Varavara Rao
-
హైదరాబాద్‌లో ఎన్ఐఏ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు గురువారం హైదరాబాద్‌లో వీక్షణం పత్రిక ఎడిటర్, వరవరరావు అల్లుడు ఎన్. వేణుగోపాల్‌తోపాటు రచయిత, పౌరహక్కుల నేత రవిశర్మ నివాసాల్లో సోదాలు జరిపారు. తెల్లవారుజామున 4 గంటలకే హిమాయత్‌నగర్‌లోని ఎన్. వేణుగోపాల్ ఇంటితోపాటు ఎల్బీ నగర్ శ్రీనివాసనగర్ కాలనీలోని రవిశర్మ ఇంట్లో సోదాలు నిర్వహించారు. పలు పుస్తకాలు, కొన్ని అనుమానాస్పద డాక్యుమెంట్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 10న గచ్చిబౌలిలోని ఎన్ఐఏ కార్యాలయానికి విచారణ కోసం హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు. ఆ కేసు ఆధారంగా దర్యాప్తు... మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్రావును గతేడాది సెప్టెంబర్ 15న కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మలేసియా టౌన్షిప్లో సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ఇంటెలిజెన్స్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ ఏడాది జనవరి 3న ఎన్ఐఏ అధికారులు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంజయ్ దీపక్‌రావుతో ఎన్. వేణుగోపాల్, రవిశర్మకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల దృష్ట్యానే ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. ఈ కేసులో వేణుగోపాల్‌ను 22వ నిందితుడిగా పేర్కొన్న ఎన్ఐఏ... రవిశర్మతోపాటు కేరళకు చెందిన మరో ముగ్గురిని సైతం నిందితులుగా చేర్చింది. కబలి దళం పేరిట సమావేశాలు నిర్వహించి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించింది. ఇదే కేసు దర్యాప్తులో భాగంగా గురువారం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలోనూ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సోదాల్లో మావోయిస్టు సాహిత్యంతో పాటు ఆరు సెల్ఫోన్లు, రూ. 1,37,210 నగదు స్వా«దీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు. పౌరహక్కుల సంఘాల ఖండన వేణుగోపాల్, రవిశర్మ ఇళ్లపై ఎన్ఐఏ దాడులను పౌరహక్కుల సంఘాల నాయకులు ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టానుసారంగా దాడులు చేయకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ఇవ్వాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేయగా అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఉపా చట్టాన్ని రద్దు చేయాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు డిమాండ్ చేశారు. నిర్బంద వ్యతిరేక వేదిక తెలంగాణ సైతం ఈ అరెస్టులను ఖండించింది. విచారణకు హాజరవ్వాలన్నారు: రవిశర్మ మన్సూరాబాద్: రవిశర్మ మీడియాతో మాట్లాడుతూ 10న విచారణకు హాజరుకావాలని ఎన్ఐఏ అధికారులు ఆదేశించారని చెప్పారు. 2016లో జనజీవన స్రవంతిలో కలిసినప్పటి నుంచి తాను ఎలాంటి మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. 2019లో స్థానిక పోలీసులు, 2021లో ఎన్ఐఎ అధికారులు తన ఇంట్లో సోదాలు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తుచేశారు. ఇది పూర్తిగా అబద్ధపు కేసు: ఎన్.వేణుగోపాల్ ఎన్ఐఏ అధికారులు తనపై నమోదు చేసినది పూర్తిగా అబద్ధపు కేసని వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్. వేణుగోపాల్ ఆరోపించారు. ‘నేను ఒక మాస పత్రిక నడుపుతున్నాను. నేను ప్రస్తుతం విరసంలో లేను’అని మీడియాకు విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన పేర్కొన్నారు. 2013లో నయీం బెదిరింపు లేఖలపై తాను రాసిన పుస్తకాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. తన మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారని, ఈ నెల 10న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు ఇచ్చారని వేణుగోపాల్ పేర్కొన్నారు. -
వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లొచ్చు
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది. ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్ 5–11 తేదీల మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్‌కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్ నంబర్, షెడ్యూల్ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. -
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
హైదరాబాద్ వెళ్లాలంటే ఎన్ఏఐ కోర్టును అడగండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: షరతులతో కూడిన మెడికల్ బెయిల్‌పై విడుదలైన విప్లవ రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లాలంటే అనుమతి కోసం జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించాలని సుప్రీంకోర్టు సూచించింది. కంటి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం కోర్టు విచారించింది. వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ వాదనలు వినిపించారు. సొంత నివాస స్థలమైన హైదరాబాద్‌లో చికిత్స చేయించుకుంటే ఆ వాతావరణంలో వరవరరావు త్వరగా కోలుకుంటారని తెలిపారు. దీంతో అనుమతి కోసం ఎన్ఐఏ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని వరవరరావుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇదీ చదవండి: Varavara Rao: వరవరరావుకు ఊరట.. శాశ్వత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు -
విరసం నేత వరవరరావుకు సాధారణ బెయిల్
-
నేడు వరవరరావు పిటిషన్‌పై సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్–ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు ఏప్రిల్ 13న నిరాకరించింది. ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ విచారిస్తుంది. 83 ఏళ్ల వయసున్న వరవరరావు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నారు. -
Varavara Rao: శాశ్వత బెయిల్‌పై సుప్రీంకు వరవరరావు
సాక్షి, న్యూఢిల్లీ: బీమా కోరేగావ్ కేసులో నిందితుడు వరవరరావు శాశ్వత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రస్తుతం మెడికల్ బెయిల్‌పై ఉన్న వరవరరావు.. శాశ్వత బెయిల్ మంజూరు చేయాలన్న అభ్యర్థనను ఏప్రిల్ 13న బాంబే హైకోర్టు తిరస్కరించింది. విచారణ సమయంలో.. హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్న పిటిషన్‌నూ తోసిపుచ్చింది. అయితే.. మూడు నెలల పాటు మెడికల్ బెయిల్ పొడిగించింది. ఈ తరుణంలో బాంబే హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాల వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. -
ఒక చట్టం... వేల వివాదాలు
124ఏ. బ్రిటిష్ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...? సెక్షన్ 124 ఏలో ఏముంది? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు. ఎందుకు తెచ్చారు ? స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్ థామస్ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి. దిశ రవి నుంచి వరవరరావు వరకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్ కిట్ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్ రేప్ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్ పటేల్, భీమా–కొరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు. ► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి ► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది. ► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్మనెంట్ బెయిల్ ఇవ్వలేం
ముంబై: కోరెగావ్–భీమా అల్లర్ల కేసులో తనకు పర్మనెంట్ మెడికల్ బెయిల్ ఇవ్వాలన్న హక్కుల నేత వరవరరావు (83) విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఫిబ్రవరి నుంచి తాత్కాలిక మెడికల్ బెయిల్‌పై ఉన్న ఆయన దాన్ని మరో ఆర్నెల్ల పాటు పొడిగించాలని, ముంబైలో కాకుండా హైదరాబాద్‌లో ఉండేందుకు అనుమతించాలని, విచారణ పూర్తయేదాకా పర్మనెంట్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మూడు పిటిషన్లు దాఖలు చేశారు. వాటన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు జస్టిస్ ఎస్బీ శుక్రే, జీఏ సనప్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. అయితే కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునేందుకు వీలుగా బెయిల్‌ను మూడు నెలలు పొడిగించింది. వీవీలో పార్కిన్సన్ లక్షణాలు కన్పిస్తున్నాయని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన్ను ఉంచిన తలోజా జైల్లో వైద్య సదుపాయాలు దారుణంగా ఉన్నాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది. రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సదుపాయాలపై ఈ నెలాఖరుకల్లా సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా జైళ్ల శాఖ ఐజీని ఆదేశించింది. -
సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయిన ప్రముఖ మహిళా న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్(60) గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. మూడేళ్లకు పైగా ఆమె జైలు జీవితం గడిపిన ఆమెకు బాంబే హైకోర్టు డిసెంబర్ 1న డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ కండీషన్‌తో పాటు ఆమెను ఎప్పుడు విడుదల చేయాలన్నది ఎన్ఐఏ ప్రత్యేక కోర్టే నిర్ణయిస్తుందని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎన్ఐఏ అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కాగా, రూ. 50 వేల పూచీకత్తుతో సుధా భరద్వాజ్‌ను విడుదల చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఆదేశించింది. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత, భరద్వాజ్ గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలయ్యారు. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. (Nagaland Firing: డ్రెస్ మార్చి, మృతదేహాల దగ్గర ఆయుధాలు పెట్టబోయారు) -
వరవరరావుకు బాంబే హైకోర్టులో ఊరట
ముంబై: ఎల్గార్ పరిషత్–మావోయిస్టులతో లింకు కేసులో మధ్యంతర బె యిల్‌పై ఉన్న విప్లవ కవి వరవరరావు(82)కు బాంబే హైకోర్టు ఊరట కల్పించింది. నవంబర్ 18వ తేదీ వరకు తలోజా జైలు అధికారులకు ఆయన లొంగిపోవాల్సిన అవసరం లేదని తెలిపింది. వరవరరావు వేసిన పిటిషన్‌పై విచారణను వచ్చే నెలకు వా యిదా వేసింది. అనారోగ్య కారణాలతో తలోజా జైలులో ఉన్న వరవరరావుకు బాంబే హైకో ర్టు ఫిబ్రవరి 22వ తేదీన ఆరు నెలల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తిరిగి కస్టడీకి వెళ్లాల్సి ఉంది. బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై ఉండగానే హైదరాబాద్ వెళ్లాలన్న వినతిపై వేరుగా పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం సూచించింది. -
వరవరరావు బెయిల్ మరోసారి పొడిగింపు
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ గడువు ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరవరరావు తన బెయిల్‌ను పొడగించాలని విజ్ఞప్తి చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ క్రమంలో వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించింది బాంబే హైకోర్టు. దాంతో పాటు షరతులు కూడా కొనసాగించింది… తెలంగాణ రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరవరరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఇదే స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీ వరకు బాంబేలోనే ఉండాలని స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా వరవరరావు కోర్టు తనకు ఫిబ్రవరిలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని.. ఫలితంగా తాను కుంటుంబానికి దూరంగా ఉంటున్నానని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 84 ఏళ్ల వయసులో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. కోర్ట్ విధించిన ఏ ఒక్క షరతును తాను ఉల్లంగించలేదని వరవరరావు కోర్టుకు తెలిపారు. (చదవండి: ఒకరి భార్యకు ‘ఐ లవ్ యూ’ అని రాసి చిట్టి విసరడం నేరమే) ముంబై హాస్పిటల్స్‌లో చికిత్స చేయించుకోవాలంటే తన లాంటి వారికి చాలా కష్టం అవుతుందన్నారు. తన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వెంటనే తన కుటుంబం దగ్గరికి వెల్లేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వరవరరావు వాదనలు విన్న కోర్టు ఈ నెల 25న ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావు గత 4 సంవత్సరాలుగా ముంబైలోనే ఉంటున్నారు. చదవండి: భారతీయుడిగా విచారిస్తున్నా..వారిని జాతి ఎప్పటికీ క్షమించదు! -
వరవరరావు బెయిల్ పొడిగింపుపై 6న విచారణ
ముంబై: ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడైన సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావుకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 6 దాకా ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావుకు బాంబే హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యంతర మెడికల్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 5న తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ బెయిల్‌ను పొడిగించాలని విజ్ఞప్తి చేస్తూ వరవరరావు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 6న విచారణ చేపడతామని కోర్టు చెప్పింది. అప్పటిదాకా వరవరరావుపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఎన్ఏఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్‌సింగ్ స్పందిస్తూ.. ఈ నెల 6దాకా వరవరరావుకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
వరవరరావు విడుదల
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కవి వరవరరావుకు స్వేచ్ఛ లభించింది. శనివారం రాత్రి 11.45 గంటలకు ముంబైలోని నానావతి ఆస్పత్రి నుంచి వరవరరావు బయటికి వచ్చారని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. భీమా కోరేగాం కేసులో ముంబైలోని తలోజా జైల్లో రెండున్నరేళ్లుగా ఆయన విచారణ ఖైదీగా ఉన్నారు. కొద్దినెలల కింద ఆయన తీవ్ర అనారోగ్యం బారినపడటంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నానావతి ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తవడంతో శనివారం వరవరరావును విడుదల చేశారు. అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు బాంబే హైకోర్టు పెట్టిన షరతుల మేరకు ఆయన ముంబై పరిధిలోనే ఉండాలి. దీంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చే అవకాశం లేదు. -
వరవర రావుకు బెయిల్
ముంబై/ సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావుకి ముంబై హైకోర్టు ఆరు నెలల బెయిల్ మంజూరు చేసింది. ఎల్గార్ పరిషద్, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2018 ఆగస్టు 28న వరవర రావుని అరెస్టు చేశారు. గత కొంతకాలంగా వరవర రావుకు తీవ్ర అనారోగ్యం నేపథ్యంలో ఆయన భార్య హేమలత వరవరరావు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. 82 ఏళ్ళ వరవరరావు వయసు, అతని తీవ్ర అనారోగ్య పరిస్థితి, తలోజా జైలులో ఆయనకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని జస్టిస్ షిండే, జస్టిస్ మనీష్ పైటేల్ల ధర్మాసనం బెయిల్ మంజూరుచేసింది. ‘ఉపశమనం ఇవ్వదగిన కేసు ఇది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వవచ్చు. తక్షణమే ఆయన్ను విడుదల చేయండి’అని కోర్టు ఆదేశించింది. హైకోర్టు జోక్యంతో గత ఏడాది నవంబర్‌లో వరవరరావుని నానావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఫిబ్రవరి 1న వాదనలు ముగిశాక బెయిల్ అంశాన్ని కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ప్రస్తుతం ముంబై నానావతీ ఆసుపత్రిలో వరవరరావు చికిత్స పొందుతున్నారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. వరవరరావుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంపై మూడు వారాల పాటు స్టే విధించాలంటూ, ఎన్ఐఏ తరఫున వాదిస్తోన్న అడిషనల్ సోలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే, వరవరరావుకి బెయిలు మంజూరు చేస్తూ షరతులను కోర్టు విధించింది. వరవరరావు ఎన్ఐఏ కోర్టు పరిధిలో ముంబైలోనే ఉండాలని ఆదేశించింది. రూ.50వేల వ్యక్తిగత బాండు, అదే మొత్తానికి రెండు ష్యూరిటీలు సమర్పించాల్సిందిగా కోర్టు సూచించింది. తన సహనిందితులతోనూ, ఈ కార్యకలాపాల్లో నిమగ్నమైన వారెవరితోనూ వరవరరావు సంబంధాలు నెరపరాదని కోర్టు చెప్పింది. వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఫోన్లు చేయరాదని కోర్టు సూచించింది. 15రోజులకు ఒకసారి పోలీసులకు వరవరరావు వాట్సాప్ వీడియో కాల్స్ చేయాలి. అన్ని కోర్టు విచారణలకు హాజరుకావాలని, కోర్టు సమన్లకు స్పందించాలని ఆదేశించింది. భారీ సంఖ్యలో వరవరరావుని కలిసేందుకు సందర్శకులను అనుమతించబోమని, ఆయన పాస్‌పోర్టుని ఎన్ఐఏ కోర్టులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకి సంబంధించి మీడియా ఎదుట ప్రకటనలు చేయడాన్ని కోర్టు నిషేధించింది. వరవరరావుని కలిసేందుకు న్యాయవాదులకు, కార్యకర్తలకు అనుమతివ్వాలని వరవరరావు తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు నిరాకరించింది. ఆరునెలల వ్యవధి ముగిశాక ఎన్ఐఏ కోర్టు ఎదుట హాజరుకావాలని, లేదా బెయిలు పొడిగింపునకు హైకోర్టుకి దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. -
విరసం నేత వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: విరసం నేత, విప్లవ కవి వరవరరావుకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. భీమా కొరేగావ్ కేసుకు సంబంధించి జైల్లో ఉన్న ఆయనకు సోమవారం బొంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక షరతులతో ఆరునెలల మెడికల్ బెయిల్ మంజూరు చేసింది. స్పెషల్ ఎన్ఐఏ కోర్టు పరిధిలోనే (ముంబైలోనే) ఉండాలని, అలాగే గత ఎఫ్ఐఆర్కు దారి తీసిన కార్యకలాపాలు చేయగూడదంటూ షరతులు విధించింది. దీంతో వరవరరావు ఆరోగ్యంపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలో ఉన్న కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల ప్రతినిధులకు భారీ ఊరట లభించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన భర్తకు బెయిల్ ఇవ్వాలన్న వరవరావు భార్య పిటీషన్‌పై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పరిస్థితుల్లో ఆయనను జైలుకు పంపడం సరికాదని భావించిన కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అవసరమైనప్పుడు రావు విచారణకు హాజరుకావాలని, అయితే భౌతిక హాజరునుంచి మినహాయింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు పేర్కొంది. మరోవైపు ఈ ఉత్తర్వుపై మూడు వారాల పాటు స్టే విధించాలని కోరిన అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. ఇటీవల కరోనా సోకడంతోపాటు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త వరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత బొంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు ఓకే!
