సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్ రణరంగంగా మారింది. దేశవ్యాప్తంగా వరవరరావుతో సహా అనేక మంది హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు, కవులు, కళాకారులు బుధవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్లోని ట్యాంక్‌బండ్‌వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న దళిత, పౌరహక్కుల నేతలు, కార‍్యకర్తలు, లాయర్లు, కవులు, రచయితలు, కార్యకర్తలను తెలంగాణ పోలీసులు బలవంతంగా గుంజుకపోయారు. మరికొంతమందిని అసలు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన చేపట్టబోతున్న ఆందోళనకారులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. ఒక్కసారిగా ఉద్యమకారులపై విరుచుకుపడిన తెలంగాణ పోలీసులు అరెస్టులకు పాల్పడ్డారు. దొరికిన వారిని దొరకినట్టు బలవంతంగా పోలీసు వ్యాన్‌లోకి ఎక్కించి నాంపల్లి, బొల్లారం, గోషామహల్, బేగం బజార్, ముషీరాబాద్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ముఖ్యంగా సామాజిక కార్యకర్త సజయ, సుధ, విరసం మంజుల, అరుణోదయ విమల, బండారు విజయ, లలిత, జయశ్రీ, ఖలీదా,గీతాంజలి, ప్రగతిశీల మహిళాసంఘం నాయకులు సంధ్య, ఝాన్సీ, ఇఫ్టూ అనురాధతో పాటు ఇతర ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా ఉద్యమకారులు పెద్ద ఎత్తున నినాదాలతో తమ నిరసన కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment