అణచివేత కుదరదు | High Court Blames The Government | Sakshi
Sakshi News home page

అణచివేత కుదరదు

Published Wed, Sep 19 2018 2:24 AM | Last Updated on Mon, Jul 29 2019 7:38 PM

High Court Blames The Government - Sakshi

హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో నిరసన గళాలు వినిపించేందుకు వేదికైన ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసన ప్రదర్శనలను ప్రభు త్వం నిషేధించడంపై హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. నగరం నడిబొడ్డునున్న ఈ ప్రాంతంలో ధర్నాలపై ఉక్కుపాదం మోపడాన్ని తప్పుబట్టింది. ‘ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతే తప్ప ఎక్కడో ఊరు అవతల 50 కిలోమీటర్ల దూరంలో ధర్నాలు చేసుకోమంటే ఎలా? అడవిలో సెల్‌టవర్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? సింహాలు, పులులు సెల్‌ఫోన్లు వాడవు కదా. మనుషులు ఉన్న చోటే సెల్‌టవర్లు పెట్టాలి.

అలాగే ధర్నాచౌక్‌ కూడా. జనాల మధ్యలో ధర్నాలు చేయకుండా రిషీకేశ్‌కు వెళ్లి చేయమంటారా? అధికారంలోకి వచ్చేందుకు ఈ ధర్నా చౌక్‌ చాలా మందికి ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరిస్తే ఎలా?’అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. ధర్నాచౌక్‌ కోసం గుర్తించిన ప్రాంతాలు, అక్కడ కల్పించిన సౌకర్యాల వంటి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే చివరి అవకాశమని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ రోజున ధర్నాచౌక్‌ వ్యవహారాన్ని తేల్చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బహిరంగ సభలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, ఊరేగింపులు తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయగా ఇదే అంశంపై విశ్రాంత ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించింది.

ఈ రెండు వ్యాజ్యాలపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హనుమంతరావు తరఫు న్యాయవాది సి. దామోదర్‌రెడ్డి వాదిస్తూ ఎన్నో ఏళ్లుగా ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకే దానికి ధర్నాచౌక్‌ అని పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చౌక్‌ వద్ద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతివ్వడం లేదని, నగరానికి 25 కిలోమీటర్ల అవతల ధర్నాలు చేసుకోవాలని చెబుతోందని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె. రామచంద్రరావు స్పందిస్తూ శంషాబాద్, షామీర్‌పేట, జవహర్‌నగర్, మేడిపల్లి తదితర ప్రాంతాలను ధర్నాల కోసం ప్రాథమికంగా ఎంపిక చేశామని, వాటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలు, ఇతర నిరసన కార్యక్రమాలు చేపడుతుండటం వల్ల స్థానికులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు.

చెరువుల దగ్గర ఇళ్లు కట్టుకుని.. నీళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయంటే ఎలా?
ఈ సందర్భంగా ధర్మాసం స్పందిస్తూ ‘ఎప్పటి నుంచో ఉన్న చెరువు దగ్గరకు వచ్చి జనాలు ఇళ్లు కట్టుకుంటారు. ఆ తరువాత ఆ చెరువు వల్ల వర్షాకాలంలో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని, దాన్ని పూడ్చేయాలని అడుగుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది. ఇందిరాపార్క్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆ తరువాతే దాని చుట్టుపక్కల ఇళ్లు వచ్చాయి. ఇది భారతదేశం. ఇక్కడ నిరసన గళాలను అణచివేస్తామంటే కుదరదు. ధర్నాలు, నిరసన కార్యక్రమాల వల్ల ఇబ్బంది కలుగుతుందనుకుంటే అర్థవంతమైన ఆంక్షలు విధించాలి. అంతేతప్ప నిషేధం విధిస్తామంటే ఎలా? ఎక్కడో 50 కిలోమీటర్ల దూరానికి వెళ్లి ధర్నాలు చేసుకోమనడం ఎంత వరకు సబబు? సెల్‌ఫోన్‌ టవర్లను అడవుల్లో పెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుంది.

సింహాలు, పులులు సెల్‌ఫోన్లు వాడవు కదా. అందుకే మనుషులు ఉండే చోటే సెల్‌టవర్లు పెట్టాలి. అలాగే ధర్నాచౌక్‌లు కూడా. జనాల మధ్యలో కాకుండా రిషీకేశ్‌లో ధర్నాలు చేసుకోమంటారా?’అంటూ ప్రశ్నించింది. ధర్నాచౌక్‌ వద్ద ధర్నాలు, ఆందోళనలు, ఇతర నిరసన కార్యక్రమాలపై నిషేధం విధించడం ఏమాత్రం సబబు కాదని ధర్మాసనం ప్రాథమికంగా అభిప్రాయపడింది. 2017లో దాఖలైన వ్యాజ్యంలో ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించింది. చివరి అవకాశం ఇస్తున్నామని, తదుపరి విచారణ నాటికి కౌంటర్‌ దాఖలు చేసి తీరాలని స్పష్టం చేసింది.

ధర్నాల కోసం పలు ప్రాంతాలను ఎప్పటిక చేశామని చెబుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తదుపరి విచారణలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కాగా, వాదనల సందర్భంగా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు బిగ్గరగా మాట్లాడటంపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ కేసులో మీరు పిటిషనర్‌ కాదు. మీరు రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి విచారణ జరుపుతోంది. లేఖ రాయడంతో మీ పని ముగిసింది. మీరు ఏ రకంగానూ జోక్యం చేసుకోవడం సాధ్యం కాదు’అని తేల్చిచెప్పింది. దీంతో ఆయన వాదనలు ముగిసే వరకు మౌనంగా ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement