ధర్నా యుద్ధం
‘ధర్నాచౌక్ ఆక్రమణ’ ఉద్రిక్తం
► ఉదయం నుంచే బైఠాయింపులు.. నిరసనలు
► హోరెత్తిన నినాదాలు, పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజాసంఘాలు
► కోదండరాం, తమ్మినేని, చాడ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
► ధర్నాచౌక్ వద్దంటూ స్థానికుల పేరుతో టీఆర్‌ఎస్ పోటీ ధర్నా
► పోటీ ధర్నా ఏర్పాట్లపై ఆందోళనకారుల దాడి.. విధ్వంసం..
► ఇరువర్గాల ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జి.. పలువురికి గాయాలు
► మఫ్టీలో ఆందోళనకు దిగిన ఓ మహిళా సీఐ, పలువురు కానిస్టేబుళ్లు
సాక్షి, హైదరాబాద్
మూడు నెలలుగా మూగబోయిన ధర్నాచౌక్ దద్దరిల్లింది. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులతో హోరెత్తింది. పోలీసుల లాఠీచార్జితో రణరంగంగా మారింది. ధర్నాచౌక్ వద్దంటూ వాకర్స్ అసోసియేషన్, స్థానిక కాలనీ సంఘాల పేరుతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, మఫ్టీలో కొందరు పోలీసులు పోటీ ధర్నాకు దిగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు కుర్చీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. ఇందులో సుమారు 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా ఆందోళనకారులు వెనుకడుగు వేయకుండా ధర్నాచౌక్‌ను ఆక్రమించుకున్నారు.
అన్ని దారులు ఇందిరాపార్కు వైపే..
తెలంగాణ జేఏసీ, ప్రతిపక్షాలతో ఏర్పడిన ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు సోమవారం ఉదయం నుంచే వివిధ సంఘాలకు చెందిన కార్యకర్తలు పెద్దఎత్తున ‘ధర్నాచౌక్ ఆక్రమణ’కు తరలివచ్చారు. నగరంలోని అన్ని దారులు ఇందిరాపార్కు వైపునకే కదిలాయి. ఉద్యమకారుల నినాదాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ధర్నాచౌక్ ప్రాంతం మార్మోగింది. ధర్నాచౌక్‌ను నగర శివార్లకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత వి.హన్మంతరావు ఉదయం 6 గంటలకే అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. అనంతరం సీపీఐ నాయకులు వందలాదిగా తరలివచ్చారు. ఇదే సమయంలో ధర్నాచౌక్‌ను ఎత్తివేయాలని స్థానికులు, వాకర్స్ ముసుగులో ముషీరాబాద్, ఎల్బీనగర్, నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు మఫ్టీ పోలీసులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనాకారులకు, టీఆర్‌ఎస్ నాయకులకు మధ్య పలుమార్లు వాగ్వాదం, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల మధ్య బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటలకు బస్‌భవన్ నుంచి టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, న్యూడెమోక్రసీ, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకుల ఆధ్వర్యంలో వేలాది మంది ధర్నాచౌక్ చౌరస్తాకు చేరుకున్నారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహం...
జేఏసీ, వామపక్ష, న్యూడెమోక్రసీ నేతల రాకతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ర్యాలీగా వచ్చిన ఆందోళనకారులు ధర్నాచౌక్‌ను ఆక్రమించుకునేందుకు బారికేడ్ల వద్దకు దూసుకొచ్చారు. ధర్నాచౌక్ లోపల టీఆర్‌ఎస్ కార్యకర్తలు, బయట ఆందోళనకారులు పోటాపోటీ నినాదాలతో వాతావరణం వేడెక్కింది. ఆందోళకారులు అక్కడున్న కుర్చీలను పగుల కొట్టి వాటిని టీఆర్‌ఎస్ నాయకుల వైపు విసిరివేశారు. మరికొందరు బారికేడ్లను ఎక్కగా మరికొందరు వాటిని పూర్తిగా తొలగించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీచార్జికి దిగారు. అయినా ఆందోళనకారులు బారికేడ్లను తొలగించుకుని ధర్నాచౌక్ వైపు పరుగెత్తారు. దీంతో అప్పటివరకు అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ ముషీరాబాద్ ఇంచార్జి ముఠా గోపాల్, పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, కార్యకర్తలు వెళ్లిపోయారు.
పలువురికి గాయాలు..
