లాఠిచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులతో ధర్నా చేయించిన హోంమంత్రికి ఏం చట్టబద్ధత ఉందని తమ్మినేని ప్రశ్నించారు. ఈ రోజు ధర్నాలో విజయం సాధించామని, ప్రభుత్వే ఘర్షణ వాతావరణం సృష్టించిందని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. ధర్నా చౌక్ వద్ద పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. -
ఉత్తమ్ బంధువు ధర్నా చౌక్ బాధితుడే: పల్లా
హైదరాబాద్: ధర్నా చౌక్ తో నగరంలో రెండు లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప బంధువు కూడా ధర్నా చౌక్ బాధితుడేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ..ఉత్తమ్ తన బంధువును అడిగితే వాస్తవాలు చెబుతారని సూచించారు. స్థానికులను కొట్టించిన లోకల్ ఎమ్మెల్యే పతనం నేటి నుంచి మొదలైందన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం నేరపూరిత నాయకత్వాల చేతిలో ఉన్నాయన్నారు. తెలంగాణాలో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ఇకపై కఠినంగా ఉంటామన్నారు. ఎక్కడ కమ్యూనిస్టులు ఉంటే అక్కడ విధ్వంసమేనని తెలిపారు. ప్రజల మీద ప్రతిపక్షాల దాడి దురదృష్టకరమని వాపోయారు. -
అందుకే కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారు: కర్నె
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ రోజు జరిగిన హింసకు వామపక్షాలే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలను టీఆర్ఎస్ఎల్పీ పక్షాన ఖండిస్తున్నామన్నారు. తాము అనుకున్నట్టే హింస జరిగినందుకు కమ్యూనిస్టులు సంతోషిస్తున్నారన్నారు. ధర్నా చౌక్ వ్యవహారం కోర్టుల్లో ఉందని, ధర్నా చౌక్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ధర్నా చౌక్ ను ఆక్రమించడానికి అదేమైనా వస్తువా ? అని ప్రశ్నించారు. పేదలకు స్థలాల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని వాటిని బడా వ్యక్తుల కట్టబెట్టింది ఎవరో అందరికి తెలుసునన్నారు. ధర్నా చౌక్‌ను వ్యతిరేకిస్తుంది గత పది సంవత్సరాలుగా స్థానిక ప్రజలేనని స్పష్టం చేశారు. కాలనీ వాసులను, వాకర్స్ ను గాయపరిచే హక్కు విపక్షాలకు ఎక్కడిది ? సూటిగా అడిగారు. ప్రజలను హింసించే హక్కు విపక్ష నేతలకు ఎవరు ఇచ్చారు ? అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు సూది దప్పడం దాడుల నైజాన్ని మరో సారి చాటుకున్నారని ఎద్దేవా చేశారు. రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన నాయకులను దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేకే ఈర్ష్యతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని తెలిపారు. కోదండరాం, రేవంత్, ఉత్తమ్, తమ్మినేనిలు ఈ రోజు జరిగిన ఘటనపై ప్రజలకు క్షమాపాణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద వేర్వేరు సంస్థలు ఓకే రోజు ధర్నా చేసిన సందర్భాలు ఉన్నాయని, విపక్షాలకు ఏ అంశం లేకనే ధర్నా చౌక్ అంశాన్ని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు. -
ధర్నాచౌక్ ప్రజల ప్రాథమిక హక్కు: లక్ష్మణ్
హైదరాబాద్: ధర్నాచౌక్ రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్ వద్ద జరిగిన ఘటనలపై ఆయన స్పందిస్తూ.. స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిమితితో కూడిన ధర్నా చౌక్‌ను కొనసాగించాలి. ప్రత్యామ్నాయ మార్గం చూయించాలి. ధర్నాచౌక్ అంశాన్ని అధికార పార్టీ రాజకీయం చేస్తోంది. తెలంగాణ కొరకు అనేక ఆందోళనలు, ఉద్యమాలు చేసిన అనుభవం ప్రజలకు ఉందని అన్నారు. -
ప్రభుత్వమే నడిపిస్తోంది: వీహెచ్
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్ద కాలనీవాసులు ఎవరూ ఆందోళన చేయడంలేదని, ప్రభుత్వమే ఈ వ్యవహారాన్ని నడిపిస్తోందని కాంగ్రెస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు అన్నారు. సోమవారం ఆయన జేఏసీ పిలుపు మేరకు మద్దతు తెలుపుతూ ఇందిరా పార్కులోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నాచౌక్ వద్ద బైఠాయించి సేవ్ ధర్నాచౌక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం కావాలనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తూ ఏమీ తెలియనట్టుగా నటిస్తోందన్నారు. ఏదిఏమైనా ధర్నాచౌక్‌ను ఇక్కడి నుంచి తరలించకుండా అడ్డుకుంటామని ఆయన అన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
-
ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : ఇందిరాపార్క్‌లోని ధర్నాచౌక్ సోమవారం పోటాపోటీ ఆందోళనతో దద్దరిల్లింది. ధర్నా చౌక్ తరలింపుపై అనుకూల, ప్రతికూల వర్గాల నినాదాలతో హోరెత్తింది. ధర్నాచౌక్ తరలింపును నిరసిస్తూ టీజేఏసీ చేపట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అలాగే ధర్నాచౌక్ తరలించాలంటూ స్థానిక కాలనీవాసులు చేపట్టిన ఆందోళనకూ పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం టీ. జేఏసీ నేతలు, వామపక్షాల నేతలతో పాటు స్థానికులు కూడా ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగారు. ధర్నాచౌక్‌ను వెంటనే ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు నినాదాలు చేస్తుండగా.. సీపీఐ కార్యకర్తలు ధర్నా చౌక్‌ను తరలించొద్దని పెద్ద ఎత్తున దూసుకురావడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కుర్చీలు, కర్రలు, జెండాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో స్థానికులకు పలువురు వాకర్స్‌కు గాయాలయ్యాయి. మఫ్టీలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తేవడానికి యత్నిస్తున్నారు. ఇరు వర్గాల వారి నినాదాలు, దాడుల మధ్య ఇందిరాపార్క్ రణరంగాన్ని తలపిస్తోంది. కాగా ఇరు వర్గాలు సంయమనం పాటించి తమ సమస్యలను శాంతియుతంగా చెప్పుకోవాలని పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గత రెండు నెలలుగా ధర్నాచౌక్‌లో ఎలాంటి ఆందోళనలకు అనుమతి ఇవ్వడంలేదని... అయితే ఈ ఒక్క రోజు మాత్రమే అనుమతి ఇచ్చామని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా... చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉత్కంఠ రేపుతున్న ‘చలో ఇందిరాపార్క్’
-
ఉత్కంఠ రేపుతున్న ‘చలో ఇందిరాపార్క్’
