ధర్నాచౌక్‌తో ఇబ్బంది లేదు
►ఇది ప్రజాభిప్రాయం..
►దీనివల్ల స్థానిక చిరు వ్యాపారులకు ఉపాధి
►ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి
కవాడిగూడ: ఇందిరాపార్కు వద్ద గల ధర్నాచౌక్‌తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, దీనివల్ల స్థానికంగా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ఉపాధి దొరుకుతోందని ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అదివారం ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, టీజేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు పరిసరాల బస్తీ ప్రజల అభిప్రాయల సేకరణకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భీమమైదానం, తాళ్లబస్తీ, ఎల్‌ఐసీ కాలనీ, బండమైసమ్మ బస్తీ, అంబేడ్కర్‌నగర్ తదితర బస్తీల్లో ఇంటింటికి వెళ్లి ధర్నాచౌక్‌తో గల ఇబ్బందులను అడిగారు. దీంతో స్థానికులు పైవిధంగా స్పందించారు.
ప్రజలు తమ బాధలు చేప్పుకునేందుకు అనేక సంవత్సరాలుగా ధర్నాచౌక్‌కు వస్తున్నారని, వారివల్ల ఇబ్బందులు లేవన్నారు. ఇందిరాపార్కు వద్దనే ధర్నాచౌక్‌ను కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకటరెడ్డి, కో–కన్వీనర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు, సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకురాలు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర సహయ కార్యదర్శి జి.అనురాధ, ఝాన్సీ మాట్లాడారు. ప్రజాగొంతుకగా ఉన్న ధర్నా చౌక్‌ను నగర శివార్లకు తరిలించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. పోలీసులు, టీఆర్‌ఎస్ నేతలు కుట్రలో భాగమయ్యారన్నారు. ధర్నా చౌక్ తరలింపు వెనక రియల్ ఎస్టేట్ వ్యాపారుల హస్తం ఉందన్నారు. ప్రజలంతా ధర్నా చౌక్ ఇక్కడే కొనసాగాలని కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం గౌరవించాలని సూచించారు. దీనిపై అన్ని పార్టీల ప్రతినిధులను ఆహ్వానించి, అఖిలపక్షంతో సమాలోచనలు జరపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.