ధర్నాచౌక్ ఆక్రమణ సందర్భంగా ఆందోళనకారులపై జరిపిన లాఠీచార్జిలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. సీపీఎం నగర కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి నుదిటిపై బలంగా లాఠీ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన్ను ముషీరాబాద్ కేర్ ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌తోపాటు న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర్‌రావు, పీవైఎల్, పీడీఎస్‌యూ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, విద్యావేత్త చుక్కా రామయ్య, టీడీపీ నేత రేవంత్‌రెడ్డి, సీపీఐ నాయకులు అజీజ్ పాషా, జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కొండా రాఘవరెడ్డి, సీపీఐ(ఎంఎల్) నేత గోవర్ధన్, మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, జనసేన నాయకులు శంకర్‌గౌడ్, అరుణోదయ విమల, పరిరక్షణ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపకులు చెరుకు సుధాకర్, పీవోడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. ప్రజలు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైందని, దానిపట్ల ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేకపోవడం విచారకరమన్నారు. రాష్ట్ర రాజధానికి దూరంగా ఎక్కడో అడవుల్లో ధర్నాలకు, ఆందోళనలకు అనుమతినివ్వడం దారుణమన్నారు. ధర్నాచౌక్ ఆక్రమణ కార్యక్రమం విజయవంతమైందని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరపాలని, ధర్నాచౌక్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో జేఏసీ తదుపరి కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మరింత ప్రజాస్వామిక వాతావరణం నెలకొంటుందని ఆశిస్తే అందుకు విరుద్ధంగా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మఫ్టీ పోలీసులతో దాడులకు దిగారని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ధర్నాచౌక్‌ను ఆక్రమించారని తమ్మినేని పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానన్న కేసీఆర్ ఇక్కడ మాత్రం ధర్నాచౌక్ ఎత్తివేయడం హాస్యాస్పదంగా ఉందని రేవంత్‌రెడ్డి అన్నారు.
ఉదయం ప్లకార్డుతో.. మధ్యాహ్నం పోలీస్ డ్రెస్‌లో..
సోమవారం ధర్నాచౌక్‌ను కొనసాగించాలంటూ ఒకవైపు.. లేదు తరలించాలంటూ మరోవైపు ధర్నాలు జరుగుతున్నాయి. అయితే ధర్నాచౌక్ వద్దంటూ చేపట్టిన శిబిరంలో లేక్‌వ్యూ పోలీస్‌స్టేషన్ మహిళా సీఐ, కొందరు మహిళా కానిస్టేబుళ్లూ కనిపించారు. సాధారణ దుస్తుల్లో, ప్లకార్డులను పట్టుకుని మరీ అందరి మధ్య కూర్చున్నారు. మీడియా ఈ విషయాన్ని గుర్తించడంతో కొంతసేపటికి ప్లకార్డులను అక్కడ పడేసి వెళ్లిపోయారు. ఇలా ధర్నాలో కూర్చున్న మహిళా సీఐ... మధ్యాహ్నం పోలీసు యూనిఫాంలో తిరిగి ధర్నా చౌక్ వద్దకు వచ్చి, విధులు నిర్వర్తించడం గమనార్హం. దీంతో ప్రభుత్వమే ధర్నా చౌక్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాలుగు కేసులు నమోదు
ధర్నా చౌక్ వద్ద జరిగిన ఘటనలకు సంబంధించి గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ఇందిరాపార్కు వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందిరాపార్కు వద్ద నుంచి ధర్నా చౌక్‌ను తరలించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు, ధర్నా చౌక్‌ను ఇక్కడే కొనసాగించాలని కోరుతున్న పరిరక్షణ కమిటీ.. ఈ రెండు ధర్నాలకూ అనుమతి ఇచ్చామని చెప్పారు. పరిరక్షణ కమిటీ ర్యాలీ ఇందిరాపార్కుకు చేరుకునే ముందు వరకు కూడా పరిస్థితులు మామూలుగానే ఉన్నాయని... ఆ ర్యాలీ ధర్నా చౌక్‌కు చేరుకోగానే ఇరువర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణలు జరిగాయని డీసీపీ పేర్కొన్నారు. కుర్చీల ధ్వంసం, పోలీసు అధికారిపై దాడి, స్థానికులపై దాడికి సంబంధించి నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమేమీ లేదని.. అయితే పోలీసు లాఠీచార్జిపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ధర్నాచౌక్ తరలింపు అనుకూల శిబిరంలో ఓ మహిళా సీఐ, కానిస్టేబుళ్లు ప్లకార్డులు పట్టుకుని కూర్చున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. దానిపై విచారణ జరుపుతామని చెప్పారు.