అజ్ఞాతంలోకి టీజేఏసీ, ఇతర ముఖ్య నేతలు.. సెల్ఫోన్లూ స్విచ్చాఫ్ - ఎలాగైనా ధర్నాచౌక్ చేరుకుంటామంటున్న టీజేఏసీ, అఖిలపక్షనేతలు - మిలియన్ మార్చ్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ, అఖిలపక్ష నేతలు సోమవారం తలపెట్టిన ‘చలో ఇందిరాపార్క్’ కార్యక్రమం ఉత్కంఠను రేపుతోంది. చలో ఇందిరా పార్క్ పేరిట ధర్నా చౌక్ ఆక్రమణకు ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో టీజేఏసీ, అఖిలపక్షాలు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, టీటీడీపీ, సీపీఎం, సీపీఐ, వైఎస్సార్సీపీ, బీజేపీ, న్యూ డెమొక్రసీ లోక్‌సత్తా, ఆమ్ఆద్మీ వంటి పార్టీలతో పాటు వివిధ ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తమను పోలీసులు అరెస్ట్ చేస్తారన్న సమాచారంతో టీజేఏసీ, అఖిలపక్షనేతలు అప్రమత్త మయ్యారు. పోలీసులకు దొరకకుండా సోమవారం నాటి ధర్నాచౌక్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే లక్ష్యంతో టీజేఏసీ, ఇతర పార్టీల ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెస ర్ కోదండరాం సహా జేఏసీ నేతలు సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. అయితే టీఆర్ఎస్ నేత ముఠా గోపాల్ నేతృత్వంలో పలువురు స్థానికులు ధర్నాచౌక్‌ను తరలించాలని పోటీగా కార్యక్రమాన్ని నిర్వహించడంతో రాజకీయంగా వేడిని రగిలిస్తోంది. ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌ను కొనసాగించాలం టూ ఇప్పటికే నెలరోజులుగా జేఏసీ, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు దీక్షలు నిర్వహించా యి. కలెక్టర్, రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించ డం, అమరవీరుల స్మారక స్తూపం దగ్గర మౌనదీక్ష వంటి కార్యక్రమాలను నిర్వహించాయి. చివరగా ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు కల్పించినా సోమవారం ఉదయం 11 గంటలకు ధర్నాచౌక్‌కు చేరుకోవాలని విపక్ష నేతలు పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాల స్ఫూర్తితో విజయవంతం చేయాలని నిర్ణయించారు. సర్కారు కక్షతో వ్యవహరిస్తోంది: టీజేఏసీ, అఖిలపక్షాలు ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం ప్రజలపై కక్షపూ రితంగా, దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ధర్నాచౌక్ పరిరక్షణకమిటీ కో కన్వీ నర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జి.నర్సింహారావు, సీపీఐ(ఎం–ఎల్) న్యూ డెమొక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు కె.గోవర్ధ న్ తదితరులు ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించా రు. ధర్నాచౌక్ పరిరక్షణకోసం గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు జరిగాయని, టీఆర్ఎస్ లో అంతర్మథనం మొదలైందని పేర్కొన్నారు. వివిధ వర్గాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, ధర్నాచౌక్‌కు అనుకూలంగా ప్రకటనలు వెలువడుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందిరా పార్క్ పరిసర కాలనీ వాసులు, ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ పేరుతో కొంతమందిని రెచ్చగొట్టి పోలీసుల కనుసన్నల్లో పోటీ ధర్నా నిర్వహించారని వారు ఆరోపించారు. పోలీసులు చట్టాన్ని పక్కనబెట్టి ప్రభుత్వానికి డూడూ బసవన్నల్లాగా వ్యవహరిస్తున్న తీరును జేఏసీ, అఖిలపక్ష నేతలు ఖండించారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు నిర్వహించతలపెట్టిన ధర్నాచౌక్ ఆక్రమణకు పోలీసులు అనుమతించాలని, లేకుంటే ఇందిరాపార్క్ వద్ద ఆదివారం జరిగిన ధర్నా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగినట్టుగా తేలిపోతుందని అన్నారు. ప్రతిపక్షాల గొంతులను నొక్కడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి, పోలీసులకు కనువిప్పు కలిగేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ధర్నాచౌక్‌ను నగరంలోనే కొనసాగిం చాల్సిన ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి అనేక రీతులలో తెలియచేస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.ప్రజల వినతులను ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.కార్యక్రమ నిర్వాహకులు వివిధ జిల్లాలనుంచి కూడా తమ కార్యకర్తలను విడతల వారీగా హైదరాబాద్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అష్ట దిగ్బంధంలో ధర్నాచౌక్ టీజేఏసీ, అఖిలపక్షం తలపెట్టిన ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌ను అష్ట దిగ్బంధం చేశారు. ధర్నాచౌక్‌కు వచ్చే దారులన్నింటిని ముళ్ల కంచెలు, భారీ బారికేడ్లతో మూసి వేశారు. ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. హైదరాబాద్‌లోని పోలీసులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 16 వందల మంది పోలీసులను భద్రత ఏర్పాట్ల కోసం రప్పించినట్టు సమాచారం. ఆదివారం రోజంతా ఎన్టీఆర్ స్టేడియంలో పోలీసు బలగాలకు డీసీపీ, ఏసీపీల ఆధ్వర్యంలో ఆందోళనాకారులను అడ్డుకోవడంపై ప్రత్యేక డ్యూటీ మీట్‌ను నిర్వహించారు. ఆదివారం రాత్రే పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌కు దారితీసే నలువైపులా సోమవారం ఉదయం ఆరు గంటల నుంచే పోలీసులు విధుల్లో చేరనున్నారని తెలుస్తోంది. పరిస్థితి విషమిస్తే ఎదుర్కోవడానికి రాపిడ్ యాక్షన్ ఫోర్సుతో పాటు వాటర్కెనాన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. -
ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లే
ధర్నాచౌక్ రద్దుపై ప్రొ. హరగోపాల్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్‌ను రద్దు చేయడమంటే ప్రజా ఉద్యమాల గొంతు నులిమినట్లేన ని ప్రొఫెసర్ హరగోపాల్ అభివర్ణించారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహి రంగ లేఖ రాశారు. రాష్ట్ర సాధనలో ధర్నా చౌక్ పాత్ర కీలకమైందని, టీఆర్ఎస్ ఆవి ర్భావం నుంచి అధికారంలోకి వచ్చేవరకూ నిచ్చెనలా నిలబడ్డ విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. ఎన్నోపార్టీలు అధికారంలోకి రావచ్చు పోవచ్చని, ఏపార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదనేది చరిత్రాత్మక సత్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకమైన ఉద్యమాలకు ఊపిరి పోసిన ధర్నాచౌక్ తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య సంస్కృతి, జీవితంలో అంతర్భాగ మన్నారు. ధర్నా చౌక్ రద్దు నిర్ణయం వెనుక పోలీసు యంత్రాంగం పాత్ర ఉంటుందన్నారు. -
ధర్నాచౌక్‌ను తొలగించాలి..