ముంబై: ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన విప్లవ కవి వరవరరావును జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు సుముఖంగా ఉన్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను డిశ్చార్జ్ చేయవచ్చని నానావతి హాస్పటల్ వర్గాలు గతవారం కోర్టుకు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది. అయితే ఇందుకు బదులుగా ఆయన్ను జేజే హాస్పటల్ ప్రిజన్ వార్డుకు తరలించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాది దీపక్ ధాకరే చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్‌కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్ఐఏ పరిధిలోనివని చెప్పారు. వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్ఐఏ న్యాయవాది అనిల్ సింగ్ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. బెయిల్ ఇవ్వండి వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని ఆయన భార్య తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. జైల్లో సరైన వైద్యసదుపాయం లేకుండా ఆయన్నుంచడం రావు ప్రాధమిక హక్కులకు భంగం కలిగించడమేనన్నారు. జైల్లో ఉన్నవారికి ఆరోగ్య సదుపాయాలు అందించకపోవడం క్రూరత్వమన్నారు. తలోజా జైల్లో ఉంటే ఆయన ఆరోగ్యం మరలా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నట్లు నానావతి ఆస్పత్రి వర్గాలిచ్చిన రిపోర్టును న్యాయమూర్తులు గుర్తు చేశారు. డిశ్చార్జ్ అనంతరం జైల్లోకి మరలా వెళితే ఏమవుతుందో ఎవరూ చెప్పలేరని ఇందిరా వాదించారు. అందువల్ల కనీసం తాత్కాలిక ప్రాతిపదికనైనా ఆయనకు బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే రావు బెయిల్‌కు ఎన్ఐఏ అభ్యంతరాలు చెప్పవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆయన్ను హైదరాబాద్ పంపితే తిరిగి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని ఎన్ఐఏ అభ్యంతరం చెప్పవచ్చని తెలిపింది. ప్రభుత్వాన్ని పడదోయడానికి యత్నించారన్నదే ఆయనపై అభియోగమని గుర్తు చేసింది. తాము బెయిల్ అడుగుతున్నది ఆరోగ్యకారణాలపై కనుక, ఎన్ఐఏ అభ్యంతరాలు వర్తించవని, అలాగే ఆయనపై అభియోగాలు నిజం కాదని న్యాయవాది పేర్కొన్నారు. ప్రధాని హత్య గురించిన ఉత్తరం కనుగొన్నట్లు ఎన్ఐఏ చెబుతోందని, ఎవరైనా అలాంటి ఉత్తరాలు కంప్యూటర్లలో దాచుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు. ఇవన్నీ కట్టుకధలన్నారు. కావాలంటే కఠిన నిబంధనలతో కూడిన బెయిల్‌నైనా మంజూరు చేయాలని కోరారు. అయితే రావుకు అన్ని రకాల వైద్యసాయం అందించేందుకు తాము కృషి చేశామని ధర్మాసనం గుర్తు చేసింది. ఉపా చట్టం కింద అరెస్టయిన వారికి బెయిల్ ఇవ్వాలంటే పలు అభ్యంతరాలుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా మానవహక్కులపై పలు డిక్లరేషన్లను ఇందిరా జైసింగ్ కోర్టు దృష్టికి తెచ్చారు. రావు బెయిల్ పిటీషన్‌పై వాదనలు కొనసాగనున్నాయి. -
వరవరరావు పరిస్థితి విషమం
ముంబై: ‘ఎల్గార్ పరిషత్’ కేసుకు సంబంధించి జైళ్లో ఉన్న ప్రముఖ తెలుగు విప్లవ కవి వరవర రావును తక్షణమే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలని బాంబే హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చికిత్స కోసం అభ్యర్థిస్తుంటే కుదరదని ఎలా చెప్పగలుగుతున్నారని జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. దాంతో వరవర రావును ప్రత్యేక కేసుగా పరిగణించి, ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేర్చి, 15 రోజుల పాటు చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆసుపత్రిలో వరవరరావును చూసేందుకు ఆసుపత్రి నిబంధనల మేరకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోర్టు స్పష్టం చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై వరవరరావు నవీముంబైలోని తలోజా జైళ్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వరవర రావును తలోజా జైలు ఆసుపత్రి నుంచి తక్షణమే నానావతి ఆసుపత్రికి మార్చి, మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఆయన భార్య హేమలత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం కోర్టు విచారణ జరిపింది. వరవరరావు ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘తీవ్రమైన అనారోగ్య సమస్యలతో దాదాపు మరణశయ్యపై ఉన్న ఒక 80 ఏళ్ల వ్యక్తికి తలోజా జైళ్లోనే చికిత్స అందిస్తామని ఎలా చెప్తారు?’ అని ఈ సందర్భంగా ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రి అయిన నానావతి హాస్పిటల్లో వరవర రావు చికిత్సకు అయిన ఖర్చును ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేసింది. చికిత్సకు అయ్యే ఖర్చును వరవర రావే భరించాలన్న ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే వాదనను.. వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర జైసింగ్ తోసిపుచ్చారు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించలేకపోవడానికి డబ్బులు లేవన్న కారణాన్ని ప్రభుత్వాలు చూపకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆమె ఉటంకించారు. ఆమె వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. ‘ప్రస్తుతం ఆయన మీ కస్టడీలో ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నప్పటికీ మీ కస్టడీలో ఉన్నట్లుగానే భావించాలి. అందువల్ల చికిత్స ఖర్చును మీరే భరించాలి’ అని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాంతో, ప్రభుత్వ న్యాయవాది దీపక్ ఠాక్రే రాష్ట్ర హోం మంత్రిని ఫోన్లో సంప్రదించారు. అనంతరం, వరవరరావుకు 15 రోజుల పాటు నానావతి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని కోర్టుకు తెలిపారు. దీన్ని ప్రత్యేక కేసుగా పరిగణించాలని, భవిష్యత్తులో ఈ తరహా కేసులకు దీన్ని ఉదాహరణగా చూపకూడదని అభ్యర్థించారు. ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)ను.. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని కోర్టు ప్రశ్నించింది. దానికి, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అభియోగాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్ఐఏ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ సమాధానమిచ్చారు. అభియోగాల నమోదుకు ఇంకా కనీసం ఒక సంవత్సరం పడుతుందని, ఎందుకంటే ఆ అభియోగాలన్నీ ప్రాథమికంగా కంప్యూటర్ సాక్ష్యాలపై ఆధారపడి ఉన్నాయని వరవరరావు తరఫున జైసింగ్‌తో పాటు వాదనలు వినిపించిన ఆనంద్ గ్రోవర్ కోర్టుకు వివరించారు. చనిపోతే ఎవరిది బాధ్యత? విచారణ ఇలాగే కొనసాగితే వరవరరావు జైళ్లోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని ఇందిర జైసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులు పారిపోకూడదనే ఉద్దేశంతోనే విచారణ ఖైదీలను జైళ్లో పెడతారని, కానీ, మానసికంగా దుర్బలమై, అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వీవీ పారిపోయే అవకాశమే లేదని ఆమె వివరించారు. ప్రస్తుతం ఆయనకు నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయన చనిపోతే ఎవరిది బాధ్యత? ఆసుపత్రిలో ఆయనకేమైనా అయితే, అది కస్టోడియల్ మరణమే అవుతుంది’ అని స్పష్టం చేశారు. జైళ్లో సహచరులు వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా వరవరరావును చూసుకుంటున్నారని, కానీ, వారు వైద్యంలో శిక్షణ పొందినవారు కాదని కోర్టుకు వివరించారు. ఆసుపత్రిలో ఉండగా, వరవరరావుకు చేసిన వైద్య పరీక్షలపై కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. అవి తప్పై ఉండొచ్చని, వాటిపై ఆయన వయసు 54 ఏళ్లు అని ఉందని పేర్కొన్నారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న లాయర్ వాదనతో కోర్టు ఏకీభవించింది. నానావతి హాస్పిటల్లో జరిపిన వైద్య పరీక్షల నివేదికను తమ ముందుంచాలని పేర్కొంది. కోర్టుకు తెలియజేయకుండా ఆయనను ఆసుపత్రి నుంచి పంపించేయవద్దని ఆదేశించింది. వీవీ భార్య హేమలత వేసిన రిట్ పిటిషన్‌తో పాటు బెయిల్ పిటిషన్‌ను కోర్టు విచారించింది. ఆయనను నానావతి ఆసుపత్రికి మార్చే అంశానికే బుధవారం నాటి వాదనలను పరిమితం చేద్దామని కోర్టు సూచించడంతో, బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగలేదు. విచారణను డిసెంబర్ 3కి కోర్టు వాయిదా వేసింది. -
వరవరరావుకు ఊరట
ముంబై : విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు(80)కు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు ముంబై హైకోర్టు బుధవారం అనుమతించింది. దీంతో 15 రోజులపాటు నానావతి ఆస్పత్రిలో వరవరరావుకు చికిత్స అందించనున్నారు. ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కాగా ఎల్గార్ పరిషత్ కేసులో జైలులోఉన్న తెలుగు కవి వరవరరావు ఆరోగ్యంపై బొంబాయి హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివరణ ఇచ్చింది. వరవరరావు ఆరోగ్యం బావుందని, మానసికంగా కూడా పూర్తి స్పృహలో ఉన్నారని వివరించింది. అయితే, వరవరరావుకు న్యూరలాజికల్ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వరవరరావు ప్రస్తుతం తలోజా జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. చదవండి: వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత రచయిత వరవరరావు (80)కు బెయిల్ ఇచ్చేందుకు ముంబై హైకోర్టు నిరాకరించింది. తీవ్ర అనారోగ్యం కారణంగా ఆయనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కుటుంబ సభ్యుల పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అయితే నానావతి ఆస్పత్రి వైద్య బృందంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా.. వరవరరావు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈనెల 17కు వాయిదా వేసింది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న తన భర్త నవరవరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ భార్య హేమలత ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అంతకంతకూ ఆరోగ్యం క్షీణిస్తున్నా తన భర్త ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, తలోజా జైలులో అమానవీయ పరిస్థితుల్లో వరవరావు మగ్గుతున్నారని ఆమె వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం తన హక్కులను ఉల్లంఘనకిందికి వస్తుందన్నారు. కాగా భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడిగా ఎన్ఐఏ పేర్కొంది. జూన్, 2018లో అరెస్టు అయినప్పటి నుండి వరవరావు జైలులో ఉన్నారు. ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వరవరావు తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. -
వివి ఒక లెజెండ్
‘కవిత్వం దాచనక్కరలేని నిజం ప్రభుత్వం అక్కరలేని ప్రజ అమృతం అక్కరలేని జీవితం’ ‘నా కవిత్వం ఒక బాధాతంత్రీ ఒక క్రోధతంత్రీ తెగినట్లు కన్నీటిని వెలిగించేవి చూపులే అయినట్లు ప్రవహిస్తూనే వుంటుంది రుధిరాక్షర నదిగా’ – వి.వి. ఒక పోరాట జీవితాన్ని, అరవైఏళ్ల పోరాట జీవితాన్ని ఒక పేజీ కాదు రెండు పేజీల్లోకి కుదించటం సాధ్యమా– ఒక పుస్తకంలోకి వడకట్టడం సాధ్యమా– అసాధ్యం– impossible. రేఖామాత్రంగానో– ఛాయామాత్రంగానో చూయించవచ్చు. ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని కవిత్వ వ్యక్తిత్వాన్ని అద్దంలో చూయించినట్టు చూయించవచ్చేమో– కానీ మొత్తం జీవితాన్ని, తాననుభవించిన దుఃఖాన్ని వేదనని agonyని, ఏకాంతాన్ని, ఏకాంతమథనాన్ని– ఆ solitary movementలో– తాను చూసిన infernoని– స్వర్గనరక కూడలిని పట్టుకోవటం ఎంత కష్టం. అసాధ్యమైనదాన్ని సాధ్యం చేయటానికి మనుషులు సృజనలోకి దిగుతారు. ప్రపంచంలోని ఏ కవీ నన్ను భయపెట్టలేదు. ఏ కవి ముందూ నేను బెరుకు ఫీలవలేదు. కాని వరవరరావు గారి ముందు కొంత జంకు, కొంత బెరుకు– శిఖరం ముందు నిల్చున్నట్టు ఫీలవుతాను. అది నిత్య సమరశీలమైన, రాజీలేని జీవితానుభవం– కారణం. ఇంకొక కవి వరవరరావులా జీవించగలడా– అనుభవించి ఆచరించగలడా– ఒక ఉక్కు నిర్ణయం నిశ్చయం కావాలి. ఆశయానికీ ఆచరణకీ మధ్య దూరం చెరిగిపోవాలి. వేణుగోపాల్ రాసినట్టు– దూరాన నుంచొని దిశానిర్దేశం చేసే మేధావి సిద్ధాంతకర్త గాదు వరవరరావు. ఆశయం రూపొందించి ఆచరణలో ఇన్నాళ్లు అగ్రభాగాన వున్నారు. మందితోనే, మందిలోనే వున్నారు. ఆశయం గాదు ఆచరణ భయపెడుతుంది– వరవరరావు Lovely person - A bit reticent- కాస్త బిడియస్తుడు, కాస్త సిగ్గరి, గొప్ప ప్రేమికుడు. ఎప్పుడో ఎక్కడో ఆయనకి షేక్‌హ్యాండ్ ఇచ్చినాకు రాసుకున్నా ‘ఆత్మ అరచేతిలోనూ దొరుకుతుందని’. ఒక విద్యుత్ ప్రవహిస్తుంది. నిన్ను ఉత్తేజభరితుణ్ణి చేస్తుంది, నిన్ను సచేతనుణ్ణి చేస్తుంది. బహుశా ప్రపంచంలోని గొప్ప వ్యక్తులంతా, మహత్తర మూర్తులంతా ఇంతేనేమో– తల చుట్టూ కనపడని కాంతిచక్రాలు తిరుగుతున్నట్టు. మొదట ఎక్కడ చూశాను? గుర్తు లేదు. కాని లీలగా ఒక రూపం– పంచె కట్టుకుని నడుస్తున్న రూపం– బహుశా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో అనుకుంటా. మిత్రులతో నడుస్తున్నారు. ‘సృజన’ జడ్చర్ల నుంచి వస్తున్న రోజుల్నించి పరిచయం, అప్పుడే ఒక ఉత్తరం రాసిన గుర్తు, ఆ తొలిరోజుల పిచ్చి కవితనొకదానిని సృజనలో అచ్చేశారు. రెండోసారి నారాయణగూడలోని శ్రీపతి రూంలో– శ్రీపతి ఒక అద్భుత కథకుడే కాదు, వ్యక్తి కూడా. ఎంత మందిని నిశ్శబ్దంగా తనలోకి లాక్కున్నాడు. ఎంతమంది దోవలు మార్చాడు! ఈ యాభై అరవై సంవత్సరాల్లో– ఎన్నిసార్లు దగ్గరగా దూరంగా సభల్లో బయటా కలిసాను. కలిసిన ప్రతిసారి ఒక కొత్త కలయిక. నూతనోత్తేజం. నిజంగా జీవించినవాడి జీవితం జీవిస్తున్నవాడి జీవితం అలానే వుంటుంది. ఎక్కడో ఒక సభలో అన్నారు: ఈ కవిత్వం కంటే ఇంకేదైనా ప్రజలకు మేలు చేస్తుందనుకుంటే ఉపయోగపడుతుందనుకుంటే– అదే చేస్తాను. నేనూ వున్నా ఆ సభలో– నేనన్నాను ‘నాకు కవిత్వమే సర్వస్వం, కవిత్వం దాటి ఏమీ లేదు– For me word is an action’. ఇప్పుడనిపిస్తుంది– అది Lame justification. ఇప్పుడు వరవరరావు ఎక్కడున్నారు– నేనెక్కడున్నాను– మనలో చాలా మంది ఎక్కడున్నాం– అది తేడా. అది ఆశ్చర్యం గొలిపే అగ్నిస్పర్శ. ఒక గొప్ప రాజకీయ కుటుంబంలో పుట్టిపెరిగిన వరవరరావులో, కవిత్వంలో రాజకీయం ఒక రక్తప్రసరణ. నెహ్రూ రాజకీయ అభిమానిగా మొదలైన వరవరరావు పరిణామం అనూహ్యం కాదు. సహజం. ఇప్పుడు ఆయన ఉండాల్సిన చోట వున్నాడు. దేశ రాజకీయ పరిణామాలు ప్రపంచ రాజకీయ పరిణామాలు అంతర్భాగం చేసుకున్న వరవరరావు జీవితం, కవిత్వం భిన్నమైనవే. ఆయన గురించి లోకానికి తెలియనిదేముంది– He is an open book – ఎవరో అడిగారు ‘మార్క్సిజం ఏం చేస్తుంది’ అని– వేరే విషయాలు పక్కనపెడితే– అది నిన్ను నిర్భయుణ్ణి చేస్తుంది. దేన్నైనా ఢీకొనే శక్తి, ఎదిరించి నిలబడే శక్తి నీకు ప్రసాదిస్తుంది. ఆయన్ని చూసినప్పుడల్లా– నాకు Tennyson, Ulyssesలోని వాక్యాలు గుర్తుకొస్తాయి– That which we are, we are; one equal temper of heroic hearts made weak by time and fate, but strong in will to strive, to seek, but not to yield. ఆయన ఏకైక గొప్ప పొలిటికల్ పొయెట్. ఎంతోకొంత ప్రతి కవీ పొలిటికల్ కవే. ఇది తిట్టు గాదు, రాజకీయాన్ని కవిత్వం చేయటం– రాజకీయ వెలుగులో వచ్చిన పరిణామాలను మార్పులను ఘటనలను కవిత్వం చేయటం మామూలు విషయం కాదు. వరవరరావు general poet కాదు. సచేతనుడైన గొప్ప ఆర్ద్ర హృదయం గల రాజకీయ కవి. మానవ ప్రవృత్తిని మానవ స్వభావాన్ని బయటకు తీసుకొచ్చి ఎత్తి చూపటం కవిత చేయటం ఒక సవాలు. అరవైఏళ్లుగా మెలకువతో, కవిత్వమూలం చెడకుండా చేస్తున్నారు. ‘ఊరేగింపు’ దగ్గర నుంచి ‘కఠినవాడు’ దాకా ఏ కవితైనా తీసుకోండి– కవిత్వ నిర్మాణ సూత్రాలకు భిన్నంగా వుండదు– లోలోపల తొలుచుకుంటూ విస్తృతి చేసుకుంటూ వెడుతుంది. నాకు బాగా గుర్తు– విరసం ఇరవైఏళ్ల మహాసభ అనుకుంటా– రాణాప్రతాప్ హాల్లో జరిగింది. జనంలో నేవున్నాను – అకస్మాత్తుగా ‘ముక్తకంఠం’ కవిత్వసంపుటి ఆవిష్కరించి మాట్లాడమన్నారు. చదవటం సంగతి పక్కనపెడితే ఆ పుస్తకాన్ని ఎన్నిసార్లు చేతితో నిమురుతూ అనుభవిస్తూ అనుభూతి చెందానో చెప్పలేను. తన సుదీర్ఘయాత్రలో– ఎంత అశాంతిని ఎంత ఘర్షణని ఎదుర్కొన్నారో చెప్పడం కష్టం. ఈ సంక్షోభభరిత, సంఘర్షణాయుత జీవితం మొత్తం కవిత్వం చేసే process ఆయన కనుగొన్నారు. ఒక పదిహేను కవితాసంపుటుల కవిత వుంది, వేలవేల పేజీల వచనముంది. ఒక రకంగా అరవై సంవత్సరాల జీవితాన్ని చరిత్రను రికార్డ్ చేశారు. ఆయన కవిగా జీవించని క్షణాలు తక్కువే. ఆయన ఉపన్యాసం ఒక గొప్ప కవిత. ఉపన్యాసాన్ని emotional గా charge చేయటం ఆయన విశిష్టత. ఆయన రాజకీయవాదా– కవా– సంపాదకుడా– అధ్యాపకుడా– ఉపన్యాసకుడా– అని ఎవరన్నా అడిగితే– వీటన్నింటి సమాహారం ఆయన. వేయంచుల కత్తిలా మెరుస్తుంటాడు, ముళ్లగదలా వలయాలు వలయాలు చుడుతూ మనల్ని సంభ్రమంలో ముంచుతాడు. ఆయన ‘సముద్రం’ గొప్ప కావ్యం. సమాజానికి సముద్రానికి అభేదం చెబుతూ సాగిన గొప్ప కవిత. ఆయన ఊరకుండడు– ప్రభుత్వం state ఊరకుండదు. వరవరరావు అంటే stateకి సమాజానికి, stateకి వ్యక్తికి మధ్య ఘర్షణ. ఇది నిరంతరం కొనసాగుతుంది. మనిషిలో గొప్ప లాలిత్యం వుంది, లాలిత్యం కాఠిన్యంగా మార్పు చెందే సందర్భాలూ కవిత్వంలో చూస్తాం. హేమ గారి మీద తొలిరోజుల్లో రాసిన ప్రేమ కవిత– సన్నజాజులు చదవండి– ఎంత గొప్ప ప్రేమికుడో, ఎంత సౌందర్యవాదో, ఎంత మృదుస్వభావో– అవన్నీ ఇప్పుడు సమాజగతంగా అంతర్లీనమయ్యాయి. అటువంటి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం– సెలబ్రేట్ చేయండి– వరవరరావు కవిత్వాన్ని పఠించి పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. He is a Legend. కె.శివారెడ్డి గొప్ప మనిషికి గొప్ప కవికి రేపటితో ఎనభైఏళ్లు నిండుతాయి. గొప్ప సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సమయం. వరవరరావు కవిత్వాన్ని పురాణంలా ప్రచారం చేయాలి. ఆయన జీవనాడి, జాతి జీవనాడిలోకి ఇంకాలి. -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్‌ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
వరవరరావుకు బెయిల్ ఇవ్వండి
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో అరెస్టయి, ముంబై జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ కవి, 81 ఏళ్ళ వరవరరావుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన భార్య పెండ్యాల హేమలత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయనను నిరవధికంగా కస్టడీలో ఉంచటం అమాన వీయం, క్రూరత్వమని, రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను అతిక్రమించడమేనని బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో జ్యుడీషియల్ కస్టడీకి వెళ్ళేనాటికి 68 కేజీల బరువున్న వరవరరావు ఇప్పుడు 50 కేజీల బరువున్నారని, ఆయన 18 కేజీల బరువు తగ్గారని, వివిధ ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, మంచంలో నుంచి కదల్లేని స్థితిలో ఉన్నారని వెల్లడించారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో పాటు, కోవిడ్ ప్రబలిన తరువాత తలెత్తిన ఇబ్బందుల కారణంగా వరవరరావుకి నిరంతర పర్యవేక్షణ అవసరమౌతోందని హేమలత తరఫున పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ తెలిపారు. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన
సాక్షి, అమరావతి : విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరావును విడిపించాలని కోరుతూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాయడం తన వ్యక్తిగత నిర్ణయం అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన వ్యక్తిగత అభిప్రాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ముడిపెడుతూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ ట్వీట్ చేయడం బాధాకరం అన్నారు. దేశ ప్రధానమంత్రిని హతమార్చాలనే కుట్ర పన్ని అరెస్టయిన విరసం నేత వరవరరావును విడుదల చెయ్యాలని భూమన కోరడం సమంజసం కాదని సునీల్ దియోధర్ ట్వీట్ చేశారు. దానికి సమాధానంగా సునీల్ దియోధర్‌కు భూమన ఆదివారం లేఖ రాశారు. ‘ప్రధాని మోదీ పట్ల నాకు అపార గౌరవం, ప్రేమ ఉంది. నేను లేఖలో కోరింది అనారోగ్యంతో బాధపడుతున్న 81 ఏళ్ల వరవరావు పట్ల జాలి చూపించమని, అంతే కానీ వరవరరావు భావాజాలాన్ని అంగీకరించి కాదు. భారతదేశపు సనాతన ధర్మాన్ని, విలువలను గౌరవిస్తా. హింసా మార్గాన్ని ఏ మాత్రం సమర్థించను. నా వ్యక్తిగత అభిప్రాయానికి సీఎం జగన్‌తో మీరు ముడిపెడుతూ ట్వీట్ చేయడం బాధాకరం. శత్రువును చంపడం కాదు.. క్షమించడం పెద్ద శిక్ష అని నమ్ముతా’అని లేఖలో భూమన పేర్కొన్నారు. కాగా, భీమా కోరేగావ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి, విరసం నేత వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వరవరరావు (వీవీ)ను విడుదల చేయాలని కోరుతూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కొన్ని రోజుల క్రితం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. అయితే ఆ లేఖ తన వ్యక్తిగత నిర్ణయం అని, దానిలో పార్టీకి సంబంధం లేదని భూమన అప్పుడే స్పష్టం చేశారు. అయితే దీనిపై మళ్లీ విమర్శలు రావడంతో భూమన వివరణ ఇచ్చారు.