- ధర్నాచౌక్‌తో అసౌకర్యానికి గురవుతున్నామని స్థానికుల ఆరోపణ - స్థానికులతో టీఆర్ఎస్ నేతల మంతనాలు సాక్షి, హైదరాబాద్: విపక్షాల ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు రోజులుగా టీఆర్ఎస్ నేతలు, కార్పొరేటర్లు.. ధర్నాచౌక్‌తో ఇబ్బంది పడుతున్న ఎల్ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, బీమానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జలవాయుటవర్స్, ఇండియన్ బుల్స్ అపార్ట్ మెంట్, ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మంతనాలు సాగించారు. ఆదివారం ఉదయం వాకర్స్ అసోసియేషన్‌తో పాటు బండమైసమ్మనగర్ బస్తీ ప్రతినిధులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. ధర్నాచౌక్‌తో నిత్యం ఇబ్బందులే... ధర్నాచౌక్‌తో తాము నిత్యం అసౌకర్యానికి గురవుతున్నామని ఇందిరాపార్క్ పరిసర కాలనీల వాసులు ఆవేదన వ్యక్తంచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైక్‌లతో శబ్ద కాలుష్యం, అటూ, ఇటూ బారీకేడ్లు వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. అప్పుడప్పుడు పోలీసుల లాఠీ చార్జీ జరిగినప్పుడు తప్పించుకొనేందుకు ఆందోళనకారులు తమ ఇండ్లలోకి వస్తున్నారని తెలిపారు. ఆయా వర్గాల ఆందోళనలకు, ధర్నాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఎవరికీ అసౌకర్యం కలగకుండా వేరే ప్రాంతంలో ధర్నాచౌక్‌ను ఏర్పాటు చేయాలని బీమా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,, కార్యదర్శులు పి.కుమార్, సతీశ్, జలవాయు టవర్స్ అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, ఇండియన్ బుల్స్ అపార్టుమెంట్ అధ్యక్షుడు శ్రీనివాస్‌లు ప్రభుత్వాన్ని కోరారు. -
ధర్నాచౌక్ తరలింపు సమంజసం కాదు: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను మరో చోటికి తరలించడం ఎంత మాత్రం సమంజసం కాదని బీజేపీ స్పష్టం చేసింది. ధర్నాచౌక్‌ను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేసింది. శనివారం పార్టీ నాయకులు వి.దినేశ్‌రెడ్డి (మాజీ డీజీపీ), పేరాల శేఖరరావు, బద్ధం బాల్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి ప్రభుత్వం ధర్నాచౌక్‌ను లేకుండా చేసి ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఊహించుకోవాలని హితవు పలికారు. ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టవచ్చని గతంలో కోర్టులు కూడా చెప్పాయని గుర్తుచేశారు. ఉద్యమపార్టీగా ఉంటూ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విధంగా చేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ధర్నాచౌక్ వల్ల ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బందులు కలిగిన సందర్భాలున్నాయా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ విషయంలో గతంలో తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదికను అందజేశామని దినేశ్‌రెడ్డి గుర్తుచేశారు. -
బాధిత ప్రజల గుండెచప్పుడు ధర్నాచౌక్
► ఇందిరాపార్కు నుంచి తరలించొద్దు ► అమరవీరులస్మారక స్తూపం వద్ద అఖిలపక్ష నేతల మౌనదీక్ష సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు నుంచి ధర్నాచౌక్‌ను తరలించవద్దని తెలంగాణ జేఏసీ, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అఖిలపక్షనేతలు మౌనదీక్ష చేపట్టారు. అసెంబ్లీ ఎదురుగానున్న అమరవీరుల స్మారకస్తూపం వద్ద శుక్రవారం నిర్వహించిన మౌనదీక్షలో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీజేపీ ఎమ్మెల్యే ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త చుక్కా రామయ్య, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ నేత మల్లేపల్లి ఆదిరెడ్డి, ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, జేఏసీ నేతలు పాల్గొన్నారు. మౌనదీక్ష అనంతరం వివిధ ప్రజాసంఘాలు, రాజకీయపార్టీల నేతలు ప్రసంగించారు. ధర్నాచౌక్ బాధిత ప్రజల గుండెచప్పుడు అని అభివర్ణించారు. రాజ్యాంగ హక్కును హరించొద్దు: కోదండరాం రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును హరించొద్దు. ఒక్క ధర్నాచౌక్‌ను ఎత్తివేస్తే హైదరాబాద్ నగరమంతా ధర్నాచౌక్‌గా మారుతుంది. ధర్నాచౌక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే 15న చలో ధర్నాచౌక్ నిర్వహిస్తాం. ధర్నాచౌక్‌ను మూసివేస్తే నిరసనలు ఆగవు. ఎవరి మార్గాల్లో వారు ధర్నాచౌక్ దగ్గరకు చేరుకోవాలి. రైతులపట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటో రైతులకు బేడీలు వేయడంతో తేలిపోయింది. ప్రజాస్వామ్యం ఖూనీ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే మరింత స్వేచ్ఛ ఉంటుందని భావించినం. ధర్నాచౌక్‌ను ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి ఈ చర్యలు నిదర్శనం. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నాయి. ధర్నాచౌక్‌ను పరిరక్షించుకుంటాం. ఖమ్మం జిల్లాలో రైతులకు బీడీలు వేసినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. పంటలను కొనాలని రైతులు ప్రశ్నించడమే నేరమా? రైతులేమన్నా ఉగ్రవాదులా, తీవ్రవాదులా? ప్రభుత్వ మెడలు వంచుతాం: ఎల్ రమణ ఇరవై ఏళ్లుగా ఉన్న ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం దుర్మార్గం. సబ్బండ వర్గాల సమస్యలు వినిపించడానికి ధర్నాచౌక్ ఉండాల్సిందే. ఇలాంటి నిరంకుశ, నియంత ప్రభుత్వాన్ని కూకటివేళ్ళతో పెకిలిస్తాం. ప్రభుత్వ మెడలు వంచి ధర్నా చౌక్‌ను కాపాడుకుంటాం. హక్కులను హరించొద్దు: ఎన్వీవీఎస్ ప్రభాకర్ ప్రజల హక్కులను హరించే అధికారం ఎవరికీ లేదు. ధర్నాచౌక్ ఎత్తి వేయడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉంది. దీనిని కాపాడుకోవాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ రాజకీయ పరిపాలన చేస్తున్నది. ఇది మంచిదికాదు. నియంతలకు పతనం తప్పదు: తమ్మినేని వీరభద్రం ధర్నాచౌక్‌ను ఎత్తివేసిన ప్రభుత్వం పతనం కాక తప్పదు. ప్రతిపక్షాలను అణచివేయడం ద్వారా అధికారంలో ఉంటామనుకోవడం భ్రమే. ప్రజలు దీన్ని సహించరు. చలో ఇందిరాపార్కు కార్యక్రమంలో పాల్గొంటాం. ధర్నాచౌక్‌ను కాపాడుకుంటాం. -
ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం దుర్మార్గం
-
‘ధర్నా చౌక్’పై నిర్ణయాన్ని ఉపసంహరించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లెక్కలేనన్ని ఉద్యమాలకు వేదికైన హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్దనున్న ధర్నా చౌక్ కోసం స్వరాష్ట్రంలో పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అభిప్రాయపడ్డారు. తాము కేవలం ధర్నా చౌక్ స్థలం కోసం ఉద్యమించడం లేదని, బాధిత ప్రజలు తెలిపే నిరసన హక్కు కోసం ఉద్యమిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చౌక్‌ను ఎత్తివేసే నిర్ణయం వాపసు తీసుకోవాలంటూ కోదండరాం నేతృత్వంలో అఖిలపక్షం నేతలు గురువారం డీజీపీ అనురాగ్ శర్మను కలసి విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జేఏసీ చేపట్టిన ఏ కార్యక్రమమూ విఫలం కాలేదని, ధర్నా చౌక్ విషయంలోనూ ప్రజలను చైతన్యవంతులను చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వివిధ వర్గాల ప్రజలు తమకు జరుగుతున్న అన్యాయాలను నిరసనలుగా వ్యక్తపరిచే హక్కు ఇన్నాళ్లూ ధర్నా చౌక్ వద్దే సాగిందని, భవిష్యత్తులోనూ అక్కడే కొనసాగాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ను కొనసాగించాలని డీజీపీని కోరామని, ఈ నెల 15లోగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. లేకుంటే చలో ధర్నా చౌక్ చేపడతామని, లాఠీ దెబ్బలు, పోలీసు తూటాలకు భయపడే ప్రసక్తే లేదని కోదండరాం తేల్చిచెప్పారు. ధర్నా చౌక్ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు గన్‌పార్క్ వద్ద ఆందోళన నిర్వహిస్తామని, దీనికి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జరిపితీరుతామని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్షంలో మాజీ మంత్రి, టీడీపీ నేత బోడ జనార్దన్, కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్, సీపీఐ నేత మల్లెపల్లి ఆదిరెడ్డి, సీపీఎం తరఫున నర్సింహారావు, జేఏసీ కో కన్వీనర్ బైరి రమేష్, కో చైర్మన్ పురుషోత్తం, పీఓడబ్ల్యూ సం«ధ్య, ప్రజాఫ్రంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బతుకు.. బర్బాద్!
ధర్నాచౌక్ తరలింపు నిర్ణయంతో చితికిన బడుగు జీవితాలు అది వేనవేల గొంతుకల ధిక్కార ప్రాంతం.. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమ్మె హక్కుకు చిరునామా.. విద్యా ర్థుల బిగిపిడికిలి బావుటా.. మహిళా సంఘాలు, ఆశవర్కర్లు, నిరుద్యోగులు, ఉద్యోగుల హక్కుల ప్రకటనకు వేదిక.. అదే కూతవేటు దూరంలోని పాలకుల చెవిని సోకేలా నినదిస్తూ నిత్య సందడితో కనిపించే ధర్నాచౌక్!! ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించాలన్న నిర్ణయంతో.. ఆ గల్లీతో పెనవేసుకున్న పేదల బతుకులిప్పుడు బజారున పడ్డాయి. నినాదాలతో పొడిబారిన గొంతులకు నిమ్మకాయ సోడా ఇచ్చే యాదగిరి బండి, కొబ్బరినీళ్లతో సేదదీర్చే రాజరాజేశ్వరి, నినాదాలను మోసుకొచ్చే ఫ్లెక్సీ బాయ్ లింగస్వామి, నినాదాలను ప్రతిధ్వనించే ఎస్డీఎస్ సౌండ్ సిస్టమ్ ఇబ్రహీం, వైఎస్సార్ పాదయాత్ర మొదలుకొని, కేసీఆర్, కల్వకుంట్ల కవిత, హరీశ్‌రావు లాంటి ఎందరో రాజకీయ నేతలకు 16 ఏళ్లుగా తన టెంట్‌తో నీడనిచ్చిన సాయి టెంట్ హౌజ్ వెంకటేశ్, ఎండనకా, వాననకా అతిచౌకగా అన్నం వండి వార్చి ఉద్యమకారుల ఆకలి తీర్చిన సాయి తిరుమల మెస్, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్, సలీం బజ్జీ బండి, రాజేశ్ చాయ్బండి, పాన్‌షాప్ గణేశ్, టీ వాలాలు, సిగరెట్ టేలాలూ అన్నీ ఇప్పుడు ధర్నా చౌక్తోపాటే మూగబోయాయి! మూసివేతకు దగ్గరగా ఉన్నాయి. వారి అరిగోసకు అక్షర రూపం ఈ కథనం... – సాక్షి, హైదరాబాద్ పని దొరుకుడు కష్టమైంది మాది భువనగిరి దగ్గర జంపల్లి. ఇంటర్ వరకు చదివిన. ముగ్గురు చెల్లెళ్లు, అమ్మను నేనే చూడాలి. నాన్న లేరు. పనికోసం హైదరాబాద్‌కొచ్చిన. పొద్దున 8 నుంచి సాయంత్రం 8 వరకు ధర్నాచౌక్‌లో ఫ్లెక్సీలు ఫిట్ చేయడం నా పని. అందుకు మా ఓనర్ నాకు రోజుకి రూ.450 ఇస్తాడు. కానీ ఇప్పుడు పని దొరకడం కష్టంగా ఉంది. అప్పుడు నెలరోజులు దొరికేటిది.ఇప్పుడు పది రోజులే దొరుకుతంది. నాలాంటి కూలీలు వేలమంది ఉన్నారు. – లింగస్వామి, ఫ్లెక్సీ బాయ్ ఇప్పుడెక్కడికి పోవాలె? నేను వరంగల్ నుంచి వచ్చాను. 18 ఏళ్ల నుంచి ఈ ధర్నా చౌక్లనే ఉంటున్న. ఇప్పుడె క్కడికి పోవాలె? పొద్దునొచ్చి, రాత్రిదాక ఇక్కడే సోడాలు అమ్ముత. వైఎస్ గారి పాద యాత్రప్పుడు మొదటిసారిగా సోడా బండి కొనుక్కున్న. ధర్నాచౌక్ ఉన్నప్పుడు రూ.వె య్యి దాకా ఉండే గిరాకి ఇప్పుడు సగం కన్నా తక్కువైంది. ఏం జేయాల్నో తెలుస్తలేదు. – యాదగిరి, నిమ్మ సోడా బండి మా బతుకులే పోయినయ్ ధర్నాచౌక్ పోయినంక మా బతుకులే పోయినయ్. గరీబోల్లకి ఏం బిజినెస్ చేయొస్తదమ్మ? బజ్జీలేసుకున్డు దప్ప. గదిగూడ ఏసుకోకుంటైపాయె. ధర్నా చౌక్ ఉన్నప్పుడు పది కిలోల బజ్జీపిండితోని బజ్జీలేసేటోణ్ణి. ఇప్పుడు 2 కిలోల పిండి కూడా ఒడుస్తలేదు. – సలీం, బజ్జీ బండి నిర్వాహకుడు రోజుకు 800 వచ్చేవి.. నేను నడవ లేను. 85 శాతం వైకల్యంతో ఏం పనిచేయొస్తది? అందుకే ఫ్రెండ్ బండి దగ్గర చాయ్లమ్ము తున్న. అప్పుడు ధర్నా లు జేసేటోళ్ళు వచ్చేది కాబట్టి రోజుకి S 7, ఎనిమిదొందలొచ్చేటియి. ఇప్పుడు 200 కూడా దొరుకుతలేవు. – రాజేశ్, చాయ్బండి ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే ఇక్కడ పదహారేళ్లుగా టెంట్ హౌస్ నడుపుతున్నా. ఇన్ని రోజులు ధర్నాచౌక్‌ను నమ్ముకొని బతికిన. బిడ్డలిద్దరిదీ ఇంటర్ అయిపోయింది. కొడుకు టెంత్ అయింది. బిడ్డలని ఇంజనీరింగ్ చదివించాలను కున్నాను. కానీ ధర్నా చౌక్ ఎత్తేసినంక మొత్తం బతుకేపోయింది. దుకాణానికి రూ.5,500 అద్దె కూడా కట్టలేకపోతున్నాం. షాప్ ఎత్తేయాలనుకుంటున్నా. ఇక నా బిడ్డల ఇంజనీరింగ్ చదువు కలే. డిగ్రీలో చేర్పిస్తాన్న. కేసీఆర్, హరీశ్‌రావు, కల్వకుంట్ల కవిత అందరికీ టెంట్లు మోసినం. అయినా యిప్పుడు ఫాయిదా లేదు! – వెంకటేశ్, సాయిరాం టెంట్ హౌస్ బిజినెస్ మొత్తం పడిపోయింది మేం కూడా టీఆర్ఎస్సే. అయితే ధర్నాచౌక్ బోయినంక బిజినెస్ మొత్తం పడిపోయింది. రూ.40 ఇస్తే కడుపునిండా అన్నం పెట్టెటోళ్లం. రోజుకి నాలుగైదు వేలొచ్చేటియి. యిప్పుడు వెయ్యి కూడా బిజినెస్ జరగట్లేదు. – రాజు, జైభవానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంటి కిరాయికి కూడా డబ్బులు రావడం లేదు మేమిద్దరం రోజంతా పనిచేస్తే ఐదారొందల కొబ్బరి బోండాలు అమ్మే వాళ్లం. ఇప్పుడు 100 కాయలు కూడా అమ్ముడుకావడం లేదు. ఇంటి కిరా యికి కూడా డబ్బులు రావడం లేదు. – రాజేశ్వరి, రాజబాబు కొబ్బరి బోండాం బండి మా షాపు నాయినే ఓపెన్ చేశారు ఇక్కడ మా నాన్న పాన్టేలా నడుపుతడు. గిరాకీ సగం పడిపోయింది. మేమంతా టీఆర్ఎస్సే. ఇప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ షాప్ ఓపెన్ చేశారు. ధర్నా చౌక్ ఎత్తివేసినంక నష్టంమొస్తున్న మాట నిజమే. ప్రభుత్వం ఏంజేసినా ప్రజల కోసమే అని ఇంకా నమ్ముతున్నం. – గణేశ్, పాన్‌షాప్ -
ధర్నాలకు అనుమతి లేదనడం దారుణం
సాక్షి, హైదరాబాద్: భావ ప్రకటన, నిరసన తెలిపే హక్కుపై ఉక్కుపాదం మోపుతూ ధర్నాచౌక్‌ను ఎత్తివేసి, హైద రాబాద్‌లో ధర్నాలకు అనుమతి ఇవ్వక పోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) విమర్శించింది. జిల్లాల్లో ఉద్యమకారులు, వివిధ సంఘాల, పార్టీల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. బుధవారం మఖ్దూంభవన్‌లో కందాళ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను అమలుచేయకపోగా ప్రజల ప్రజాస్వామికహక్కులపై దాడి చేయ డాన్ని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదిం చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులపై పోలీసుల దాడులు తీవ్ర మవుతున్నాయని ధ్వజమెత్తారు. భూమి హక్కు పట్టాల కోసం ఉద్యమిస్తున్న పేదలు, పోడు సాగుచేసుకుంటున్న బడుగులపై పోలీసులు దాడులుచేసి కేసులు పెట్టడాన్ని ఖండించారు. -
ధర్నాచౌక్ వద్ద నిరసనలకు ఆటంకాలొద్దు
►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15న నిర్వహించ నున్న ధర్నాచౌక్ ఆక్రమణకు ఆటంకాలు కల్పించవద్దని.. వివిధ వర్గాల ప్రజలు ఈ నిరసనకు హాజరయ్యే విధంగా రాష్ట్రప్రభు త్వం అనుమతించాలని ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. అన్నివర్గాల ప్రజలు, రాజకీయపార్టీలు, సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు ధర్నాచౌక్‌కు వచ్చేవారని, ఇప్పుడు దానిని పరిరక్షించుకునేందుకు ధర్నాలు, నిరసనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించింది. ధర్నాచౌక్‌ను కాపాడుకునేం దుకు ప్రజలంతా ఈ నెల 15న ఉదయం 11 గంటలకు ఇందిరాపార్కుకు చేరుకోవాలని పిలుపునిచ్చింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందిరా పార్కు ఆక్రమణను నిర్వహించి ప్రజల ప్రజా స్వామిక ఆకాంక్షలను కచ్చితంగా వెల్లడించి తీరుతామని ప్రకటించింది. బుధవారం మఖ్దూం భవన్లో సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను మూసేయడం ద్వారా ప్రజా స్వామ్య గొంతుకను నొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రజలంతా అడ్డుకోవాలన్నారు. సీఎస్‌కు, డీజీపీకి వినతి పత్రాలు తమ కమిటీ ఈ నెల 15న చేపట్టే ధర్నాచౌక్ ఆక్రమణకు ఆటంకాలు కల్పించవద్దని 11న డీజీపీకి, 12న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు. 12న వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, నాయకులు గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మౌనదీక్ష చేస్తారన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు సేవ్ ధర్నాచౌక్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం కోరారు. తెలంగాణ ఏర్పడ టమంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం కాదని వరవరరావు అన్నారు. మలిదశ పోరా టంలో 1,400 మంది విద్యార్థులు, యువ కులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఎన్ని కలు జరిగి ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా స్వామ్య ప్రక్రియ ముగిసినట్లు కాదని, అది ఒక జీవనవిధానమన్నారు. అందుకు నిరం తర సంఘర్షణ, చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ధర్నాచౌక్ సాధించుకునే వరకు ఉద్యమం సాగుతుందని సీపీఎం నేత డీజీ నర్సింహారావు చెప్పారు. ఈ సమావేశంలో ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు (ఆప్), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), రమాదేవి (న్యూడెమోక్రసీ), విమలక్క (అరుణో దయ), రవిచంద్ (టీడీఎఫ్), కె.సజయ (సామాజిక కార్యకర్త) పాల్గొన్నారు. -
ఎందుకు అనుమతివ్వడం లేదు?
ధర్నాచౌక్ వద్ద నిరసనలపై ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు దేశ పౌరులందరికీ ఉంద ని, ధర్నాచౌక్ వద్ద నిరసనలకు ఎందుకు అనుమతినివ్వలేదో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ అం శానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబా ద్, రాచకొండ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూరి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ధర్నా చౌక్ వద్ద గతంలోలా నిరసనలు, సమావేశా లకు అనుమతినిచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశిం చాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు వేసిన పిల్‌పై మంగళవారం ధర్మాసనం విచా రణ జరిపింది. పిటిషనర్ తరపున న్యాయ వాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రెండు మూడు దశాబ్దాల నుంచి ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా యని, ఏ ప్రభుత్వమూ వాటిని అడ్డుకో లేదని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ధర్నా చౌక్‌ను అక్కడి నుంచి తరలించి, శివార్లలో ఏర్పాటు చేయాలని భావిస్తోందని చెప్పారు. అంత దూరం వెళ్లి ఎవరు నిరసన కార్యక్ర మాలు చేపట్టగలరన్నారు. కేసీఆర్ ధర్నా చౌక్‌ను మార్చడం లేదని చెబుతున్నారని, కానీ పోలీసులు ఎటువంటి నిరసనలకూ అనుమతినివ్వడం లేదని చెప్పారు. ధర్మాస నం స్పందిస్తూ.. ‘నిరసన తెలియజేయడం ఈ దేశ పౌరుని హక్కు. దానిని ఏ ఒక్కరూ హరించజాలరు’ అని స్పష్టం చేసింది. ఈ సమయంలో ఏజీ కె.రామ కృష్ణారెడ్డి స్పంది స్తూ.. గడువునిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామన్నారు. ఇందుకు ధర్మా సనం అంగీకరిస్తూ.. ప్రతివా దులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కి వాయిదా వేసింది. -
ధర్నాచౌక్ అసెంబ్లీ లాంటిది: టీపీసీసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రజలకు ఉందని, ధర్నా చౌక్‌ను తరలించడం ద్వారా టీఆర్ఎస్ నియంతృత్వ ధోరణిని బయటపెట్టుకుందని టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ ముదిరాజ్ విమర్శించారు. సామాన్య ప్రజలకు ధర్నా చౌక్ అసెంబ్లీ లాంటిదని, దానిని ఇందిరా పార్కు వద్దే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ ధర్నాచౌక్‌ను ఎత్తివేయలేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం కేసీఆర్ వాస్తవ పరిస్థితులను దాచిపెడుతున్నారని ఆరోపించారు. నిరసన తెలిపేందుకు పోలీసులు ఎందుకు అనుమతిని ఇవ్వడంలేదో చెప్పాలన్నారు. -
కేసీఆర్‌ది ద్వంద వైఖరి
హైదరాబాద్: ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిథి నగేష్ ముదిరాజ్ మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ.. నియంతృత్వ ధోరణితో కేసీఆర్ ధర్నా చౌక్‌ను తరలిస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా ధర్నా చౌక్ ఎత్తి వేయలేదు అన్న కేసీఆర్ ఎందుకు పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలియ చేయలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్ పై కోర్ట్‌ను ఆశ్రయించామని, కోర్ట్ తీర్పు న్యాయంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని దేశానికి తెలియచేసింది ధర్నా చౌక్ అని గుర్తు చేశారు. నగర శివారులోని అడవి ప్రాంత లో ధర్నా చౌక్ ని కేటాయించారు..ఇది సమంజసమా అని ప్రశ్నించారు. ధర్నాచౌక్ అసెంబ్లీ లాంటిదని..దాన్ని ఇందిరా పార్క్ వద్దే కొనసాగించాలని డిమాండ్ చేశారు. -
ధర్నా చౌక్‌ను ఇంకా తొలగించలేదు
హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సాక్షి, సిద్దిపేట: హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తొలగించేందుకు ఇంకా ఎలాంటి అనుమతి ఇవ్వలేదని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతిపక్షాలకు ఏమీ దొరక్క ధర్నా చౌక్ అంశాన్ని పట్టుకొని రాద్దాంతం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సభ కోసం శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ధర్నాచౌక్ కంటే మంచి ప్రదేశం దొరికితే అక్కడ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నామని అన్నారు. -
నిరసన తెలిపితే ఎందుకు భయం?
-
టీఆర్ఎస్కు ఎందుకంత భయం: జానారెడ్డి
హైదరాబాద్: ప్రజాస్వామ్య పద్దతిలో కాంగ్రెస్ నిరసన తెలుపుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు భయం పట్టుకుందని సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..ధర్నా చౌక్ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామన్నారు. ధర్నా చౌక్ తరలింపు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని అన్నారు. భవిష్యత్ లో టీఆర్ఎస్ను ప్రజలే దూరం పెడతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసినంత మాత్రాన ప్రజల గొంతు నొక్కలేరని తెలిపారు. -
ధర్నాచౌక్ ప్రజా గొంతుక: చాడ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకపక్షంగా ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను నిషేధించి అప్రకటిత అత్యవసర పరిస్థితిని సృష్టించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహించకుండా నిషేధం విధించడంతో పాటు అక్కడ నిరసనలు తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజా గొంతుకగా నిలిచిన ధర్నాచౌక్ పరిరక్షణలో భాగంగా శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ధర్నాచౌక్ కోసం దీర్ఘకాలిక ఉద్యమం
⇒ లెఫ్ట్, ప్రజాసంఘాల నిర్ణయం ⇒ నేడు ప్రజాసంఘాల నేతలతో సదస్సు సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నిరసనలకు అవకాశం కల్పించే వరకు వివిధ రూపాల్లో దీర్ఘకాలిక ఉద్యమానికి సిద్ధం కావాలని వామపక్షాలు, ప్రజాసంఘాలు నిర్ణయించాయి. ఈ దిశలో ఉమ్మడి కార్యాచరణను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీగా ఏర్పడినా, రాబోయే రోజు ల్లో దానిని విస్తృతపరిచి కలిసొచ్చే శక్తులను భాగ స్వాములను చేయాలనే ఆలోచనతో ఉన్నాయి. ముం దుగా జిల్లాస్థాయిల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై ప్రచార కార్య క్రమాలు నిర్వహించి, అన్ని జిల్లాలు, మండల స్థాయిల నుంచి ఈ ఉద్యమంలో వివిధ వర్గాలు పాల్గొనేలా చేయా లని వామపక్షాలు, ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. దీనికి అనుగుణంగా అన్ని జిల్లాల్లో రౌండ్‌టేబుల్ సమావే శాలను నిర్వహించాలని నిర్ణయించాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రజాసంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర బాధ్యులతో కూడిన రాష్ట్ర సదస్సును నిర్వహించనున్నారు. ఉమ్మడి కార్యాచరణ చేపట్టే దిశలో ఈ నెల 14 వరకు జిల్లాల్లో వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టను న్నారు. 15 నుంచి వచ్చేనెల 9 వరకు మగ్దూంభవన్‌లో రిలే నిరాహారదీక్షల ద్వారా మద్దతును కూడగట్టాలని, మే 10న హైదరాబాద్ ఆక్రమ ణను చేపట్టాలని నిర్ణయించారు. ఇతర పార్టీల భాగస్వామ్యంపై భిన్నాభిప్రాయాలు... ఇదిలా ఉండగా ధర్నాచౌక్ పునరుద్ధరణ విషయంలో కాం గ్రెస్, బీజేపీ, టీడీపీలను కూడా కలుపుకుని పోవాలని గురువారం రాత్రి జరిగిన భేటీలో కొందరు సూచించినా దానిపై ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ సమస్యపై వామపక్షాలు, ప్రజాసంఘాలు పోరాడుతున్న విధంగానే ఇతర పార్టీలు కూడా కృషి చేస్తేనే విస్తృత ప్రాతిపదికపై కలవొచ్చునని సీపీఐ, సీపీఎం నాయకులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. -
ధర్నాచౌక్ పరిరక్షణకు ఉద్యమం : చాడ
ఈ నెల 15 నుంచి మే 9 వరకు నిరాహార దీక్షలు: చాడ సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌ను పరిరక్షించుకునేందుకు ప్రజా ఉద్య మాలు ప్రారంభిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా, విద్యార్థి, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో దశలవారీగా ఉద్యమాలు నిర్వహించి ధర్నాచౌక్‌ను ఇందిరాపార్క్ వద్దే కొనసాగిం చేలా ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. గురువారం మగ్దూంభవన్‌లో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. చాడ వెంకట్‌రెడ్డి మాట్లా డుతూ ధర్నా చౌక్ ఎత్తివేయొద్దని గవర్నర్, హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఈ నెల 15 నుంచి మే 9 వరకు మగ్దూంభవన్ ఎదుట రోజుకో సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహిస్తామ న్నారు. మే 10న ఇందిరాపార్క్ వద్ద భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. సమా వేశంలో పరిరక్షణ కమిటీ కో కన్వీనర్ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, ప్రజా తెలంగాణ వేదిక గాదె ఇన్నయ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రవిచంద్ర, ఎంసీపీఐ సాంబయ్య, సీపీఐ నేత ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లక్ష గళాల వేదిక ధర్నాచౌక్
సందర్భం ధర్నాచౌక్ సాక్షిగా అంగన్వాడీ టీచర్ల మీదకు గుర్రాలతో స్వారీ చేయించిన ఒకనాటి పాలకుడు ఎలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందో మనకు తెలియదా? ధర్నాచౌక్ పాలకులది కాదు, మనందరిదీ. సేవ్ ధర్నాచౌక్... ఈ నినాదం ఇప్పుడు తొలి తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో క్షమించరాని నేరం. ఆ ప్రాంతానికున్న చారిత్రక నేపథ్యాన్ని తుడి చేయాలనే కసి వారి ప్రతి మాట, చేతలోనూ కనిపి స్తోంది. ఇరవై ఐదేళ్ల క్రితం హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా, సెక్రటేరియట్ ఎదురుగా నిర్వహించే ధర్నాలను, బహిరంగ సభ లను శాంతి భద్రతల పేరు చెప్పి రెండు కిలోమీటర్లు దాటిన తర్వాతే ఇలాంటి వేదికలు ఉండాలని ఇంది రాపార్క్ దగ్గర ఈ ప్రదేశాన్ని కేటాయించింది అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వమే. ప్రజాగళం వినిపించాల్సింది ఈ రెండు వేదికలే కాబట్టి, వాటికి ఈ ప్రాంతం మరీ ఎక్కువ దూరం కానందున ప్రతి పక్ష పార్టీలు, ఇతర ప్రజాసంఘాలు అప్పటినుంచి ఈ ప్రాంతాన్ని ఒక వేదికగా మలచుకున్నారు. ఆనాటి నుంచి ధర్నాచౌక్ అనేక చారిత్రక ఉద్య మాలకు నెలవుగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు తమ గొంతు వినిపించటానికి ఈ వేదికను శక్తివంతంగా ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో వున్న టీఆర్ఎస్ పార్టీతో సహా. ఇవే కాకుండా ప్రజాసంఘాల ద్వారా 1/70 అమలు కోసం ఆదివాసీల హక్కుల కోసం అయినా, దళిత బహుజనుల హక్కుల కోసం ఉద్యమించినా.. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ సాధన అయినా, మరణశిక్షల రద్దు ఉద్యమమైనా, రైతు ఆత్మహత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించినా, ఎన్కౌంటర్ల సంస్కృతిని వ్యతిరేకిం చినా, మత సామరస్యం కోసం నడుం బిగించినా, బాలల హక్కుల కోసం పోరాడినా, డాక్టర్లు, నర్సులు, మున్సిపాలిటీ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, మీడియా సంఘాలు, యాజమాన్యాలు, ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, పనిమనుషులు, సఫాయి కార్మికులు, చేనేత కార్మికులు, కవులు, కళా కారులు అనేకానేక సమూహాలు, ఆఖరికి అర్చకు లతో సహా అనేక కుల సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాలతో ఒక సంభాషణ జరపటం కోసం ఎవరికీ ఏ రకమైన ఇబ్బందులు కలిగించకుండా.. తమ సమావేశాల్ని, ధర్నాలను నిర్వహించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలపడటానికి అనేక సబ్బండ వర్ణాల ప్రజలు, సమూహాలు ఒక దగ్గరకు రావటానికి ధర్నాచౌక్ కీలకమైన ప్రాంతం. తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షని ఈ వేదిక ద్వారానే ప్రపంచానికి చాటి చెప్పారు. కానీ ఇప్పుడు ఏ వేదికైతే తమ ఆకాంక్షకు బలమైన ఆసరాగా ఉందో, ఏ రహదారి తమ పోరా టాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందో దాన్నే శాశ్వ తంగా మూసి వేయాలనే విఫలయత్నాన్ని ప్రభు త్వం చేస్తోంది. తాము నడచిన దారుల్నే వారు మర చిపోవాలనుకుంటున్నారు. బహుశా తమకింక ఆ వేదికల అవసరం లేదనుకుంటున్నారు. ధర్నాచౌక్ అనేమాట వినపడితే విచక్షణ మరుస్తున్నారు. చిన్న పిల్లలు, మహిళలు అని చూడ కుండా లాగి అవతల పారేయమని పోలీసులకు మౌఖిక ఆదేశాలందా యట. ఇదేమిటని ప్రశ్నిస్తే, ‘మీరు సీఎంతో మాట్లా డుకోండి, మాకు ఆదేశాలున్నాయి ఇలా చేయమని’ అని వారే మరీ చెప్తున్నారు. ‘అలా మాట్లాడుకోవటా నికి ఉన్న వారధే కదా ఈ ధర్నాచౌక్, అందుకేS దాని మీద నిషేధాజ్ఞలు ఉండ కూడదని మేం ప్రశ్నిస్తు న్నాం’ అంటే, ‘మాకు చాలా ట్రాఫిక్ సమస్యలొస్తు న్నాయని, ‘పక్కనవున్న కాలనీ వాళ్లకి చాలా ఇబ్బంది అవుతోంది’ అని చెబుతున్నారు. ధర్నాచౌక్ అంటే కేవలం ఒక రోడ్డు మాత్ర మేనా!? ఎన్ని ఆలోచనల కూడలి అది! ఎన్నో ప్రాంతాల నుంచి సమూహాలుగా వచ్చిన ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వాలకు తెలియచేసే వేదిక అది. అక్కడి నుంచి ఎన్ని లక్షలమంది తమ గళాల్ని వినిపించి ఉంటారు? ఎన్నో లక్షల మంది గత 25 సంవత్సరాల నుంచి తమ పాదముద్రల్ని అక్కడ నిక్షిప్తం చేశారు. ప్రభుత్వాల నిరంకుశత్వాలకు ఎన్ని సార్లు ఈ ధర్నాచౌక్ ప్రత్యక్షసాక్షిగా ఉండలేదు. ఎన్నిసార్లు పోలీసుల లాఠీలు ప్రజల శరీరాల మీద నాట్య మాడలేదు... వాటిని తట్టుకుంటూ, ఇనుప గేట్లను తోసుకుని మరీ నినదించిన మట్టిపాదాల ముద్రలు కదా మనకు స్ఫూర్తి. ధర్నాచౌక్ సాక్షిగా అంగన్వాడీ టీచర్ల మీదకు గుర్రాలతో స్వారీ చేయించిన ఒకనాటి పాలకుడు ఎలాంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాల్సి వచ్చిందో మనకు తెలియదా? చెరబండరాజు రాసిన ‘నన్ను కదిపినా, ఖండిం చినా మళ్ళీ మళ్ళీ అలలా పుట్టుకొస్తూనే ఉంటాను’ అనే కవిత స్ఫూర్తిగా అవును... మేం ఉద్యమిస్తాం... అన్యాయానికి వ్యతిరేకంగా... అవును.. మేము పాదయాత్రలు చేస్తాం... సామాజిక న్యాయం కోసం... అవును.. మేం దిక్కులు పిక్కటిల్లేలా నిన దిస్తాం... ధర్నాచౌక్ సాక్షిగా మీ నియంతృత్వానికి చరమగీతం పాడేలా... ధర్నాచౌక్ పాలకులది కాదు, మనందరిది. కాపాడుకుందాం. కె.సజయ వ్యాసకర్త సామాజిక పరిశోధకురాలు, స్వతంత్ర జర్నలిస్ట్ ‘ 99483 52008 -
నేతాజీ సేనను ఎలా చూడాలి?
విశ్లేషణ నేతాజీ మనమంతా గౌరవించే దేశభక్తుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. నేతాజీ సైనికులు కూడా స్వాతంత్య్ర వీరులుగా గుర్తింపు పొందవలసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారెవరూ ఉండరు. బ్రిటిష్ పాలన మీద భారత జాతీయ సైన్యాన్ని (ఆజాద్ హింద్ ఫౌజ్–ఐఎన్ఏ) యుద్ధానికి సమాయత్తం చేసిన దళపతి నేతాజీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. గాంధీ అహింసావాదంతో స్వాతంత్య్రం సాధించే అవకాశం లేదని తుపాకిని నమ్మాడు. బ్రిటిష్ ఇండియా సర్కారు కళ్లుకప్పి తప్పించుకునిపోయి, మహా సైన్యాన్ని–ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మించాడు. బ్రిటిష్ ఇండియా సైనికులుగా కాదు, భారతీయ సైనికులుగా రెండో ప్రపంచయుధ్ధంలో పోరాడమని నాటి పాలకులు పిలుపునిచ్చారు. కానీ ఎందరో సైనికులు వెళ్లి నేతాజీ సేనలో చేరారు. వీరిని బ్రిటిష్ ఇండియా పాలకులు సైన్యం వదిలిన నేరస్తులుగా, దేశద్రోహులుగా నిర్ధారించారు. ఏ దేశంలోనైనా సైన్యాన్ని వీడి రావడం పెద్ద నేరమే. మన పీనల్ కోడ్ ప్రకారం వీరూ ఆ నేరారోపణకే గురైనారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత ఈ సైనికుల హోదా ఏమిటి? ఇప్పటికీ వారిని సైన్యం వదిలిన నేరస్తు లుగా భావిస్తారా? లేక స్వాతంత్య్ర సమరయోధులుగా గౌరవిస్తారా? అన్నది కీలక ప్రశ్న. ఆర్కియాలజీ జాతీయ కేంద్రాన్ని ఆర్టీఐ కింద ప్రద్యోత్ ఈ ప్రశ్న అడిగాడు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని శత్రు బలగాల చేజిక్కిన ఇండి యన్ నేషనల్ ఆర్మీ సభ్యులను మీరు ఏమంటారు? దేశ ద్రోహులా లేక సమరవీరులా? బ్రిటిష్ ఇండియా సర్కార్ వలెనే మీరూ వారిని దేశద్రోహులుగా భావిస్తున్నారా అని అడిగారు. ఆర్కియాలజీ కేంద్రంలో దీనికి సంబంధించి ఏమైనా రికార్డులు ఉంటే ఇవ్వాలన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4 (1)(బి)(సి) కింద ఇటువంటి అంశాలపై ప్రభుత్వ విధాన నిర్ణయమేమిటో స్వయంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఆర్కియాలజీ విభాగం వీరిని సైనికులు కాబోలను కుని ఆర్టీఐ దరఖాస్తును రక్షణమంత్రిత్వ శాఖ పిఐఓకు బదిలీ చేసింది. రక్షణశాఖ వీరిని మాజీ సైనికులనుకుని ఈ పత్రాన్ని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమశాఖకు పంపిం చారు. ఆ శాఖకు వీరు సైనికులో, మాజీ సైనికులో అర్థం గాక హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తును బదిలీ చేశారు. తెలిసో తెలియకో మాజీ సంక్షేమ శాఖ హోంశాఖకు పంపి సరైన పనిచేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దర ఖాస్తుదారుడు ప్రద్యోత్ తమ కార్యాలయానికి వచ్చి మొత్తం ఫైళ్లన్నీ చూసుకోవచ్చని ఉత్తరం రాశారు. ఏ ఫైళ్లు చూడాలి? ఎన్నని పరిశీలించాలి? అయినా వివరాలు దొరు కుతాయా? అసలు ఈ కీలకమైన అంశంపైన ఇన్నేళ్లూ ఏ విధాన నిర్ణయం తీసుకున్నదో ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఏ విధానమూ లేకపోతే అదైనా చెప్పక తప్పదు. ప్రభుత్వం నేతాజీ అనుయాయులను వీర స్వాతంత్య్ర సమర సైనికులుగా భావిస్తే వారికి హోంశాఖ ఇచ్చే సన్మానపత్రాలు, పింఛన్లు తదితర సౌకర్యాలు కల్పిం చవలసి ఉంటుంది. కనీసం మాజీ సైనికులుగా భావిస్తే వారికి లభించే సంక్షేమ పథకాలను వర్తింప చేయవలసి ఉంటుంది. నాటి సైన్యాన్ని వదిలి వెళ్లిన నేరస్తులుగా భావిస్తే దొరికిన వారిని దొరికినట్టు ప్రాసిక్యూట్ చేసి జైలు పాలు చేయవలసి వస్తుంది. కనుక వారు దేశద్రోహులా లేక స్వాతంత్య్ర సమరవీరులా? అన్నది విధానపరమైన ప్రశ్న. ఒకవేళ సైన్యాన్ని వదిలేసిన సైనికుల జాబితా ఉంటే, ఆ జాబితాను నేరస్తుల వర్గం నుంచి తొలగించారో లేదో చెప్పవలసి ఉంటుంది. ఆర్కైవ్స్ వారు ఈ విషయమై ఏమీ చెప్పలేరు. వారి అధీనంలో ఉన్న విషయం కాదు కనుక. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవలసిన విషయం ఇది. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ వ్యవహారాలను హోంశాఖ నిర్వహిస్తుంది కనుక ఆ శాఖే చొరవతీసు కోవాలి. ఈ సమాచార అభ్యర్థనలో ప్రద్యోత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అడగలేదు. ఆయనను స్వాతంత్య్ర∙సమర వీరుడిగా పరిగణిస్తున్నామా లేక బ్రిటిష్ సర్కార్ భావించినట్టు తమకు ద్రోహం చేసిన విప్లవ వాదిగా, తిరుగుబాటుదారుడిగా స్వతంత్ర భారత సర్కారు కూడా పరిగణిస్తున్నదా? నేతాజీ జన్మదినాన భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో జోహార్లు అర్పించే ప్రకటన విడుదల చేసి ప్రతి ఏటా పత్రికలకు డబ్బు కూడా ఇస్తుంది. ఆయన పేరు చెబితే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. కటక్‌లో నేతాజీ పుట్టిన ఇంటిని, కోల్‌కత్తాలో పెరిగిన ఇంటిని జాతీయ మ్యూజియంలుగా మార్చారు. తప్పిం చుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన కారును కూడా ప్రదర్శిస్తున్నారు. నిర్ద్వంద్వంగా నేతాజీ మనమంతా గౌర వించే దేశ భక్తుడు, జాతీయ ఉద్యమనాయకుడు, మనకు తొలి సర్వసైన్యాధిపతి కావలసిన వీరుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. కనుక నేతాజీ వెంటనడిచిన సైనికులు కూడా స్వాతంత్య్ర సమర వీరులుగా గుర్తింపు పొందవలసిందే. ఈ విషయం చెప్పవలసిన హోంశాఖ మళ్లీ ఈ దర ఖాస్తును ఆర్కైవ్స్ విభాగానికి పంపింది. ఫైళ్లు ఇతర పత్రాలకోసం పంపితే సమంజసమే కానీ, విధాన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత హోం మంత్రిత్వ శాఖదే కనుక ఆ విధాన నిర్ణయమేమిటో ప్రకటించాలని కమిషన్ ఆదేశిం చింది. (ప్రద్యోత్ కుమార్ మిత్రా వర్సెస్ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఇఐఇ/ఇఇ/అ/2015/001837 కేసులో కేంద్ర సమాచార కమిషన్ 13 ఫిబ్రవరిన ఇచ్చిన ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
2కే రన్‌పై ఉక్కుపాదం.. కోదండరాం అరెస్ట్
హైదరాబాద్: ధర్నా చౌక్‌ను తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ చేపట్టిన 2కే రన్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచే సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని పోలీసులు బారికేడ్లతో దిగ్బంధించారు. 6 గంటల నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పరిరక్షణ కమిటీ నేతల అరెస్టు ఉత్కంఠగా కొనసాగింది. సుందరయ్య పార్కు పరిసర ప్రాంతం అంతా నినాదాలతో హోరెత్తింది. ర్యాలీ ప్రారంభం కాకముందే సుందరయ్య పార్కుకు చేరుకున్న టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నేతలు జి.రాములు, నర్సింహ, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు వి.సంధ్య, న్యూడెమోక్రసీ నాయకుడు కె.గోవర్ధన్, గాయకురాలు విమలక్క తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను తొలగించటం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని తమ్మినేని విమర్శించారు. శాంతియుతంగా ర్యాలీని నిర్వహించడానికి కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. -
టీజేఏసీ చైర్మన్ కోదండరాం అరెస్ట్